నీతో నాకిక కుదురదు అన్నాడు వినయ్ తన భార్య శృతితో.
నేను అదే చెపుతున్నాను. మీతో నాకు ఫ్యూచర్ కనిపించడం లేదు. అంతే ధీటుగా అంది శృతి.
పావు గంట నుండి వాళ్ళ మాటలు వింటున్న లాయర్ మాలతికి విసుగొచ్చి..
''అబ్బబ్బ ఆపండి మీ గోల. ఇంతకీ మీకు ఏం కావాలి? అర్జెంటుగా''
''మాకు విడాకులు'' కావాలి అని తేల్చి చెప్పారు ఆమె ముందు కూర్చున్న ఆ యువజంట.
మాలతికి ఆ జంటను చూస్తే ఒకింత ఆశ్చర్యం, ముచ్చట వేసింది. ఇద్దరికీ నిండా పాతిక ముప్పై ఏళ్లు లేవు. చూడ్డానికి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' లా వున్నారు. కానీ బిహేవియరే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లా వుంది. ఇంటి వద్ద గల తన ఆఫీస్‌కి వచ్చిరావడంతోనే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అరిచారు, గోల చేశారు. నోట్ పాడ్ తీసుకొని.... ''ముందు మీ గురించి వివరంగా చెప్పండి'' అంది మాలతి.
''నేను ముందు చెపుతాను'' ఆత్రంగా ముందుకొచ్చాడు వినయ్.
''అంతటా మీరే ముందుండాలి. మీ మాటే చెల్లుబాటు కావాలి'' అలక పూనింది శృతి.
''ఇది పోలీస్ స్టేషన్ కాదు. ముందు ఫిర్యాదు చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి'' నవ్వుతూ శృతిని శాంత పర్చింది మాలతి.
''నేను గవర్నమెంట్ టీచర్ నండి. కష్టపడి చదివి ఈ స్థాయికొచ్చాను. మా వాళ్ళు ఎన్నో ఆశలతో నన్ను చదివించి ఇంతవాణ్ణి చేశారు. మావి మధ్య తరగతి బతుకులు. ఏదో నా ఖర్మ కొద్ది ... వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడైనట్టు వుంటుందన్న ఆశతో... ఇదిగో.. ఈవిడ గారిని చేసుకున్నాను. ఫినిష్! మూడేళ్ల నుంచి నాకు మనఃశాంతి దూరమైంది. నాలాగే తను ఉద్యోగం వెలగ బెడ్తున్నానని పెద్ద ఫోజు..పొగరు. అంతటా తన మాటే నెగ్గాలి.'' ఉక్రోషంగా చెప్పుకుంటూ పోయాడు వినయ్.
''అబద్ధాలు చెప్పకండి.. మర్యాదగా వుండదు'' మధ్యలో కలుగ చేసుకుంటూ అంది శృతి.
''తనను పూర్తిగా చెప్పనియి. నువ్వు చెప్పేది వింటాను కదా'' అంది మాలతి.
''ఇదిగో ఇలాగే అనవసరంగా మధ్యలో దూరి అంతా పాడు చేస్తుంది.'' చిరాగ్గా అన్నాడు వినయ్.
శృతి మూతిని మూడు వంకర్లు తిప్పింది.
''మా పెళ్లికి ముందే చెప్పానండి.. మా అమ్మానాన్నాని చూసుకొనే బాధ్యత మనదేనని. అప్పుడు సిన్సియర్‌గా తలూపి, ఇప్పుడు తోక జాడిస్తోంది''
''తోక జాడించాడానికి నేను జంతువుని కాను''రోషంగా అంది శృతి.
''అదే నయం కాస్త అయినా విశ్వాసం చూపుతుంది.''అన్నాడు వినయ్.
''చూశారా.. చూశారా.. నన్ను జంతువుతో పోల్చి తిడుతున్నారు'' ఆరోపించింది శృతి.
