Sat 06 Nov 23:42:30.869918 2021
Authorization
పాట:-
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న/గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి/ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా/నీ వల్లనే భరించలేని తీపి బాధలే/ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా/తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా/నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా/లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా/జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే/ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా /గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా/నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా/నిన్నలోనే నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన/నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే/ఏం మార్పిది నీ మీద పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా/ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా.
నువ్వు లేని నేను నేనుగా లేను. అన్నీ కోల్పోయిన వాడిలా, నాకు నేనే ఏమీ కాని వాడిలా దిగులుపడిపోతున్నాను. ఈ ప్రపంచమంతా నేను జయించినా, నీ ప్రేమ వల్ల కలిగిన హాయి ఏదైతే ఉందో దాని ముందు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ ప్రేమికుడు తన ప్రేయసికి తన మనసులోని ప్రేమను తెలియజేస్తాడు.
తొలిసారిగా వలపు వానలో తడిసిన యువకుడి మనసు అతని ఆధీనంలో ఉండదు. కాళ్ళు నేల మీద నిలవవు. ఆకాశపు అంచుల్ని తాకుతాయి. ఆలోచనలన్నీ తన ఎదను మీటిన ఆ అమ్మాయి చుట్టే తిరుగుతాయి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు. ఏదో తెలియని అలజడి ఎదలో రగులుతుంటుంది. ఎవ్వరో తనను పిలిచినట్టుగా ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు యువకుడు. ఇదంతా ప్రేమ మాయే. ప్రేమ వల్ల మనసు పొందిన మధురానుభూతే. ఈ అనుభూతిని మాటల్లో చెప్పడం వీలుకాదు. అయినా, చెప్పడానికి మాటలూ చాలవు. అలాంటి అనుభూతిని అక్షరాల్లో పొదిగితే ఈ పాట అవుతుందేమోననిపిస్తుంది. 2012లో వచ్చిన 'అందాలరాక్షసి' సినిమాలోనిదీపాట. రాకేందుమౌళి రాశాడు.తొలిసారి ప్రేయసిని చూసినపుడు, అడుగుల్లో అడుగేసి ఆమె వెంటే నడిచినపుడు, ఆమెకై పదే పదే తపించిపోయినపుడు ప్రియుని తీరు ఎలా ఉంటుందో, అతని తపన ఎన్ని రకాలుగా పరవళ్ళు తొక్కుతుందో ఈ పాట ద్వారా ఆవిష్కరించాడు రాకేందుమౌళి.
మొదటిసారి తన ప్రేయసిని చూసిన వెంటనే ఆ యువకుడికి కొత్తగా రెక్కలొచ్చి ఆకాశంలో ఎగిరినంత ఆనందం కలిగింది. అతని గుండెను కొరుక్కుతినే కళ్ళు ఆమెవి. ఆ కళ్ళు చూసినంతనే మనస్సు మొదటిసారిగా నవ్వడం నేర్చుకుందట. ఇది అతని జీవితంలో కలిగిన వింతమార్పుగా అతడు భావిస్తుంటాడు. ఎడారి ఎండమావి ఒక్కసారిగా ఉప్పెనై ఉరకలెత్తినట్టుగా తాను అనుభూతి చెందుతున్నాడు. ఆమె వల్లనే తీయని బాధల్ని భరిస్తున్నాడు. ఆ తీపి బాధ పేరే ప్రేమే. ఆగకుండా యుగయుగాలుగా సాగుతున్న కాలానికి తాను ఒక విన్నపం చేసుకుంటున్నాడు. అది ఏమిటంటే ః ఆమె తన చెంత ఉన్నప్పుడు కాలాన్ని ఆగిపొమ్మని, కదలకుండా నిలిచిపొమ్మని, ఆ మధురక్షణాలలో మరీ కాస్త పులకించనివ్వమని కోరు కుంటున్నాడు.
నువ్వు లేని నేను నేనుగా లేను. అన్నీ కోల్పోయిన వాడిలా, నాకు నేనే ఏమీ కాని వాడిలా దిగులుపడిపోతున్నాను. ఈ ప్రపంచమంతా నేను జయించినా, నీ ప్రేమ వల్ల కలిగిన హాయి ఏదైతే ఉందో దాని ముందు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ ప్రేమికుడు తన ప్రేయసికి తన మనసులోని ప్రేమను తెలియజేస్తాడు.
ఆ ప్రేయసి తనను గుర్తించకపోతే, తన ప్రేమను అంగీకరించకపోతే ఆ జీవితమే మోయలేని బరువని అతడు భావిస్తున్నాడు. అతనిలోని ప్రాణం వానచినుకులకు తడిసి ఝల్లంటూ జారిపోతుంది. అతనిలోని బాధకి ప్రేమ అనే మాట తక్కువనే చెప్పాలి. అంత ఆరాధనాభావన అతనికి ఆమెపై.
నాకు ఊపిరినిచ్చింది నీ ప్రేమ. అలాంటిది నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నా శ్వాస ఆగిపోతుంది. నన్ను గుర్తు పట్టనట్టుగా, నేనెవరో ఎరుగనట్టుగా నువ్వు అలా వెళ్ళిపోతే నేనేమైపోవాలి. నిన్నటి రోజుల్లోనే నువ్వుంటే ఎలా? నిజం లోకి రా! నన్ను గుర్తించు. నన్ను చూడు. కలలతోనే కాలాన్ని గడిపేస్తావా? నిజాల జాడలోకి రా! నా నిజం నువ్వు. నా ప్రాణం నువ్వు. నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది నాకు. ఆ ప్రేమను అర్థం చేసుకో. నన్ను చేరుకో. అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలపాలనే ఆరాటం ఆ యువకుడిలో కనిపిస్తుంది.
సినిమా మొత్తానికి మకుటం లాంటి పాట ఇది. చాలా ప్రసిద్ధి చెందిన పాట. ఇప్పటికే ఈ సినిమా వచ్చి 9 ఏండ్లు గడిచినా.. నేటికీ.. ఏనాటికీ ఈ పాట నిత్యనూతనమే.
- తిరునగరి శరత్ చంద్ర