'కురూపితనం' అనే పదం రాయను. ఎందుకంటే మట్టి గాయం .. మట్టి దుఃఖం ... మట్టి స్పర్శ ఎప్పుడూ కూడా కురూపితనంతో లేదు, అది సౌందర్యానికి మచ్చుతునక. మట్టి, మనిషి పుట్టుకకు ముందు ఇలాగే వుండేది. నిజానికి మనిషి ఈ మట్టిని గాయపరిచాడు. వేదనకు గురిచేశాడు. ఇంకా కురూపితనాన్ని ఇచ్చాడు. అటువంటి మనిషి ముఖం చూడకుండానే మట్టి ఎప్పుడూ మనిషికి తోడుగా వుంది. ఆసరాగా నిలిచి సహకరించింది. సహకరిస్తూనే వుంటుంది.
నేేను ఏ కథ రాయను ?
కథ రాయాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారీ వెంటనే నలుదిక్కుల నుంచి కథలు నన్ను చుట్టుముడ్తాయి. ఒక కథకు రోజూవారీ కష్టంతో మొద్దుబారిపోయిన చేతులు, ఒక కథకు అందమైన ముఖం మీద మందుగుండ్ల గాయాలు ఇంకా రక్తపు మరకలు. మరో కథకు భుజాలు తెగిపడి వున్నాయి. ఒక దానికి కాళ్ళు లేవు. ఒక దాని కళ్ళు పేలిపోయి బయటికి పొడుచుకొని వచ్చాయి. ఒక దాని కండరాలు అణుబాంబు పేలిన అగ్గి కారణాన కాలి మాడి వున్నాయి.
నలువైపులా చూస్తాను కానీ ఏ ఒక్క కథ కూడా పూర్తి రూపం సంతరించుకున్నట్టు కనబడదు. ఏ ఒక్క దానికి అందం సరిగా కుదరదు... కొన్నిటికి దేహాలపై ఆచ్ఛాదనలు సరిపడ వుండవు... వికారమైన, గాఢమైన మరకలు మాత్రం కప్పి వేస్తాయి. కానీ ఈ వికారత్వం కూడా ఒక రకమైన అందమే. మరి కవులు, సాహితీవేత్తలు అంజలి ఘటిస్తూ, సౌందర్యాన్ని పంచుతూ, సౌందర్య ప్రశంస చేస్తూ వచ్చారు గదా ! అలాంటప్పుడు మరి నేనెందుకు కురూ పితనాన్ని అందమైన అబద్ధపు దుప్పటిలో కప్పి ప్రపంచానికి చూపెట్టాలి. దుప్పటిని తొలిగించి ఎందుకు చూపించకూడదు? కానీ దాని అవసరమేముంది? నా కథలన్నీ మట్టి నుంచి పుట్టినవే! ఇంకా వీటి పాదాలు నేల మీదనే వున్నాయి. వీటి కురూపితనంలో కూడా మట్టి వేదనలే వున్నాయి. ఈ వేదనలే దీనికి కురూపితనాన్ని అంటగడుతున్నాయి. ఇక నుంచి నేను 'కురూపితనం' అనే పదం రాయను. ఎందుకంటే మట్టి గాయం... మట్టి దుఃఖం ... మట్టి స్పర్శ ఎప్పుడూ కూడా కురూపితనంతో లేదు, అది సౌందర్యానికి మచ్చుతునక. మట్టి, మనిషి పుట్టుకకు ముందు ఇలాగే వుండేది. నిజానికి మనిషి ఈ మట్టిని గాయపరిచాడు. వేదనకు గురిచేశాడు. ఇంకా కురూపితనాన్ని ఇచ్చాడు. అటువంటి మనిషి ముఖం చూడకుండానే మట్టి ఎప్పుడూ మనిషికి తోడుగా వుంది. ఆసరాగా నిలిచి సహకరించింది. సహకరిస్తూనే వుంటుంది. మనిషి, మట్టి ఇంకా ఆసరా ...
