Sun 08 Jan 03:48:43.455593 2023
Authorization
'ఏం పంచాతిరా పిలగా... ఊకూకెనే దేనికొస్తది చెప్పండి కొట్లాట మీకు. అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణులోలె కూడి ఉండక. తిన్నదరగకనా ఏంది. అట్లనే ఉంది మీ తీరు జూస్తుంటే. కడుపుకాలి ఒకడేడిస్తే, తిన్నదరగక ఇంకోడు పడిశిండంట. మీదీ అంతే. నిచ్చె జూస్తున్న. ఇసోంటి పంచాతీలు మా అయ్యలనాడు లేవు, మా తాతల నాడు లేవు. మీరు మొదలైనా రిప్పుడు.... ఏదన్న ఉంటే ఇద్దరు కూసోని మాట్లాడు కోవాలే...' గుడిసె ముంగల పందిరి కింద నులక మంచం మీద కూసోని పొగసుట్ట దాగుకుంట కొడుకులను తిడుతున్నడు ఇస్తారి. కొడుకులు ఇద్దరు ఇళ్లండ్లల్లకెల్లి బయటకు వస్తలేరు.
రంగమ్మగూడెంల ఇస్తారి ఓ మోస్తరు రైతు. మేనమామ బిడ్డ సాలమ్మతో ఆయనకు పెండ్లయ్యింది. పెనిమిటి చెప్పింది చేయడందప్ప ఇంకోటి ఆలోచించే మనిషిగాదు సాలమ్మ. ఆళ్లకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు యాదగిరి, చిన్నోడు మల్లేశం. అయ్య, అమ్మ సదివించాలని చూశినా శిన్నప్పుడు ఇస్తారికి సదువబ్బలే. అటుదిట్టంగా, ఇటుదిట్టంగ యవసం పనులకు వొంగిండు. యవసం ఇగురంగ జేస్తడనే పేరుమాత్రం దెచ్చుకుండు.
తనకు సదువకపోయినా కొడుకులను మస్తుగ సదివించాలని, పెద్ద ఉద్యోగస్తులను జేయాలని ఇస్తారి కలలు గన్నడు. ఊళ్లెనే ఉన్న బళ్ళె ఆళ్లిద్దరినీ షరీక్ జేసిండు. బళ్ళెకయితే పోయిండ్రు గానీ పోరలకు ఇద్దరికీ సదువబ్బలే. సదువు ఇగొస్తది, అగొస్తది అని చూశి చూసి ఇస్తారి పాణం బేజారయ్యింది. చేసేది లేక ఆళ్లిద్దరినీ యవసంలకు దింపిండు. ఇద్దరికి మంచి సంబంధాలు జూసి పెండ్లిల్లు జేశిండు. ఆళ్లకు కూడా పిల్లలయ్యిండ్రు.
అయ్మ, అమ్మ సంపాయించి ఇచ్చిన ఇల్లు, 10 ఎకరాల పొలం భద్రంగా కాపడుకుంట వచ్చిండు ఇస్తారి. సుట్టుపక్కలోల్లు అమ్ముతుంటే కొని, పొలాన్ని పెంపే జేశిండుగానీ అయ్య, అమ్మ ఇచ్చినదాంట్ల గజం జాగ గూడా అమ్మలే. ఇప్పుడు 70ఏండ్లకు వచ్చిండు. వయసు మీదపడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే గాబట్టింది. ఇగ లాభం లేదని, తన పాణం బాగుండంగనె పిల్లలకు పొలం, ఇల్లు పంచాలనే ఆలోచనకు వచ్చిండు. ఏ పెద్దమనుసులను గూడా పిల్వకుండ ఇస్తారే ఇద్దరు కొడుకులకు పొలం, ఇల్లు సమానంగా పంచిండు. ఆళ్ల అత్తగారోల్లనించి గూడా మాట రాకుండా పిల్లలకు ఆస్తులను పంచిండని ఊళ్లె అందరు అనుకున్నరు. కొడుకులిద్దరు గలి, పొత్తులనే కర్సుపెట్టి ఇస్తారి, సాలమ్మ ఉండటానికి పొత్తులు తీసిన ఖాళీ జాగలో కొంత భాగంలో ఆళ్ల ఇండ్ల పక్కనే ఇంత గుడిశె ఏపిచ్చి ఇచ్చిండ్రు. ఎవరి యవసం ఆళ్లు జేసుకోబట్టిండ్రు.
