Sun 15 Aug 01:47:33.765372 2021
Authorization
తమిళ మూలం : బవా చెల్లదురై
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ
అడగాలని అనుకునీ అనుకునీ ఇరవై ఆరేళ్లు గడిచి పొయ్యాయి. నాన్నా! అడగలేని ప్రశ్నలను నోట్బుక్లో రాసుం చాను. వాటినే కవితలు అంటున్నారు స్నేహితులు. సొంత సణుగుళ్లు అంటున్నారు సాహితీ మిత్రులు. నాకెక్కడిదయ్యా కవిత్వమూ, కథలూనూ? నాకు సొంతమైనదంతా ఒక్కటే కవితా ఒక్కటే కథేగా! అరుపులు వినీవినీ పూడుకుపోయిన నా చెవులూ, సోడియం వేపర్ వెలుతురులోనే ఇన్నేళ్లూ నిద్రకు అలవాటు పడ్డ నా కళ్లూ, నిద్రలేని కళ్లను నులుముకుంటూ మొదటి జాములోనే మండీ వాళ్లకు 'టీ' తీసుకురావటానికి పరుగెత్తేవాడికి కవిత్వమూ, కథలూ ఎలాగయ్యా సాధ్యం?
నీ ప్రేమ క్రూరత్వమే ఇలాంటి ఎన్నో ప్రశ్నలను అడగటానికి వీల్లేని అసక్తుడిగా మార్చేసింది నాన్నా. ప్రేమ, ఓదార్పు, కట్టుబాట్లు లాంటి ఎన్నో మాటల ద్వారా నువ్వు వేసిన ఇనుప కంచెకు వెనక, కొత్త వర్షంలో పూచిన చిరు పుష్పాలను కూడా నేను ఆగి చూడలేదు. నాకు స్కూలుకు సమయం మించి పొయ్యేది. ఆ లం... కు వ్యతిరేకంగా నేను చదివి కలెక్టర్ కావాలి, ఇవన్నీ ఆ చిరుచిరు పుష్పాల నునుపుదనాన్నీ అందాన్నీ బాధించొచ్చు, కదు నాన్నా!
ఒకే ఒక ప్రశ్నే నాన్నా నాలో... బూతుమాట లేని అమ్మ పేరును నువ్వు ఒక్కసారైనా పలికితే వినాలని ఉంది. మాట, మృదువుగా... నిదానంగా. నా మీదుండే నీ ప్రేమ క్రూరత్వాన్నంతా దూరంగా... విసిరి పారేసి, మూడు నెలల పసికందుగా...
అమ్మ గర్భంలో ముడుక్కొని... ఆమె రూపమిచ్చిన శరీరమిది.
నిన్నూ, నన్నూ ఒకే క్షణంలో విదిలించి పారేసిందా?
దీన్ని ఒక నేరంగా, పొత్తిళ్లలో పెరగనందుకు నేనడగటం లేదు. తల్లిపక్షి తన రెక్కల చాటున పిల్లల్ని భద్రంగా దాచిన దాని కన్నా సురక్షితంగా, నువ్వు నన్ను కనిపెట్టుకున్నావు. నువ్వు ఎగరమన్నప్పుడు నేను ఎగిరాను. నువ్వు చెప్పిన చెట్ల కొమ్మల్లోనివి మాత్రమే పండ్ల రుచి చూశాను.
నాతో కలిసి పనిచేసేవాళ్లు సంగీతం గురించి మాట్లాడుతున్నారు, వాదనలు చేస్తున్నారు. సంగీతం మనిషిని మైమరిచి పోయేటట్టు చేస్తుందంటున్నారు, నువ్వు నిద్రపోతున్న ఒక అర్థరాత్రి పూట నేనూ ఎంతో రహస్యంగా సంగీతాన్ని విన్నాను నాన్నా.
గడబిడ శబ్దాలు, జరుగు జరుగు అంటున్న అరుపులూ, మధ్య మధ్యలో పశువుల అంబారావాలు, బండ్ల హారన్ శబ్దాలూ... వీలు కావటం లేదు నాన్నా, ఇంతకన్నా పైకి వెళ్లటానికి నిద్రా, దు:ఖమూ ఆహ్వానిస్తున్నాయి. ముప్పై మూడేళ్లుగా చెవులు ఈ శబ్దాలకు అలవాటుపడి పాతబడి పొయ్యాయి. సరిచెయ్యబడ్డ శబ్దాలే సంగీతమట! నేను వినాలనుకునే శబ్దాలు ఎప్పుడు సరిచెయ్యబడ్డాయి?
స్కూల్లో చదువు కుంటున్నప్పుడు ఏ ఉపాధ్యాయుడూ ఈ ప్రశ్నను వినకుండా ఉండలేదు.
