ఆమె సాధారణం కన్నా కాస్త ఎక్కువైన ఎత్తు. నలుపూ కాని, తెలుపూ కాని ద్రావిడ రంగు. ఇదే తన జీవితంలో మొట్టమొదటగా చూసే ఎరుపు రంగు ప్రభుత్వ కట్టడం అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్న అమాయకమైన కళ్లు. మొదటిరోజు కార్యాలయం ప్రవేశం కావటం వల్ల శ్రద్ధగా చేసుకున్న అలంకరణ. అదంతా అవసరం లేదన్నట్టుగా ఆమెను చుట్టుకొని వున్న ఆ నీలిరంగు కాటన్ చీరె. ఆమెను ప్రతిబింబిస్తూ ఆమె నుండి తేలివచ్చిన ఆ పరిమళం గురించి ఉదృతంగా లేచిన నా ఆసక్తిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆ వ్యక్తిని చూస్తూ...''ఎవరిని కలవాలి?'' పూర్తిగా కార్యాలయం దర్పంతో అడిగాను.
డిప్యూటీ తహసీల్దారుగా నేను ప్రమోషన్ పొందిన రెండవ నెలలో ఒక శుక్రవారం మధ్యాహ్నం. అప్పటి వరకూ గ్రహించని ఒక సువాసన వ్యాపనంలో మనసు తేలికై తలపైకెత్తినప్పుడు, ఎదురుగా వాళ్లిద్దరూ నిలబడున్నారు.
ఇద్దరినీ పరిశీలించిన నా కళ్లు ప్రకృతి ధర్మం ప్రకారం ఆమె మీదనే నిలిచిపోయింది. అది ఆకర్షణ వల్లే కాదని అంతరంగం తెలిపింది.
ఆమె సాధారణం కన్నా కాస్త ఎక్కువైన ఎత్తు. నలుపూ కాని, తెలుపూ కాని ద్రావిడ రంగు. ఇదే తన జీవితంలో మొట్టమొదటగా చూసే ఎరుపు రంగు ప్రభుత్వ కట్టడం అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్న అమాయకమైన కళ్లు. మొదటిరోజు కార్యాలయం ప్రవేశం కావటం వల్ల శ్రద్ధగా చేసుకున్న అలంకరణ.
అదంతా అవసరం లేదన్నట్టుగా ఆమెను చుట్టుకొని వున్న ఆ నీలిరంగు కాటన్ చీరె. ఆమెను ప్రతిబింబిస్తూ ఆమె నుండి తేలివచ్చిన ఆ పరిమళం గురించి ఉదృతంగా లేచిన నా ఆసక్తిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆ వ్యక్తిని చూస్తూ...''ఎవరిని కలవాలి?'' పూర్తిగా కార్యాలయం దర్పంతో అడిగాను.
''మిమ్మల్నే సార్.''
''కూర్చోండి.'' అని నా టేబుల్‌కు మరోవైపుకు జరిగినప్పుడే ఎదురుగా ఏ విధమైన అడ్డంకులు లేకుండా వుందని గ్రహించాను. కాస్త జరిగి కళ్లకు కనిపించిన రెండు చెయిర్లను నా పక్కగా వేసుకొమ్మని కోరాను.
ఆ కళ్లల్లో తేలిన ఒక చిలిపితనం గమనించనట్టుగా గమనించాను.
''సార్, ఈమె నా భార్య. పేరు లావణ్య. బి.ఎస్.సి. ఫిజిక్స్ చదివింది. కొత్తగా టి.ఎన్.పి.ఎస్.సి.(తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్)లో సెలక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ మీ కార్యాలయంలోనే.'' అని ఆయన చేతిలోని ఫైల్‌ను నా ముందుకు చాపాడు.
అప్పటివరకూ మూసి వున్న మా ఆఫీసు తలుపులు క్రీచుమంటూ తెరుచుకున్నాయి.
''సొంత వూరు?''
''కీళ్ పొన్నాత్తూరు.''
మొట్టమొదటిసారిగా ఆ యువతి నోరు తెరిచింది.
