అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నాను. రెండు రోజులుగా వదలకుండా కురుస్తున్న వాన వల్ల భూమ్మీద ప్రవాహాలతో నేలంతా నీళ్లతో నిండిపోయింది.
టౌన్ నుండి రెండు మైళ్ల దూరంలో వున్న గ్రామం అది. కామరాజర్ కాలంలో నిర్మించిన బడికి మొదటి ప్రధానోపాధ్యాయుడూ, సంరక్షకుడూ నాన్నే.
అద్దె ఇల్లు పాఠశాల పక్కనే వున్న వీథిలోనే.
''బాడిగంతా ఏమీ వొద్దు అయ్యోరా, మా బిడ్డలకు పాటాలు సెప్తాండావు, నీ దెగ్గిర ఏం దుడ్డు తీసుకునేది?''
ఆ గ్రామంలోని మనుషులందరూ ప్రేమను, వదలకుండా కురిసే ఇలాంటి వానలాగా సదా గుమ్మరిస్తుండేవాళ్లు.
మేము మొత్తం నలుగురం. అణ్ణామలై పురం నుండి సారోన్ స్కూలుకు నడిచివెళ్లి చదువుకొని వచ్చేవాళ్లం. రోజూ మధ్యాహ్నం బోర్డింగ్ స్కూలు పిల్లలకు ఇచ్చే రాగిపిండి గంజి, అందులో వూరిపోయి వుండే ముల్లంగి ముక్కలూ తిని, విసిగిపోయి వున్న రోజులవి.
ఇండ్లల్లో నుండి హైవే మీదికి రాగానే మేము నలుగురమూ పోటీలు పడి అటుగా వెళ్తున్న వస్తున్న సైకిళ్ల అన్నలకు నమస్కరించటమూ, చెయ్యి చాపి ఆపటమూ, బొటనవేలిని పైకి లేపి లిఫ్ట్ అడగటం... అంటూ ఎలాగైనా వాళ్లను ఆపేసే వాళ్లం. ఎప్పుడైనా ఒకసారి టూ వీలర్ వెళ్లేది. వాళ్లను ఆపటానికి భయం. దాన్నీ అధిగమించి అయ్యవారి కొడుకును నేను ధైర్యంగా చెయ్యి చాచి ఆపి బైక్ వెనకాల కూర్చొని ప్రయాణించిన రోజులు ప్రత్యేకించి నాకు గొప్పగా వుండేవి.
రెండు రోజులుగా వదిలిపెట్టని వాన ఇప్పుడు ఆగి ఆగి కురుస్తూ వున్నది. దొరికిన విరామంలో యూనిఫామ్ వేసుకొని నలుగురమూ రోడ్డుమీదికొచ్చాం. చాలాసేపటిదాకా ఎదురు చూసినా ఒక్క సైకిల్ అన్న కూడా ఆ దినం రాలేదు. వెనక్కెళ్లి పోదామా అని ఆలోచించి అది నచ్చక సారోన్ (స్కూల్)కేసి నడవటం మొదలుపెట్టాం. ఐదు నిమిషాల నడకలో, మేమందరమూ మాకు ముందు నిలబడున్న చాలా మందితో కలిసి రహదారి మీదే ఆగిపోవలసి వచ్చింది ఆ దినం.
సముద్ర చెరువు నిండిపోయి దాని కలుజు (తూము) పగిలిపోయి, చెరువులేని మా వూర్లో 'ఓలై' చెరువు అని పిలవబడే ఒక పెద్ద కాలవ నిండిపోయి, బ్రిడ్జికి పైన రెండడుగుల వరకూ నీళ్లు ప్రవహిస్తున్నది.
కొందరు ధైర్యస్తులైన అన్నలు ప్రవాహానికి ఎదురేగుతూ దాటుకొని వెళ్లటం గొప్ప సాహసంగా అనిపించింది. ఒక వ్యక్తి ఆయన భార్యను ఎత్తుకొని భుజమ్మీద పెట్టుకొని దాటటం మమ్మల్ని మేము మరిచిపోయి ఆ వర్షం రోజున చేతులు చరిచి కేకలు వేయించింది. భుజమ్మీదున్న ఆ యువతి కూడా మమ్మల్ని చూసి బదులుకు చేతులు చరిచి నవ్వింది. వర్షంలో అన్ని దృశ్యాలూ అపూర్వమైనవిగా మారిపోతాయి.