ఇస్తారికి ఇజ్జత్ గల్ల మనిషనే పేరుంది. సుట్టుపక్కల ఊళ్లల్ల కూడా పతార బాగానే ఉంది. ఇప్పడి దాకా ఊళ్లే ఒకనితోటి 'దెశ' అనిపిచ్చుకోకుండా బతికిండు. ఇప్పుడే... కొడుకులు నిచ్చె పంచాతి పెట్టుకుంటుంటే ఇజ్జత్ బోతదనే భయం మనసులు జొరబడ్డది ముసలోనికి. ఇద్దరు కొడుకులకు పంచంగ ఆ ఇండ్ల పక్కెమ్మటి కొద్దిగంత ఖాళీ జాగా మిగిలింది. అది నాగ్గావలంటే, నాగ్గావలనేది, యాదగిరి, మల్లేశాల మధ్య పంచాతికి కారణమయ్యింది. ఇస్తారి రెండు, మూడుసార్లు ఇద్దరినీ కూసోబెట్టి శెప్పిజూశిండు. ఇన్నట్టే ఇంటరు, తెల్లారే సరికి మొదటికొస్తరు. 'ఇంట్ల పెండ్లాలు జెప్పినట్టల్లా ఆడేటోళ్లు ఏం సంసారం జేస్తర్రా' అని తిట్టినా ఆళ్లల్లో మార్పురాలే. కండ్ల ముంగల్నే కొడుకులు ఇట్ల పంచాతీకి దిగుతుంటే తట్టుకోలేక గుడ్ల నిండ నీరుదీశింది సాలమ్మ.
అన్నదమ్ములిద్దరికి పడ్తలేదని, నిచ్చె పంచాతీ అయితుందని ఊళ్లె తెలిశిపోయింది. రెండుమూడుసార్లు కచ్చీరు కాడ పంచాలి కూడా పెట్టిండ్రు. అయినా అది తశ్వ అయితలేదు. యాదగిరి పొలం పక్కన లింగయ్య అనే రైతు పొలం ఉంది. ఒక నాడు నాగలి బదులియ్యమని లింగయ్య అడిగితే యాదగిరి ఇయ్యలే. అది మనసుల పెట్టుకున్న లింగయ్య అదును కోసం జూస్తుండు. కాలం కలిశొచ్చినట్టు మల్లేశంతో యాదగిరికి పంచాతీ వచ్చింది. అదే అదననుకోని పంచాతీలో కలగజేసుకుని లింగయ్య ఇంకింత రాజేశిండు.
ఒకనాడు లింగయ్య శీకటిమొకాన మల్లేశం ఇంటికిపోయి కలిశిండు. ఆ ముచ్చట, ఈ ముచ్చట అయినంక జాగ పంచాతి గురించి ఎల్లదీశిండు.
'గింత జాగ గూడా వదులుకోకు మల్లేశా, నేను నీయెంట నిలబడత. ఎంతకాడికయినా జూద్దాం. నాకు దెలిశిన నాయకులు మస్తుగుండ్రు. పోలీసు ఠాణా కాడికి పోయినా సరే ఆళ్లతో నీకు మద్దతుగ జెప్పిస్తా. ధైర్యంగా ఎదిరించి మాట్లాడు. అవసరమైతే కచ్చీరుకాడ మళ్లోసారి పెద్దమనుసులల్ల పంచాతీ పెట్టు. ఈ సారి నీకు దాపుగా పెద్దమనుషులను నేను మాట్లాడ. ఇయ్యాలరేపు జాగలు బాగా ఫిరం అయినయి. ఎందుకొదులుకుంటవు. ఎన్ని పైసల పెడే వస్తది. అదేమన్నా మీ అన్న సంపాయించిండా. మీ అయ్య ఇచ్చిందే గదా.. ఇయ్యాల ఇదయ్యింది, రేపు ఇంకోటి అయితది అప్పుడెట్ట. ఎంత కరయినా సరే ఎనకకు పోవద్దు...' అని మల్లేశానికి రేషం గల్పించిండు. యాదగిరిని ఇరుకున పెట్టాలన్నది లింగయ్య పన్నాగం.
'లింగన్న జెప్పింది బాగనె ఉందిగద.' అని మల్లేశం భార్య లక్షమ్మ కూడా వంతపాడింది. సడీసప్పుడు లేకుండా సరేనని తలూపిండు మల్లేశం.
