Sat 15 Oct 23:59:16.649865 2022
Authorization
కలపటం రాజ్యానికి రాజు వీరమల్లుడు. ఆయనకు తన ప్రజలలో మానవత్వం ఉన్నవారిని చూడాలన్న కోరిక కలిగింది. మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరగసాగాడు. రాజు, మంత్రి ఒక ఊరి నుండి నడుచుకుంటూ మరో ఊరి దారి పట్టారు. ఆ బాటలో దూరంగా ఒక ఎడ్లబండి చక్రం బురదగుంటలో కూరుకుపోయి ఉంది. ఆ బండి నిండా సామానులున్నాయి. అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతను ఎడ్లబండిని బయటకు లాగేందుకు సహాయం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు.
''మనం వెళ్లి సాయం చేద్దాం పదా'' అన్నాడు రాజు. ''ప్రభూ, మానవత్వం ఉన్న మనుషులను మీరు చూడాలనుకుంటున్నారు కదా. కొంతసేపు ఆగుదాం'' అన్నాడు మంత్రి. రాజు, మంత్రి ఆ బండికి సమీపంగా ఉన్న ఓ చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డారు.
అనేకమంది వ్యక్తులు ఆ బాట వెంట వెళ్లారు గానీ, ఎవరూ ఆ బండి వ్యక్తికి సాయం చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఒక బలమైనవ్యక్తి అటుగా వెళ్తూ ఆగి ''బండిలోని సామానంతా కిందికి దించు. బండి ఖాళీ అవుతుంది. అప్పుడు నువ్వు సులభంగా బండిని బయటకు లాగవచ్చు. ఆ తర్వాత సామాను బండిలో పెట్టుకుని వెళ్ళిపో'' అని సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
అది చూసి ''అడిగో మానవత్వం ఉన్న మనిషి'' అన్నాడు రాజు. ''ప్రభూ, అతను సగం మనిషి. ఆ బలమైనవ్యక్తి నిండు మనిషి అయినట్టయితే బండివాడితో కలిసి ఆ బండిని బురదగుంట నుండి బయటకు తీసేవాడు. కేవలం సలహా ఇచ్చి తన దోవన తాను పోయేవాడు కాదు'' చెప్పాడు మంత్రి. తర్వాత రాజు, మంత్రి ఆ బండివాడికి సాయం చేశారు.
మరో ఊరిలో నాలుగు రహదారుల ప్రధాన కూడలిలో సాయంత్ర సమయంలో ఒక పాడుబడిన భవనం మీదకు ఎక్కి నిలబడ్డారు రాజు, మంత్రి. అక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. వ్యాపారం బాగా సాగుతోంది. జనం బాగా ఉన్నారు. ఆ రహదారిలో ఒక ఆంబోతు రంకె వేస్తూ వస్తోంది. అది చూసిన ఒక పొడవాటి వ్యక్తి తన ముందున్న ఒక నడవలేని వ్యక్తిని చూసి ''తప్పుకో! తప్పుకో!'' అని అరుస్తూ తను తప్పుకున్నాడు. నడవలేని వ్యక్తి వెనక్కి తిరిగి చూసి అతి కష్టం మీద పక్కకు తప్పుకున్నాడు
రాజు మంత్రి వైపు చూశాడు. ''ఇతను కూడా సగంమనిషే ప్రభూ. పొడుగువ్యక్తి నిండు మనిషి అయినట్టయితే ఆ నడవలేని వ్యక్తికి తప్పుకోవటంతో సహాయం చేసేవాడు. కేవలం హెచ్చరించి తన రక్షణ తాను చూసుకునే వాడు కాదు'' చెప్పాడు మంత్రి.
