అన్నీ గుర్తొస్తున్నాయి. ఆమె మనసు తడిసిన కాగితమయింది.
వాళ్ళ అమ్మ మళ్ళీ పెద్దగా అరిచింది. చెద్దర్ని కోపంగా పక్కకు నెట్టేసి
బయటకి వెళ్ళింది. నీళ్ళు పట్టి, గిన్నెలు కడిగి ఇళ్ళూడ్చి తలుపు
దగ్గర మౌనంగా కూర్చుంది. ఇంటి మీద పక్షులరుస్తున్నాయి,
ఎదురుగా చెట్ల మీద కోతులు దూకుతున్నాయి. ఏదో కోల్పోయిన
బాధ ఆమె మనసులో. అందరికీ అన్నీ ఉండవని ఆమెకు తెలుసు
కానీ రేపు మిగలనివి ఈరోజు ఎందుకు దొరుకుతాయో ఆమెకు
తెలియదు.ప్రేమంటే ఏంటి? కష్టాల్లో తోడుంటే ప్రేమేనా?
ప్రేమే అవుతుంది. అవుతుందా?
మెల్లగా చీకటి చెదిరిపోతుంది. పాటలు వినిపిస్తున్నాయి. ఏ పని కూడా ప్రశాంతంగా చేసుకొనివ్వని భక్తి పాటలవి. అందంగా తల దువ్వి పీక నరికినట్టే ఉంటాయి. అది ఊరు కాదు అలా అని పట్నం కూడా కాదు పట్నంలాగే కనిపించే పల్లెటూరు. గాలికి పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
వాటిని చూసి రొమ్మువిరుస్తూ చాయి బండి దగ్గర కొందరు రాజకీయాలను నమిలేస్తున్నారు. బడ్జెట్లోని తప్పొప్పుల గురించి చర్చిస్తున్నారు. వాళ్ళు చాయి పైసలిస్తారా లేదంటే ఎప్పటిలాగే బాకీ పెడతారా అని టెన్షన్ పడుతున్నాడు చాయి బండతను.
ముళ్ళు కర్ర చేతిన బట్టి, కాలుకయిన సెగ గడ్డ నుంచి రాసి కారుతున్నా అర క్కట్టడానికి ఎద్దుల్ని తొలుకేలుతున్నాడు జీతగాడు వీరయ్య. ఫీజు కట్టలేదని బయట కూర్చోపెడతారేమోనని హోమ్ వర్క్ కంప్లీట్ చేసి ఆలోచిస్తున్నాడు ఎసూబు కొడుకు.
జీవితమంటే పాతిక సంవత్సరాల వరకు చదవడం తర్వాత ముప్పై ఏండ్ల వరకు జాబు చేయడం అంతేనా అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాడు హైదరాబాద్ నుంచి పండక్కి ఇంటికొచ్చిన రుక్కీనమ్మ మనమడు.
''రాత్రి గంటలు గంటలు ఫోన్లో మూతి పెట్టడం, పోద్దెక్కినా సోయి లేకుండా పండడం. ఆ అమ్మాయి శ్రావణీని చూడు ఎలా పనులు చేస్తుందో, తొందరగా వచ్చి సావు నీళ్లొస్తున్నాయి''
పొద్దుపొద్దున్నే మనసు పాడు చేసే వాళ్ళ అమ్మ మాటలు యధావిధిగా వినిపించాయి. రాత్రంతా ఆమె నిద్ర పోలేదు, ఎప్పుడో మూడింటికి కళ్ళు మూసింది. ఆమె గుండెలో దుఃఖపు సూదున్నది. అందుకే ప్రశాంతంగా నిద్ర పోలేకపోయింది.
మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళలో కారం పడినట్టే కళ్ళు మండాయి. లేచి కూర్చుంది. ఏవో గుర్తోస్తున్నట్టే అనిపించింది. మనసు చేదుగైన ఫీలింగ్. వాళ్ళ అమ్మ మళ్ళీ అరిచింది. ఆమెకు కదలాలని లేదు. ఈరోజు ఆ ఇద్దరినీ కలవబోతుంది. కళ్ళల్లో కన్నీళ్ళు ఊరాయి.