బోసిపోయిన ఒక ఆఫీసు పరిస్థితిలో, అందులోనూ ఇలాంటి ఎండ మాడ్చేస్తున్న మధ్యాహ్నం పూట లావణ్య లాంటి ఒక యువతి తన సొంత వూరి పేరును చెప్పటం కూడా కొన్నిసార్లు కవిత్వమైపోతుంది.
ఈ తరుణం కోసమే ఎదురుచూసినట్టుగా నా చూపులను పూర్తిగా ఆమెకేసే తిప్పాను. మనిద్దరి మధ్యా కొనసాగే మాటలలో ఇక మూడవ వ్యక్తి ఎందుకన్నట్టుగా ఆమె భర్త భావించి ఒంటరిగా వదిలేసినట్టు నేనే భావించి గొప్పతనంలో మునిగిపోయాను.
నా ఎదుటే లావణ్య వుండాల్సిన చోటు. కొంత అనుభవం గడించిన సూచనలు, సలహాలన్నీ ఇవ్వటం జరిగాయి. అన్నీ పూర్తయ్యాక, నా అహం బయటపడుతోందా అన్న నేరభావనతో ఆమె భర్త వైపుకు తిరిగి, ''మీరు ఎక్కడ పనిచేస్తున్నారు?'' అని అడిగాను. నాకే తెలుస్తోంది అది చాలా
చాలా
సంప్రదాయమైన ప్రశ్న.
''మిలట్రీలో సార్. ఇప్పుడుండేది యు.పి.లో!' అని చెబుతూ, ఆయన దగ్గరున్న సంచిలో నుండి ఒక పెద్ద స్వీట్ బాక్స్‌ను తీసి నా ముందుకు చాపాడు.
''వాళ్లే కదా జాయిన్ అవుతున్నారు. వాళ్ల దగ్గరే ఇవ్వండి.'' అని చెప్పేసరికి బాక్స్ లావణ్య అందాల చేతులకు మారాక ఒక జాంగ్రీ మాత్రం తీసుకొని, ''మిగతా వాళ్లకూ ఇవ్వండి.'' అని పక్కనున్న క్యాబిన్ల కేసి చేతిని చూపించాను.
ఇంటర్మీడియెట్ తర్వాత ఒక్కో సబ్జెక్టుకూ వేర్వేరుగా ట్యూషన్. తిరుక్కురళ్, భారతియార్ కవిత్వం వేరే. అయితే ఎక్కడికీ వెళ్లి ట్యూషన్ చెప్పించుకోకనే వీటిని నేర్చుకుని ఎంత ఆరితేరిన నటుడిగా వున్నాను.
''మీరు ఎన్ని రోజులు లీవులో వచ్చారు?''
''రేపు రాత్రి కాట్పాడి నుండి ట్రెయిన్ సార్. ఆమెను బాగా చూసుకోండి సార్.'' అని కరచాలనం చేసి నిష్క్రమించాడు. నొక్కిన ఆ భర్త చేతులలో మిలట్రీ కాఠిన్యం కనిపించింది.
లావణ్య రాక తర్వాత మా ఆఫీస్ ముఖంలో నూతనోత్సాహం కలిగించినట్టుంది. అన్నింటిలోనూ ఒక ఆసక్తి అందరికీ కలిగినట్టుగా నేను గ్రహించాను. దృష్టి కేంద్రీకరించలేని క్షణాలలో నా ఎదుటనున్న లావణ్య ముఖాన్ని గమనించేవాణ్ణి. రింగులు రింగులుగా వుండే ఆ నల్లని కురులు, ముఖంలో పడీ పడనట్టుగా అలల్లా కదిలేవి. పనిలోకి వచ్చే, కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఆడవాళ్లు నిజంగా దేవతల్లాగానే వస్తున్నారు. ఆ తర్వాతే కార్యాలయపు సాతానులు వాళ్లమీదికి దూకి దుర్దేవతలుగా మార్చేస్తున్నారు.
మార్గశిర నెలలోని తెల్లవారి జాములలో తలమీద పడే మంచులా ఆఫీసు పనిభారం మా అందరి మీదా పడసాగింది. అది సుఖవంతమైనదిలాగా కనిపించే విషపు సూదులు. ఆ బాధ నుండి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేది లావణ్య కళంకంలేని ముఖమే. అక్కడ శాశ్వతంగా శ్రమ నుండి ఓదార్పు పొందటం కోసం ఒక చోటుంది. ఎందుకనో ఆఫీసంటే ఇష్టం ఇప్పుడు మరింత ఎక్కువగా వుంది నాకు.