ఆమెను సైగతో వారించింది మాలతి.
''పెళ్ళైన మూడేళ్లకు ఇలా తింగరిగా వుంటే ముందు ముందు ఈ మహా తల్లితో ఎలా వేగాలి! కన్న తల్లిదండ్రులు కనిపించే దైవాలండి. వారిని ఆదరించకుంటే కొడుకుగా నా జన్మ ఎందుకు చెప్పండి?'' బాధగా అన్నాడు వినయ్ ముగిస్తూ.
మాలతి ఇప్పుడు శృతిని మాట్లాడమంది.
''లాయరు గారు... ఎదగాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. నేను మాత్రం తన కంటే ఎందులో తక్కువ? తనలాగే బాగా చదువుకున్నాను. జాబ్ చేస్తున్నాను. సంపాదిస్తున్నాను. నాకు కోరికలు వుండవా... ఆశలుండవా.. ఆకాంక్షలుండవా! ఉద్యోగస్తురాలినై వుండి కూడా ప్రతి చిన్న అవసరానికి భర్తపై ఆధారపడే దౌర్భాగ్యస్థితి ఏ భార్యకు రావద్దండి'' కళ్లోత్తుకుంటు అంది శృతి.
వినశృ మధ్యలో అడ్డుపడ్తు ... ''తన జీతంలో నుండి అవసరాలకు సరిపడ డబ్బులు తీసుకున్నాకే మిగతావి ఇస్తుందండి. ఐనా వాటిని నా సొంత ఖర్చులకో, జల్సాలకో ఖర్చు చెయ్యడం లేదు. ఆమె ఇష్టంతోనే మా భవిషత్తు అవసరాల కోసం పొదుపు చేస్తున్నాము''
శృతి అందుకొంది. ''రాక రాక ఎప్పుడైనా మా వాళ్ళు వస్తే ప్రేమగా పలకరించడు. మర్యాద చెయ్యడు. కానీ వాళ్ళ తరుపున బంధువులు ఎవ్వరూ వచ్చిన నేను ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ సేవలు చెయ్యాలి. తనకు నచ్చినట్టుగా వుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు. ఎందుకీ వివక్ష! నా వ్యక్తిత్వానికి గుర్తింపు, విలువ లేదు. మరి దేనికీ కలిసి వుండడం.. తనే విడాకుల ప్రపోజల్ తెచ్చాడు సరే అన్నాను''
అంతా విని మాలతి నిట్టూర్చింది. తన దశాబ్ద కాల లాయర్ వృత్తిలో ఎన్నో కేసులు చూసింది. వాదించింది. హత్యలు, దొమ్మిల వంటి క్రిమినల్ కేసులు. గృహహింస, వేధింపులు వంటి సివిల్ కేసులు. వాటితో పోలిస్తే వీళ్లది చిన్న కేసు. కమ్యునికేషన్ గాప్, సర్దుబాటు ధోరణి లేనందువల్ల వచ్చిన ప్రోబ్లం. వీరికి లాయరు కాదు ఫ్యామిలీ కౌన్సిలర్ సరిపోతుంది. ఆ మాటే అంది మాలతి. ఆ పని కూడా చేశారట! అమ్మా నాన్నను తన దగ్గర ఉంచుకోవాలని వినయ్, కాదు కూడదని శృతి ఎవరూ వెనక్కి తగ్గరట! ఇక కలిసి వుండడం కుదరదని విడాకుల కోసం తన దగ్గరికి వచ్చారట.. గాజు పెంకు లాంటి కేసు జాగ్రత్తగా డీల్ చేయకుంటే భళ్ళున పగిలేలా వుంది. అనవసరమైన పంతాలకుపోతూ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్న ఈ యువ జంటకు విడాకులా!!!! నో...నో...అలా జరగకూడదు. వీరిని అపే ప్రయత్నం చేయాలనుకుంది.