ఎలాగూ, ఈ వెల్లువను దాటి చిన్నపిల్లలమైన మేము పాఠశాలకు వెళ్లటం కుదరదు. కొంతసేపు పెరుగుతున్న ప్రవాహాన్ని వేడుక చూస్తుండగా, పెద్ద వాన మళ్లీ కురవటం మొదలు పెట్టింది. మేము ఒకరినొకరు చూసుకోకుండా వెనక్కు తిరిగి ఇంటికి పరుగెత్తుకొచ్చేశాం. పుస్తకాలన్నీ తడిసి పోయాయి. నా పైనుండీ పాదం వరకూ నీళ్లు కారుతున్నది.
ఎన్నడూ లేనివిధంగా ఇంటి లోపలివైపు గొళ్లెం పెట్టబడింది. వాన జల్లు పడుతుందని అమ్మ లోపలివైపు గొళ్లెం పెట్టుకొని వుండొచ్చు. నేను తడిసిన బట్టలతో తలుపును గట్టిగా తట్టాను.
తలుపు చాలా రహస్యంగా తెరవ బడింది. అమ్మ తన మధ్య వేలిని పెదవి మీద పెట్టి ''ష్...'' అని హెచ్చరించి నా చేతిని పట్టుకొని నన్ను లోపలికి లాక్కొని, మళ్లీ తలుపుకు గొళ్లెం పెట్టింది. వినోదంగా అనిపించింది.
నా చొక్కా, నిక్కరును విప్పి పడేసి, తువ్వాలుతో ఒళ్లంతా తుడుస్తూ, వంటగదికేసే చూస్తున్నది అమ్మ. తన దృష్టిలో నుండి ఏదీ తప్పించుకోకూడదన్న జాగ్రత్తను ఆమె కళ్లల్లో చాలా దగ్గర నుండి చూశాను.
''యేరే నిక్కరు ఏసుకో...'' అని అమ్మ వంటగదికేసి వెళ్లే లోపు ఒక కోడిపుంజు వంటగదిలో నుండి పైకిలేచి ఎగిరొచ్చి మేము నిలబడున్న చోట్లో దబ్బుమన్న శబ్దంతో కింద పడింది. పడిన వేగంలో అది మళ్లీ పైకిలేచి మళ్లీ వంటగదిలోకి ఎగిరింది. జరుగుతున్నవన్నీ నాకు ఎంతో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించాయి.
అమ్మ మౌనంగానే పనులు చెయ్యసాగింది. నా రాక ఆమెకు ఏ ఇబ్బందీ పెట్టనట్టుగా వంటగదికేసి తన దృష్టిని పెట్టింది.
నా కళ్లలో అలుముకున్న చీకటి తొలగగానే ఆ కోడి పుంజును స్పష్టంగా చూశాను. రోలు సందులో ముడుక్కొని వుంది. దానికి పైశ్వాస దిగవశ్వాస ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే గొంతు ఎక్కెక్కి దిగింది. రక్త వర్ణంలో కదిలిన దాని కళ్లు నన్నే చూశాయి.
అది పక్కింటి మణెమ్మక్క పుంజు. ఎప్పుడూ అది అమ్మ దగ్గరికొచ్చి ఆమెను పని చేసుకోనీకుండా ఆటపట్టించేది. అమ్మ దాంతో ఎన్నోసార్లు జరిపిన సంభాషణలన్నీ కూడా నాకు కంఠోపాఠం.
''ఇదో సూడూ, నా దెగ్గిర ఆటాడొద్దు. ఒక దినం కాకపోయినా ఇంకో దినం కోసి కూర వొండేస్తాను.''
