మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి సాంత్వన పరిచే రెండు మాటలు కూడా చెప్పలేరు. మీరు ఎదుటి వాళ్ళను చూస్తారు. ఎదుటి వాళ్ళ మిమ్ముల్ని చూస్తారు. బహుశా దీని వల్ల కూడా మనసుకు శాంతి లభిస్తుందేమో? ఇదే కారణమై వుండొచ్చు, మనుషులు ఒంటరిగా, గదుల్లో తట్టుకోలేని బాధగా వుంటే తరుచుగా బయటికి వస్తుంటారు. రోడ్ల మీద, పబ్లిక్ పార్కుల్లోకి, పబ్బుల్లోకి, అక్కడ మీకెవరు కూడా సాంత్వన పరచక పోయినా మీ దుఃఖం మీ నుంచి దారి మళ్ళి మరో వైపుకు తిరిగిపోతుంది. అలాగని దీని వల్ల బాధ బరువేమి తగ్గదు, కాకపొతే ఆ బరువు, కూలీ మోసే సామాన్ల మాదిరి ఒక భుజం నుంచి మరో భుజం మీదకు మోపబడుతుంది.
నేనీ బెంచి మీద కూర్చోవచ్చా? లేదు లేదు, మీరు లేవకండి! నాకీ చివరి అంచు చాలు. బహుశా మీకు ఆశ్చర్యం కలుగుతుండవచ్చు, నేను వేరే బెంచి వద్దకు ఎందుకు వెళ్లడం లేదని? ఇంత పెద్ద పార్కు. నాలుగు వైపులా ఖాళీ బెంచీలు. ఐనా మీ వద్దే ఎందుకు దూరి కూర్చోవాలనుకుంటున్నాను? మీరు తప్పుగా అర్థం చేసుకోరంటే నేనొక విషయం చెప్పనా? ఏ బెంచి మీదనైతే మీరు కూర్చున్నారో ఆ బెంచి నాది! ఔను, నేనిక్కడే రోజూ కూర్చుంటాను! మీరు అన్యదా భావించకండి! ఈ బెంచి మీద నా పేరేమి రాసి లేదు. ఐనా మున్సిపాలిటీ వారి బెంచి మీద పేరేమిటి? మనుషులు వస్తారు, కాసేపు కూర్చుంటారు, తిరిగి వెళ్ళిపోతారు! ఎవ్వరికి గుర్తు కూడా వుండదు, ఫలానా రోజు ఫలానా వ్యక్తి వచ్చి ఇక్కడే కూర్చున్నాడని. కూర్చున్న వ్యక్తి వెళ్లిపోగానే తిరిగి మొదటి లాగే ఖాళీ అవుతుంది. కాసేపైన తరువాత మరో ఆగంతకుడు అదే స్థానంలో కూర్చుంటాడు. అతనికివేమీ తెలియవు, ఇంతకు పూర్వము ఆ స్థానంలో స్కూల్‌కు వెళ్లే ఒక అమ్మాయి వచ్చి కూర్చుందో లేక ఒంటరిగా వున్న ఒక ముసలావిడ కూర్చుందో, కాకపొతే తాగి నిషాలో వున్న జిప్సీ కూడా వచ్చి కూర్చొని వుండొచ్చు.
లేదండీ, నిజానికి మనిషి ఎక్కడైతే స్థిరంగా వుంటాడో పేర్లు అక్కడే రాయబడతాయి. అందుకే ఇండ్లకు పేర్లుంటాయి, అలాగే మరి సమాధులకు. అసలుకైతే అప్పుడప్పుడు ఆలోచన కలుగుతూ వుంటుంది, సమాధులపై పేర్లు లేకుంటేనే నయమని, ఎందుకంటే బతికున్న మనిషి ఎవడైనా కాని మరొకరి సమాధిలోకి దూరడానికి ఇష్టపడడు కదా !