ఆఫీసు, బయటా రెండుచోట్లా లావణ్య ప్రత్యేకమైపోయింది. గలగలమంటూ వుండేది. ఆమె నుండి మాటలు సదా కురుస్తూనే వుంటాయి. వాటిలో తడీ, తపనా వున్నాయి. చుట్టూ వున్నవాళ్లు ఆ మాటల్లో పడిపోవటం, కలిసిపోవటం, మైమరిచిపోవటం గమనించటానికి వీలైంది. అయితే దానితోపాటు చివరిదాకా ప్రయాణించింది కొందరు మాత్రమే. ఆమె ఎప్పుడూ యు.పి.లో వున్న తన భర్తయిన ఆ మిలట్రీవ్యక్తి గురించే మాట్లాడుతూ వుందని కనిపెట్టటానికి వీలైంది.
ఆమె నుండి బయటికొచ్చే అన్ని మాటలలోనూ అతను మాత్రమే వున్నాడు. అతని ప్రేమా, ఎడబాటు, తపన, ఏ భేషజమూ లేకుండా ఒక్కొక్క మాటకూ ఒక్కోదాన్నీ ఆమె జాగ్రత్తగా ఎంచి పెట్టుకుంది. దూరంగా వున్నప్పటికీ ప్రతిక్షణమూ 'కన్నభిరాన్' ఆమెతోనే జీవిస్తున్నాడన్న ఒక వాస్తవాన్ని తనలో స్వీకరించింది. లావణ్య అన్న ఒకామె ఒంటరిగా లేదు. ఆమెతో ఆ మిలట్రీ వ్యక్తి ఒక లోడ్ చేసిన తుపాకీతో ఎప్పుడూ తోడుంటున్నాడన్న భావన అందరికీ కలిగింది. కన్నభిరాన్ లేని ఒంటరిదైన లావణ్యను నేను మాత్రమే కాదు ఎవరివల్లా దర్శించటానికి వీలుకాలేదు. ఎదో ఒక రక్షణ కోరి అనవసరంగా ఈ స్త్రీ అతనిని మోసుకొని తిరుగుతోందా? అని కొన్నిసార్లు ఆమెపై కలిగే అసహ్యాన్ని, చలనం లేని ఆ అందమైన ముఖంలో దోబూచులాడే రింగుల కురులను వెంటనే పీల్చేస్తాయి.
ఆమె తన సెల్ఫోన్లో అతనికి మాత్రం ఒక ప్రత్యేకమైన రింగ్‌టోన్ పెట్టుకుందన్న విషయాన్నీ కనిపెట్టాను.
ఆఫీస్ టైమ్‌లో అది కనీసం నాలుగు సార్లయినా ఆమెను పిలుస్తుంది. అదొక రహస్య కలయిక కోసం ఆహ్వానం లాగానే నన్ను అసూయ పరుస్తుంది. ఒక్కొక్క ఆహ్వానం ప్రారంభంలోనూ అయిష్టమైన లావణ్య ముఖం నన్ను చూస్తుంది. ఎన్నిసార్లని నేను ఆమెను గమనించటం లేదని ముఖం తిప్పుకుని నటించేది? ఆమె నన్ను కనిపెట్టేసిందేమోనన్న సన్నని ఆదుర్దా కనిపించి, తర్వాత అదే అలవాటైపోయింది.
సెల్ఫోన్లో అతనితో మాట్లాడుతూ ఆఫీస్‌ను వదిలి బయటికెళ్లేది. ఆఫీస్ కాంపౌండుకు ఎదురుగా పూర్తిగా వేపచెట్ల నీడ పరుచుకుని చల్లని నేల. నడుస్తూ నడుస్తూ కొన్ని సమయాలలో ఒక్కొక్క చెట్టుగా చుడుతూ వచ్చి, నిశితంగా గమనిస్తే వాళ్ల మాటల అంతానికి ఎన్నో వేపకొమ్మలలో నుండి చిగురాకులు తుంచివేయబడి వుండేది. నిట్టూర్పులను రకరకాలుగా విడవటం తప్ప, యాభై ఏళ్లు నిండబోయే ఒక ముసలి ఆఫీసర్‌గా ఇంకేం చెయ్యగలను?