ఇది అమ్మనోట పదే పదే ఉచ్ఛరించబడిన మాటలు. అప్పుడప్పుడూ ఆమె మానసిక స్థితిని బట్టి కొంత బూతు మాటలూ దొర్లేవి. అమ్మ తిట్టటాన్ని గమనిస్తే ఆ పుంజువాళ్ల నాన్న నిస్సందేహంగా ఒక కుక్క అన్నది స్పష్టమౌతుంది. ఇవ్వాళ అమ్మ చేతికి సరిగ్గా దొరికిపోయి ఇలా రోలు మాటున మరణ భయంతో దాక్కొని వుండటం పాపమనిపించింది.
ఇద్దరూ ఒక నిర్ణయంతో ప్రవర్తిస్తున్నట్టుగానే నాకనిపించింది.
పుంజు అప్పుడప్పుడూ చేసిన శబ్దం ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్లకుండా ఇంట్లోపలే తిరగటానికి కారణం, బయట పెద్ద శబ్దంతో ఇంకా కురుస్తున్న వాన.
వాన ఎప్పుడూ అందరినీ వాళ్లవాళ్ల స్వభావస్థితికి మళ్లించి, ప్రశాంతతను చేకూర్చి, తాను మాత్రం ప్రవాహిస్తుంది. ఆ రోజూ అంతే!
అమ్మ మెల్లగా రోలు వెనక పక్కగా వెళ్లి మట్టి నేలమీద మోకాళ్ల మీద కూర్చొని, అంగుళం అంగుళంగా ముందుకు కదిలి పుంజుమీద చెయ్యి వేసిన మరుక్షణం అది ఎగిరి నేను నిలబడున్న చోటికి వచ్చింది.
నేను ముఖాన్ని తిప్పుకొని దాన్ని పట్టుకోవటానికి చేసిన ప్రయత్నమంతా ఫలించలేదు. అది మా ఇద్దరినీ కలిపి మోసం చేసి నిమిషంలో ఎక్కడో కనుమరుగై పోయింది.
ఇప్పుడు ఎవరూ పిలవకుండానే నేనూ దాన్ని పట్టుకోవటానికి అమ్మతో జత కలిశాను. మూసి వున్న తలుపు మా ఇద్దరికీ కలిపి కాపలా కాసింది.
బియ్యం పోసి వుంచే అండాయికి పక్కన అది నేలకు శరీరాన్ని ఆనించి పడుకొని వుండటాన్ని నేనే కనిపెట్టి అమ్మకు సైగ చేశాను. అమ్మ దాన్ని గమనించీ గమనించనట్టుగా ఇంకా వెనకగా వెళ్లి, నేలమీద మళ్లీ మోకాళ్ల మీద కూర్చుని దానికేసి కదిలింది. సైగలతో నన్ను దాని ముందుకొచ్చి నిలబడమంది. అమ్మను నిశితంగా చూసినపుడు ఒక అనుభవమున్న వేటగత్తెలా వుంది.
జరుగుతున్నది నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎవరూ రాకూడదనుకున్నాను, ముఖ్యంగా నాన్న.
నాన్న వచ్చేస్తే అమ్మతో కలిపి నాకూ దెబ్బలు పడతాయి. నాన్న దెబ్బల మహత్యం ఆ వూరికే తెలుసు. నేను వీధి వీధీ పరుగెడుతుంటే, నాన్న ఒక దొంగను పట్టుకునే సామర్థ్యంతో పరుగెత్తుకొచ్చి నన్ను పట్టుకొని కొట్టేవారు. అమ్మను ఒక మూలకు తోసి కాళ్లతోనే తన్నేవారు. ఇది ఎప్పుడో ఒకసారే జరిగేది.
జీవితంలో అన్నీ వస్తాయి. వెళతాయి. నాన్న నాకు ఎప్పుడూ నాలుగైదు టెరికాటన్ షర్టులుగా కొనిచ్చేవారు. ఒక చొక్కా, ఒక నిక్కరు కొనిచ్చినట్టుగా నా జ్ఞాపకాలలోనే లేదు. ఎవరూ వూహించనంతగా అమ్మకు తెల్లరాళ్ల దుద్దులు తీసుకొచ్చేవారు. అలాంటి సందర్భాల్లో ఆయనమీద ప్రేమ పొంగుకొచ్చేది.