ప్రేమ ఒక్కరికే పరిమతమవుతుందా? మరొకరిపై కలగదా? కలుగుతుంది. కలుగుతుందా? గుండె కోసుకుపోతున్నట్టే అనిపించింది ఆమెకు.
తనతో మాట్లాడాలంటేనే బయపడే ఈశ్వర్, పదో తరగతిలో పీర్ల పండుగ రోజున ఇంకో గంటలో పీర్లు నీళ్లకెళ్తాయనగా ఇరవైరూపాయాల ఉంగరం తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి ''ఐ లవ్ యూ'' అని చెప్పేసి పారిపోయాడు. చుట్టూ జనం, కొంచెం దూరంలోనే ఉన్న సర్పంచ్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు.
ఆమెలో భయం పెరిగింది, ఐస్ క్రీమ్ బండి దగ్గర ప్రభు వెనకాల నిలబడి సిగ్గుపడుతూ ఆమెను చూస్తున్నాడతను. ఆమెకేమి అర్ధంకాలేదు. కాసేపటికి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విషయం అఫ్రీన్‌కి చెప్పింది. అఫ్రీన్ ఆ రింగుని చెక్ చేసి ఆమె చేయి పట్టుకొని అతని దగ్గరకు తీసుకెళ్లింది.
''నువ్వు కూడా ఇలా చేస్తావని నేననుకోలేదురా''
ఆమె అతనివైపు చూడలేకపోయింది. అఫ్రీన్ గొంతు పెద్దది చేసింది.
''మగదీరా సినిమా చూసినవా?''
''పో సినిమా పిచ్చిదాన, వాళ్ళిద్దరి మద్య నువ్వు దూరకు''
దైర్యంగా మాటీడిసాడు ప్రభు
''రేరు పొట్టోడా, నేను కాదు నువ్వు మద్యలో దూరావనుకో స్కూల్లో నువ్వు చేసిన పని అందరికీ చెప్తా''
ప్రభు సల్లపడ్డాడు. అక్కడ నుంచి దూరమెల్లాడు.
''దీనికి నువ్వంటే ఇష్టమేరా కానీ హ్యాపీనెస్గా చూసుకోవాలి చెబుతున్న''
అతని మనసు తెలీకైంది. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆనందంలో పిడికిలి బిగించి చేతిని కిందకి పైకి ఊపుతూ ఎస్ ఎస్ అని గట్టిగా అరిచాడు. అఫ్రీన్ మాటకు ఆమె గుండె మాత్రం జల్లుమన్నది. మాట్లాడాలనుకుంది కానీ మాట్లాడలేకపోయింది.
''బైరవా, ఖుష్ అయింది సాలు. నాకూ నీ మిత్రవిందకి ఐస్ క్రీమ్ తినిపిరు''
అఫ్రీన్ చేతులూపుతూ చెప్పింది. అతను వెనక జేబులో నుంచి పేపర్ పర్సు తీసి అందులో నుంచి పదిరూపాయాల నోటు ఆమె చేతిలో పెట్టాడు. వాళ్ళు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కాసేపటికి పీర్లు నీళ్ళకి కదిలాయి.
''వెళ్తున్నావరా నీళ్ళకి''
''హా వెళ్తున్నాను''
''అబ్బాయిగా పుడితే ఎక్కడికంటే అక్కడికి తిరగొచ్చు ఛీ ఆడ జన్మ''
అఫ్రీన్ మాటలకు అతనేమి బదులివ్వలేదు.
''సరే మేము వెళ్తామిగా, రేపు స్కూల్లో కలుద్దాం''
అఫ్రీన్‌తో పాటే ఆమె కూడా కదిలింది. అఫ్రీన్ ఐస్ క్రీమ్ కోసం ఆడిన అబద్దం ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె అతనివైపు తిరిగి చూసింది. అతని మనసులో ఏదో తెలియని ఆనందం.