ఇదిట్లుండంగ.... మల్లేశం అంటే గిట్టని వెంకటేశం యాదగిరిని కలిశిండు. ముచ్చట మీద ముచ్చటపెట్టుకుంట శిన్నగ జాగ పంచాతి గురించి తీశిండు.
'యాదగిరన్నా... శిన్నప్పటి నించి నిన్ను జూస్తున్ననే. ఇస్తారి పెద్దనాయినకు నీవు యవసంలో ఎంత ఆసరయినవే. నీకన్న ఎనక పుట్టినోడు నీకు ఎదిరిచ్చి మాట్లాడుతుండంటే ఎంత ధైర్యం. ఎవరి హిమ్మత్ జూసుకోని జేస్తుండంటవు. నిన్ను జూస్తుంటే నాకైతే శాన బాధనిపిస్తుందే నీవు ఏమన్నా అనుకో గానీ...' నిప్పు రాజేశే మాటలు వదిలి ఊకున్నడు వెంకటేశం.
'ఇంకెవరి హిమ్మత్ ఉంటది. ఆయన అత్తగారు జర ఉన్నోళ్లు. ఆళ్ల బిర్రు జూసుకోని ఆయన లెస్స లొల్లిబెడ్తుండు. మా పిల్లల ఉసురు దగుల్తది..' కోపంతో శాపాలు పెడుతుంది యాదగిరి భార్య మంగమ్మ,
'అరె.. నీవుకోరాదే.. మేం మాట్లాడుతున్నం గదా...' భార్య దిక్కు కోపంగా గుర్కాయించి జూశిండు యాదగిరి.
'అగో...తమ్మున్ని పల్లెత్తు మాట అననియ్యడీన...' అని గులుగుకుంట ఆళ్లకు చాయ బెడ్డందుకు వండే అలకు బోయింది మంగమ్మ.
'ఏం జేద్దామంటవు తమ్మీ...' వెంకటేశం దిక్కు జూసుకుంట అడిగిండు యాదగిరి. తన లైన్లకు వచ్చిండని సంతోషపడ్డాడు వెంకటేశం.
'ఏం జేద్దామంటవేంది యాదగిరన్నా...అమాయకంగా. నువ్వేం భయపడకు. ఇంకోసారి పెద్దమనుసులల్ల పెట్టు. ఎందుకినడో జూద్దాం. నాకు దెలిశిన పెద్దమనుసులను మాట్లాడ. కరుకు ఎనకాడకు. జాగ ఎందుకు రాదో నేనుజూస్తా. కచ్చీరు కాడ పంచాతీ పెడ్దాం. ఆడకాకుంటే నాకు దెల్సిన వకీలు ఉన్నడు. కేసు కూడా పెట్టిద్దాం. ఇంట్ల ఆలోశించుకోండ్రి మరి....' అని లేవబోయిండు వెంకటేశం. చేయిబట్టి ఆపి, 'సరే నువ్వు జెప్పినట్టే జేద్దాం తమ్మి.' అని వెంకటేశం చేతుల చేయేసి చెప్పిండు యాదగిరి. ఇంతల మంగమ్మ చాయదెస్తె తాగి ఎల్లి పోయిండు వెంకటేశం.
లిలిలి
జాగ పంచాతి తశ్వ జేయ్యాలని పెద్దమనుసుల కాడికి ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి ఆళ్లు యవసం పని చెడగొట్టకోని మరీ దిరిగిండ్రు. మీరు జెప్పినా ఇనరు. మీకు జెప్పడమే తప్పు. మేము రాము అని పెద్దమనుసులు ఇద్దరికి మొకం మేదనే జెప్పిండ్రు. అయినా ఆళ్లకు రోజు దావతులిచ్చుకుంట ఆఖరికి ఒప్పిచ్చుకుండ్రు. రెండు మూడు సార్లు కచ్చీరుకాడ పెట్టినా ఆళ్లు మారలేదని, ఈసారి యాదగిరి, మల్లేశాల పంచాతీ మాట్లాడాలంటే చెరో రూ.50వేలు డిపాజిట్ పెట్టాలని పెద్ద మనుసులు షరతు పెట్టిండ్రు. ఈ సారి ఇనకపోతే ఇంకోసారి మా దగ్గరకు రావొద్దని హెచ్చరించిండ్రు. దానికి ఇద్దరు ఒప్పుకున్నరు. అన్నమాట ప్రకారం రూ.50వేల సొప్పున పెద్దమనసుల కాడ డిపాజిట్ పెట్టి పంచాతికి వచ్చి కూసుండ్రు అన్నదమ్ములిద్దరు. ఎట్లనయినా తశ్వ జేసుకోవాలనే ఆలోచనకు ఇద్దరు వచ్చిండ్రు.