దెబ్బలు, తన్నులు తింటున్నప్పుడల్లా టెరికాటన్ చొక్కా, తెల్లరాళ్ల కమ్మలూ మా ముందుకొచ్చి దాన్ని స్వీకరించేలా చేసేవి.
ఇదిగో ఇప్పుడు కోడి. అందులోనూ పక్కింటి కోడి. పచ్చిగా చెప్పాలంటే అమ్మ ఇప్పుడు చేస్తున్నది దొంగతనం. ఒక్క నిమిషంలో సాధారణ కోడి, దొంగ కోడిగా మారిపోయింది.
నాన్న చేతికి దొరికిపోయామంటే నన్నూ అమ్మనూ కోడి ముందు బలి ఇచ్చేస్తారు.
నా ఆలోచనలపై పుంజు అరుపుల శబ్దం పడి దొర్లింది.
అమ్మ ఒక చేత్తో దాని రెండు కాళ్లనూ కలిపి పట్టుకొని ఇంకో చేత్తో దాని గొంతును అదిమి పట్టుకుంది.
గెలుపు గర్వం లాంటిదంతా అమ్మ ముఖంలో ఏమీ కనిపించలేదు. మౌనంగా ప్రవర్తించసాగింది. దీనికి పెట్టుబడి మౌనమే కాబోలు.
నేను చూస్తుండగానే కింద నేలమీద పుంజును పెట్టబోతూ, తర్వాత ఏదో మరిచిపోయినట్టుగా ఒక చేత్తో దాన్ని ఎత్తి చూసింది. బరువు ఎంతుందో చూస్తోందని వూహించాను. నా వూహ కరెక్టే.
''రొండు కిలోలు తూగొచ్చు.'' తనలో తానే అనుకున్నది అప్పటి ప్రశాంతతలో నాకూ వినిపించింది. శబ్దం చేస్తే మొదటికే మోసం వస్తుంది.
నన్ను తలుపు దగ్గర నిలబడమన్నట్టుగా సైగచేసింది. పుంజును కింద పడేసి, దాని రెండు కాళ్లను తన కాలితో నొక్కి పట్టింది. తన చేతిలో వున్న కత్తిపీటను దాని గొంతు దగ్గరకు తీసుకెళ్లటం నేను తలుపు దగ్గర నిలబడి నిక్కి నిక్కి చూడ్డంతో బాగా చూడటానికి వీలైంది.
'క్లక్' మన్న ఒక చిన్న శబ్దం వినిపించింది. నేను చప్పున ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను.
అణగారే శబ్దం అది అని తెలిసింది. ఆ తర్వాతా అమ్మ కొంత సేపు తన కాలిని దాని కాళ్లపై నుండి తియ్యకుండా వంగొని వున్న స్థితిలోనే నిలబడింది. నేను ఇప్పుడు తలుపు దగ్గర నుండి వంటగదిలోకే వచ్చేశాను. ఒక అడుగు పక్కగా పుంజు తల పడుంది. తలను చేతిలోకి తీసుకొని చూశాను. కాసేపటి క్రితం రక్త వర్ణంలో మెరిసిన కళ్లు ఇప్పుడు మూసుకొని వున్నాయి.
అమ్మ చర్యలు ఇంకా సంచలనాలయ్యాయి. కట్టెల పొయ్యి మీద మంచి నీళ్లు పెడుతూ, మిరప రాయి మీద పసుపు నూరటం మొదలుపెట్టింది. నాన్న ఆ దినం వాన వల్ల ''స్కూల్లోనే తినేస్తాను.'' అని ఉదయం చెప్పింది మా ఇద్దరికీ ఎంతో అనుకూలమైపోయింది.
మధ్యలో ఒకే ఒకసారి తలుపు తీసి, బయటివైపు చూసి వచ్చింది. వెనకే నేనూ వెళ్లాను. అప్పుడూ వాన జోరున కురుస్తోంది. అమ్మ ఆ దినం వీధిని చూడటంలో ప్రత్యేకమైన శ్రద్ధ వుంది. మణెమ్మ ఇంటివైపు మాత్రం కొంతసేపు అమ్మ చూపులు సంచ రించి ఆగింది. ఆమె ఇంటి తలుపూ లోపలివైపు గొళ్లెం పెట్టినట్టుంది.