మీరటువైపు చూస్తున్నారా! గుర్రపుబగ్గీ- సరంజామా వైపు. లేదు, ఇందులో విచిత్రమేమి లేదు! పెళ్లిలాంటి శుభకార్యాలలో ఇప్పుడు కూడా మనుషులు గుర్రపు బగ్గీలు వాడుతున్నారు. నేనైతే రోజూ చూస్తూవుంటాను. అందుకే నేను ఈ బెంచిని నా కోసం నిర్ణయించుకున్నాను. ఎందుకో తెలుసా! మీ దష్టి సూటిగా ఎదురుగా వున్న చర్చి పైనే పడుతుంది, మీ మెడను తిప్పి చూడాల్సిన అవసరం పడదు. చాలా పాత చర్చి. ఈ చర్చిలో పెళ్లి జరిపించడం అంటే ఎంతో గౌరవంగా భావిస్తారు. అవసరమనుకున్నవాళ్ళు ఎనిమిది, పది నెలల ముందే తమ పేర్ల మీద అడ్వాన్స్ బుకింగ్ చేయించుకుంటారు. ఐనా, నిశ్చితార్ధానికి, పెళ్ళికి మధ్య ఇంత పెద్ద టైం గ్యాప్ సరియైంది కాదు. అప్పుడప్పుడు మధ్యలో అభిప్రాయబేదాలు వచ్చేస్తుంటాయి, ఇంకా చెప్పాలంటే సరిగా వివాహ ముహూర్త సమయంలో వధువు లేదా వరుడో కనబడకుండా పోతారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నిశ్శబ్దంగా వుండేది. గుంపులు గుంపులుగా మనుషులు వుండక పోయేవారు. ఇలా గుర్రాల బగ్గీలు ఉండేవి కావు. బిచ్చగాళ్ళు కూడా వట్టి చేతులతో వెళ్లిపోయేవారు. ఇలాగే, రోజులాగే కూర్చొని ఎదురుగా వున్న బెంచి మీద ఒకమ్మాయిని చూసా. ఒంటరిగా కూర్చొని శూన్యపు కళ్ళతో తదేకంగా చర్చి వైపే చూస్తోంది.
"పార్కులో ఇదే పెద్ద సమస్య ! ఇంత విశాలమైన ప్రదేశంలో వుండి కూడా ఎవరికీ వారే తమలో తాము బందీలై కూర్చుండిపోతారు."
మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి సాంత్వన పరిచే రెండు మాటలు కూడా చెప్పలేరు. మీరు ఎదుటి వాళ్ళను చూస్తారు. ఎదుటి వాళ్ళ మిమ్ముల్ని చూస్తారు. బహుశా దీని వల్ల కూడా మనసుకు శాంతి లభిస్తుందేమో? ఇదే కారణమై వుండొచ్చు, మనుషులు ఒంటరిగా, గదుల్లో తట్టుకోలేని బాధగా వుంటే తరుచుగా బయటికి వస్తుంటారు. రోడ్ల మీద, పబ్లిక్ పార్కుల్లోకి, పబ్బుల్లోకి, అక్కడ మీకెవరు కూడా సాంత్వన పరచక పోయినా మీ దుఃఖం మీ నుంచి దారి మళ్ళి మరో వైపుకు తిరిగిపోతుంది. అలాగని దీని వల్ల బాధ బరువేమి తగ్గదు, కాకపొతే ఆ బరువు, కూలీ మోసే సామాన్ల మాదిరి ఒక భుజం నుంచి మరో భుజం మీదకు మోపబడుతుంది. దీని వల్ల పెద్ద ఉపశమనం ఏమీ చేకూరదు. నేనైతే ఇలానే చేస్తూవుంటాను, ఉదయానికల్లా గది బయటికి వచ్చేస్తాను. లేదు లేదు, మీరు మరో విధంగా భావించవద్దు. నాకేమి సమస్యలు లేవు. నేను ఎండ కోసం ఇక్కడికి వస్తాను- మీరు చూసివుండవచ్చు పార్కు మొత్తంలో చెట్టు కింద లేని బెంచి ఇదొక్కటే! ఈ బెంచి మీద ఒక్క ఆకు కూడా రాలిపడివుండదు. ఇంకో పెద్ద లాభమేమిటంటే, ఇక్కడి నుండి సూటిగా చర్చి వైపు చూడగలుగుతాను. బహుశా ఈ విషయం మీకు ముందే చెప్పివుంటాను.