అన్నీ గుర్తొస్తున్నాయి. ఆమె మనసు తడిసిన కాగితమయింది. వాళ్ళ అమ్మ మళ్ళీ పెద్దగా అరిచింది. చెద్దర్ని కోపంగా పక్కకు నెట్టేసి బయటకి వెళ్ళింది. నీళ్ళు పట్టి, గిన్నెలు కడిగి ఇళ్ళూడ్చి తలుపు దగ్గర మౌనంగా కూర్చుంది. ఇంటి మీద పక్షులరుస్తున్నాయి, ఎదురుగా చెట్ల మీద కోతులు దూకుతున్నాయి.
ఏదో కోల్పోయిన బాధ ఆమె మనసులో. అందరికీ అన్నీ ఉండవని ఆమెకు తెలుసు కానీ రేపు మిగలనివి ఈరోజు ఎందుకు దొరుకుతాయో ఆమెకు తెలియదు.
ప్రేమంటే ఏంటి? కష్టాల్లో తోడుంటే ప్రేమేనా? ప్రేమే అవుతుంది. అవుతుందా?
అతను దుబారు వెళ్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఆమె స్థిరంగా ఉండలేకపోతుంది .రెండేళ్లలో అతనొస్తాడని తెలుసు. అన్ని రోజులు అతను లేకుండా బ్రతకాలంటే ఆమెకు బయంగా ఉంది. పదో తరగతిలో మొదలైన వారి ప్రేమ డిగ్రీ అయిపోతున్నా ఇప్పటి వరకు అప్పటిలాగే ఉంది. ఆమె కష్టం అతనికి నరకంతో సమానం. ఊరు మొత్తం ఆమెను ఒకలా చూస్తే ఈశ్వర్ మాత్రం ప్రేమ రూపంగానే చూశాడు, ప్రేమిస్తూనే వచ్చాడు.
''ఇంకా అలానే ఉన్నావా ,ఇట్లనే నన్ను పంపిస్తే రెండేళ్ళు నేనక్కడ బాదపడుతూనే ఉంటాను''
ఆమె కళ్ళు తుడుచుకుంది
''నన్ను వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నావ్''
ఆమె అతన్ని చూడనే లేదు
''తప్పదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సిందే. నా వాళ్ళ కోసం నీ కోసం కూడా''
''నీకు దూరంగా నా వల్ల కాదు''
అతనామెను చేతుల్లోకి తీసుకున్నాడు. చాలాసేపు ఆమెతో టైమ్ స్పెండ్ చేసాడు. ఆరోజు రాత్రి ఆమెను శూన్యంలోకి వదిలేసి అతనెళ్ళిపోయాడు. దుబారు వెళ్ళాక రెండు నెలల వరకు ఆమెతో టచ్‌లో ఉన్నాడు కానీ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్.
బయట వర్షం మొదలైంది. ఆమె మనసు పగిలిన కుండయింది. ఎప్పటిలానే వాళ్ళ అమ్మ గట్టిగా ఒర్రింది. ఆమె పైకివెళ్ళి బట్టలు తీసుకొచ్చి బెడ్డు మీద పరిచింది. ఎందుకో మరి ఆమె మళ్ళీ అక్కడ తలుపు దగ్గరే కూర్చుంది.
''ఆడ కూసోనీ ఎవడికి సైగలు చేస్తున్నావే, ఇటొచ్చి కూరగాయలు కొరు''
ఆమె ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
''నా సావుకే పుట్టిందిది, ఎప్పుడూ సుఖంగా ఉండనివ్వదు''
ఆమె ప్లేట్ పట్టుకుని బయటకి వచ్చింది.
''ఇపుడు నేనేం చేసానని అలా మాట్లాడుతున్నావ్''
''ఏం చేయాలే దమ్మిడి ఆదాయం లేదు. పందిలా మెక్కుడు తప్ప ఏం చేస్తున్నావ్ నువ్వు''
''ఏం చేయాలి?''
