Sun 04 Jul 07:28:16.25136 2021
Authorization
చంద్రయ్య, బాలయ్య రైతులు. ఇద్దరూ వ్యవసాయం చేసేవారు. చంద్రయ్య బీదవాడు. బాలయ్య ధనవంతుడు. వారు కూరగాయలను ఎక్కువగా పండించి పట్టణంలో అమ్ముకొని వచ్చేవారు.
చంద్రయ్య ఎప్పుడు ఉల్లిపంటను వేసేవాడు. అది ధర చాలా తక్కువ ఉండటం వల్ల చంద్రయ్యకు ఎక్కువ లాభం వచ్చేది కాదు. బాలయ్య అలా కాకుండా ఏ పంట ఎక్కువ ధర వస్తుందో తెలుసుకొని దాన్ని పండించి ఎక్కువ లాభం సంపాదించేవాడు. బాలయ్య చంద్రయ్యతో తాను వేసిన పంటను వేయమని ఎన్నో సార్లు చెప్పాడు. కానీ బాలయ్య మాట చంద్రయ్య వినలేదు.
చంద్రయ్య కుటుంబ సభ్యులకు పూట గడవడమే కష్టమె ౖపోయింది. ఎంతో కొంత అప్పు చేసి చంద్రయ్య కుటుంబాన్ని పోషించేవాడు.
ఒకసారి దేశంలోనే ఉల్లికి చాలా కరువు వచ్చింది. కానీ చంద్రయ్యకు ఆ సంవత్సరం ఉల్లి పంట బాగా పండింది. అది అమ్మితే చాలా డబ్బు వచ్చింది. ఈ పంట వల్ల చంద్రయ్య ధనవంతుడు అయ్యాడు. అయినా తాను ఉల్లి పంట వేయడం మానలేదు.
బాలయ్య పంటలకు రాబడి లేక పెట్టుబడి మొత్తం పెట్టి బీదవాడు అయినాడు. బాలయ్య చంద్రయ్యను అభినందించి అతని అదష్టాన్ని పొగిడాడు. చంద్రయ్య బాలయ్యకు కూడా కొంత ధన సహాయం చేసి ఆదుకున్నాడు.
ఇలా ధనవంతుడైన చంద్రయ్య ఆ డబ్బుతో తన కూతురు పెళ్లిని ఘనంగా చేశాడు. అంతేకాదు, ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి ఐదు హౌటళ్లను పెట్టాడు. వాటిలో నౌకర్లను కూడా నియమిం చాడు. ఆ హౌటళ్లలో మూడింటిలో లాభం వచ్చింది. ఈ రెండింటిలో నష్టం వచ్చింది. అయినా తాను నిరుత్సాహ పడలేదు. కొన్ని రోజులకు ఆ రెండు హౌటళ్లలో కూడా లాభం రాసాగింది.
ఆ డబ్బుతో చంద్రయ్య తిరిగి మళ్ళీ ఐదు హౌటళ్లను కొత్తగా ప్రారంభించాడు. ఈ వ్యాపారాన్ని తన కొడుకుకు అప్పగించాడు. క్రమేపి ఆ హౌటళ్లు కూడా మంచి లాభం సంపాదించాయి.
చంద్రయ్య వద్ద ధనసహాయం పొందిన బాలయ్య కూడా కొద్ది రోజుల్లో ధనవంతునిగా మారాడు. అతడు కూడా చంద్రయ్య వలె హౌటళ్లను పెట్టాడు. కానీ వాటి లో తీవ్రమైన నష్టం వచ్చింది. కొన్ని రోజులకే బాలయ్య ఆ హౌటళ్లను మూసి వేశాడు. మళ్లీ బీదవాడు అయినాడు.
చంద్రయ్యతో బాలయ్య మాట్లాడుతూ ''ఇంకా పది హౌటళ్లను కూడా నీవు ప్రారం భించు'' అని అన్నాడు. చంద్రయ్య ''ఆశకు అంతుండాలే బాలయ్యా! ఈ లాభం చాలు. నాకున్న డబ్బులో సగం పది హౌటళ్లకు పెట్టుబడి పెట్టాను. ఎంతో మంది కి ఉపాధి కల్పించాను. ఇప్పుడు నేను నష్టపోయినా ఫరవాలేదు. ఎందుకంటే మిగిలిన సగం డబ్బు నా వద్ద ఉంది. కావున నేను హాయిగా బతకవచ్చు. ఇది కూడా పెట్టుబడి పెట్టి నేను నష్టపోతే మళ్ళీ బీదవానిగా మారక తప్పదు. అలా చేయడం నాకు ఇష్టం లేదు'' అని అన్నాడు.
ఆ మాటలకు బాలయ్యకు జ్ఞానోదయం అయింది. తాను అనవసరంగా తన డబ్బంతా మొత్తం పెట్టుబడి పెట్టి బీదవాడు అయినాడు. అదే చంద్రయ్య చెప్పినట్టు సగం పెట్టుబడి మాత్రం పెడితే తాను బీదవాడు అయ్యేవాడు కాదు. ఈ రహస్యం తెలుసుకున్న బాలయ్య చంద్రయ్య దగ్గర తిరిగి ధన సహాయం పొంది అతని సలహా మేరకు సగం మాత్రమే డబ్బు ఖర్చు చేసి వ్యాపారంలో లాభం సంపాదించి, చంద్రయ్య డబ్బును తిరిగి చెల్లించాడు. అందుకే వ్యాపారంలో ఇతరుల సలహాలు తీసుకొనడమే కాకుండా తెలివిగా వ్యవహరించాలి.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య
సెల్: 9908554535