కానీ మట్టిని మనిషి నుండి దూరం చేసే వాడెవడూ? నా పంటను అమ్ముకొని నా శ్రమ ఫలితంగా తెచ్చుకున్న ఈ మర్యాదలు - తలపాగా, చెప్పులు ఎవరు లాక్కున్నది? పంట- దేన్నైతే నా చెమటను ప్రవహింపజేసి, మట్టితో మమేకం జేసి, మట్టి నుంచి పుట్టించింది. నా లోలోపలి నుంచి కూడా రక్తాన్ని పిండేసిన యంత్రాలు, ఏ రక్తాన్నయితే ఆధారంగా జేసుకొని నా పిల్లాజెల్లా బాధ్యతలకు నేను కట్టుబడియున్నానో! నా కడుపు ఖాళీగా ఎందుకున్నదో ? ఇంకా నా రక్తమంతా యంత్రాలకప్పగించిన తర్వాత కూడా నా పిల్లలు ఆకలితో ఎందుకు మాడి పోతున్నారు? నా మట్టి మీద ఎవరు గిరిగీసి ఉంచారు. నా కళ్ళం పొత్తిపై ఎవరి నియంత్రణ రేఖలు? ఎందుకని? జమీలా సౌందర్యాన్ని అల్జీరియా ఏ చేష్టలు వికృత పరిచాయి. వియత్నాంలోని హరిత వనాలను ఇంకా చిన్న చిన్న ఇళ్ళను ఎవరు బూడిద కుప్పలుగా మార్చేశారు. సహారా ఎడారిని ఎవరు, ఎందుకు రక్తసిక్తం చేసి దాని అస్తిత్వాన్ని ధ్వంసం చేశారు. తెల్లవాళ్లు వివక్షతో నల్లవాళ్ళను బెల్లం సోదరుడని ఎందుకు బెల్లం రాశుల్లోకి విసిరేసారు. మనిషి జన్మతాః స్వేచ్ఛాజీవియైతే మరి అతన్ని బానిసగా మార్చడానికి ఇంతగా శాస్త్ర విజ్ఞానం ఆవిష్కరింపజేయాల్సిన అవసరమేమొచ్చింది. మట్టిని అంత పవిత్రంగా భావిస్తే ఎందుకు ఇంతగా దాని గుండెల్ని గాయపరిచి, రక్తాన్ని చిందింపజేసి దాని శరీరాన్ని జల్లెడ చేస్తున్నారు. దేవుడు ఒకవేళ ప్రతిరోజు తోడు ఐతే మరి మనిషి ఆసరాను ఎందుకు లాక్కుంటున్నాడు? దేవుడు, మట్టి , మనిషి ఇంకా ఆసరా ఒక సమూహమైతే, అతని నాలుగు స్తంబాలుగా ఆధారమైతే మరి అక్కడ ఏ హస్తం ఈ నియంత్రణ రేఖలను తుడిచేసి, వీటిని తొలిగించే ప్రయత్నం చేస్తుంది. నాజీలు ఆక్స్ ఫర్డ్ శైలిలో ఆంగ్లం చెబుతారు, ఇంకా మాట్లాడుతారు. నా నోటినుండి పంజాబీ భాష విని, నావైన పెద్ద షర్బతీ కళ్ళ వైపు ప్రశ్నించే చూపులు దర్శనమిస్తాయి. ''రబ్ వర్గా ఆస్రా తేరా వస్ దా రహూ మిత్రా''( దేవుడు నీకు తోడునీడ లాంటి వాడు సర్వకాలాలలో నీతోనే స్నేహంగా వుంటాడు).