''ఎదురు మాట్లాడితే రోకలి బండ ఇరిగిద్ది. మూసుకొని పని చేరు''
ఆమె మనసు విరిగిన మానయింది. ద్వేషించుకునేవారు, అసహ్యించుకునేవారే చుట్టూ ఉన్నప్పుడు జీవితం చినిగిన కాగితమే అవుతుంది. ఆసరాగా ఉండేవారు ,ప్రేమించేవారులేక ఆమె ఎడారిలో కాక్టస్ మొక్కగా మిగిలిపోయినప్పుడే ఈశ్వర్ ఆమె జీవితంలోకి వచ్చాడు.
అతను చూపిన కొద్ది ప్రేమ కూడా ఆమెకు గొప్పగానే కనిపించింది. ఉల్లిపాయలు చేతిలోకి తీసుకుంది. కళ్ళు మండాయి హృదయం కూడా. అసలు నేను ప్రేమించానా లేక అతనికి లొంగిపోయానా? లేదు ప్రేమించాను. కాదు కాదు నాకున్న ఇష్టాన్ని నేనే డెవలప్ చేసుకున్నానేమొ?
దుబాయ్ నుంచి వస్తున్నట్టు ఈశ్వర్ కాల్ చేసి చెప్పాడు. రెండేళ్ల తర్వాత అతన్ని చూస్తున్నానన్న ఆనందం కన్నా అతన్ని ఫేస్ చేయలేని బాధే ఆమెలో ఉంది. ఒకప్పుడు అతన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని తపించిపోయిన తను ఇప్పుడ ఎందుకు వస్తున్నాడా అని ఫీల్ అవుతుంది.
ఆమె చేసింది తప్పే అని ఆమె ఫీలింగ్. అందుకే అతనితో మాట్లాడాలంటే భయం. విషయం ఎలా చెప్పాలి? రిసీవ్ చేసుకోగలడా? అర్దం చేసుకుంటాడు... చేసుకుంటాడా?ఆరోజు రాత్రి ఆ ప్రశ్నలతో, బయాలతో, కన్నీళ్లతో గడిచింది.
తర్వాత రోజు తెల్లారి వాళ్ళ అమ్మ పక్కూరు వెళ్ళింది. డోర్ సౌండ్ అవుతుంది. మాజీ సర్పంచ్ కొడుకేమో అని తలుపు తీయడానికి చాలా సేపు నిరాకరించింది.
''తలుపు తీస్తావా లేదా''
ఈశ్వర్ వాయిస్. ఒక్క క్షణం ఆమెకేమి అర్దం కాలేదు. అయోమయంగానే తలుపు తీసింది.
''తలుపు తీయడానికి ఇంత సేపెంటె ఎవడినైనా పెట్టుకున్నావా లోపాల''
ఆమె నోట మాట రాలేదు.
''ఎందుకలా మాట్లాడుతున్నావ్? ఎప్పుడొచ్చావ్?''
ఆమె చెంపపైన బలంగా కొట్టాడు .కూలబడిన ఆమెను చేతుల్లోకి తీసుకొని మరింత బలంగా వెనక్కి నెట్టాడు.
''ఈశ్వర్...''
ఆమె గట్టిగా విలపించిపోయింది. అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేసింది కాని కుదర్లేదు.
''ఏం మనిషివే నువ్వు, నీలాంటోళ్లని నరికి పాతరెయ్యాలే''
ఆమె ఏడుస్తూ గోడకానుకుని అలానే ఉండిపోయింది. అతను ఆమేకు దగ్గరగా వెళ్ళాడు.
''నువ్వు పడుకున్నోళ్ళ లీస్టు ఒక్కడిదగ్గరే ఆగిందా లేక వందలు దాటిందా''
ఆమె నిశబ్దంగా మారింది. అతనామె తలపట్టుకుని గోడకేసి కొట్టాడు.