నిజంగా మీరు అదష్ట వంతులు. ఇక్కడికొచ్చిన మొదటిసారే ఎదురుగా ఃఘోడా -గాడిః సరంజామా చూడగలుగుతున్నారు. అలా చూస్తూవుండండి- చర్చి ఎదురుగా కాసేపట్లో చిన్న గుంపు గుమికూడుతుంది. ఆ గుంపులో చాలా వరకు ఎలాంటి మనుషులు వుంటారంటే వారికి పెళ్లి కొడుకు ఎవరో తెలియదు, పెళ్లికూతురు ఎవరో తెలియదు. కాని వారిని ఒక్క క్షణం చూడటానికి గంటలకొద్దీ బయట నిలబడివుంటారు. మీ విషయం నాకు తెలియదు కాని కొన్నింటిని చూడటానికి కలిగే ఉత్సాహం జీవిత కాలమంతా సరిపోదు. ఇప్పుడు చూడండి, మీరు ఈ పెరెంబులేటర్ ముందు కూర్చొని వున్నారా? నాకు మొదటగా ఏమనిపించింది అంటే లోపలికి తొంగి చూడాలని ! ఏదో మీ పిల్లాడు వేరే వారికి భిన్నంగా వున్నట్లు. కాని భిన్నంగా ఏమీ వుండడు. ఈ వయసులో అందరు పిల్లలూ ఒకే తీరుగా వుంటారు - నోటితో చూషకము పట్టుకొని అలా పడుకొని వుంటారు. ఐనా ఎప్పుడైతే నేను పెరెంబులేటర్ ముందు నుండి వెళ్తుంటానా, లోపలికి తొంగి చూడాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఆలోచిస్తే నాకూ చాలా విచిత్రమనిపిస్తూ వుంటుంది. ఏదైనా వస్తువు ఎప్పుడూ ఒకే తీరుగా వుంటుందో దాన్ని వదిలించుకోవాలి తప్ప మనిషి దాన్నే పట్టుకు వేళ్ళాడుతుంటాడు. ఎలాగంటే, ప్రైమ్‌లో పడుకున్న పిల్లలు లేదా కొత్త పెళ్లి జంట కూర్చున్న గుర్రపు బగ్గీ లేదా శవాన్ని పడుకోబెట్టిన పాడె. మీరు గమనించి వుండవచ్చు, ఇలాంటి సంఘటనలప్పుడు చిన్నపాటి గుంపు ఎప్పుడూ గుమికూడుతుంది. మీ అధీనంలో వున్నా లేకున్నా, కాళ్ళు మాత్రం వాటంతట అవే అటువైపుకు లాక్కెళ్తాయి. నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తూ వుంటే ఆశ్చర్యమనిపిస్తుంది, ఏ విషయాలైతే మన జీవితాన్ని నిలబెట్టడానికి సహాయకారిగా వుంటాయో, అవి మన నియంత్రణలో వుండవు. అటువంటి వాటి గురించి మనం అస్సలు పట్టించుకోము. ఇతరులతో పంచుకోము. నేను మిమ్ముల్ని అడుగుతున్నాను - మీరు మీ జన్మ ఘడియల గురించి ఏమైనా జ్ఞాపకం తెచ్చుకోగలరా ? లేదా మీ మరణం గురించి ఎవరితోనైనా ఏమైనా చెప్పగలరా? అంతెందుకు, మీ వివాహ అనుభవాల గురించి ప్రత్యక్షంగా మీ అంతరాత్మతో మాట్లాడగలరా? మీరు నవ్వుతున్నారు కదూ ... లేదు, నా ఉద్దేశం మరేదో వుంది. తన వివాహం అనుభవాలను జ్ఞాపకం చేసుకోకుండా వుండగలిగే అటువంటి వ్యక్తి ఎవరు! నేను విన్నదేమిటంటే కొన్ని దేశాలు ఇలా కూడా వున్నాయని, అక్కడ మనుషులు మత్తులో మునిగే దాకా తమ వివాహ ప్రసక్తి ఎత్తరని, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని... ఆ తరువాత ఆ విషయాలే వారికి గుర్తుండవని. నా ఉద్దేశం అది కాదండీ, ఇలాంటి అనుభవాల గురించియని కాదు, వాస్తవానికి నా ఉద్దేశమేమిటంటే మీరు ఖచ్చితంగా ఆ క్షణాన్ని గుర్తుకు తెచ్చుకోగలరా! ఎప్పుడైతే మీరు ఒంటరిగా, విడిగా వుండలేక జీవితాంతం మరొకరి తోడు కావాలన్న తుది నిర్ణయం తీసుకున్న క్షణం. మీరు ఖచ్చితంగా ఆ బిందువు పైన మీ వేలును పెట్టగలరా! ఏ క్షణమైతే మీ లోపలవున్న ఒంటరితనాన్ని పక్కకు తోసి మరొకరికి స్థానం కల్పించి స్వాగతం పలికే క్షణం...? ఔను, అలాగే కొద్దీ సమయం క్రితం మీరు కాస్త పక్కకు జరిగి నన్ను ఈ బెంచి మీద చోటిచ్చినట్లుగా..! నేనిప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానంటే, ఏదో మీరు నాకు సంవత్సరాలుగా పరిచయం వున్నట్లు...