ఆమెకోసం ఫోన్ ఆహ్వానాలు పెరిగిపోతూ వున్నాయి. లావణ్య మీదున్న నా అభిమానంపై అధికారం గావు కోరింది. మొండిగా నేను దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నాను. అయినా దాని ప్రభావం ఎవరివల్లా అడ్డుకోవటానికి వీలుకాదు.
''ఆఫీస్ టైమ్‌లో ఒక రోజుకు ఎన్నిసార్లని బయటికెళతారు లావణ్యా?''
''ఆరు గంటల తర్వాత ఇంట్లో వున్నప్పుడు మాట్లాడమనండి. వీలైతే బయటికెళ్లకుండా సీట్లోనే కూర్చొని మాట్లాడండి.''
ఇలా అది ఒక్కొక్కసారీ ఒక్కొక్కటిగా బయటికొచ్చింది. అన్నింటికీ లావణ్య నుండి ఒకే విధమైన నవ్వు. అది ఏ బెదిరింపునైనా తేలిక చేసేంత బలాన్ని కలిగివుంది. ఏ అధికారాన్నైనా పైకి లేవకుండా అణిచి కిందికి నెట్టేస్తుంది.
''ఆయన ఎప్పుడూ నా గురించే సార్ ఆలోచిస్తూంటారు. ఆయన నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా వుండలేడు. అందుకు సమయమూ సందర్భమూ ఏదీ అవసరం లేదు సార్. పిల్లలు దగ్గర కూడా ఎప్పుడో ఒకప్పుడే మాట్లాడతారు. నాతో మాత్రం ఆయన మాట్లాడుతూనే వుంటారు. నేనూ అంతే సార్. మా ఇద్దరి మధ్యలో అలాంటి ఒక ఇది సార్.''
''ఎప్పుడు ఇంటికొచ్చేస్తారు?''
''వచ్చే సంవత్సరం సార్. డిసెంబర్ 31తో పదిహేనేళ్ల సర్వీసు పూర్తవుతుంది. తర్వాత రాసిచ్చేసి వచ్చేస్తారు. ఇందులో ఒక రెండు నెలలు, తర్వాత పూర్తిగా మూడు వందలా అరవైఐదు రోజులూ అంతే సార్. తర్వాత నాకు అన్నీ ఆయనతోనే. ఫోన్లో మాట్లాడవలసిందే వుండదు.''
మిగతా ఆమె దగ్గరేం మాటలు లేవు. వాటిని ఎవరైనా ఆమె ముఖసంతృప్తి నుండి జవురుకోవచ్చు. వీలుకానివాళ్లు అంచనా వేసుకోవచ్చు.
ఈ యువతి ఎలాంటిది? ఈమెను వేటితోనూ అంచనా వెయ్యటానికి వీలుకాలేదు. ఈమె ప్రతి క్షణ విరామాన్నంతా అతనితోనే నింపేస్తున్నది. లేదూ నింపుకునేలా నటిస్తోందా? నేను ఏ నిర్ణయానికీ రాలేకపోయాను. నన్ను తలుచుకొని నేనే నవ్వుకునేవాణ్ణి.
మిలట్రీ నుండి సెలవుల్లో వచ్చి ఈమెను పెళ్లి చేసుకొని, కొన్ని రోజుల్లోనే వెళ్లినట్టున్నాడు. ఆ తర్వాతి రోజులలో వీళ్లిద్దరూ సెలవు జీవితాన్నే జీవించినట్టున్నారు. అతను లేకనే గడిచిపోయిన ఇన్నేళ్లను ఈమె ఇంకా అలవాటు చేసుకోలేదా? అతని రాకకోసం నిరీక్షించి తపించే మనసుతోనే తన ఒక్కొక్క దినాన్నీ గడుపుతోందా? అని అయోమయమైన నా మనసును అడ్డుకొని ఆపి, ఆఫీస్ వ్యవహారాలమీద తిప్పిన రోజులెన్నో.