''అయినా తల్లి లంజ అయినప్పుడు కూతురు మంచిదెలా అవుతుందే, ఇంక నయం నీ లంజ శకలు ఇప్పటికైనా తెలిసినరు నాకు''
ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆమె మనసు ఆరిపోయిన దీపమైంది. ఆమెను వికారంగా చూస్తూ అతను వెళ్ళిపోయాడు.
ఉల్లిపాయలు తీసి మరో ప్లేట్లో వేసింది. నిన్న జరిగిన ఆ సంఘటనను తలుచుకుంటే చర్మం వలిచినట్టే అనిపించింది. ఈరోజు ఆమె ఆ ఇద్దరినీ కలవబోతుంది. రాత్రే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళని కలుస్తున్నందుకు ఆమెలో భయం లేదు. బాధ మాత్రం అలానే ఉంది. కొంచెం కూడా తగ్గలేదు.
''ఎంతసేపే తొందరగా కానీ''
వాళ్ళ అమ్మ గొంతు. ఆమె మనసుని పాడు చేసే గొంతది
ఇంటి బయట ఆ మాజీ సర్పంచ్ కనిపించాడామెకు. అతని మీద కొంతైనా ఆమెకు పాసిటివ్ ఫీలింగ్ ఉంది. వాళ్ళ అమ్మ మొహంలో సిగ్గు, ఆమెకు అసహ్యం కలిగించే సిగ్గది. ఆమె ఆరోతరగతి చదువుతున్నప్పుడే ఆమె తండ్రి మరణించాడు. వాళ్ళ అమ్మకి ఆ మాజీ సర్పంచ్ అంటే ఇష్టం.
తనకు బాధని, దుఃఖాన్ని కలిగించే ఇష్టమది. ఇప్పుడామె బయటకి వెళ్తే అతను లోపలికి వస్తాడు. ఆమె త్వరగా రడీ అయ్యి బయటకి వచ్చింది.
''తిన్నావా అమ్మ'' ఆ మాజీ సర్పంచ్ అడిగాడు.
''హా''
ఆమె అతనివైపు చూడకుండానే సమాదానం ఇచ్చింది అతను లోపలకి వెళ్ళాడు. ఆమె ఆటోస్టాండ్ వైపు కదిలింది. ఆమెను ఇబ్బంది పెట్టె కొన్ని చూపుల మద్య, ఆమె మనసుని పీక్కుతినే కొందరి మాటల మద్య ఆమె నడుస్తూ వెళ్తుంది. ఆకాశం మొత్తం నల్లగా మారింది. చల్లని గాలి ఆమెను పలకరించింది.
ఆమె అడుగులు బలంగా పడుతున్నాయి. కొందరి ఆశల్ని తొక్కివేస్తూ ఆమె నవ్వింది. ఆ ఇద్దర్ని ఆమె ఈరోజు కలవబోతుంది. టైం చూసింది, ఇంకా కొంత సమయమే ఉంది. వాళ్ళు ఇద్దరూ త్వరగా వస్తారన్న నమ్మకం ఆమెకు లేదు. అయినా ''కొత్తూరు''ఆటో ఎక్కింది. ఆమెకు ఎక్కువసేపు అక్కడ ఉండాలని లేదు.
ఫోన్ ఓపెన్ చేసింది.
love you too shankar
శంకర్ మెసేజ్. ఆమె గాయంలా మారింది.
''ఇంకో 15ఎఱఅర లో వస్తా''
రిప్లై ఇచ్చింది.ఆమె కనుల నుంచి తెగిన కన్నీటి చుక్క కీప్యాడ్ మీద పడింది. ఏదో కోల్పోయానన్న బాధ ఆమెలో. ఎందుకు కోల్పోయానన్న సమాదానం ఆమె దగ్గర లేదు. మనుషులు ఈసీగా మారిపోతారు. ప్రేమ, ఇష్టం, కేరింగ్ ఇవన్ని ఫేక్. ఆశలతో నిలబడ్డ ప్రేమలు ఆశలు తీరాకో, అవి తీరవని తెలిసాకొ కూలిపోతాయి.