చూడండి, ఇప్పుడు నలుగురైదుగురు సిపాయిలు కూడా చర్చి ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలాగే ఒక్కొక్కరుగా వచ్చి అందరూ గుమికూడితే వచ్చిపోయే దారి కూడా ఃబంద్ః అయిపోతది. నయం ఈ రోజు ఎండ వుంది. చలికాలంలో కూడా మనుషులు తోసుకుంటూ, రాసుకుంటూ నిలబడి పోతారు. నేనైతే సంవత్సరాల నుండి చూస్తూ వస్తున్నాను.. ఒక్కొక్కసారి, పదిహేను సంవత్సరాల క్రితం నా పెళ్లి సందర్భంలో గుమికూడిన జనమే ఇంకా నిలబడి వున్నారా! అన్న భ్రమ కలుగుతుంది. అదే గుర్రపు బండి అటూ ఇటూ తిరుగుతూ సిపాయిలు, ఈ రోజు కూడా ఏమీ మారలేదు అన్న రీతిలో వుంది. ఔను, నా పెళ్లి కూడా ఇదే చర్చిలో జరిగింది. కానీ చాలా కాలం కిందటి మాట. అప్పుడు గుర్రబ్బండి నేరుగా చర్చి దర్వాజ ముందుకే వచ్చి నిలబడే విధంగా దారి ఇంత వెడల్పుగా వుండకపోయేది. మాకు ఆ రోజు బగ్గీని ఆ సందు వెనకాలే నిలబెట్టవలసి వచ్చింది. నేను మాత్రం మా తండ్రి గారితో కలిసి నడుచుకుంటూ ఇంతదాకా వచ్చాను. దారికిరువైపులా జనాలు నిలబడి చూస్తుండగా ఎక్కడైనా పొరబాటు జరిగి కాళ్ళు జారి ఎక్కడ పడిపోతానోనని నా గుండె ధక్.. ధక్.. మంటూ కొట్టుకోసాగింది. తెలియదు, ఎవరైతే గుంపులో వుండి నన్ను చూడటానికి వచ్చి నిలబడిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో. మీరేం ఆలోచిస్తున్నారు.. ఒక వేళ ఎవరైనా ఆ గుంపులోని వ్యక్తి నన్ను గుర్తుపట్టి ఈ బెంచి మీద ఒంటరిగా కూర్చున్న అమ్మాయి తనేనని గుర్తుపట్టగలడా! ఆ రోజు తెల్లని దుస్తులు ధరించి చర్చి వైపుకు వెళ్తున్న అమ్మాయి నేనేనని? నిజం చెప్పండి.. గుర్తు పట్టగలరా? మనుషుల సంగతి నాకు తెలియదుగాని ఆ గుర్రం మాత్రం తప్పకుండా నన్ను గుర్తుపట్టగలదు. ఆ రోజు దాన్ని లాగిపెట్టి తెచ్చాం. ఔను, గుర్రాన్ని చూడగానే నేనెప్పుడూ ఆశ్చర్యపోతూవుంటాను, ఎప్పుడైనా మీరు దాని కళ్ళలోకి తొంగి చూసారా? ఎలా అనిపిస్తుందో తెలుసా! ఒక ఆత్మీయమైన వస్తువు నుండి తను వేరు చేయబడినాయని, కాని ఇప్పటికీ విడిపోయిన భావనకు అలవాటు పడలేక పోయిందేమో! అందుకే మనుషుల ప్రపంచంలో గుర్రం ఎప్పుడూ ఉదాసీనతగా వుంటుంది. ఏ వస్తువు తోటి కూడా అలవాటు పడకపోవటం... ఇంతకన్నా దౌర్భాగ్యపు స్థితి మరొకటి లేదు. ఈ మనుషులు చివరి వరకు ఎవ్వరి తోటి ఆత్మీయ సంబంధం నిలబెట్టుకోలేక ఆ గుర్రంలాగే ఒక ఉదాసీన ప్రపంచంలోనే వుండిపోతారు. లేదా నాలా ఒక ఎండ తునక అన్వేషణలో ఒక బెంచీ నుంచి మరో బెంచికి మధ్యలో తిరుగాడుతూ వుంటారు.