యాదగిరి ముందు నుంచి ఆళ్ల అయ్యకు తోడుగ యవసంల కష్టపడుకుంట వచ్చిండు. ఆని పిల్లలు కూడా పెద్దోళ్లయితుండ్రు. అందుకే ఇద్దరి మధ్య ఉన్న ఖాళీ జాగ యాదగిరికే చెందుద్ది. జాగ దీసుకున్నందుకు మల్లేశకు రూ.10వేలు యాదగిరి కుషామతుగ ఇయ్యాలే అని పంచాతీని ముగించిండ్రు పెద్దమనుసులు. ఇద్దరూ కచ్చీరు కాడి తీర్పును ఒప్పుకోని సప్పుడుగాకుండ ఇంటిబాట పట్టిండ్రు.
'పంచాతీ తశ్వ అయినాదిరా..' ఇంటికొచ్చిన కొడుకులను అడిగిండు ఇస్తారి.
అయ్యందని తలూపిండ్రు.
'ఎట్లెట్లయ్యిందీ..'
ఇద్దరు సప్పుడుగాకుండా నేలదిక్కు జూస్తుండ్రు.
'ఎట్లయ్యిందంటే శెప్పరేందిరా. తేలుగుట్టిన దొంగలోలే అట్ల మాట్లాడరేందిరా..' మళ్లీ గద్దించి అడిగిండు ముసలోడు.
జరిగిందంతా పూసగుచ్చినట్టు జెప్పిండు పెద్దకొడుకు యాదగిరి. ముసలోడు జరంతశేపు ఆకాశం దిక్కు జూశిండు. అనుకున్నట్టే అయ్యిందిగదరా అనుకుంట కొడుకుల దిక్కు మల్లిండు. 'నేను జెష్షలేదురా. ఇద్దరు కూడి ఉండాలే. ఏదన్న ఉంటే ఇద్దరు కూసోని మాట్లాడుకోవాలె. తింటె కొద్దోగొప్పో ఒకడు ఎక్కువ తింటడు. తింటే ఏందిరా. మనోడే తింటుండు అనుకోవాలె. పంచాతీలు పున్యానికి చెప్తందుకు ఇయి ఎనకటి రోజులారా. డిపాజిట్ లేకుంట ఇయ్యాలరేపు ఎవరన్న పెద్ద మనుసులు పంచాతీలు జెప్తున్నారా. వేలకువేలు డిపాజిట్లు కట్టి వాళ్లను బతికిచ్చుడు దప్ప ఏమన్న ఫాయిదా ఉన్నాదిరా. డిపాజిట్ రూ.50వేలు పెడితే రూ.15వేల ఇలువజేసే జాగ వచ్చింది. చిన్నోనికి రూ.10వేలుపాయె. అంటే రూ.25 వేలకు ఆ జాగ కొన్నవన్నట్టు. రూ.25వేలు పోయినట్టేగా, చిన్నోడు రూ.50వేలు డిపాజిట్ కడితే పెద్దోడు రూ.10వేలు ఇచ్చిండు. అంటే రూ.40వేలు నష్టం. దావత్లని తాగుడు, పీకుడు కోసం కూడా తగులబెడ్డిరి. ఆ పైసలుంటే జత ఎడ్లన్నా వచ్చేయిగదరా. యవసానికన్నా కొంత ఆసరయ్యేటివి. ఎంత పనిజేస్తే అన్ని పైసలు వస్తయిరా. పైస విలువదెల్వని గాడిది కొడుకులు. మంచిగ తయారైన కుప్పమీద వచ్చి కూసుంటే కష్టం ఎట్లదెలుస్తది. నేను శిన్నప్పటి నించి ఇగ మీ లెక్క జేస్తే సంసారం ఎప్పుడో సంకనాకి పోవు. ఇగ మీరు జేసిన సంసారం గీడికి దెచ్చినారు. తూ... ఏం పుటుక పుట్టిర్రురా.... రేపు మేము సచ్చినా సావుజేస్తరన్న నమ్మకం కొడ్తలేదు.' అని తిట్టుకుంట తన గుడిసెలకు బోయిండు.
- పాటి మోహన్‌రెడ్డి 8008574385