వీటి దేంట్లోనూ తనకు సంబంధం లేదన్నట్టు లావణ్య వంచిన తలను ఎత్తకుండా పనిలో మునిగిపోయి వుండేది. ఇక వచ్చే సెల్‌ఫోన్ ఆహ్వానాలు మాత్రమే ఆమెను తలపైకెత్తగలవు.
ఒక సంవత్సరమూ, రెండు నెలలూ, నిమిషంలో కరిగిపోగలవని లావణ్య ఆఫీస్‌లో వున్న వాళ్లందరికీ స్వీట్ పంచినప్పుడే అర్థమైంది.
''ఆయన శాశ్వతంగా వచ్చేశారు సార్.'' ఆమె ముఖం మునుపటికన్నా ప్రకాశవంతంగా కనిపించింది. తల నిండుగా మల్లెల సరాలు వ్రేలాడుతోంది. ఆమె నుండి వీచే ఒక ప్రత్యేకమైన మల్లెల పరిమళమూ కలిసి ఇంకో కొత్త సువాసనను ఏర్పరచాయి.
''ఇకమీదట లావణ్యకు ఏ దిగులూ వుండదు.''
నేను నాలో చెప్పుకుంటున్నట్టుగా పైకే చెప్పేశాను.
''ఔను సార్.'' అని కళ్లు విప్పార్చి నాకు చాలా దగ్గరగా నిలబడి, నన్ను నేరుగా చూస్తూ అంది.
ఆ నిమిషమే ఆమె నా నుండి చాలాదూరం వెళ్లిపోయినట్టుగా అనిపించింది. ఆమె సీటును కూడా ఇంకో చోటుకు మార్చేద్దామా అని ఆలోచించి, వెంటనే దాన్ని ఎందుకో చెయ్యలేకపోయాను.
లావణ్య ఇంటి పరిస్థితులు పూర్తిగా ఇంకో విధంగా మారిపోయింది.
అతను ఇంటికొచ్చిన ఐదవరోజున ఆమె ఆఫీస్‌కు వెళ్లే తొందరలో స్నానం చేస్తోంది. ఎంత తొందరగా స్నానం చేసినా ఆమెకు పూర్తి స్వేచ్ఛ వుండాలి. నోరు ఏదో ఒక పాటను గొణుగుతూనే వుండాలి. ఆ విధంగానే ఆ రోజూ జరిగింది.
అతను ఆమెను పిలవటం, నీళ్లు కారుతున్న శబ్దంలోనూ, పాటను పాడుతున్న ఆనందంలోనూ ఆమెకు వినిపించలేదు.
ఆమె స్నానాలగది నుండి బయటికి రాగానే, ''మీ ఆఫీసులో శరకర్ ఎవరు?'' ఏదేదో కనిపెట్టానన్న ధోరణి అతని కంఠంలో కనిపించింది.
''నాతో పనిచేసే ఏ2. ఎందుకూ ఏంటి విషయం? ఫోన్ ఏమైనా చేశారా?''
''ఫోన్ చేస్తాడని ఎలా కరెక్ట్‌గా చెప్పావ్?''
ఆమె అతనిని ఎప్పుడూ లేనివిధంగా అప్పుడు సూటిగా చూసింది.
అతని కళ్లు కలత చెంది వుంది. ఒళ్లు ఆదుర్దా పడుతోంది. బోనులో తిరిగే ఒక జంతువులా అతను లోలోపల మదన పడుతున్నట్టుగా ఆమెకు అనిపిం చింది.
ఆమె ప్రశాంతంగా వుంది. కాసేపటిక్రితం షవర్లో నుండి కురిసిన చల్లని నీరు మనసునూ నిశ్చలంగా మార్చింది. తడి తలవెంట్రుకల నుండి నీళ్లు శరీరమంతా కారుతోంది.
''అతనేంటో తాళి కట్టిన పెళ్లాన్ని పిలిచినట్టుగా, లావణ్య ఎక్కడాని అడుగుతున్నాడు.''
ఆమె ప్రశాంతంగా అతనికేసి చూసింది.
''మాట్లాడకుండా వుంటే అన్నీ సరియై పోతాయా?''
ఆమె మాట్లాడింది. అందులో ఎన్నడూ లేని విధంగా లేదూ అతను అప్పటివరకూ సెల్ఫోన్లో వినని దీర్ఘం కనిపించింది.