''విడాకులు సరే మరి కోర్టు కారణం అడిగితే ఏం చెబుతారు''
''అమ్మా నాన్న మా దగ్గర వుండడం తనకు ఇష్టం లేదండి. నాకు మాత్రం వాళ్లే సర్వస్వం. ఇక ఈ విషయంలో మా అభిప్రాయాలు కలిసే అవకాశం లేదు. అందుకే విడాకులు కావాలి''
మాలతి వినయ్ మాటలకు తల అడ్డంగా వూపింది.
''విడాకులకు మీరు చెప్పే కారణాలు సరిపోవు. మీలో ఎవరో ఒకరు గృహహింస బాధితులై వుండాలి. శారీరక మానసిక వేధింపులకు గురై వుండాలి. వాటిని సాక్ష్యాలుగా చూపి కోర్టును విడాకులు కోరవచ్చు. సో... మీ కేసులో బలం లేదు. ఐయామ్ సారీ.''.. ఏ దొ విధంగా వారి ప్రయత్నాన్ని అడ్డుకోచూసింది మాలతి.
ఇద్దరు కొద్దిగా నిరాశ పడ్డారు.
''మీకు చట్టాలు, వాటి సెక్షన్ల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఏదో సెక్షన్ కింద మాకు విడాకులు మంజూరయ్యేలా చూడండి.. ప్లీజ్.'' అన్నారిధ్దరు బతిమిలాడతూ.
మాలతి అంది. ''అది సరే శృతి... పెళ్లికి ముందు వినయ్ చెప్పాడట కదా.. వాళ్ళ అమ్మ నాన్నను చూసుకోవాల్సి వుంటుందని.''
''నేను మర్చి పోలేదండి.. అత్తయ్య వాళ్లు వుండేది ఈ సిటీ పక్కనే ఓ పల్లెటూరు. గంట ప్రయాణం. మేం తరుచూ వెళ్తూ పండగలు అక్కడే ఆనందంగా జరుపుకుంటాం. ఉద్యోగస్తుల గురించి మీకు తెలియంది కాదు... ఉరుకుల పరుగులు జీవితాలు... అద్దె ఇల్లు... ఇరుకైన బతుకులు.. ఆరోగ్యంగా ఉన్నంత కాలం అక్కడే ఉంటామన్నారు వాళ్లు. ఇటు ఉద్యోగం, అటు వాళ్ళను చూసుకోవడం ఇప్పటి నుండే ఎందుకని కొంత కాలం ఆగుదామన్నాను. ముందుముందు ఎలాగూ తప్పదు. అంతే.. ఆయన అంతెత్తున లేచారు... బోడి ఉద్యోగం మానేయ్యమని గొడవ చేశారు''.
''వాళ్లకు వయసు మీద పడుతోంది. ఏ క్షణం ఎలా ఉంటుందో! మన దగ్గర వుంటే కనిపెట్టుకొని వుండొచ్చు. అయినా ఆరోగ్యంతో వున్న వాళ్ళనే చూసుకొలేనీ దానివి, రేపు వాళ్ళు మంచాన పడితే చూస్తావన్న గ్యారంటీ ఏమిటి? అందుకే నీతో తెగతెంపులు.'' అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా' కటువుగా అన్నాడు వినయ్.
ఎవరి వాదన వారిదే. ఎవరూ మెట్టు దిగడం లేదు.
''సరే. మీ జీవితాలు మీ ఇష్టం. కానీ విడాకులు మీరు అనుకున్నంత తొందరగా రావు. అన్నింటి కంటే ముఖ్యంగా మీ పేరెంట్స్‌ను సంప్రదించారా!!'' అంది మాలతి.
మా జీవితాలు, మా నిర్ణయాలు మా ఇష్టం.. ఇందులో వారి జోక్యం అనవసరం అన్నారిద్దరు.
