''నేను కేవలం మా అమ్మను మాత్రమే చూసి రమ్మన్నాను కాని అక్కడికి పోతే ప్రకృతి అందాలను ఆస్వాదించి స్వచ్చమైన గాలిని పీల్చుకుంటావని ఆశ. ఈ పట్టణాలలో అదే గాలిని వేలకు వేలు పోసి కొంటున్నారు తెలుసా?. పట్నం పోతే బాగుపడతాం అని నువ్వు పుట్టక ముందు వచ్చాం కాని ఈ కాలుష్యమైన గాలిని పీలుస్తూ రోగాల పుట్టలా తయారయ్యాం'' అంటూ తల్లి చెబుతుంటే తన తల్లి గురించి చెబుతుందా? తనని తన తల్లిని కన్న పల్లె గురించి చెబుతుందా? అనే ఆలోచనలో పడ్డాడు పవన్. ఏదైతేనేం అమ్మ మాట వినాలి అనుకోని చేయి కడుకొని తన రూంలోకి పోయి పడుకున్నడు.
సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి పోవాలంటే ఊపిరి బిగవట్టుకొని పోవాల్సిందే. లేదంటే రోడ్డు మీది బండ్ల పోగంతా కడుపులోనే కాపురం జేస్తది. టైం ఆరు దాటుతోంది. పవన్ ఇంటికి పోవాలంటే ఆలోచిస్తున్నడు. కాని తప్పదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది హైదరాబాదే అయినా ఈ మధ్య కాలుష్యం బాగా పెరిగిపోయింది. పోక తప్పదు అనుకోని మధ్యాహ్నం తిన్న లంచ్ బాక్స్ తీసుకొని అఫీసులోంచి బయటకు నడుస్తుంటే ఇంగ్లీష్ పాట రింగ్ టోన్‌తో తన ఫోన్ మోగింది. జేబులోంచి తీసి చూస్తే పవన్ వాళ్ళమ్మ. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ''చెప్పే నా అమ్మమ్మ బిడ్డ'' అని పవన్ అనగానే ''ఎక్కడున్నవ్ నాన్న?'' అని అడిగింది తల్లి. ''ఇదిగో నన్ను కన్న మా అమ్మ దగ్గరకు అంటే ఇంటికే వస్తున్న. చెప్పమ్మ ఏంటి విషయం'' అంటూ మెల్లగా మెట్లు దిగుతూ ఉన్నడు. ''ఒరే నాన్న మీ అమ్మమ్మకు అదే మా అమ్మకు ఆరోగ్యం బాగలేదంట రేపు అలా ఊరికి పోయోద్దువు ఒక రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి రారా..'' అని అనగానే ''సెలవా? నేనా? వద్దమ్మ. ఇక్కడ చాలా పనులున్నయి సెలవు పెట్టడానికి రాదే'' అంటూ అక్కడే నిలబడి మాట్లాడుతున్నడు. ''మా నాన్న కదరా అర్థం చేసుకో నేనే పోయేదాన్ని కాని నాకు వీలుకాకనే నిన్ను పొమ్మంటున్న. అందు లోను నీకు ఊరి వాతావరణం అంటే ఇష్టం కదా. అమ్మమ్మను చూసినట్టు ఉంటుంది ఆ వాతావరణంలో ఓ రెండు రోజులు గడిపినట్టు ఉంటుంది'' అని తల్లి చెప్తుంటే ''అదంతా కదమ్మా నాకు పోవడానికి రాదు అర్థం చేసుకో'' అంటూ తల్లిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు పవన్. తల్లి కూడా ఎలాగైనా వీడిని ఊరికి పంపాల్సిందే