Sat 21 May 23:05:01.474622 2022
Authorization
అసలే ఎండాకాలం...
అందులోనూ మే నెల...
భానుడి భగభగలు...
డా|| బి.ఆర్.అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల పర్యవేక్షణాధికారిగా ఆర్డర్ కాపీ తీసుకుని నల్గొండ బస్టాండ్‌లో సూర్యాపేట బస్సెక్కాను.
ఎండ దంచి కొడ్తోంది.
ఐనా డ్యూటీ తప్పదాయె.
అందులోనూ ధర్మానాయక్ ఆర్డరిచ్చిండంటే ఎగొట్టుడే లేదు. బస్సులో కూర్చున్నా నా ఆలోచనలన్నీ సూర్యాపేట గురించే...
చుట్టూ ముట్టూ సూర్యాపేట
నట్టనడుమ నల్గొండ
నువ్వుండేదైదరాబాదు
దాని పక్కన గోలుకొండ
గోలుకొండా ఖిల్లా కిందా...
నీ గోరి కడ్తం కొడుకో
నైజాం సర్కరోడా... బండి యాదగిరి రాసి పాడిన బండెనక బండి గట్టి... పాట యాదికొచ్చింది.
ప్రపంచ చరిత్రలోనే వీరతెలంగాణ నినాదాన్ని వినిపించిన నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా.
నైజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నల్గొండ ముందుంది. తెలంగాణ సాయుధ పోరాటలో 4500 మంది ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ జిల్లాలోనే. తెలంగాణ సాధనలో ఆత్మబలిదానం చేసుకున్న అమర వీరులకు మొక్కాలె. వాళ్ల త్యాగం గొప్పది. వాళ్ల ఉద్యమం ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.
బస్సు నకిరేకల్ దాటింది. నా ఆలోచనలు దూరవిద్య వైపు పరుగెత్తాయి.
ప్రభుత్వం అందరికీ ఉచిత విద్య అంటున్నా నేడు కొందరికి మాత్రమే విద్య అందుబాటులో వుంది.
చదువుకోవాలని తపన వున్నా చాలా మంది కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి గ్రామాల్లో వుంది. చదువు మధ్యలో ఆపేసిన వాళ్లంతా పల్లెల్నుండే వున్నారు.
ఇప్పుడు అందరికీ అందుబాటులో వుండేది దూర విద్య. ఉద్యోగం చేసుకుంటూ చదువు కొనసాగించే వాళ్ళకు, చదువు మధ్యలో ఆపేసిన వాళ్లకు, పెళ్లయి కాపురం చేస్తున్న వాళ్లకు, దూరవిద్య ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. దూరవిద్య భారమైనప్పటికీ ఇష్టపడి చదివితే కొంత కష్టమైనా సులువే అవుతుంది.
పట్టుదలతో చదివతే డిగ్రీ పట్టాను పట్టుకోవచ్చు.
ఇప్పుడు దూర విద్య మరీ దగ్గరైంది కూడా. అందులోనూ సెమిస్టర్ సిస్టమ్ వచ్చింతర్వాత అంబేడ్కర్ విద్యకు ఆదరణ మరింత పెరిగింది.
ఒకప్పుడు ఓపెన్ యూనివర్శిటీ పరీక్షంటే అంతా ఓపనే అనే వాదన వుండేది. చిట్టీలు రాసి పాసయ్యే వాళ్ల ఆట కట్టించేందుకు యూనివర్శిటీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అంతేకాదు పరీక్షా విధానంలో సమూలంగా మార్పులు చేపట్టి, కొత్తగా సెమిస్టర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి విద్యార్థులు ఈజీగా పాసయ్యేందుకు వీలుగా 20 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను రూపొందించింది.
అంబేడ్కర్ యూనివర్శిటీలో చదివి ఇప్పటివరకు ఆర్డీవోలైన వారు, అసిస్టెంట్ కమీషనర్లు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్ వన్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులైన వారెందరో ఉన్నారు.
ఇంకా ఆలోచిస్తున్నంతలోనే సూర్యాపేట వచ్చేసింది.
బస్సు దిగి ఎస్వీ డిగ్రీ కళాశాలలోకి చేరుకున్నాను. పరీక్ష గదిలోకి ప్రవేశించగానే అక్కడ అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండటం నాకు అమితాశ్చర్యాన్ని కలిగించింది.
మరో గదిలోకి వెళ్లబోతూ బయట ఒకమ్మాయి దీనంగా నిలబడి వుండటం గమనించి ఇన్విజిలేటర్‌ను అడిగాను. ఆ అమ్మాయి చిట్టి కొడుతుంటే పట్టుకొని బయట నిల్చోబెట్టాడట ఇన్విజిలేటర్.
నీ పేరు...?
బాలి...దీనంగా వుందా పిలుపు.
ఎక్కడి నుండి వచ్చావు?
లచ్చిరాం తండ సార్!
చిట్టీలు తేవడం తప్పుకదా?
తప్పలేదు సార్!
ఎందుకు..?
అదంతే సార్!
కారణం ఉంటుంది కదా!
ఏం చెప్పమంటారు సార్! మా బాధ.
ఎలా చెప్పమంటారు సార్! మా గాధ
ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు... ఆవేదనగా అంది బాలి.
ఎలాంటి పరిస్థితి... ఏమిటా కష్టం?
పెళ్ళయి రెండేళ్ళయినా కాపురానికి రావద్దంటున్నారు సార్.
ఏం...ఎందుకు?
డిగ్రీ పాసైన తర్వాతే రమ్మంటున్నారు సార్!
అందుకే ఈ తిప్పలు తప్పట్లేవు సార్!
కాస్త వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తావా?... అని ఆ అమ్మాయిని నేను ప్రాధేయపడటం గమనించి అప్పుడే అక్కడికి వచ్చిన కో ఆర్డినేటర్ ప్రసాద్ వివరించాడు.
పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి వాళ్లు మీ అమ్మాయి ఎంత వరకు చదువుకుంది? అని అడిగితే డిగ్రీ పాసయిందని అబద్దం చెప్పి పెళ్లి చేశార్ట. తీరా పెళ్లయింతర్వాత సర్టిఫికెట్ అడిగితే అసలు విషయం బయటపడితే అత్తింటి వారు డిగ్రీ పాసైన తర్వాతే కాపురానికి రావాలని కండీషన్ పెట్టారు... అందుకే ఈ పరీక్ష రాస్తున్నట్టు చెప్పింది బాలి.
అత్తింటి వేధింపులు భరించలేక 'పరీక్ష' కోసం అవస్థలు పడుతున్న 'బాలి'ని విస్తుబోయి అలాగే చూస్తుండిపోయాన్నేను.
- పున్న అంజయ్య, 93966 10639