కాసేపు ఇద్దరితో విడి విడిగా మాట్లాడి చూసిన ఆమెకు ప్రయోజనం కనిపించ లేదు. చివరగా నోట్పాడ్ను పరిశీలిస్తూ... ''లైఫ్ అన్నాక కాస్తా పట్టువిడుపులు వుండాలి. పరిష్కారం వుందని నమ్మితే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి కూర్చునే ఓపెన్‌గా మాట్లాడుకొండి'' హితవు పలికింది మాలతి.
''ఫ్యామిలీ కౌన్సిలర్లా మాట్లాడకండి. మాకు విడాకులు కావాలి. అందుకే లాయర్ అయిన మీ వద్దకు వచ్చాం'' అన్న వినయ్ మాటలకు ఆమె మనసు నొచ్చుకుంది. వాళ్ళను వారం తర్వాత రమ్మంది.
వారంలో ఇద్దరు వేరు వేరుగా ఫోన్లు చేశారు. షరా మామూలే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేశారు. విడాకులు తొందరగా కావాలన్నారు. ఓ రోజు మాలతి కోర్టులో వుండగా శృతి ఫోన్ చేసి ఏడ్చింది. జాబ్‌కు వెళ్లనివ్వడం లేదట. ఇంట్లో వంట వార్పు బందట. హోటల్ నుండి వేరు వేరు పార్శిల్స్ తెప్పించికుంటున్నారట. మాలతి శృతిని ఓదార్చి వినయ్‌తో మాట్లాడుతానంది. ఆమెలో కొద్దిగా కంగారు మొదలైంది. 'మ్యాడ్ గైస్' ... గోటితో పోయేదానికి గొడ్డలి వెతుకుతున్నారు. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి వినయ్‌ని ఆఫీసుకి రమ్మంది. తను వచ్చాడు
మీ ఆవిడ ఫోన్ చేసిందని శృతి పేరు ఎత్తగానే సర్రున లేచాడు.
''చేస్తుంది... ఎందుకు చేయదు వున్నవి లేనివి మీతో బాగానే చెప్పి వుంటది''
''విడాకులకు అప్లరు చేసుకున్నారు కదా... మరి ఇంకా ఎందుకు గొడవలు''
''అమ్మా నాన్నను తిడితే ఎలా వూరుకుంటానండి. ఇలా కావడానికి వాళ్లే కారణమట. కన్నవారి కోసం కట్టుకున్న దానికి అన్యాయం చేస్తున్నానట.. ఇంట్లో పొయ్యి వెలగక మూడు రోజులైంది. ఇదెక్కడి న్యాయం. నాది తప్పేలా అవుతుంది!! వాళ్లకు నేనే దిక్కు మరి. చూసుకోవద్దూ!!
''కూల్ వినయ్ ముందు టీ తాగు..'' అంది మాలతి.
ఇంతలో పొట్టిగా, సన్నగా వున్నతను వచ్చి ఇద్దరికీ టీలు ఇచ్చి వెళ్ళాడు. వినయ్‌కి టీ తాగాక అప్పటిదాకా వున్న ఆవేశం తగ్గి కాస్తా ఉపశమనం కలిగింది. గదిని పరిశీలించాడు. పెద్ద పెద్ద రోజ్ వుడ్ షెల్పులు వాటి నిండా లా పుస్తకాలు.
''ఈ వారంలో ఒక రోజైనా కూర్చుని మాట్లాడుకున్నారా?
''పెళ్ళై మూడేళ్లు గడిచిన ఇంతవరకు ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంది లేదు. నేను ఒకటంటాను. వెంటనే తను అది కాదంటుంది. అంతే ఇక ఆ రోజంతా ఇంట్లో గొడవే. తనకు బాగా ఇగో అండి. ఉద్యోగం చేస్తోంది కదా.. ఇంట బయట అందరు తన మాటే వినాలి. నో.. నో.. అలాంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడడమా!!! చూడండి... తను తగ్గే దాకా నేను తగ్గను.'' తేల్చి చెప్పాడు వినయ్.