అసలు ఒక అమ్మాయి మీద కేరింగ్ చూపించడమే ట్రాష్. అమ్మాయిల మీద అదికారం కోసం ఇదో నాటకం. అవును, అమ్మాయి కష్టాల్లో ఉంటే ప్రతి మగాడు మొగోడే అవుతాడు. ఆమె కష్టాన్ని వాడుకుని ఆమెని లొంగతీసుకుంటాడు. హా అవును, ఆమె ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరోజు ఆమెకు మళ్ళీ గుర్తుకొచ్చింది అచ్చం అలానే.
స్టోర్‌కి వెళ్ళి వస్తుంది. ఆమెకు ఈరోజు స్టోర్‌కి వెళ్లాలని అస్సలు అనిపించలేదు, కానీ వెళ్ళక తప్పలేదు. హనుమాన్ గుడి దగ్గర ఆగింది. పొద్దుటి నుంచి స్టోర్‌లో అలానే నిలబడిన కారణంగా ఎప్పటిలాగానే కాళ్ళు గుంజాయి. గుడెదురుగా ఉన్న బెంచీపైన కూర్చుంది. నిర్మానుషమైన ప్రదేశం, చుట్టూ ఎవరూ కనిపించలేదు. బిగ్గరగా ఏడ్చింది.ఆ షాపతని మాటలు ఆమెకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె మనసు ఛిద్రమైపోతుంది. ఎవరూ లేని ప్రయాణం, ఒంటరి ప్రయాణం అసలు అర్ధమే లేని ప్రయాణమేమో? అవును, దుఃఖం మాత్రమే ఉన్న ప్రయాణం. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఎండినాకులు ఆమె మీద పడ్డాయి.ఆ చెట్టుని చూసింది. ఆ చెట్టు ఎండిపోయుంది. పెదాలు విరవకుండానే నవ్వింది. ఎవరితో పంచుకోవాలో ఆమెకు అర్ధం కాలేదు .మనసు చీకటైన ఫీలింగ్. ఫోన్ ఓపెన్ చేసింది.శంకర్ టెన్ మిస్సుడ్ కాల్స్. ఈ జీవితపు ఎడారిలో ఆమెకు ఎవరైన తొడున్నారంటే కేవలం శంకర్ మాత్రమే, తెలికగా ఊపిరి తీసుకుంది. అతనికి కాల్ చేసి రమ్మన్నది. కొద్దిసేపట్లోనే అతనొచ్చాడు. ఆమె మనసు చిగిరించిన మానైంది.
''ఏమైంది, ఇక్కడ కూర్చున్నావ్''
ఆమె పక్కన బెంచీపైన కూర్చున్నాడు. ఆమె కిందకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది.
''ఎక్కడికైనా వెళ్దామా?''
అతనడిగాడు, ఆమె అడ్డంగా తలూపింది
''నా జీవితంలో కన్నీళ్ళు తప్ప ఇంకేం లేవు శంకర్''
అతనామె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె దుఃఖాన్ని వినే క్రమంలో అతను పొందిన అదికారమది.
''ఆ కిరాణం బాస్కర్గాడు నాతో''
కన్నీటి బొట్లు వారి చేతుల మీద పడ్డాయి. అతనిలో నిప్పు పుట్టింది.
''ఏమన్నాడు, ఏమన్నాడో చెప్పు''
ఆమె హృదయం మరింత బరువెక్కింది. ఆమె మొఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అతనికి మరింత అదికారం దొరికింది. అతని మనసు కూడా ఆమెలాగే కన్నీటి కుండైంది.
''మార్నింగ్ వాళ్ళ షాప్‌కి వెళ్ళాను ప్యాడ్స్ కోసం, అలానే అడిగాను .కానీ వాడు..'' ఆమె కొద్దిగా ఊపిరి తీసుకుంది.