''మీ ఇల్లు ఎక్క డుంది?'' అందరూ వీధి పేరు చెబు తారు. కొందరు ఇంటి నెంబరు చెబుతారు. ఇంకా కొందరు ఇంటి పేరు కూడా చెప్పారు. నేను మాత్రమే లేచి ''మండీ వీధి'' అనేవాణ్ణి.
''మండీ వీధిలో ఎక్కడీ''
ఈ ప్రశ్న నామీద విసరబడే నిప్పు జ్వాల. ఏం చెప్పేది? మణి మొదలియార్ మండీ, రాజమాణిక్యం కమీషన్ మండీ, సీతాపతి నాయకర్ బియ్యపు మండీ అంటూ కొనసాగే నా పట్టికలో ఏ మండీని త్వరగా మూసేస్తారో అదే ఆనాటి రాత్రి నేను నివసించే చోటు. నిశ్చలంగా ఉన్న ఆ క్షణాలు జ్ఞాపకాల నుండి కదలలేనివి నాన్నా. గొంతు పూడుకుపోయి, శరీరం వణుకుతూ చూస్తున్న చూపులను తప్పించుకొని, చెప్పటం పూర్తిచేసి ఒక శవం లాగా... అందరూ అడిగారు. మీ నాన్న లేకుండా నువ్వు సాధ్యమే కాదా?
సోడియం వేపర్ దీపాల వెలుతురు పడే మండీల వరండాలలో నేను చదవటం పూర్తిచేసేంత వరకూ ఏరోజు నువ్వు నిద్రపోయావనీ? నా మెలకువ తర్వాత ఒక్కరోజూ నువ్వు లేవలేదు. ఇంటిని కాపాడే గుర్ఖా నిఘా కన్నా సునిశితమైనది నీ మెలకువ. వరం కోసం ఒక ముని చేసే తపస్సులా నాకోసం నువ్వు ఎదురుచూశావు. చలిలో, ఉక్కపోతలో నడిపించుకొని తీసుకెళ్లి టీ ని, ఎప్పుడైనా బన్నునూ తీసిచ్చి నా బద్దకాన్ని ఉత్సాహపరిచిన తోడువు నువ్వే నాన్నా.
చీకటి తొలిగేలోపే, ఒక మైలుకన్నా దూరంగా ఉండే తామరగుంటకు తీసుకెళ్లి, చల్లటి నీటిలో నన్ను ముంచి, సోపు పెట్టి ఒళ్లంతా శుభ్రంచేసి నూలుబట్టతో తుడిచినదంతా ఏ తండ్రీ చెయ్యనటువంటివే. పదవ తరగతి చదివేంత వరకూ కూడా నిక్కరుతో నిలబెట్టి స్నానం చెయ్యించేవాడివి. ఒక్కరోజు కూడా కింది మెట్టు మీదికి దిగటానికో, ఈదటానికి తపించిన నా రెక్కలనో నువ్వు గమనించనే లేదు. నాకు ఏమైనా జరిగితే నీకు ఎవరున్నారు నాన్నా? దీన్నే నాన్నా ప్రేమ క్రూరత్వం అని నేను మాటలో చొప్పించాను.
మొట్టమొదటగా మనం ఇల్లు అని అద్దెకు తీసుకున్నది నాకు ప్రయివేట్ స్కూలు టీచరు ఉద్యోగం వచ్చిన తర్వాతనే కదా. నా అవస్థల తారాస్థాయి, నాలుగు గోడల మధ్యన ఒక గదిలో పడుకోవటమంటే. ట్యూబ్ లైటూ, సిక్ట్సీ వాట్స్ బల్బూ వేసుకుని పడుకున్నా కూడా నిద్ర రానంటోంది. సోడియం వేపర్కు అలవాటుపడ్డ నిద్ర.
గతించిన కాలపు అవమానాలతో నత్త పెంకులోపలికి తన శరీరాన్ని లాక్కున్నట్టుగా నన్ను నేను కుంచించుకుంటున్నాను నాన్నా. ఎప్పుడూ మండీల ప్రాంతంలోని రద్దీతో కూడిన వీధులను తప్పించాలని, యాదృచ్ఛికంగా పక్కకు తిరిగే మయంలో మండీలలోని వరండాలు నా శరీరానికంతా ఏదో పూస్తోంది.
ఖాకీ నిక్కరు గుడ్డకూ, ఎనిమిది రూపాయలకూ తక్కువైన గంజి వార్చే తెల్లబట్టను చొక్కా గుడ్డ అని వాళ్లు తీసిచ్చినందుకు నువ్వు ఎన్నో రోజులు, ఈ పెద్ద మనుషుల ముందు వంగి నిలబడి ఉండటం, నేను టీ తీసుకురావటమూ, వాళ్లింటి అమ్మగార్ల చీరలను ఇస్త్రీ చేసి తీసుకెళ్లి ఇవ్వటమూ అన్న గత కాలపు ఇక్కట్లు ఇంకా కొనసాగుతున్నాయి నాన్నా.