ఇంతలో బయట ఆడుకుంటున్న పాప వీల్ చైర్లో కూర్చున్న మాలతిని చుట్టేసింది. నాలుగేళ్లు వుంటాయి.. పాప ముద్దుగా బొద్దుగా వుంది. చురుకైన కళ్ళతో చూడ ముచ్చటగా వుంది. శృతి నాతో సఖ్యతగా వుంటే ఇలాంటి పాపతో ముద్దుముచ్చట్లలో తేలిపోయే వుండేవాడిని. నాకా అదృష్టం లేదు అనుకున్నాడు వినయ్.
''మీ పాపా అండి..''
అవును.. తన పేరు ముగ్ధ. అంకుల్‌కు హాయ్ చెప్పమ్మా'' పాప ముంగురులు సరి చేసస్తూ అంది మాలతి.
హాయి.. అంకుల్ అంది ముగ్ధ నవ్వుతూ.
పాపను చూస్తూ మీ వారు ఏం చేస్తారు మేడం ఆసక్తిగా అడిగాడు.
ఒక నిమిషం... తననే పిలుస్తానుండు అంటు భర్తను పిలిచింది.
వంట గదిలో నుండి ఇందాక టీ తెచ్చిన వ్యక్తి వచ్చాడు గరిట పట్టుకొని.
టీ తాగారా... నవ్వుతూ అడిగాడు వినయ్‌ని. అవునని తలూపి వినయ్ ఆమె భర్త కోసం ఇంకా లోపలి వైపు చూస్తున్నాడు.
''వినయ్... ఇటు చూడండి... ఈయనే మా వారు. పేరు శ్రీకర్. ట్రాన్స్ కో లో జాబ్ చేస్తారు'' అంటూ భర్తను పరిచయం చేసింది. ఒక్క క్షణం వినయ్ తడబడ్డాడు. నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇస్తున్న శ్రీకర్‌తో చేయి కలుపుతూ అయోమయంగా చూశాడు.
''కంగారు పడకండి వినయ్. ఈ రోజు వంట మనిషి రాలేదు. మనం మాట్లాడుతూ బిజీగా ఉండడంతో నేను ఈ టైంకు టీ తాగుతాననీ తెలిసి తనే టీ కల్పిపి తెచ్చారు.. తను బాగా వంట చేస్తారు.. మంచి ఫిలాస ఫర్ కూడా'' నవ్వు తూ చెప్పింది మాలతి. ఆ గందరగోళం నుంచి కాస్త తేరుకొని ఇద్దరికీ సారీ చెప్పాడు వినయ్.
శ్రీకర్ తేలిగ్గా నవ్వేసి... భార్య భర్తకు టీ అందించడం మనకు అలవాటైన దృశ్యం!... కానీ నువ్విప్పుడు అరుదైన దృశ్యం చూసావు అంతే! వినయ్ ఒకటి చెప్పానా.. జీవితం అంటే లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళడం లాంటిది. మంచి కంపెనీ ఇచ్చే వ్యక్తి పక్కన వుంటే ఎవరికైనా ప్రయాణ అలసటే తెలియదు. మరి ఆ వ్యక్తి మనమే ఎందుకు కాకూడదు. భార్యాభర్తలు ఇద్దరు ఇగోలు, లోగోలు పక్కన పెట్టి జీవించడం అలవాటు చేసుకుంటే లైఫంతా హ్యాపీగా గడిపేయచ్చు మాలాగా.. సరే... సరే.. మీరు మాట్లాడుకోండి. మీకు అంతరాయం కలిగించినట్టున్నాను.. ఈ రోజు లంచ్‌లోకి ఏం స్పెషల్ చేయమంటావు డియర్ అదే చెరగని చిరునవ్వుతో అన్నాడు శ్రీకర్. పర్లేదండి. మీరు రెస్ట్ తీసుకోండి... ఈ రోజు నేనే వంట చేస్తాను.. థాంక్యూ అంది మాలతి.