''వీళ్లందరూ అంతే శంకర్, కావాలని అమ్మాయిల కెదురుగా బూతులు మాట్లాడతారు. వాళ్ళ అమ్మకి జరిగేదె ప్రతి అమ్మాయికి జరుగుతుందని తెలిసినా తప్పుగానే చూస్తారు తప్పుగానే మాట్లాడతారు''
''ఆ నాకొడుకేమన్నాడో చెప్పు ఫస్టు''
అతనామె బుజాలపై చేయివేసాడు, ఆమెను ఓదారుస్తూ.
''ఏమంటాడు, నీ తల్లికీ నీకు మానమే లేదు అన్నీ డైరెక్టుగానే మాట్లాడతారు. మరి నాతో ఓపెన్‌గా అన్నీ మాట్లాడతావా అని గలీస్ గలీస్‌గా మాట్లాడాడు''
ఆమెను దగ్గరకు తీసుకుని వోదార్చాడు. అతని మనసు బగ్గుమంది. ఈ చీకటి జీవితంలో ఆమెకు అతనే వెలుతురు. ఈశ్వర్ పోయాక ఆమె ప్రతి కష్టంలో శంకర్ ఉన్నాడు.
''నువ్వలా బాదపడకు ప్లీస్, నాకేలానో ఉంటుంది. వాడన్నదానికి అనుభవిస్తాడు మాటిస్తున్నాను''
అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది.
love you ra love you soo much .నువ్వు బాదపడితే నేను బ్రతకేలేను''
ఆమె అతన్ని ముద్దుపెట్టాడు
love you too shankar
అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెప్పింది.
చినుకులు మొదలయ్యాయి. గాలి గట్టిగా వీస్తూంది. మెల్లగా వెళ్తుంది ఆటో. ఆమె మీద జల్లు పడుతుంది. వానలో తడవడమంటే ఆమెకు భయం. కొన్ని చూపులు హృదయాన్ని చీరేస్తాయి. ఈశ్వర్ వచ్చినట్టు మెసేజ్ చేసాడు. కాల్ మాట్లాడాలంటే అసహ్యమేమో, ఆమె సన్నగా నవ్వింది.
అసలు ప్రేమంటే ఏంటి? కష్టాల్లో తోడుండడమే ప్రేమా హాహాహా అది ప్రేమే కాదు, దానివెనకాల స్వార్దముందిగా అది మోహం, ఎవరో అన్నట్టు సెక్స్ కోసం పెట్టె పెట్టుబడే ప్రేమ.
హా, అవునూ
కరుణగిరి పార్క్ ఎదురుగా ఆటో ఆగింది. వాళ్ళు ఇద్దరూ కీ వాల్ దగ్గర ఆమె కోసం వైట్ చేస్తున్నారు.ఆమె ఆటో దిగి డ్రైవర్ చేతిలో ఇరవైరూపాయల నోటుని బెట్టి కీ వాల్ వైపుగా నడుస్తుంది. ఆమెలో అలజడి, అప్పటి వరకు లేని అలజడి. కొత్త ప్రశ్నలు ఆమె మనసులో మొలకెత్తడం మొదలుపెట్టాయి.
కర్చీఫ్‌తో మళ్ళీ మళ్ళీ మొఖం తుడుచుకుంటుంది. అంతటి చల్లని వాతావరణంలో కూడా ఆమెకు చెమటలు పడుతున్నాయి. నిజానికి ఆమె బయపడట్లేదు, కానీ తెలియని యుద్దం ఆమె మనసులో జరుగుతుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. శంకర్ సిగిరెట్ వెలిగించాడు. ఈశ్వర్ చూపులో అసహ్యం.అయిదు నిమిషాల వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
''ఇంకెంతసేపు ఇలానే సైలెంట్‌గా ఉంటారు, మాట్లాడేవైనా ఇంకేం కథలు చెప్పాలో అర్దం కావట్లేదా'' ఆమెను రఫ్‌గా కదిలించాడు శంకర్. గాలి పెద్దదైంది. ఆమె మాట్లాడలేదు.తల దించనూ లేదు
''అన్న ఇది పెద్ద లంజ, నువ్వు దీని వెనకాల పడ్డావనే నేననుకున్నాను కాని మొన్న చెప్పింది మీ ఇదరీ మద్య అన్నీ జరిగాయని. దీని మీద ప్రేమ పోయిందన్నా నాకు. ఈ విషయం తేల్చి చెప్పడానికే నేనొచ్చాను''
ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. కానీ చూపులో మార్పులేదు.