''మీకేం అయ్యింది? ఇప్పుడు ఏం జరిగిందని ఇలా ఆవేశపడుతున్నారు? నాతో పనిచేసే వ్యక్తి ఆయనకన్నా జూనియర్ అయిన నన్ను ఎలా పిలుస్తారు? పెళ్లాన్ని పిలిచినట్టుగా పిలిచారంటే? లావణ్య అన్న పేరే అందరూ పేరుపెట్టి పిలవటానికే కదా?''
ఆమెకు పొంగుకొచ్చిన ఆవేశాన్ని అణచుకుంటూ బట్టలు మార్చుకోవ టానికి పడకగదిలోకి వెళ్లింది.
ఎప్పుడూ రంగుల్ని చూసి, ఆస్వాదించి, మ్యాచింగ్‌లో కాసంత కూడా తేడా లేకుండా జాగ్రత్తగా దుస్తులు ఎన్నుకునే లాఘవం అవ్వాళ కుదరలేదు. ఏదో ఒక చీరెనూ, దానికి ఏమీ సంబంధంలేని ఒక బ్లౌజునూ ధరించింది. గత నాలుగైదు రోజులలో జరిగిన సంఘటనలన్నీ ఆమెకు వ్యతిరేకంగా వున్నాయి. లేదూ ఇవ్వాళ వాటిని అలాంటి ఒక కోణంలో చూసేలా చేస్తోంది.
అతనికి ఈ ఇంటి పరిసరాలు అనుకూలంగా లేవు. 'తనలాగానే' అని అంతరాత్మ పలికింది.
దూరం నుండి సెల్‌ఫోన్ ద్వారా వెలిబుచ్చిన అతని ప్రేమ ఇప్పటికన్నా ఆమెను సజీవంగా వుంచినట్టుంది.
అతను కూడా అనవసరంగా ఆమెచేత ఉదాసీనబడు తున్నట్టుగా గ్రహించాడు. ఆమె ప్రతిరోజూ తనతో ఎంత మధురంగా సెల్ఫోన్లో మాట్లాడేది. ఆ మాటలు మళ్లీ తవ్వి తియ్యటానికి ప్రయత్నించి ఓడిపోయాడు. ప్రతి దానికీ కస్సున లేస్తోంది. ఆమె దార్లో పయనించటానికి వీలు కాలేదు. ఏదో వేరే ప్రపంచంలో ఎప్పుడూ వుంటోంది. తన పొడ పూర్తిగా ఆమెకు అనవసరమైపోతోంది.
ఆఫీస్‌కు బయలుదేరేందుకు తన హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకొని బయటికొచ్చింది.
''తిన్లేదా?''
''లేదు, వొద్దు.'' ఆమె ముఖం చూడకుండా ఇంకెటో చూస్తూ చెప్పింది.
అసహనపు వాసన ఇద్దరి మీదా ప్రసరించింది.
''నేను వచ్చే వుండకూడదు కదూ?''
ఆమె అతనిని సూటిగా చూసింది. తర్వాత తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా, ''ఇప్పుడు మాత్రం ఏమైందట? మిలట్రీ రిటర్న్ మనుషులకు కోటాలో వెయ్యి పనులున్నాయి. ఇంట్లోనే ఇలా కూర్చొని వుంటే ఏంటేంటో మనసు వూహిస్తుంది.''
ఆమె మాటల పొడవాటి కత్తితో ఖండింపబడ్డాడు.
''అయితే నన్ను బయటికి పోరా అంటున్నావ్?''
''పనికి పొమ్మంటున్నాను.''
ఇద్దరి మాటల్లోనూ తడి లేకుండా ఉష్ణమెక్కాయి.
ఆమె అతనిని తిరిగి కూడా చూడకుండా బయటికొచ్చింది.
శంకర్ ఇప్పుడు సెల్ఫోన్లో తనను ఆహ్వానిస్తే, తనకు అది ఎంత గొప్ప ఓదార్పుగా వుంటుంది. అతను ఆమెకు సంబంధించిన తన సంభాషణను ఎప్పుడూ ఒక కవిత ద్వారా ప్రారంభిస్తాడు.
- తమిళ మూలం: బవా చెల్లదురై ,
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ, 73820 08979
Sun 17 Oct 04:15:53.236831 2021