అన్నట్టు పట్టుదలగా ఉంది. ఇక చివరికి పవనే కన్విన్స్ అయి మళ్ళీ ఆఫీసులోకి పోయి లీవ్ లెటర్ రాసి బయటకు వచ్చి బైక్ తీస్కోని ట్రాఫిక్‌లో ఇర్రుక్కొని కష్టపడుతూ ఇంటికి చేరేవరకు టైం తొమ్మిది దాటింది. అప్పటికే తల్లి వేడి నీళ్ళు పెడితే స్నానం చేసి వచ్చి పెట్టిన అన్నం తినడానికి కూర్చున్నడు. పవన్ తింటుంటే ''అదేంట్రా చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి అంటే మా కంటే ముందే తయారయ్యే వాడివి ఈరోజు పోనని మారం చేస్తున్నవ్?'' అంటూ పక్కనే కూర్చొని అడిగింది తల్లి. తింటూనే తల్లిని చూస్తూ ''పోవాలని ఇష్టంలేక కాదు మా... ఆఫీసులో పనుంది. అందుకే పోను అన్నది'' అంటూ ముద్ద నోట్లో పెట్టుకున్నడు పవన్. ''ఊరికి పోవడమంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోవడం కాదురా! ఒక వ్యక్తి పసివాడై తల్లి ఒడిలో స్వేచ్ఛగా ఆడుకోవడం'' అంటూ తల్లి చెప్పగానే తినడం ఆపి ఆలోచనలో పడ్డాడు పవన్. ''నేను కేవలం మా అమ్మను మాత్రమే చూసి రమ్మన్నాను కాని అక్కడికి పోతే ప్రకృతి అందాలను ఆస్వాదించి స్వచ్చమైన గాలిని పీల్చుకుంటావని ఆశ. ఈ పట్టణాలలో అదే గాలిని వేలకు వేలు పోసి కొంటున్నారు తెలుసా?. పట్నం పోతే బాగుపడతాం అని నువ్వు పుట్టక ముందు వచ్చాం కాని ఈ కాలుష్యమైన గాలిని పీలుస్తూ రోగాల పుట్టలా తయారయ్యాం'' అంటూ తల్లి చెబుతుంటే తన తల్లి గురించి చెబుతుందా? తనని తన తల్లిని కన్న పల్లె గురించి చెబుతుందా? అనే ఆలోచనలో పడ్డాడు పవన్. ఏదైతేనేం అమ్మ మాట వినాలి అనుకోని చేయి కడుకొని తన రూంలోకి పోయి పడుకున్నడు.
పొద్దున పోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టింది పవన్ తల్లి. తను తయారై రూంలోంచి బయటకు వచ్చిండు. అన్నం పెట్టుకొచ్చి తినపెట్టింది. మళ్ళీ రెండు రోజులు నాతో ఉండడు కదా అన్నట్టు. ''నాన్న ఊరిలో ఏం ఇబ్బంది ఉన్న మీ పెద్ద మామ కొడుకు ఉన్నాడు కదా శ్రీను వాడిని అడుగు అన్నీ చూస్కుంటాడు'' అని చెప్పేసరికి 'వాడెవడు?' అన్నట్టు మొఖం పెట్టిండు. ''అప్పుడు మా సర్పంచి అన్న అని చెప్పేదాన్ని కదా. ఆ అన్న కొడుకే వీడు. ఇప్పుడు కూడా మా అన్న లేదా ఇంకెవరైనా మనోళ్ళే సర్పంచిగా ఉండొచ్చు. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్కుంటారు'' అని అన్నీ చెప్పి సాగనంపుతుంటే ''సరే నువ్వు జాగ్రత్త'' అంటూ అక్కడి నుండి బయలుదేరిండు పవన్.