ఏమన్నారు మీరు? లేదు, బహుశా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నాకు పిల్లలు లేరు - ఇది నా అదష్టం. పిల్లలే వుంటే నేనెప్పుడూ వేరుపడక పోదు. మీరు గమనించే వుంటారు, స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వుండకపోయినా పిల్లల కారణంచే కలిసే వుంటారు. నాకు ఇలాంటి ఆటంకం కలగలేదు. దీని వలన నేను చాలా సుఖంగా వున్నాను. ఒక వేళ సుఖానికి అర్థం వెతికితే, మనకు మనంగా స్వయంగా ఒంటరితనాన్ని కోరుకుంటే! కానీ కోరుకోవడం వేరు, అలవాటు పడడం వేరు. సాయంకాలానికి ఎండ మసకబారి పోతూవుంటే నేను నా గదిలోకి వెళ్ళిపోతాను. కాని వెళ్ళడానికి ముందు నేను ఃపబ్ఃలో ఎక్కడైతే అతను నా కోసం వేచి వుండే వాడో అక్కడ తప్పకుండా కాసేపు కూర్చుంటాను. తెలుసా, ఆ పబ్ పేరు? బోనాపార్ట్- ఔను నెపోలియన్ మొదటిసారి ఈ నగరానికి వచ్చినపుడు, ఆ పబ్‌లో కూర్చున్నాడని అంటూ వుంటారు. కానీ ఆ రోజుల్లో దీని గురించి నాకేమి తెలియకపోయేది. మనం బోనాపార్ట్ ఎదురుగా కలుసుకుందామని అతను నాతో మొదటిసారి చెప్పినపుడు నేను పూర్తి సాయంకాలం దాకా నగరానికి మరో వైపు ఎక్కడైతే నెపోలియన్ గుర్రం మీద కూర్చొని వున్నాడో అక్కడే నిలబడ్డాను. మీకెప్పుడైనా మీ మొదటి డేటింగ్ ఇలా గడిచిందా, మీరు పూర్తి సాయంకాలం పబ్‌కు ఎదురుగా నిలబడివుంటే మీ కాబోయే జీవిత భాగస్వామి ఃపబ్లిక్ స్టాచ్యూః కింద... క్రమంగా అతని ఇష్టం నా కలవాటుగా మారింది. మేమిద్దరం సాయంకాలం సమయం అప్పుడప్పుడు ఎక్కడైతే నన్ను కలవడానికి ముందు అతను కూర్చునేవాడో ఆ ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం. లేదా నగరంలో ఆయా ప్రదేశాలకు ఎక్కడైతే నా బాల్యం గడిచిందో అక్కడికి వెళ్ళేవాళ్ళం. మీకు ఇదంతా వింతగా అనిపించటం లేదా! మనం ఏ వ్యక్తినైతే అధికంగా ఇష్టపడతామో, కేవలం వర్తమానంలోనే ఆ వ్యక్తితో వుండాలని కోరుకుంటామా? అలా కాకుండా ఎప్పుడైతే సదరు వ్యక్తి మనతో లేనప్పుడు అతని గతంలోకి కూడా తొంగి చూడాలనుకుంటాము కదా? మనమెంతగా ఈర్ష్య తో స్వార్థపరులమై పోతామంటే, ఆ వ్యక్తి మనం లేనప్పుడు కూడా జీవితాన్ని గడిపేవాడు, ప్రేమించేవాడు, నిద్ర, మేల్కోవడం చేసేవాడు కదా! అలాంటి సమయాలు కూడా వుండి వుంటాయి అన్న విషయాన్ని కనీసం ఆలోచించే సహనం కూడా కోల్పోతాము. మరి ఒకవేళ అదే వ్యక్తితో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత, ఏ అలవాటు స్వయంగా నీది, ఏది ఇతరుల నుండి నువ్వు చౌర్యం చేసింది అన్న విషయం చెప్పడం కూడా అసంభవం అయిపోతుంది. ఔను, పేక ముక్కల్లా అది నీలో ఎలా కలిసిపోతుందంటే ఏదైనా ఒక పేక ముక్కను తీసి ఇది నాదియని, ఆ పేక ముక్క ఎదుటి వ్యక్తిదని చెప్పలేము. చూడండి, అప్పుడప్పుడు నేనాలోచిస్తూవుంటాను చావుకి ముందు మనలో అందరికి ఒక అవకాశం దొరకాలి, మన అంతరంగాలను తవ్వి చూసుకోవడానికి. మన గతాన్ని, మన మూలలను, ఉల్లిపొరలుగా ఒక్కొక్కటి వొలుచుకుంటూ పోతే మీ కాశ్చర్యం కలగకపోదు, అందరూ తమ తమ వంతు తీసుకోవడానికి వచ్చి చేరుతారు. తల్లి, తండ్రి, స్నేహితుడు, భర్త అలా అన్ని పొరలు వారికి... చివరికి మిగిలిన ఎండి పోయిన మూలం- తొడిమె మీ చేతిలో వుండిపోతుంది. అది ఎందుకూ పనికి రాదు. దాని మరణం తర్వాత తగలబెట్టేస్తారు లేదా మట్టి కింద పాతి పెట్టేస్తారు. మనిషెప్పుడూ ఒక్కడిగానే మరణిస్తాడని అంటూ వుంటారు కదూ! నేను నమ్మను. మనిషి తన అంతరాత్మలో వున్నవారందరిని తనతో పాటుగా తీసుకొని మరణిస్తాడు. ఎవరితోనైతే పోరాటం చేస్తూ వుండేవాడో, ఎవరినైతే ప్రేమించేవాడో తన లోపల వున్న మొత్తం ప్రపంచాన్ని తనతో పాటు తీసుకొని పోతాడు. అందుకే మనం ఎవరైనా మరణిస్తే దుఃఖానికి గురవుతామో, అది కూడా స్వార్థంతో కూడుకున్న దుఃఖమే. ఎందుకంటే, ఆ మనిషితో పాటు వున్న మన వంతు కూడా శాశ్వతంగా దూరమవుతుంది.
