Sun 04 Dec 00:51:06.22358 2022
Authorization
ఒక జింక పిల్ల మర్రి చెట్టు ఊడలు పట్టుకుని పాటలు పాడుకుంటూ ఊయలూగుతుంది. పొరపాటుగా చెయ్యి పట్టు తప్పి కింద బురద గుంటలో పడిపోయింది. అందులో నుండి పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతుంది. ఎవరయినా అటుగా వస్తే చెయ్యి పట్టుకొని పైకి లాగుతారని ఎదురు చూస్త్తోంది. ఈలోగా బలంగా ఉన్న ఒక తోడేలు వేట కోసం వెతుకుతూ అటుకేసి వచ్చింది.
'మాంఛి జింక వాసన వస్తుంది' ఎక్కడో అని చుట్టూ చూస్తుంటే ''ఓ తోడేలు మామా! నన్ను కాస్త పైకి లాగేసి పుణ్యం కట్టుకో'' అని బురద గుంటలో నుంచి అరిచింది జింక పిల్ల.
''నువ్వా జింక పిల్లా! ఎక్కడో జింక వాసన వస్తుంది అని నాలుక పీకేస్తుంది''... అంటూ నోరు తడి చేసుకుంది.
''అదేంటి తోడేలు మామా! సాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు నన్ను తినేస్తాను అంటున్నావు. ఇదెక్కడి న్యాయం?'' దీనంగా ఆంది జింక పిల్ల.
''నిన్ను బయటకు లాగితేనే కదా తినేది?'' అంటూ దగ్గరకు వచ్చి నా కాలు గట్టిగా పట్టుకో అని ఒక కాలు బురద గుంట వైపు పెట్టి తను దగ్గరగా ఉన్న చెట్టును గట్టిగా పట్టుకుంది. జింక పిల్ల తోడేలు కాలు పట్టుకుంది. తోడేలు ఒక్క ఉదుటున కాలు పైకి లాగేసింది, జింక పిల్ల ఒడ్డుకి వచ్చి పడింది. తోడేలు నుండి తప్పించుకునేందుకు ఒక ఆలోచన వచ్చింది జింక పిల్లకు.
''తోడేలు మామా! నువ్వు చేసిన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అంది జింక పిల్ల.
''నేను తినడానికి నిన్ను పైకి లాగాను కానీ నిన్ను బతికించడానికి కాదు'' అని నోరు తెరచి జింక పిల్లని అందుకోబోయింది.
''ఆ... ఆగు మామా! నన్ను తింటే ఈ పూటకు ఆహారం అవుతాను. నన్ను వదిలిపెడితే నీకు ఒక మాయకుండ ఇస్తాను. అందులో నువ్వు ఏది వేసినా రెండుగా తయారు అవుతాయి. అప్పుడు నువ్వు నీకు దొరికిన ఆహారం అందులో వేసి ఉంచి మంత్రం చదివితే, రెట్టింపుగా అవుతాయి. అప్పుడు రెండు పూటల ఆహారం అమరుతుంది'' అంది జింక పిల్ల.
''తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఇటువంటి మాయ మాటలు నేను వినను'' అంది తోడేలు.
''అయ్యో! తోడేలు మామా! నేను నిజమే చెప్తున్నాను... కావాలంటే నన్ను మా ఇంటికి తీసుకెళ్లు, మా అమ్మ అది ఉపయోగించి మాకు ఆహారం పెడుతుంది. నన్ను కాపాడినందుకు నీకు బహుమతిగా ఇస్తుంది. ఒకవేళ అబద్దం అయితే అక్కడే నన్ను తినెయ్యి'' అంది జింకపిల్ల.
అప్పుడు తోడేలుకి ఇదేదో బాగున్నట్లు అనిపించింది.
''సరే పదా! వెళ్దాం'' అని జింక పిల్లతో వాళ్ల ఇంటికి వెళ్ళింది తోడేలు.
జింక పిల్ల ఇంట్లోకి రాగానే తల్లి జింక బయటకు వచ్చి ''ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మేము కంగారు పడుతున్నాం, ఈ తోడేలు తమ్ముడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు?'' అని ఆశ్చర్యంగా అంది.