పవన్ కనకంపల్లి స్టేజి దగ్గర బస్ దిగగానే శ్రీను బైక్ తీస్కోని వచ్చి ''హారు బావ'' అని పలకరించిండు. ''ఏం శ్రీను ఎట్లున్నవ్'' అని పవన్ కూడా పలకరిస్తూ చేతిలో చేయి కలిపిండు. ''బాగున్న బావ. అత్తమ్మ బాగుందా? రా కూసో ఇంటికి పోయి మాట్లాడుకుందాం'' అని శ్రీను చెప్పేసరికి ఎండలు బాగా మండుతున్నయని బ్యాగ్ లో ఉన్న సన్ గ్లాసెస్ తీస్కోని పెట్టుకొని బైక్ ఎక్కి కూసున్నడు పవన్. శ్రీను మెల్లగా బైక్ ని పోనిచ్చిండు. అక్కడి నుండి ఊర్లోకి రెండున్నర కిలోమీటర్ల దూరం. రోడంతా గుంతలు గుంతలు అయ్యింది. పవన్ గతంలో అంటే శ్రీను వాళ్ళ నాన్న సర్పంచిగా ఉన్నప్పుడు ఊరికి వస్తే రోడ్డు చాలా బాగుండేది. కాని ఈరోజు రోడ్డు మొత్తం ధ్వంసం అయ్యింది. బైక్ గుంతల్లో ఎగిరెగిరి పడుతుంది. కొంతదూరం పోంగనే ఎదురుగా పెద్ద టిప్పర్ వస్తుంది. అది చూసి శ్రీను బైక్ పక్కకు ఆపిండు. ''ఈ బండి ఊర్లోంచి ఎందుకు వస్తుంది శ్రీను?'' అంటూ అడిగిండు పవన్. ''ఈ బండ్ల వల్లనే బావ ఈ రోడ్డుకు ఈ గతి పట్టింది. ఇంతకుముందు నువ్వొచ్చినప్పుడు ఎంత బాగుండేది!'' అంటూ టిప్పర్ పోగానే మొఖాలకు పౌడర్ లెక్క పట్టిన దుమ్ముని తూడ్సుకొని మళ్ళీ బైక్ ని స్టార్ట్ చేసిండు శ్రీను. ఇంకొంత దూరం పోగానే మళ్ళీ ఇంకో టిప్పర్ లోడ్ బండి వస్తుంది. శ్రీను మళ్ళీ బైక్ పక్కకు ఆపిండు. బీటి రోడ్డు పగిలి మట్టి టిప్పర్ వెంట దుమ్ము తుఫాన్ లెక్క లేస్తుంది. ఈసారి పవన్ గ్లాసెస్ మీద పెరుకుపోయినట్టు అంటుకున్నది దుమ్ము. తూడ్సుకొని శ్రీను వైపు చూసి ''ఇంతకు ఈ ఊర్లో ఇలాంటి బండ్లు ఎక్కడివి శ్రీను?'' అని అడిగిండు. ''మా ఊరికి బాల్ రెడ్డి దొరొచ్చిండు. ఇవి ఆయనవే. ఊరవతలున్న గుట్టని లీజుకు తీస్కోని క్రేషర్ వేసిండు. అక్కడి నుండే వస్తున్నరు'' అని మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ఊర్లోకి పోతుంటే మొత్తం ధ్వంసం అయిన రోడ్డే కనిపించింది పవన్ కు. ఇంటికి చేరుకున్నరు. పవన్ బయటనే కడుక్కొని ఇంట్లోకి పోయి అమ్మమ్మ పక్కన మంచం మీద కూర్చున్నడు. ముసల్ది చూసి ''అమ్మ ఎట్లుంది బిడ్యా?'' అని అడిగింది. ''అమ్మ బానే ఉంది కాని నీవెందుకు ఇట్లైనవ్? టైంకు తింటలేవా?'' ''తింటున్నా కాని వయసు పడేకొద్ది పానం మంచిగుంటలేదు బిడ్యా'' అని చెప్తుంటే నవీన చాయి తెచ్చి ఇచ్చింది. నవీన పవన్ కు మరదలు. ముసల్ది కూడా తాగు అన్నట్టు సైగ చేసింది. పవన్ చేతికి తీస్కోని తాగుతుంటే దూరంగా నిలబడి అదే పనిగా పవన్ ని చూస్తుంది నవీన. ఇంతలోనే బయట నుండి పవన్ వాళ్ళ మామ కొండన్న వచ్చిండు. పవన్ చూసి ''బాగున్నావా సర్పంచి మామ'' అని పలకరించిండు. ''బాగున్నా అల్లుడు. అమ్మ నాన్న ఎట్లున్నరు?'' అని అడుగుతూ పవన్ పక్కనే కూర్చున్నడు కొండన్న. ''ఏంది