అరె, చూడండి- అతను మేల్కొన్నాడు. కాస్త పెరెంబులేటర్ కదిలించండి. నెమ్మది నెమ్మదిగా కదిలిస్తూ వుండండి. తనకు తానుగా వూరకుండిపోతాడు నోటితో చూషకం ఎలా పట్టుకున్నాడో చూస్తే అది చిన్నపాటి సిగార్‌ను తలపిస్తుంది. చూడండి, ఎలా పైన మబ్బుల్ని మిటకరిస్తూ చూస్తున్నాడో! నేను నా చిన్నతనంలో ఒక కర్రను తీసుకొని ఇలా తిప్పుతూ వుండేదాన్ని. అప్పుడు అవి నా సైగల మీద గగనంలో విహరిస్తున్నాయా అన్నట్లు కదలాడేవి. మీరేం అనుకుంటున్నారు? పిల్లలు ఈ వయసులో వాళ్ళేం చూస్తున్నారో, వాళ్ళేం వింటున్నారో, అవి తరువాత వారికి గుర్తుకుంటాయా? తప్పకుండా గుర్తుండి వుంటాయి. ఏదో ఒక శబ్దం, కదలిక, అడుగుల చప్పుడు, వీటిని పెద్దయ్యాక వయస్సు వలలో పోగొట్టుకుంటూ వుంటాము. కానీ అనుకోని సమయంలో వాటి ఆనవాళ్లు అందగానే మనకనిపిస్తూ వుంటుంది, ఈ స్వరం ఎక్కడో విన్నట్లుగా, ఈ సంఘటన లేదా ఇలాంటి సంఘటనే ఎప్పుడో మన ఎదుటే జరిగినట్లుగా, దాంతో పాటే ఆ సంఘటనతో ముడిపడిన అనేక విషయాలు ఏవైతే మన మనసులో సంవత్సరాల తరబడి పేరుకుపోయివుంటాయో అవి ముడి విప్పినట్లుగా ఒక్కొక్కటిగా అన్నీ విచ్చుకుంటాయి. కాని రోజూ వారి పరుగులాటలో వాటి వైపు మన ధ్యాస మల్లదు. కాని అవి అక్కడే ఉంటాయి. సమయం కోసం వేచి చూస్తూ కాచుకొని ఓ మూలకు నక్కి వుంటాయి. రోడ్డు పై నడుస్తూ వున్నప్పుడు, ట్రామ్ కోసం వేచి చూస్తున్నప్పుడు లేదా రాత్రి పడుకోబోయే ముందు, నిద్ర పట్టని సమయాలందు అకస్మాత్తుగా మనల్ని పట్టుకుంటాయి. అప్పుడు మీరెంతగా గింజుకున్నా, తండ్లాడినా అవి మిమ్ముల్ని వదలవు. నాతో ఒక రాత్రి ఇలాగే జరిగింది...
మేమిద్దరం పడుకొని వున్నాం. అప్పుడు నాకొక విచిత్రమైన శబ్దం వినబడింది - సరిగ్గా అదే మాదిరి ఎలాగైతే నా చిన్నప్పుడు నేను ఒంటరిగా గదిలో కలవరిస్తూ నిద్రలేచే దాన్ని, అప్పుడు పక్క గదిలో అమ్మ, నాన్నలు లేరన్న భ్రమ కలిగేది. ఇంకా నేనెప్పుడూ వాళ్ళను ఇక చూడలేను అన్న భావన కలిగి గట్టిగా అరిచే దాన్ని. కానీ ఆ రోజు రాత్రి అరవ లేదు. పక్క మీద నుండి లేచి గడప వరకు వచ్చి తలుపులు తెరిచి బయటికి తొంగి చూసాను. బయట ఎవ్వరూ లేరు! వెనక్కి వచ్చి అతని వైపు చూసా. అతను గోడవైపుకు మొహం తిప్పి పడుకొని వున్నాడు. ఎలాగైతే ప్రతిరోజూ పడుకుంటాడో- అలా! అతనికేమి వినబడలేదు. అపుడు నాకర్థమైంది ఆ చప్పుడు బయటిది కాదు అది నా అంతరాత్మ లోని ధ్వని. కాదు, నా అంతరాత్మ ధ్వని కూడా కాదు, చీకట్లో ఒక గబ్బిలంలా నన్ను తాకుతూ వెళ్ళిపోయింది- అటు బయటికి కాదు, లోపలికి కాదుబీ ఐనా నాలుగు వైపులా రెక్కల చప్పుడు చేస్తూ..! నేను తిరిగి వచ్చి ఎక్కడైతే అతను పడుకున్నాడో అక్కడే మంచం మీద కూర్చున్నాను. నెమ్మది నెమ్మదిగా అతని శరీరాన్ని నిమరసాగాను. అతని దేహంలోని అన్ని భాగాలను స్పర్శించ సాగాను. ఒకప్పుడు ఆ స్పర్శ నన్ను పులకరింపజేసేది. నాకిది విచిత్ర మనిపించింది, నేనతన్ని తాకుతూ వున్నాను కానీ నా చేతులు శూన్యంగానే తిరిగి వస్తున్నాయి. సంవత్సరాల వెనకటి ప్రతిధ్వని అతని శరీర భాగాల నుండి విడివడి నా ఆత్మతో