మరి అతనికేం జవాబివ్వాలి? దేవుడికి చాలా పనులుంటాయి. ప్రపంచం చాలా పెద్దగా మారింది. సమస్యలు పెరిగాయి. వ్యస్తుడై వున్నాడు. మరి ఆసరా? ఎవరికీ ఆసరా, ఇంకా ఎలా? ఎవరికైతే తోడునీడ అవసరం ఉందో వారి సంఖ్య పెరిగినా నీడల్ని లాక్కునే వాళ్ళ సంఖ్య వేల మీద అధికంగా వుంది. టహల్ సింగ్ చాచా సరిగానే చెబుతుండేవారు. ''బేటా! మనమంతా కథలమే! కానీ మన రచన చేసే వాడే లేడు''. ఔను, చాచా టహల్ సింగ్, మీరు నిజం చెబుతున్నారు. నిన్న మొన్నటి మాటనే, ఎప్పుడైతే మీరు ఇక్కడ భూమి పుత్రుడిగా ఈ మట్టి నుండి పుట్టారో, బంగారంతో సమానంగా తూగేవారు. ఈ నేల మిమ్ములను గారాల బిడ్డగా చూసుకొని మురిసిపోయేది.గాలి కన్నా వేగంగా పరుగెత్త గల మీ గుర్రాల సందడి పూర్తి గ్రామంలో ఉండేది. మీ అందమైన పశు సంపత్తిని చూడటానికి దూరదూరాల నుండి వచ్చేవారు. మీ దగ్గరవున్న బర్లకు సరితూగ గల బర్లు పంజాబ్ మొత్తంలో ఎవరి దగ్గర వుండేవి? మీ వరండా, రంగు రంగుల మంచాలు, పెట్టెలు, రంగు రంగుల పూల అల్లికలతో వున్న మఖ్మల్ పరదాలు ఇంకా తివాచీలు, లెక్కకు మించిన రకరకాల వస్తువులతో నిండి వుండేది. మీ ఇంటి గడప నుండి సహాయార్థిగా వచ్చిన ఏ వ్యక్తి కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. ఒక పెద్ద సర్దార్ అయి వుండి కూడా మీ నౌకర్లను స్వంత బిడ్డల్లా చూసుకునే వారు. ఊరి ఆడపడుచులను, ఆడబిడ్డలను మీ స్వంత అక్క చెల్లెళ్లుగా, కూతుళ్లుగా ఆదరించేవారు. ప్రతి ఒక్కరి దుఃఖంలో మీరు భాగస్వామిగా వుండే వారు .
బైణి సాహెబ్ గారు, గురుద్వారా వారు వటవృక్షం కింద అందరితో కలిసి కూచున్నారు. మీ హవేలీలో వందల మందికి భోజనం సిద్ధం చేయబడేది. అల్లరి పిల్లలు చాటు మాటుగా ''నామ్ ధారీలు భోజనానికి వచ్చేసారు'' అంటూ పాటలు పాడేవారు .
గ్రామంలో మేళ ప్రారంభమైంది. మేము చిన్న పిల్లలం. గురు దర్శనం కోసం వెళ్లాం. ఇంకా చాలా మంది భక్తులు గురు దర్శనం కోసం దూర దూరాల నుండి వచ్చియున్నారు. మీరు నన్ను ఇంకా పాల్ సింగ్ ను పట్టుకొని గురూజీ ముందు నిలబెట్టారు.
''వీళ్ళు నా పిల్లలు'' అని మీరన్నారు. పాల్ తలపై ఎలాంటి ఆచ్చాదన లేదు. చిన్నదైన జుట్టుముడి బిగించి వున్నాడు. గురూజీ ముందుగా అతని తల మీద చేతితో నిమిరి మీ వైపు ప్రశ్నార్థకంగా చూపులను విసిరాడు, ఏ విధంగానంటే ''ఈ రెండవ ముసల్మాన్ పిల్లాడు ఎవరు?'' అన్నట్లు. మీరేమో ''నా సోదరుడి కొడుకన్నారు '' గురూజీ నవ్వుతూ రెండు చేతులతో నా తల మీద ప్రేమగా ముద్దిడి ఆశీర్వదించారు.