వీధిలో నడిచి వెళుతుంటే 'రేరు ఈశ్వరా, పరుగెత్తరా పరుగెత్తరా నాలుగు స్ట్రాంగ్ టీ లు' అని ఒక గొంతు వినిపిస్తుందేమోనన్న ఆదుర్దాలో ఒక ఉపాధ్యాయుడు జీవించటమన్న తీవ్ర గాయపు బాధ నీకింకా అర్థం కాలేదన్నది గొప్ప వేదనే.
నీకు, నేనింకా మండీవాళ్ల కోసం పరుగెత్తే వాడిలాగా, నిక్కరు తొడుక్కుని, నిన్ను స్నానం చెయ్యించమని తామరగుంట ఒడ్డున తల వంచుకొని నిలబడే వాడిలాగా కొనసాగటం సంతోషంగా ఉండొచ్చు! నా శరీరమంతా అవమానం బురదలా పూయబడింది. నేనే శుభ్రం చేసుకుంటాను. కాస్త దారివ్వు నాన్నా!
పరోఠా కుర్మాను చూస్తున్నప్పుడు కాదు, గుర్తొస్తున్నప్పుడే వాంతికొస్తోంది నాన్నా. కుళ్లిన కాయగూరలూ, పండిపోయిన టమేటాలు, మన పరిస్థితికి ఇవే అన్న నీ న్యాయమూ కలిసి వాంతి వచ్చేలా చేస్తోంది. ధర్మలింగం నాయకర్ ఇంట్లో, పౌర్ణమికి, ఆకులు పరిచి వడ్డించిన వేడి అన్నాన్ని, తినలేక తడబడి, పిసుకుతూ ఉన్నాను. అది పరోటా కుర్మాను దాటుకొని పొయ్యామన్న ఆనందం కాదు. 'తినూ తినూ' అన్న నీ మాటలకు జవాబుగా, నా కళ్లు ఇంతకాలం గడిచాక తెరుచుకున్నదే, అదే నాన్నా సమాధానం.
ఇదంతా చెప్పటానికి నాకిప్పుడేమైంది? ఇదేగా నువ్వు? మూడు నెలల బిడ్డగా అమ్మ పాతచీరలో చుట్టి తీసుకొచ్చి, సూరి మండీ వాకిట్లో పడుకోబెట్టి మూటలెత్తి సంపాదించి కాపాడకుండా ఉండుంటే తెలుస్తుంది, నేను ఎలాంటి పోకిరిగాడిగా మండీ వీధిలో తిరిగాడుతూ ఉండేవాణ్ణో అని.
'నీకు ఆకలెత్తినప్పుడు, నాకూ ఆకలేసింది, నీ కడుపును కడగగా మిగిలినదానిలో నేనూ జీవించిన జీవితాన్ని నేరమనా చెబుతావు?' అని నువ్వు ఆవేశపడకు లేదూ ఆవేశపడు. ఎవరిని చూసినా అవమానపడి, లోలోన అణచుకుని నక్కి నక్కి ఒక వ్యక్తి జీవించాల్సిన దైన్యాన్ని నీతో పంచుకోకుండా, లేదూ నీ మాట ప్రకారమే నీతో మాత్రమే పంచుకోకుండా ఉండేలేక పోతున్నాను నాన్నా. చివరిగా ఒక్క విషయం,
మనసులోనే అరగదీసి పెట్టుకున్న ఈ ప్రశ్న దెబ్బతిన్న కన్నులాగా నలిగి, కొన్ని సమయాల్లో వాచి, కొన్నిసార్లు ఎండి...
అమ్మ చచ్చా పొయ్యింది?
తిరిగే వైపు నుండంతా బయలుదేరుతున్న ఈ ప్రశ్నవల్ల కృశించి, చావు వాకిట నిలబడ్డప్పుడల్లా, ఒక నీడ... ఒక నీడ... చెయ్యి పట్టుకుని లేపి, నడినెత్తిన శ్వాసించి, తల వెంట్రుకల్ని సవరించి, నా దు:ఖాలను, వొలిచి వెయ్యటానికి తపించే కరుణా, ప్రేమా నిండి తేలే ఆ కళ్లతో మాత్రమే ప్రతిసారీ తప్పించుకుంటున్నాను నాన్నా.
చెట్టునుండి తుంచి పడేసిన ఒంటరి కొమ్మలా మండీవీధి మూలలో ఎవరో ఒక మూటలు మోసే తాగుబోతుతో ఎప్పుడూ గొడవపడుతూ, అరుచుకుంటూ కాలం వెళ్లబుచ్చే ఆమె కళ్లకు, ఒక ప్రాణాన్ని కాపాడి గుండెకు హత్తుకుని ఉండే సామర్థ్యమూ జీవితమూ ఎలా నాన్నా సాధ్యం?
ఒప్పుకుంటున్నాను నాన్నా, ఆమెకూ నీకూ ఏ సంబంధమూ లేదు. మరి నాకు?