మమ్మీని డిస్ట్రబ్ చెయ్యద్దు... రా నాన్న అంటు పాపను లోపలికి తీసుకెళ్లి పోయాడు శ్రీకర్. ఎందుకో అక్కడ వినయ్‌కి ఇక ఒక్క క్షణం వుండాలనిపించలేదు. డైవోర్స్ డాక్యుమెంట్లు త్వరగా సిద్ధం చెయ్యమని చెప్పి బయటపడ్డాడు. ఏం మగ పుట్టుక... భార్యకు టీ అందించడం .. ఇలాంటి వాళ్ళు కుడా వుంటారా!!! లంచ్‌లోకి ఏం స్పెషల్ చేయమంటావ్ డియర్ వ్యంగ్యంగా శ్రీకర్ మాటలు ఇమిటేట్ చేసి తిట్టుకున్నాడు. కానీ శ్రీకర్ మాటలు, పనులు సహజంగా, స్వచ్ఛంగా ఉన్నాయనిపించింది. వారిద్దరి మాటల్లో దాపరికం, కల్మషం లేదు. ఉన్నదల్లా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అపేక్ష.
''ఉదయం నుండి చూస్తున్నాను... అదోలా వున్నావ్.. నీ ఆరోగ్యం బాగానే వుంది కదా'' అంది శృతి ఆఫీసులో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హిమ నుదుటిని తాకుతూ.
''నిన్నటి వరకు బాగానే ఉన్నాను శృతి. ఇక ఈ రోజు నుంచి నా జీవితంలో ఆనందం ఆవిరి కానుంది.'' అంది బాధగా.
''ఆనందం ఆవిరి కావడం ఏమిటి?'' అర్థం కానట్టు చూసింది శృతి.
''మా ఆడపడుచు.. ఈ రోజు నుంచి ఇక ఎప్పటికీ మా ఇంట్లోనే వుండ బోతోంది.''
''ఆమె మీ ఇంట్లో వుండిపోవడం ఏమిటి... కాస్త అర్థమయ్యేలా చెప్పవూ!!''
చెపితే పరువు పోతుంది. మా అత్తగారి తరుపు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మా ఇద్దరి సంపాదనతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈవిడ గారికి ఘనంగా పెళ్ళి చేసి అత్తారింటికి పంపాము. ఉద్యోగస్తుడైన భర్తతో చక్కగా కాపురం చెయ్యచ్చు కదా... పెళ్ళైన రెండు నెలలకే తిరిగి వచ్చేసింది. ఎందుకంటే ఏమి చెప్పదు.. భర్త గురక పెడతాడని, వాళ్ళ అత్త తనకసలు నచ్చలేదని ఇలా ఏవో కుంటి సాకులు చెప్పేది.
మేము బుజ్జగించి పంపడం... తను వారంలోపే మళ్ళీ పుట్టింటికి రావడం.. ఇదే తంతు.. అతను చూసి చూసి విసుగెత్తి ఇప్పుడు విడాకులు ఇచ్చేశాడు... ఇంకేం ఆ మహా తల్లి మా ఇంటికి వచ్చేసి మా గుండెల మీద మళ్ళీ కుంపటై కూర్చుంది. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. వీధిలో తలెత్త లేకుండా వున్నాం.''
ముక్కు చీదుతూ చెప్పింది హిమ.
''విడాకులు తీసుకోవడం అంత పరువు తక్కువ పనా!!! తనకు నచ్చని వాడితో తను మాత్రం ఎలా కాపురం చేస్తుంది చెప్పు?''