''అమ్మా! ఈ మామ నన్ను బురద గుంట నుండి పైకి లాగి రక్షించాడు. నువ్వు మాకు ఆహారం పెట్టే మాయకుండని బహుమతిగా ఇస్తావని తీసుకువచ్చాను. మామా! ఇక్కడ కూర్చో. నేను కుండ తెస్తాను'' అని మాట్లాడొద్దు అని సైగ చేసి తల్లిని తీసుకొని లోపలకు వెళ్ళింది జింక పిల్ల.
జరిగిందంతా తల్లికి చెప్పి, తరువాత ఏం చేయాలో కూడా చెప్తుంది జింక పిల్ల.
ఒక మట్టి కుండ, దానిపై బోర్లించిన ఒక మూత తెచ్చింది తల్లి జింక.
''ఇదిగో తోడేలు తమ్ముడూ! ఇందులో ఏదైనా వేసి మూత పెట్టి కళ్ళు మూసుకొని మూడు సార్లు 'ఓం బీం చూం' అని మూత తీసి చూస్తే అది రెట్టింపు అవుతుంది'' అని చెప్పింది తల్లి జింక.
''నాకు నమ్మకం కుదిరేది ఎలా?'' అంది తోడేలు.
''ఇదిగో నా చేతిలో రెండు ఎండు చేపలు ఉన్నాయి, అవి ఇందులో వేస్తాను చూడు తోడేలు మామా!'' అంటూ రెండు చేపలు వేసింది జింక పిల్ల.
''మూత పెట్టి కళ్ళు మూసుకుని మంత్రం చదువుకో తమ్ముడూ! కళ్ళు ఒకసారి తెరిచినా కూడా మంత్రం పని చెయ్యదు. కుండ కూడా మహిమ కోల్పోతుంది'' అంది తల్లి జింక.
తోడేలు కళ్ళు మూసుకోగానే జింక పిల్ల తన వెనుక దాచిన మరో రెండు ఎండు చేపలు కుండలో వేసింది. మంత్రం చదివి తోడేలు మూత తీసి చూసేసరికి నాలుగు చేపలు ఉండటం చూసి భలే అనందపడింది.
''ఒక పూట ఆహారం సంపాదించుకుంటే రెండు పూటలకు వస్తుంది!'' అని కేరింతలు కొట్టింది.
''ఇదుగో తమ్ముడూ! నా పిల్లను కాపాడావు అని ఇంత విలువైనది ఇస్తున్నాను. నువ్వు పొరపాటుగా మంత్రం చదివినా, తొందరపడి మూత తీసినా కుండ మహిమ కోల్పోతుంది, అప్పుడు మా మీదకు దండ యాత్ర చేయను అని మాట ఇవ్వు'' అంది తల్లి జింక.
''సరే సరే! అలాగే'' అంటూ కుండ, మూత పట్టుకొని ఇంటికి వెళ్ళింది తోడేలు.
''హమ్మయ్యా! నీ సమయ స్ఫూర్తి వల్ల ఉట్టి కుండని, మాయ కుండ అని చెప్పి తప్పించుకున్నాము'' అంది తల్లి జింక పిల్లను దగ్గరకు తీసుకొని.
తోడేలు బయటకు వచ్చి అడవి అంతా వెతికినా ఆహారం ఏమీ దొరకలేదు, బాగా తిరిగితే ఒక చిలకడ దుంప ముక్క దొరికింది.
ఉస్సూరుమంటూ అది పట్టుకొని గబగబ కుండలో వేసి మూత పెట్టి మంత్రం జపిస్తూ, పూర్తి కాకుండానే ఆకలికి తట్టుకోలేక కళ్ళు తెరిచేసింది.
పాపం! కుండలో వేసింది వేసినట్లుగా చిలకడ దుంప ముక్క అలాగే ఉంది. అది చూసి తోడేలు వెఱ్ఱి కోపంతో కుండ నేల కేసి కొట్టింది, కుండ ముక్కలైంది.
చేతికి చిక్కిన జింక పిల్ల పోయింది, చేతికి అందిన కుండ పోయింది అని ఏడుస్తూ కూర్చుంది తోడేలు.
నీతి : దురాశ దు:ఖానికి చేటు! అత్యాశకి పోతే చేతికి అందింది కూడా దొరకదు.
- కె.వి. సుమలత, 9492656255