''బలే బతుకే నీది. బిసినెస్ పెట్టుకోరాదు. మస్తు పైసల్''
అతని కళ్ళల్లో అదే అసహ్యం. ఆమె పెదాలపై సన్నటి నవ్వు
''నవ్వకూ ప్రాణం తీస్త, ఎంతగనం ప్రేమించానె నిన్ను''
కోపాన్ని పెదాలకింద అణిచాడు.
''ఎంతగనం ప్రేమించావేంటి''
అతనిలో కోపం బగ్గుమంది. ఆమె మెడను గట్టిగా పిసికాడు. ఆమె అతన్ని వెనక్కి నెట్టింది.
''అంతలోకువయ్యాన మీకు, ఇష్టమొచ్చినట్టు వాగుతున్నారు. మీరు చేయిచెసుకున్నట్టే నేను చేసుకొనా, నాకు కొట్టడం వచ్చు''
వాళ్ళు ఇద్దరూ స్టాట్యూలయ్యారు
''మరోసారి చెప్పు శంకర్, ఏదో అన్నావ్. నేను నీకేం చెప్పలేదా. అరె హౌలే, నా వెనకాల కుక్కలా తిరుగుతుంటే అరె బాబు నేను ఈశ్వర్ని లవ్ చేసినా మా ఇద్దరి మద్య అన్నీ అయిపోయాయి నన్నొదిలెయ్యి అన్నీ ఎన్ని సార్లు చెప్పిన్రా, నువ్వంటే ప్రాణం అని కబుర్లు చెప్పినవప్పుడు. ఇప్పుడిలా మాట్లాడటానికి మానమనిపించట్లేదా''
శంకర్ బదులివ్వలేకపోయాడు. ఆమె మాటలు అతని తల దించాయి
''ఎవడో చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చి నా వొంటి మీద చెయ్యేసి గలీస్‌గా మాట్లాడిన నువ్వు ఎంతొగనం ప్రేమించావా నన్ను. నీ సుఖం కోసం ఎన్నిసార్లు నన్ను శారీరకంగా హింసించావో గుర్తుందా? ఇప్పుడు నేను లంజని అంటున్నావ్''
తల తెగిపడినట్టు అనిపించింది ఈశ్వర్‌కి
''తప్పు నాది కూడా ఉంది. ఇంట్లో ప్రేమ దొరక్కపోయేసరికి మీకు లొంగిపోయాను. అవును తప్పు నాది కూడా ఉంది. నా కళ్ళు తెరుచుకున్నాయిప్పుడు. మీరు నన్ను వదిలేయడమెందిరా నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను''
ఆమె ఆ ఇద్దరి మద్య నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. ఎవరూ ఆపలేదు. కొంత ముందుకు నడిచాక ఆమె వెనక్కి తిరిగింది
''ప్రేమంటే ఒకరిపై ఒకరికి అదికారమిచ్చేది కాదు ఒకర్ని ఒకరు అర్దంచేసుకునేది''
వర్షం మొదలైంది. ఆమె ఆ వర్షంలో అలానే నడుస్తూ వెళ్తుంది. వర్షం మీద ఆమెకు బయం పోయింది. చీకటిలో నుంచి వెళుతురులోకి నడుస్తుంది. ఆశలకు అందని ద్రాక్షలా, వలలకు అందని వాయువులా ఆమె వెళ్తుంది. కొందరి అహంకారాన్ని, అదికారాన్ని తొక్కుకుంటూ వెళ్తుంది. ఏడారివైపు నదిగా మారి వెళ్తుంది.
Sun 23 Jan 11:30:50.418874 2022