లేదు శృతి... ఆ అబ్బాయి అన్ని విధాల ఆమెకు తగినవాడు. మా ఆడపడుచు ఇష్టంతోనే ఈ పెళ్ళి జరిగింది. ఆమెది ఒట్టి పెంకితనం, మొండితనం. ఆ గుణాలే ఇప్పుడు మా కొంపముంచాయి. సంసారం అంటేనే ఓ సర్దుబాటు... ఓ కమిట్మెంట్.. ఏం మనమైతే ఇలాగే చిన్న చిన్న కారణాలతో మన కాపురాల్ని కూల్చేసుకొని కన్నవారిని వీధిన పడేస్తమా చెప్పు''
హిమ అలా ఒక్కసారిగా సూటిగా అడిగే సరికి శృతికి వెన్నులో ఝల్లుమంది.
శృతి తడబడింది... జవాబు కోసం తడుముకుంది. విషయం దాటవేస్తూ పద పద లంచ్‌కు టైం అవుతుందంటూ తొందర చేసింది. లంచ్ చేస్తుంటే తన అన్నా వదిన గుర్తుకొచ్చారు.
నాలుగు రోజుల తర్వాత శృతి వినయ్‌లు లాయర్ ఇంటికి వెళ్లారు.
''డాక్యుమెంట్లు సిధ్ధం చెయ్యమని పత్తా లేకుండా పోయారు. ఫోన్లో దొరుకరు. ఈ రోజు విడాకులకు అప్లరు చేద్దామనుకుంటున్నాను''
తనకు ఎదురుగా కూర్చున్న వాళ్ళ వంక సూటిగా చూస్తూ అంది మాలతి.
''మమ్మల్ని క్షమించండి లాయరు గారు. ఇక వాటి అవసరం మాకు లేదు'' అన్నాడు వినయ్ గట్టిగా.
ఒక్కసారిగా మాలతికి ఆ మాటలు మండు వేసవిలో మంచు జల్లులుగా చల్లగా మనసును తాకాయి.
''అవును లాయరు గారు.. మాలోని ఇగోలను పక్కనపెట్టి మొదటిసారిగా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఆశ్చర్యకరంగా ఒకరి ఉద్దేశ్యాలు ఒకరం తేలిగ్గా అర్థం చేసుకోగలిగాం. ఈ విషయంలో నా స్నేహితురాలు హిమ తన ఆడపడుచు గురించి సరైన టైంలో చెప్పి నా కళ్ళు తెరిపించింది. అది విన్న తర్వాత నేనే వినయ్‌తో కాస్త హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నానని తెలుసుకున్నాను'' అంటు హిమతో జరిగిన సంభాషణ అంతా చెప్పింది శృతి.
''అందుకేనా ఎప్పుడూ లేనిది నేను చెప్పేది ఆసాంతం ఓపికతో విన్నావ్'' అన్నాడు వినయ్ శృతి వంక మెచ్చుకోలుగా చూస్తూ.
ఆమె చిరునవ్వు నవ్వింది.
''ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీకు గుర్తుందా మాలతి గారు.. ఆ రోజు మీ వారు శ్రీకర్ గారిని నేను వంట మనిషిగా పోరపడ్డ సంఘటన. అది నన్ను ఆలోచింప చేసిందండి. భార్యభర్తల మధ్య నిజమైన అనుబంధానికి, ప్రేమకు ఎలాంటి పట్టింపులు భేషజాలు, వుండవని తెలిసింది. మూడేళ్ల మా కాపురంలో ఫర్ ద ఫస్ట్ టైం శృతి వెర్షన్ కూడా వినాలనుకున్నాను. విన్నాక తెలిసింది ఆమె మా అమ్మానాన్నను చూసుకోడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా వుందని'' మెరిసే కళ్ళతో అన్నాడు వినయ్.