సంగమించేది. ఇప్పుడేమి అలా లేదు. అదే విధంగా అతని శరీరం వైపు తదేకంగా చూస్తూ వుండిపోయాను. ఎలాగైతే కొందరు మనుషులు, పాత శిథిల భవనాల గోడల మీద చాలా కాలం పూర్వం వాళ్ళు రాసి వదిలేసిన తమ పేర్లను అన్వేషిస్తున్నట్లు.. కాని నా పేరు అక్కడెక్కడా లేదు. వేరే ఏవో గుర్తులున్నాయి, ఇంతకు ముందు వాటిని నేనెప్పుడూ చూడనే లేదు. ఆ గుర్తులకు నాకు కనీసం ఎలాంటి సంబంధం లేదు. రాత్రంతా అతని తల దగ్గరే కూర్చున్నాను. నా చేతులు నిర్జీవమై అతని దేహంపై అలాగే పడి వున్నాయి. నాకు చాలా భయమేసింది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన శూన్యం నేనెవరితో చెప్పుకోలేని స్థితి. ఔను, మా వకీలుతో కూడా చెప్పుకోలేను, ఎవరినైతే నేను ఎంతో కాలం నుంచి ఎరుగుదును.
వారనుకున్నారు నాకు మతి చెడిందని. ఎలాంటి విఘాతం. నా భర్త ఏమైనా మరో స్త్రీతో వెళ్లేవాడా?అతనేమైనా నాతో క్రూరంగా ప్రవర్తించేవాడా? అవును, అతను ప్రశ్నల వర్షం కురిపించసాగాడు. ఇక నేనున్నాను, ఇడియట్ లా అతని ముఖం చూస్తూ వుండిపోయాను. అప్పుడు నాకు మొదటి సారి అనిపించింది, విడిపోవడానికి కోర్టు, కచ్చేరీలు వెళ్లనవసరం లేదని. సాధారణంగా అందరూ అంటుంటారు గదా మన బాధను ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక పడుతుందని. నా మనసెప్పుడూ తేలిక పడలేదండీ, మనుషులు బాధల్ని పంచుకోలేరు కేవలం ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులని.. నిర్ణయం చెబుతారు. అసలు సమస్య ఏమిటంటే ఎవరైతే మన బాధని గుర్తించి అర్థం చేసుకోగలరో ఆ వ్యక్తి నుండే మనం దూరం అవుతాము. అందుకే నేను నా బస్తీని వదిలి నగరంలోని ఈ ప్రాంతానికి వచ్చేసాను. ఇక్కడ నన్నెవరూ గుర్తు పట్టరు. ఇక్కడ నన్ను చూసి ఇలా మాట్లాడుకోరు.. ఃఃచూడండి, ఈ ఆడది తన భర్తతో ఏడేళ్లు కాపురం చేసి ఈ రోజు విడిపోయిందనిఃః ఇంతకు ముందు ఇలా ఎవరైనా మాట్లాడితే, నేను నడిరోడ్డులో నిల్చుండి పోయేదాన్ని. అలా మాట్లాడే వారిని పట్టుకొని మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగిందో వివరించి చెప్పాలని మనసు తహతహలాడేది. అతను పబ్‌కు ఎదురుగా, నేను విగ్రహం కింద ఎలా మేము మొదటి సాయంకాలం ఒకరికొకరం విడివిడిగా ఎదురుచూస్తూ గడిపేవాళ్ళం- ఏ విధంగా అతను మొదటిసారి చెట్టు చాటుకు లాక్కెళ్లి ఎలా ముద్దు పెట్టుకు న్నాడో, ఏ విధంగా నేను భయం భయంగా అతని శిరోజాలను తాకానో, ఔను, నిజమేమిటో వాళ్లకు తెలియ జెప్పే వరకు, ఆ రాత్రి గురించి ఏమి మాట్లాడలేనని అనిపించేది. ఎప్పుడైతే నా అంతర్లోకంలో మొదటిసారి కల్లోలం సష్టించ బడిందో, ఇంకా ఇంత కాలం తర్వాత నాలో కోరిక పుట్టింది, నేను పక్క గదిలోకి ఎక్కడైతే నా తల్లిదండ్రులు పడుకునేవారో అక్కడికి పరిగెత్తుకు పోవాలని. కాని, ఆ గది ఖాళీగానే వుంది. అవును, నేనెక్కడో చదివా, పెద్దవాళ్లమయ్యా మంటే అర్థం, మీరు ఒకవేళ అర్ధరాత్రి మేల్కొని ఎంతగా అరిచి గింజుకున్నా పక్క గదిలోంచి ఎవరూ రారు. అక్కడ ఎప్పుడూ ఖాళీగానే వుంటుంది. చూడండి, ఆ రాత్రి తర్వాత నేనెంత పెద్దదాన్ని ఐపోయాను.