నువ్వు సర్పంచిగా ఉండి రోడ్డుని అట్ల చేసినవ్'' అని అడిగిండు వచ్చేటప్పుడు పడ్డ ఇబ్బంది గుర్తుకొచ్చి. అల్లునికి తెల్వనట్టుంది అని అనుకోని ''నేను సర్పంచిగా దిగిపోయి రెండేండ్లు అయితుంది అల్లుడు. ఇప్పుడు మా ఊరి దొర బాల్ రెడ్డి సర్పంచి'' అని కొండన్న చెప్తుంటే చాతకాకున్నా కొండన్న తల్లి మంచం మీదనే కూర్చొని ''ఓడు బాల్ రెడ్డి కాదు బిడ్యా ఈ ఊరిని బలి తీస్కునే రెడ్డి'' అన్నది. ఆ మాట వినగానే ఏదో విషం ఊరిలోకి పాకుతుంది అనిపించింది పవన్ కు. ''మరి నువ్వు సర్పంచిగా ఉన్నప్పుడు లేకుండెనా మామ ఈ బాల్‌రెడ్డి?''. ''ఉండే కాని ఈ ఊర్లో లేకుండే. అక్కడక్కడే సీటిలో వ్యాపారాలు చేసుకుంటుండే ఇప్పుడు ఊరు మీద కన్ను పడ్డది. వచ్చి ఈన్నే ఉన్నడు'' అని కొండన్న చెప్తుంటే పవన్‌కు ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తున్నరు. పవన్ అమ్మమ్మ గురించి వచ్చి అది పక్కన పెట్టి ధ్వంసం అవుతున్న ఊరి గురించి తెలుసుకోవాలని తపిస్తున్నడు. ఒక్కొక్కటి అడగాలని మనసు కోరుతున్నది. లేటు చేయకుండా ''మామ ఈ ఊర్లో కులాల వారిగా ఎన్ని ఓట్లు ఉంటరు?''. పవన్ అడిగినదానికి కొండన్న కొంచెంసేపు ఆలోచన చేసి ''మన బీసీలవి అరవై శాతం ఉంటరు. ఎస్.సి లవి ఓ ముప్పై శాతం ఉంటరు. ముస్లిం మైనార్టీలవి ఆరేడు శాతం ఉంటే మిగిలిన మూడు నాలుగు శాతమే రెడ్డిలు ఉన్నరు. కాని ఏం చేస్తాం మొత్తం వాళ్ళకే అమ్ముడుపోతరు'' అంటూ ముందుకు చూస్తే బ్యాగ్ అక్కడే ఉంది. నవీన ఎదురుగా నిలబడి చూస్తుంది. శ్రీను కూడా అక్కడే పక్కనే కూర్చొని ఉన్నడు. కొండన్న బిడ్డ వైపు చూసి ''బ్యాగ్ లోపల పెట్టి బావకు అన్నం పెట్టమ్మ. నువ్వు తిను నేను మల్లోస్త'' అని చెప్పి బయటకు పోయిండు. నవీన అన్నం పెట్టింది. పవన్ తిన్న తర్వాత అమ్మమ్మతో మళ్ళీ మాట్లాడిండు.
సాయంత్రం పూట సరదాగా బయటకు పోదామని శ్రీను పవన్ నవీన ముగ్గురు ఇంటి నుండి బయలుదేరిండ్రు. చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఊరి బయట ఉన్న రోడ్డుపై నడుస్తూ ముగ్గురు తమ తమ విషయాలను మాట్లాడుతూ నవ్వుతూ నడుస్తుంటే ఎదురుగా పెద్ద టిప్పర్ దుమ్ము లేపుతూ వస్తున్నది. అది చూసి నవీన చున్నీని తలపై కప్పుకున్నది. ఆ దుమ్ముకు ఇంటి దగ్గర ఉంటేనే బాగుండేదేమో అనుకున్నడు పవన్. కాని అలాగే ఇంకా ముందుకు నడుస్తూ ఉంటె పక్కనే అందంగా ఉన్న పెద్ద గుట్టను తొవ్వేది కనిపించింది. ఆ గుట్టని చూస్తుంటే ధ్వంసం అవుతున్న ప్రకృతి అందాలను మళ్ళీ ఎలా సృష్టించగలరని ప్రశ్న మొదలైంది పవన్‌లో. స్వార్ధపు మనిషి మనిషినే కాదు ప్రకృతిని కూడా అత్యాచారం చేస్తున్నాడని అనిపించింది లోలోపల. అది చూడగానే పవన్ కు అక్కడ నిమిషం కూడా నిలవాలనిపించలేదు. ఇంటిబాట పట్టిండ్రు.