కన్న వారిని ప్రేమించే భర్త దొరకడం నా అదష్టం మాలతి గారు... నా మట్టి బుర్రకు అర్థం కాలేదు కానీ... తల్లిదండ్రులు పట్ల ఇంత బాధ్యతగా వున్నవాడు తన భార్య, కుటుంబం పట్ల అంతే బాధ్యతగా వుండి తీరుతాడు. మా మధ్య వున్న కమ్యునికేషన్ గాప్ వల్ల ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడో అనే అభద్రతా భావం నాలో నిత్యం వుండేది. అందుకే ఆయన ప్రతి మాటకు అడ్డుపడుతూ వచ్చాను. ఆయనతో మాట్లాడక.. కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చడానికి ఆరాటపడుతున్నడని తెలుసుకున్నాను.. ఇక మాకు విడాకులు అవసరం లేదండి. అంది శృతి ఆనందంగా.
మేం అర్థం చేసుకోలేదు గాని మొదటి నుండి లాయర్ లా కాక ఒక తోబుట్టువులా మమ్మల్ని కలపాలని చూశారు. మా బంధం విచ్ఛిన్నం కాకుండా కాపాడాలని చూసిన మిమ్మల్ని ''మాలతి అక్కయ్య'' అని పిలవాలని వుంది'' అన్నాడు ఉద్వేగంగా వినయ్.
ఆ మాటలకు మాలతి కళ్ళు సంతోషంతో చెమ్మ గిల్లాయి.
*********************
అది సిటీ గ్రాండ్ హోటల్.
హిమకు, తన భర్త శ్రీకర్‌కు మంచి ట్రీట్ అరెంజ్ చేసింది మాలతి.
''నేను చెప్పింది చక్కగా చేశారు. మీ వల్ల వారిలో అపోహలు తొలిగించి మళ్ళీ ఒకటి చేయగలిగాను. మీ ఇద్దరికీ చాలా చాలా థాంక్స్''... నవ్వుతూ సంతోషంగా అంది మాలతి.
''ఒక స్నేహితురాలిగా అది నా బాధ్యత మేడం.. ఇందులో నా సహాయం కంటే వాళ్ళను ఒకటి చెయ్యడానికి మీరు పడిన శ్రమ, ఆరాటం గొప్పది. అది నన్ను కదిలించింది. అందుకే చిన్న అబద్ధాన్ని అందంగా రక్తి కట్టించి శృతిని నమ్మించి ఆత్మ విమర్శ చేసుకునేలా చేశాను'' అంది మెరిసే కళ్ళతో హిమ.
టీ గ్లాస్ కింద పెడుతు శ్రీకర్ అన్నాడు
''మీ ఇద్దరు నా కష్టం మర్చిపోతున్నారు. హిమా... నిన్ను కలవడం కోసం శృతికి తెలియకుండా మీ ఇంటికి, ఆఫీసుకి ఈ మహా తల్లి నాతో కార్లో ఎన్నిసార్లు చక్కర్లు కొట్టించిందో లెక్కేలేదు... అంతేనా... అసలు పాలు కలపడమే రాని నాకు ట్రైనింగ్ ఇచ్చి మరీ నాతో టీ పెట్టించుకుని తాగింది.''
అతని మాటలకు ఇద్దరూ గట్టిగా నవ్వారు.
''థాంక్స్ శ్రీవారు.. వినయ్, శృతిల మధ్య చిన్న కమ్యునికేషన్ గాప్.. అపార్థం, అవగాహన లోపం... దాన్ని సరిచేయడానికి మీతో ఇలా చేయించాల్సి వచ్చింది'' అంది మాలతి.
భార్య వైపు గర్వంగా చూస్తూ అన్నాడు శ్రీకర్.
''ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు మాలతి... విడాకులు కేసు అనగానే ఇలా ఇప్పించేసి అలా డబ్బులు దండకునే లాయర్లు వున్న ఈ రోజుల్లో కాపురాలు నిలబెడుతు వివాహ బంధాన్ని కాపాడాలని తపించే నువ్వు నా భార్య కావడం నా అదష్టం''
ఆ మాటలకు హిమా సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టింది.
- కశివోజ్జల భాస్కరాచారి, 7396016164
Sun 23 Oct 05:36:17.50846 2022