కానీ, ఒక్క విషయం నాకిప్పటివరకు అర్థం కాలేదు. భూకంపం, బాంబుల దాడి సమాచారం పత్రికల్లో అచ్చవుతాయి. ఎక్కడైతే పిల్లల బడి వుందో అక్కడ ఇపుడు శిథిలాలే మిగిలివున్నాయని మరుసటి రోజే అందరికీ తెలిసిపోతుంది. ఎక్కడ శిథిలాలు పడివున్నాయో అక్కడే ధూళి పైకి లేస్తుంది. కాని మనుషుల జీవితాల్లో ఇలాంటి భూకంపాలు, సంఘటనలు జరిగితే ఎవ్వరికీ ఎలాంటి సమాచారం వుండదు. ఆ రాత్రి తర్వాత రెండవ రోజే నేను పూర్తి నగరంలో ఒక్కదాన్నే ఒంటరిగా తిరుగాడుతూ వుంటే ఏ ఒక్కరూ కనీసం నా వైపు తిరిగి కూడా చూడలేదు. మొదటి సారి నేనీపార్కుకు వచ్చినపుడు ఏ బెంచి మీదనైతే మీరు కూర్చున్నారో ఇదే బెంచీపై కూర్చున్నాను. ఇంకా, ఔను, ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యమేసిన విషయమేమిటంటే నేను సరిగ్గా అదే చర్చికి ఎదురుగా కూర్చున్నాను, ఏ చర్చిలో నా వివాహం జరిగిందో... అప్పుడు దారి ఇంత వెడల్పుగా లేదు, మా గుర్రపుబగ్గీ నేరుగా చర్చికి ఎదురుగా వచ్చి నిలబడడానికి. మేమిద్దరం నడిచే ఇక్కడిదాకా వచ్చాం.
మీరు వింటున్నారా, ఆర్గన్ మీద సంగీతం? చూసారా, వాళ్ళు దర్వాజలు తెరిచేసారు. సంగీతపు ధ్వనులు ఇక్కడి దాకా వినబడ్తాయి. ఈ ధ్వని వినగానే నాకర్థమయి పోతుంది, వారిరువురు ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారని, ఉంగరాలు మార్చుకున్నారని. చాలు, ఇంకా కొద్దీ సమయమే వుంది- వాళ్ళు బయటికి రావడానికి. మనుషుల్లో ఇపుడు అంత ఓపిక ఎక్కడిదని, ప్రశాంతంగా వేచివుండడానికి. ఒక వేళ మీరు వెళ్లి చూడాలనుకుంటే నిశ్చింతగా వెళ్ళిరండి. నేనెలాగూ ఇక్కడే కూర్చునే వుంటాను. మీ పిల్లవాణ్ణి చూస్తూ వుంటాను. ఏమన్నారు మీరు? అ, అవును, సాయంకాలం దాకా ఇక్కడే వుంటాను. ఆ తర్వాత చలి పెరిగిపోతుంది. పగలంతా చూస్తూ వుంటాను, ఎండ తునక ఏ బెంచి మీద పడి ఎండ మడుగు కడుతుందోనని- ఆ బెంచీ మీదనే వెళ్లి కూర్చుంటాను. పార్కులో ఎక్కడ నేను ఘడియ, అర ఘడియ కూర్చోకుండా వుండలేని ఏ మూల లేదు. కాని ఈ బెంచి నాకు అన్నింటి కన్నా ఇష్టమైనది. ఒకటి- దీని మీద ఆకులు రాలిపడే అవకాశం లేదు, రెండవది... అరే మీరెళ్ళి పోతున్నారా?
(జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, నిర్మల్ వర్మ హిందీ కథ ధూప్ కా ఏక్ టుక్ డాకు తెలుగు అనువాదం)
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
Sun 03 Oct 03:52:04.747945 2021