మర్నాడు ఒక గ్రామంలోని ఒక వీధిలో నడుస్తున్నారు రాజు, మంత్రి. ''రంగయ్యా, నీ పొలంలో గేదెలు పడ్డాయి. నేను అటు నుండే వస్తున్నాను'' అరుస్తున్నట్టు అన్నాడు ఒక పొట్టివ్యక్తి. గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చిన రంగయ్య అనే వ్యక్తి తన పొలం వైపు బయలుదేరాడు. అతనికి తెలియకుండా అనుసరిస్తూ రాజు, మంత్రి వెళ్లారు. రంగయ్య పొలానికి వెళ్లేసరికి కొంత పంట పాడైంది, బాధపడుతూ గేదెలను తోలాడు.
రాజు మంత్రి వైపు చూశాడు. ''ఇతనూ సగంమనిషే ప్రభూ. ఆ పొట్టివ్యక్తి నిండు మనిషి అయినట్టయితే తనే పొలంలోని గేదెలను తోలేసేవాడు. సమాచారం చెప్పి ఊరుకునేవాడు కాదు'' చెప్పాడు మంత్రి.
''అయితే నా రాజ్యంలో మానవత్వం ఉన్న మనుషులు లేనేలేరా?'' అడిగాడు రాజు వీరమల్లుడు. ''వేచి చూద్దాం ప్రభూ'' అన్నాడు మంత్రి.
మరొక ఊరి నుండి దానిని ఆనుకుని ఉన్న అడవిలోకి నడుస్తున్నారు రాజు, మంత్రి. దూరంగా ఒక వ్యక్తి చేతిలో సంచితో వడివడిగా నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక దొంగ ఆ వ్యక్తిని అడ్డగించి కత్తి చూపించి బెదిరించాడు. ఆ వ్యక్తి చేతిలోని సంచిని లాక్కున్నాడు. ''మంత్రీ, మనం వెళ్లి ఆ దొంగను శిక్షిద్దాం'' అన్నాడు రాజు. ''ఆగండి ప్రభూ, ఒక్క నిమిషం ఆగి ఆ పని చేద్దాం'' అన్నాడు మంత్రి.
పారిపోతున్న దొంగ ''అబ్బా పాము...'' అంటూ కుప్పకూలి పోయాడు. దొంగతనానికి గురైన వ్యక్తి వెంటనే దొంగ దగ్గరికి వెళ్ళాడు. దొంగను పాము కరిచిందని గుర్తించాడు. వెంటనే పాము కాటు పడిన దొంగ కాలి పైభాగాన తన తుండుతో గట్టిగా కట్టు కట్టాడు. దొంగ నుండి కత్తిని తీసుకుని కాటు పడినచోట గాయం చేసి రక్తం పీల్చి ఊస్తూ దొంగకు ధైర్యం చెయ్యసాగాడు. అంతలో అటుగా ఒక గుర్రపు బండి వచ్చింది. ఆ బండిలో దొంగను ఎక్కించుకుని ఊరిలోని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. సరైన సమయంలో వైద్యం అందటం వల్ల దొంగ బతికాడు.
తను లాక్కున్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తూ ''నేను మీ సొమ్ము కాజేయాలని చూస్తే, మీరు నా ప్రాణం కాపాడారు. నిజంగా మీరు దేవుడు. ఈ క్షణం నుండి నేను దొంగతనాలు చేయటం మానేస్తున్నాను'' అని, తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి పాదాలను పట్టుకున్నాడు దొంగ.
వాళ్లకు తెలియకుండా అనుసరించిన రాజు, మంత్రి. జరిగిందంతా చూశారు. ''ప్రభూ, తన సొమ్ము దోచుకున్న దొంగ ప్రాణాలు కాపాడిన అతను నిండుమనిషి. అతను చూపిన మానవత్వం వల్ల దొంగలో మార్పు కలిగింది. నిజంగా అతను గొప్పవాడు'' అన్నాడు మంత్రి. తన ప్రజలలో మానవత్వం ఉన్న మనిషిని చూసినందుకు రాజు వీరమల్లుడు ఎంతో సంతోషించాడు.
- కళ్ళేపల్లి తిరుమలరావు