మరి చాచా, మీరు అందమైన ఆ ఆడగుర్రాన్ని కపుర్తలా మహారాజా వారి నుండి అమితమైన ఆకాంక్షతో పదివేలకు కొన్నారు. చాలా కాలం తర్వాత ఆ గుర్రం ఒక పిల్ల దానికి జన్మనిచ్చింది. ఆ పిల్ల గుర్రంలో మీ ప్రాణం వుండేది. నాకు చాలా కాలం తర్వాత తెలిసింది, దాని విలువ చాలా ఎక్కువని. అప్పుడు దాని వయస్సు ఆరు నెలలు మాత్రమే. ఒకరోజు నేను ఆడుతూ ఆడుతూ మీ ఇంటికి వచ్చాను. బంగారు మనసు గల చాచీ నన్ను రెండు చేతులతో దగ్గరగా హత్తుకొని ప్రేమగా తల నిమిరింది. నుదుటి మీద ముద్దిడి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఒక రొట్టె ముక్కను పొడిగా చేసి దాంట్లో చక్కర వేసి నాకు తినిపించ సాగింది. ఇదే సమయంలో పాల్ వచ్చాడు. మళ్ళీ మేమిద్దరం కలిసి ఆడుకుంటూ హవేలీ లోపలికి వెళ్లిపోయాం. భారు రతన్ సింగ్ ఆ సమయంలో హవేలీ లోపల వున్నాడు. అతని కోతి, మనిషిలా ఫర్నెస్ లాంటి తొట్టిలో చెరుకు వేయసాగింది. భారు ఉత్ప్రేరకాలుగా వుండే గడ్డి వేసి మరుగుతున్న చెరుకు రసం నుండి పై మైల తెట్టును తొలగించసాగాడు (నాకింకా గుర్తున్నది - భారు తీసిన బెల్లపు ముద్దలు పూర్తి గ్రామంలోనే అందరికన్నా తెల్లగా, శుభ్రంగా ఉండేది). నిక్కు ఇసాయి కొలిమి తిత్తి నుండి గాలి ఊదసాగాడు. కొలిమి నుండి వచ్చే పొగలు, మరుగుతున్న బెల్లపు ఆవిర్ల వెనక వున్న భారు దాక్కున్నట్లుగా తోచేది. కానీ అతను పాల్ ను, నన్ను చూసాడు.
''రసం తాగు'', ''బెల్లం తిను'', ''చెరుకు గడలు నమిలి పీల్చు'', ''కూర్చో ఓ చిన్నా!'', '' వీరూ చెక్క బల్లను తీసి కాస్త ఎండలో పెట్టు''%లల% భారు రతన్ సింగ్ ఒక్కసారిగా ఎన్ని ఆదేశాలిచ్చాడు. కానీ నా ధ్యాసంతా ఆ పిల్లగుర్రం పైనే మళ్లింది. నేను, పాల్ పిల్లగుర్రం దగ్గరికి వెళ్లి దాన్ని చూడసాగాము. అది ఎంతో అందంగా, సుందరమైన చిత్రపటంలా వుంది. ఎక్కడి నుండో అంతలోనే టహల్ సింగ్ వచ్చారు. ఏ బాల్య ఛేష్టయో అర్ధం కాకపాయె కానీ నేను వెళ్లి దాని ఒళ్ళో కూచున్నాను. పిల్ల గుర్రం మీద ఎక్కి కూర్చోవాలని మంకుపట్టు పట్టాను. ఏడేళ్ల వయస్సు పిల్లలకు ఏ%ళి% తెలుస్తుంది! కానీ చాచా, మీరు ఒక్కసారి కూడా నా కోరికను కాదన లేదు, పోనీ వద్దని సముదాయించనూ లేదు. పై పెచ్చు ఆ అమాయకమైన, అమూల్యమైన పిల్లదాన్ని పట్టుకొని జీనుకు అల్లిక వేసి దాన్నిసిద్ద%ళి% చేసారు. అక్కడున్న వ్యక్తి ఆశ్చర్యంతో దయ్యంలా చూస్తూ నిలబడిపోయాడు. భారు ఉడికిన బెల్లాన్ని వదిలి వచ్చి నిలబడిపోయాడు. ప్రతి ఒక్కరు చాచా మీ వైపే చూస్తూ నిలబడి వుండిపోయారు. ఒక పిల్లవాడి తుంటరి చేష్టలో మీరు కూడా పిల్లవారై పోయారు. కానీ ఎవ్వరూ మిమ్ముల్ని కాదని చెప్పే ధైర్యం, సాహసం చెయ్యలేకపోయారు. మళ్ళీ మీరు భుజం మీది నుండి దుప్పటిని తొలిగించి కంగారులో