'వే క్లియర్' అన్నట్టుగా అమ్మ ఇంకాస్త నిదానంగా వ్యవహరించింది. సాధారణమైన అమ్మ పద్ధతిలో పెద్ద వేపుడు బాణలిలో కాసేపటి క్రితం వరకూ ఆట చూపించిన పుంజు ఏ వ్యతిరేకతా లేకుండా వుడుకుతోంది.
పొయ్యిలో ఇంకొక కట్టెను పెట్టి దానికెదురుగా కూర్చొని కట్టెలపొయ్యి మండుతూ వుంటే చూస్తూ వుంది. పొయ్యి వేడెక్కి నేనూ దాని పక్కన ముడుక్కొని కూర్చున్నాను. ఏదో ఒక లోతైన ఆలోచన అమ్మలో తిరగటం తెలుస్తోంది.
ఒకవేళ ఇలా చెయ్యకుండా వుండాల్సిం దని ఇప్పుడు అనుకుంటోందా?
రేపు విషయం తెలిస్తే ఏం కావాలి, ఈ వూరి అయ్యోరి పెండ్లాం? మంచీచెడూ అని అన్నింటికీ ముందుండేది, ఈ వూర్లో అయ్యవారూ, అయ్యవారి భార్య అయిన అమ్మే కదా. అందుకే ఐదవ తరగతి కూడా దాటని అమ్మను అందరూ 'టీచర్' అని పిలుస్తున్నారు. చిన్న వడ్డీ వ్యాపారం కూడా చేస్తోంది. వడ్డీ అంటూ డబ్బుగా ఎవరి నుండీ తీసుకోక పోయినప్పటికీ వేరుగా వస్తువులు, పాత్రలు చేతులు మారతాయి. ఇవన్నీ కూడా ఒక అల్ప కోడి వల్ల ఒకే ఒక నిమిషంలో తలకిందులై పోతుంది.
కోడి మాంసానికి ఆశపడి ఇప్పటివరకూ చేర్చిపెట్టిన అన్నింటినీ పోగొట్టుకోవలసి వస్తుందేమోనన్న దిగులు కాబోలు అది అని నేను అనుకున్నందుకు వ్యతిరేకంగా, రోకలి పక్కన పెట్టిన పారను తీసుకొని ఆవేశం వచ్చిన దానిలా పేడతో అలికిన వంటగది మట్టినేలను చెక్కి గుంత తియ్యటం మొదలుపెట్టింది. మొదట్లో ఎంత ఆలోచించినా అర్థంకాలేదు.
ఏమొచ్చింది ఈ అమ్మకు? ఇవ్వాళ వున్నట్టుండి పక్కింటి కోడిని పట్టుకొని కోసేసింది. వంటగదిలో గుంత తీస్తోంది. నాకు జవాబిస్తున్నట్టుగా, మూలనున్న వెదురుచాటలోని ఆ కోడి రెక్కలు, ఈకలు, పేగులు, వ్యర్థాలు వీటితో పాటు మూసిన కళ్లతో వున్న దాని పూర్తి తలభాగం వీటిని ఆ గుంతలో వేసి మళ్లీ మట్టిని తోసింది.
చింతపండు రసం పోసి, మాంసం చారును దించటానికీ, వంటగది మొత్తము పేడతో అలకటానికీ సరిగ్గా వున్నది.
'ఎవురితోనూ సెప్పకూడదు' అన్న చెప్పని ఒప్పందం మా ఇద్దరి మధ్యా ఏర్పాటైంది.
బయట వాన శబ్దమూ, లోపలి నుండి పుట్టుకొచ్చే చలీ, అమ్మ నాకు వేసి పెట్టిన వేడన్నము, మాంసం కూరా, వెతికి వెతికి గరిటెతో తీసిపెట్టిన గుండెకాయ, రాతి గుండెకాయ గొప్ప మైకాన్ని కలిగించింది నాకు.
