Sun 15 Jan 00:39:36.019733 2023
Authorization
అడవిలో అటు ఇటూ తిరుగుతున్న ఎలుగుబంటికి దారి మధ్యలో ఒక పచ్చలహారం దొరికింది. అది రాజుగారో లేక రాజోద్యోగులో ధరించేది. మరి అడవి మధ్యలోకి ఎలా వచ్చింది? ఎంత ఆలోచించినా అసలు విషయం అంతు పట్టలేదు ఎలుగు బంటికి. వేటకు వచ్చినవారి మెడలో నుండి జారిపోయి వుంటుంది. వేటలో నిమగమై వారు గమనించి వుండరు. ఇంటికెళ్ళాక పచ్చలహారం పోయిన సంగతి తెలిసి వుంటుంది. రాబోయే రోజుల్లో దాన్ని వెతుకుతూ ఎవరైనా మనుషులు రావచ్చు. గమనిస్తూ వుండి వారు రాగానే ఇస్తే సరిపోతుంది అనుకుని తాను వున్న గుహలో జాగ్రత్తగా దాన్ని దాచి వుంచింది. ఎంతకాలం ఎదురు చూసినా ఆ హారాన్ని వెతుకుతూ ఎవరూ రాలేదు. ఎలుగుబంటికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని తన దగ్గర అట్టే ఎక్కువకాలం వుంచుకునే బదులు అడవిలో అందరికంటే గొప్ప జంతువును ఎన్నిక చేసి ఆ హారాన్ని ఆ జంతువు మెడలో బహుమానంగా వేస్తే బావుంటుంది అని ఆలోచించింది.
ఆ విషయం కోతితో అంటే, ''చాలా బావుంది ఆలోచన! నేనిప్పుడే అడవి జంతువులన్నింటితో చెప్పి వస్తాను'' అంటూ బయలుదేరి అందరికి క్షణాల మీద తెలియ జేసింది.
పక్క రోజు రాత్రి పిండి ఆరబోసినట్లు వెన్నెల కాస్తున్న సమయంలో అడవి మధ్యలో గుట్టకు దిగువన పక్షులు, జంతువులు అన్నీ సమావేశమయ్యాయి.
''మీమీ గొప్పదనాలు తెలియజేయండి'' అన్నది కోతి వారితో. కోయిల ముందుకొచ్చి, ''గానంలో నన్ను మించిన వారులేరు. నా గానం ఎవరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నది.
చిలుక ముందుకొచ్చి ''మనుషుల్లాగ మాటలాడగలిగే పక్షిని నేనే!''అంది.
''నాలాగ నాట్యం ఎవరు చేయగలరు?'' అంది నెమలి.
''నాలాగ పరుగెత్తగలిగినవారు ఎందరు?'' అంది గుర్రం.
''నా అంత అందమైన జంతువులు అరుదు'' అంది జింక.
ఇలా అన్ని పక్షులు జంతువులు తమతమ గొప్పదనాలను ఏకరువు పెట్టాయి. చివరకు సింహం జూలు విదుల్చుకుంటూ వచ్చి ''పరాక్రమంలో నన్ను మించినవారు లేరు. ఎంత వేగంగా అయినా పరిగెత్తి వేటాడగలను. అందుకే ఎంతో మేధావులయిన మానవులు కూడా వారిపేరు చివర పరాక్రమానికి గుర్తుగా సింహ అని పెట్టుకుంటారు''అంది.
ఏనుగు ముందుకొచ్చి ''నా అంత భారీ దేహం ఏ జంతువుకు లేదు. అయినా సాధు జంతువుని. శాకాహారిని. బుద్ధిజీవినని మానవుడంటాడు. కోటలు కట్టాలన్నా గుడులు కట్టాలన్నా పెద్ద పెద్ద బండరాళ్ళను, పెద్ద పెద్ద మానులను తరలించాలన్నా మేమే ఆధారం. మొన్నటికి మొన్న అడవిలో ఊబిలో ఎవరిదో రథం దిగబడిపోతే మేమే బయటకు లాగాం. ఆ విధంగా మానవ నాగరికత మాతో ముడిపడి వుంది.'' అంది ఏనుగు.
జంతువులన్నీ ''ఇక బహుమతి సింహాన్ని కానీ, ఏనుగును కానీ వరిస్తుందని నిర్ణయానికొచ్చేసాయి. అవి అనుకున్నట్లే ఎలుగు బంటి కూడా ఇద్దరి పేర్లూ చెప్పి, వీరిలో కూడా ఏనుగును ఎన్నిక చేస్తున్నాను అంది.
''ఎందువలన?'' అని పక్షులు జంతువులు ఎలుగు బంటిని అడిగాయి.
''ప్రతిభావంతులు, పరాక్రమవంతులు ఈలోకంలో ఎంతో మంది ఉండవచ్చు. కానీ వారి ప్రతిభ కానీ పరాక్రమంగానీ ఇతరులకు ఉపయోగపడాలి. ఏనుగు శక్తి యుక్తులుండీ సాధు జంతువుగా వుండటం ఎంతో గొప్ప. అంత దేహానికీ క్రూరత్వం వుండి వుంటే అడవి జంతువులమైన మన పరిస్థితి ఏమిటి? అన్నింటా సింహం, ఏనుగు సమ ఉజ్జీలయినప్పటికీ సింహం తన పరాక్రమాన్ని సొంత ప్రయోజనానికే, అంటే వేటకు మాత్రమే ఉపయోగిస్తుంది. దాని వల్ల ఇతరులకు ఎటువంటి లాభం లేదు. పైగా ఇతర వన్యజీవులకు ప్రాణహాని కూడా. ప్రతిభ కానీ పరాక్రమంగానీ అందరికీ ఉపయోగపడాలి అప్పుడే దానికి సార్థకత. అందువల్ల బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను'' అంది.
పశు పక్ష్యాదులన్నీ ఎలుగు బంటి నిర్ణయానికి తలలాడించి తమ ఆనందాన్ని వ్యక్త పరిచాయి. పచ్చలహారం ఏనుగు మెడను అలంకరించింది. ఏనుగు హుందాగా విజయసూచకంగా తొండం పెకెత్తి చూపుతూ ముందుకు కదిలింది.
- డా.గంగిశెట్టి శివకుమార్