మరుసటిరోజు పవన్ ఊరు మొత్తం తిరిగిండు శ్రీనుని వెంటబెట్టుకొని. ఊరు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని తెలుసుకోవాలను కున్నడు. పొద్దట్నుంచి మధ్యాహ్నం వరకు తిరిగి తిరిగి తనకు కావాల్సిన విషయాలన్నీ రాబట్టుకున్నడు పవన్. తన తల్లి చెప్పినట్టు ఇప్పుడు లేదు. ఇక ఉండాలనుకోలేడు. అదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పిండు.
చివరిమాటగా తన మామకు ఒక మాట చెప్పాలనుకున్నడు. బ్యాగ్ సర్దు కున్నడు. కాని మధ్యలో నవీన వచ్చి ''మళ్ళీ ఎప్పుడు వస్తవ్ బావ?'' అని అడిగిండు. ఆ అడగడంలో ఏదో కొత్తదనం ఉంది. కాని పవన్ ఏమీ చెప్పలేకపోతున్నడు. బ్యాగ్ వేసుకొని వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీస్కోని వాళ్ళ మామ ముందు నిలబడిండు పవన్. ''అమ్మానాన్నలను అడిగినట్టు చెప్పు'' అని కొండన్న చెప్తుంటే సరే అన్నట్టు తల ఊపి ''అమ్మ ఈ ఊరి గురించి చాలా గొప్పగా చెప్పింది మామ. కాని ఇక్కడ అవి ఎక్కడా కనిపించట్లేదు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఊర్లోకి అడుగు పెట్టడం వల్ల ఊరు ఊపిరి కోల్పోయింది. నేను వచ్చేటప్పుడు రోడ్డు మాత్రమే ధ్వంసం అయ్యింది అనుకున్న కాని పొద్దట్నుంచి ఊర్లో తిరిగినంక అర్థమయింది. గతంలో అంటే బాల్ రెడ్డి ఊర్లోకి రాకముందు అధికారం అంతా అధిక జనాభా ఉన్న వర్గం చేతిలోనే ఉండేది. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు. కాని ఇప్పుడు అలా కాకుండా కేవలం మూడు శాతం ఉన్న వర్గానికి అధికారం అంటగట్టి తొంబై ఏడు శాతం ప్రజలు బానిసలు అయిండ్రంటే మనం ముందుకు పోతున్నామా? వెనక్కి పోతున్నామా? అర్థం కావడం లేదు మామ. చాలామంది ఆయన దగ్గర నోట్లున్నరు నోట్లున్నరు అంటున్నారు కాని మనదగ్గర అంతకు మించిన బలం అధికారాన్ని ఇచ్చే ఓట్లున్నాయని మన వాళ్ళు తెలుసుకోవడం లేదు. వీళ్ళని నమ్మి మహనీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఇక్కడ వీళ్ళు అమ్ముడుపోతూ బతుకులు నాశనం చేసుకుంటూ ఇంకా ఇంకా అజ్ఞాతంలోకే పోతున్నారు. మళ్లిప్పుడు ఊరు రాష్ట్రం కులకంపు కొడుతున్నరు మామ....'' ఏకధాటిగా మాట్లాడి మెల్లగా ఊపిరి పీల్చుకున్నట్టు ఆగి నవీనను చూసి ''నవీన గురించి మాట్లాడమని అమ్మకు చెప్తా మామ'' అని చెప్పి అక్కడి నుండి కదిలిండు పవన్. ఆ మాట వినగానే నవీన మొఖంలో అప్పటిదాక లేని వెలుగు వచ్చింది. పవన్ మాత్రం మళ్ళీ అదే గుంతల రోడ్డులో దుమ్ముకొట్టుకొని పట్నం బస్ ఎక్కిండు.
- కెపి లక్ష్మీనరసింహ ,9010645470
Sun 07 Nov 02:41:16.244211 2021