తిని ముగించేంతవరకూ తలుపు లోపలి వైపున గొళ్లెం పెట్టే వుంది. తిని ముగించే లోపు నిద్ర ముంచుకొచ్చింది. అక్కడే చాప పరుచుకొని పడుకున్నాను. సాయంకాలం నాన్న వచ్చే నన్ను లేపారు.
నిద్రపోయి లేవగానే మధ్యాహ్నం జరిగిం దంతా కలలో సంభవించినట్టుగానే వుంది. ఒకవేళ జరిగిందంతా కలా!
ఏమీ జరగనట్టు ఎంతో సహ జంగా అమ్మ లోపలికీ బయటికీ తిరుగుతుండటం కూడా నా అనుమానాన్ని బలపరిచింది.
అలకబడ్డ వంటగది ఇంకా ఈ వానకు ఆరలేదు. గుండెకాయ, మాంసము తిన్న కడుపు చెబుతుంది. ఇది కలేమీ కాదు, చాతుర్యమైన కోడి దొంగతనం ప్రతిఫలంగా నిండిన కడుపు.
అమ్మ నిదానం కాస్త ఆదుర్దాను కలిగించినప్పటికీ, నేరం జరిగి ఎన్నో గంటలు గడిచిపోవటంతో సహజంగా వున్నాను. ఆనవాళ్లు కూడా పూర్తిగా పూడ్చిపెట్టబడ్డాయి. కడుపులో నుండి ఎవరూ దేన్నీ తవ్వి తియ్యలేరు. అంతా కచ్చితంగా పూర్తయిందని అనుకుంటున్న నిమిషంలో మణెమ్మక్క మా ఇంటి ముందు నిలబడి, ''టీచరమ్మా...'' అని గొంతిచ్చింది.
ముఖంలో ఏ చిన్న మార్పూ లేకుండా, అమ్మ ఆ అక్కను ఎదుర్కొంది.
''రా మణెమ్మా...'' అన్న అభిమానంతో కూడిన పిలుపు కూడానూ. ఆ అక్క లోపలికొచ్చి ఒట్టి నేలమీద కూర్చుంది.
''ఆ చాపమీంద కూర్చో.'' అని వేసి వున్న చాపను చూపించింది అమ్మ.
ఆ అక్క సగం కూర్చోనీ కూర్చోకుండా, ''నా కోడిపుంజు కనబడ్డం లేదు అయ్యోరమ్మా.'' అనగానే అమ్మ ముఖాన్ని చూడకుండా ఆమె కళ్లు నాలుగు వైపులా తిరగాడసాగింది. ఇందులో ఏ సంబంధమూ లేకుండా లోపలి గదిలో కూర్చొని, నాన్న హాస్టల్ ఖర్చుల్ని రాసుకుంటూ వున్నారు.
గొంతు విని నాన్న వెనక్కు తిరిగి వాళ్లిద్దరినీ చూసి మళ్లీ తన పనిలో మునిగిపొయ్యారు.
''అయ్యో, నీ పెద్ద పుంజా. రొండు కిలోలుంటాయే?'' అని తానూ ఆదుర్దాతో అడిగినట్టుగా అడిగింది.
అమ్మకన్నా దాని బరువు సరిగ్గా మణెమ్మక్క కూడా తెలుసుకొని వుండటానికి వీల్లేదు.
''వానలో యాడ ముడుక్కోనుండాదో?'' అని మణెమ్మక్కా, ''బాగా ఎతికి సూడు...'' అని అమ్మా మాట్లాడటం పూర్తిచేసి, లేచి బయటికి వెళ్లటానికి ప్రయత్నించిన ఆమెకు అడ్డుపడి, ''చనం కూసో, వొస్తా, రొండు దోసెలు తినేసి పో. మా ఇంట్లో కూడా ఇయ్యాల కోడి కూరే.'' అని ఎంతో సహజంగా దోసెలు కాల్చటం ప్రారంభించింది అమ్మ. అగ్గి ఆగి నిదానంగా మండసాగింది.
తమిళ మూలం: బవా చెల్లదురై
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
సెల్: 73820 08979
Sun 25 Jul 06:17:16.25187 2021