బెదిరిపోయి ఎగిరే పిల్లగుర్రానికి రక్షణగా నిలిచి మృదువైన, సుందరమైన దాని వీపు మీద 'జీను' వేసి గట్టిగా బిగించారు. ఈ రోజు ఆలోచన చేస్తే ఆరు నెలల పసిప్రాయం కలిగి పాలు తాగే సుకుమారమైన ఆ ప్రాణికి ఈ మాత్రం దుఃఖం, బాధ ఎక్కువే అని చెప్పాలి. కానీ చాచా మీరు నన్ను దాని మీద కూర్చోబెట్టి, ముందుండి పట్టుకొని హవేలీలో రెండు చక్కర్లు కొట్టిం చారు. కానీ అది బాధతో, రక్షణ లేదన్న భయంతో తండ్లాడుతూ కుప్ప కూలిపోయింది. మహారాజా కపుర్తలా వారి ప్రియమైన గుర్రం, దాని అందమైన సంతానం, దాన్ని మీరెంత ప్రేమగా చూసుకునేవారో నాకు తెలుసు. కానీ మీ ముఖం మీద ఏ మాత్రం నిరాశ ఛాయలు రానివ్వలేదు. నా తండ్రి మినహా ఎవ్వరు కూడా ఏ మాత్రం ఎదురు జవాబిచ్చే ధైర్యం చేయలేదు. ఎప్పుడైతే ఆయన ఈ విషయం విన్నారో అప్పుడు నన్ను, మిమ్ముల్ని కూడా కోపగించుకున్నారు కదా! కానీ మీరు మాత్రం ఒక్క నవ్వుతో ఊర్కున్నారు.
చాచా ఈ రోజు నేను పెద్దవాణ్ణయ్యాను. లోకమంటే అర్ధం చేసుకోగలను. జీవితంలో దెబ్బలు తినితిని రాటుదేలాను. సమాజంలోని మంచిచెడులు చూసాను. సగం ప్రపంచం తిరిగి చూసాను. అక్కడి ప్రజల జీవన విధానాలు చూసాను. వారిని అర్ధం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాను. ఈ రోజు ఈ మాటలు కలలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి. అవి గతించిన స్వప్నాలు. ఎవరి కలలైతే చెదిరిపోతాయో ఆ మనిషి ఎంతటి దురదృష్టవంతుడో గదా! ఈ రోజు మనసులో అనుకుంటూ వుంటాను చాచా, మీరు మా నాన్న గారికి సోదరసమానులు. ఆయనతో మీరు తలపాగా మార్చుకున్నారు . మీరు స్వంత సోదరులు కాకున్నా నాపై చూపిన ప్రేమ ఎంత గొప్పదంటే నా స్వంత బాబాయిలు కూడా అంతటి ప్రేమను చూపలేదు. రక్తసంబంధం గట్టిదనం గురించి చెబుతుంటారు కానీ నా స్వంత మనుషులకన్నా మీరు నాకెంతో ప్రియం. మీకు మీ పాల్ కన్నా నా మీద ప్రేమ ఎక్కువ. నేనంటే గారాబం. నా దగ్గర అతి చనువు ఎందుకో?
ఒక్కసారిగా ఇలాంటి తూఫాను చెలరేగుతుందని ఊహించలేదు. అది మనిషిని ఛిద్రం చేసింది. నేలను స్మశానంలా చేసి కనుమరుగయ్యింది. రావి, బసంతార్ ప్రవాహ వడి పెరిగి భయానకంగా మారాయి. ఇంకా అలలు కోపంతో నురగలు కక్కుతూ బయటికి వచ్చేసాయి. నాలుగు దిక్కులా నీళ్ళే వున్నాయి. మీరు నిండుకుండ లాంటి మీ హవేలి నుండి, అన్నీ పుష్కలంగా వున్న ఇంట్లో నుండి రెండు మూడు వస్తువులు మాత్రమే తీసుకున్నారు. నా బందు బలగంతో, నాన్నగారితో ఆ బండిలో బరిశెలు , బందూక్లు ఇతరత్రా సామాగ్రితో బయలుదేరి వెళ్లారు. బండిలో చాచి, పాల్, మీరు ఇంకా రత్తో వున్నారు. మీ దరిదాపుల్లో వుండాలని మీ భద్రతకై పొలిమేరలో వున్న వంతెన వరకు మేము వచ్చాము. మీరు కూడా భద్రతా లేకుండా ఐపోయ్యారు. అలాగే మిమ్ముల్ని విడిచి వెళ్ళడానికి వచ్చినవాళ్లు కూడా ... దారిలో దోపిడీ, హత్యలు, దాడులు వాటితో భయం. వంతెన చేరుకోగానే అప్పుడు మా నాన్నగారు మీరు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వున్నారు. మీరు వంతెన దాటుతూ వుంటే మాటిమాటికి మిమ్ముల్ని తిరిగి చూస్తూ గుండెలవిసేలా ఏడ్చాడు మా నాన్న. మీరు ముందుకు కదిలి గుంపులో కలిసి మాయమయ్యారు, కానీ మేము ఎందుకో అక్కడే వంతెన మీదనే సాయంకాలం దాకా దుఃఖిస్తూ కూర్చొని వుండి పోయాము. మిమ్ములను పోగొట్టుకున్నాక చెదిరిపోయిన మీ ఇంటిని చూస్తూ, మా ఇంటికి తిరిగి వచ్చాము. ఆ సమయంలో నేను ఎనిమిదేళ్ల వయస్సు వాడిని. ఇప్పుడు ముప్పయి ఎనిమిదేండ్ల వయస్సు. నేను అత్యంత కష్ట సమయంలో కూడా నా తండ్రిని ఏడ్వడం చూడలేదు, ఆ రోజు తప్ప. ఇప్పటికీ మీ పేరు వినగానే ఆయన కళ్ళలోని కాంతి బలహీనపడిపోతుంది.
ఈ రోజు ముకేరియా లోని ఒక పల్లెలో శరణార్థి టహల్ సింగ్ ఎంత ఆనందంగా వున్నాడో తెలియదు? ఇప్పుడు పాల్ సింగ్ నాలా సగం నెరిసిన నెత్తితో, కాంతివంతమైన బాదం లాంటి కళ్ళలో ఏమైన కలలు నిక్షిప్తం చేశాడా? లేదా? తెలియదు.
చాచా టహల్ సింగ్ చెప్పేవారు ''మనమంతా కథలమే, కానీ మన రచన చేసే వారు లేరు'' యని. చాచా, చూడు నాకు మీ కథ జ్ఞాపకముంది. ఏదో ఒక రోజు నేను రాస్తాను. ఈ రోజు మాత్రం నాకు నలువైపులా ఎన్నో కథలు చుట్టుముట్టి వున్నాయి. నలువైపులా మహా ప్రళయం లాంటి అలజడి అలుముకొని వుంది.
నా కథలు రక్తసిక్తమై వున్నాయి. వాటి శిరస్సులు నగంగా వున్నాయి. జుట్టు చెదిరిపోయి వుంది. దేహమంతా గాయాలు నిండి వున్నాయి. నా చేతిలో విరిగిపోయిన కలం, ఇంకా నేను నా కథల కోసం సంతోషాలను నింపుకొని రావాలని ఏ పాత్రను తీసుకొని బయలుదేరానో ఆ పాత్ర విరిగి ముక్కలై వుంది. నా కళ్ళ నిండా కన్నీళ్లే. నేను నా దారిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. నా స్థితి కూడా నా కథల మాదిరిగానే వుంది. కానీ నేను ఆలోచిస్తూ వుంటాను - నేను కథను ఎలా రాయను ?
(అఫ్జల్ అహసాన్ రంధావా ప్రముఖ పాకిస్తానీ పంజాబీ నవల,కథా రచయిత. సెప్టెంబర్ 01, 1917లో అమృత్ సర్ లో జన్మించారు. 1958లో సియాల్కోట్ లోని ముర్రె కాలేజిలో గ్రాడ్యుయేషన్, 1964లో న్యాయవాద శాస్త్రంలో లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుండి పూర్తి చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 1972 నుండి 1977 వరకు మెంబర్ గా వున్నారు. పై కథ వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా చేయబడిన రచన)
- పంజాబి కథ: ఖోయీ హుయి ఖుష్బూ
మూల రచయిత : అఫ్జల్ అహసాన్ రంధావా
హిందీ అనువాదం: డా|| గురు చరణ్ సింగ్
- తెలుగు అనువాదం: డా|| రూప్ కుమార్ డబ్బీకార్
Sun 14 Nov 02:50:14.278383 2021