Sun 29 Jan 02:45:02.293851 2023
Authorization
రామయ్య అనే రైతు తన చేనులో జొన్న పంటను వేశాడు. అక్కడకు ఒక అడవి పంది వచ్చి ఆ జొన్న కంకులను తినుటయే కాకుండా ఆ కర్రలను తొక్కి అతని పంట అంతా నాశనం చేయసాగింది. సహజంగా జంతు ప్రేమికుడైన రామయ్య మర్నాడు ఉదయం ఆ అడవిపందిని చూసి కూడా ఏమీ అనలేదు. తర్వాత అది తాను చేసిన పని గురించి చెట్టు పైన ఉన్న ఒక చిలుకకు చెప్పింది. చిలుక దానిని కోప్పడి ''ఓ వరాహమా! నీవు చేసింది చాలా తప్పు. ఆ రామయ్య చాలా పేదవాడు. పైగా మంచివాడు. అటువంటి రైతుకు నీవు నష్టం కలిగిస్తావా! మనకు చేతనైతే ఇతరులకు ఉపకారం చేయాలి కానీ అపకారం మాత్రం చేయకూడదు తెలుసా!'' అని అంది.
అప్పుడు ఆ అమాయకపు అడవిపంది ''ఓ చిలుకా! నేను చేసింది ఉపకారమే. నేను ఆ కంకులను తిని అతనికి మేలు చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కర్రల బరువును నేను ఆ కంకులను తిని పోగొట్టాను కదా! వాటి బరువు తొలగినట్లే కదా! అంతేకాకుండా మళ్ళీ ఆ కర్రలకు ఇంకా ఎక్కువ కంకులు వేయవచ్చును కదా! ఆ కంచె నాకు అడ్డు వచ్చింది. అందువల్లనే దానిని కోపంతో నాశనం చేశాను'' అని అంది. దాని మాటలు విని చిలుక నవ్వి ''ఓసీ పిచ్చిదానా! అది ఉపకారం కానే కాదు. అపకారమే. అతని కంచె కూడా నీవు నాశనం చేయడం వల్ల అక్కడకు అన్ని జంతువులు వెళ్లి అతని పంటనంతా తొక్కి ఆ కంకులను తిని అతనికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. అది అతనికి ఉపకారం ఎలా అవుతుంది? అంతేకాకుండా ఆ కంకులను నీవు తింటే మళ్లీ కంకులు వేయవు. నిన్ను చూస్తే నవ్వొస్తుంది. ఎంత అమాయకురాలవు?'' అని అంది.
అప్పుడు ఆ అమాయకపు అడవి పంది ఆ చిలుకతో ''మరి నేను అతనికి ఎలా సాయం చేయాలో నీవే చెప్పు !'' అని అంది. అప్పుడు ఆ చిలుక ''నీవు ఆ పంటను తొక్కి పాడు చేయకు. నీవు అతనికి ఇంకా ఉపకారాన్ని చేయదలిస్తే ఆ కంచెను తిరిగి ఏర్పాటు చేయటంలో అతనికి సహకరించు. అందువల్ల ఇతర జంతువులు ప్రవేశించకుండా అతని పంట అతనికి దక్కుతుంది. ఆ తర్వాత నీవు చేసిన మంచి పనికి అతడే నీకు కంకులను ఇస్తాడు. అలా అతడు ఇచ్చిన కంకులను తినాలి తప్ప నీవు దొంగతనంగా వాటిని తినగూడదు. నీవు రైతులకు సాయం చేస్తే అతడే నీ మీద దయ కలిగి నీకు ఆహారాన్ని పెడతాడు. అదీ ఉపకారమంటే !'' అని అంది.
దాని మాటలు విన్న అడవి పంది వెంటనే రామయ్య జొన్న చేనుకు వెళ్లింది. అక్కడ అది లోపలి నుంచి తిరిగి కంచెను తానే తిరిగి ఏర్పాటు చేయాలని చూసింది. కానీ దానికి అది సాధ్యం కాక ఆ చేనులోనే చిక్కుబడిపోయింది. దాన్ని చూసి చెట్టు పైన ఉన్న కాకి ఒకటి నవ్వి ''ఎవరైనా కంచెను లోపల నుండి ఏర్పాటు చేస్తే బయటకు ఎలా వెళ్లుతారు? నీవు ఇప్పుడు బయటకు వెళ్లలేవు. అందువల్ల దానిని కొద్దిగా తొలగించి నీవు బయటకు వెళ్ళి బయట నుంచి కంచెను ఏర్పాటు చెయ్యి'' అని అంది. అప్పుడు అడవి పంది కాకి చెప్పినట్టే బయట నుంచి కంచెను ఏర్పాటు చేయాలని చూస్తే దానికి అదీ సాధ్యం కాలేదు. అప్పుడే వచ్చిన రామయ్య అది చూసి నవ్వి తానే కంచెను ఏర్పాటు చేయసాగాడు. అప్పుడు ఆ అడవి పంది ముళ్ల కంపను తన ముక్కుపై వేసుకుని వచ్చి అక్కడ వేయసాగింది. దానికి ఆ ముళ్ళు గుచ్చినప్పటికీ అది సాయపడుతున్నానన్న ఆనందంలో ఆ బాధను మరచిపోయింది. ఆ తర్వాత రామయ్య అది చేసిన సాయానికి మరికొన్ని కంకులను దానికి ఇచ్చాడు. అది వాటిని ఆనందంగా తీసుకుంది.
తర్వాత అడవి పంది మరొక రైతు చేనుకు వెళ్లి దానికి కూడా కంచెను ఏర్పాటు చేయడంలో ఆ రైతుకు సాయం చేసింది. అతడు కూడా అది చేసిన సాయానికి ఆశ్చర్యపోయి దానికి కొన్ని కంకులను తినడానికి ఇచ్చాడు. ఇలా అది ప్రతి రైతు చేనుకు వెళ్లి కంచెను ఏర్పాటు చేయటంలో రైతులకు ముళ్లకంప తెచ్చి యిచ్చి సాయం చేయసాగింది. ఆ తర్వాత అది తాను చేసిన పనిని ఆ చిలుకకు చెప్పింది.
అది చేసిన సాయానికి ఆ చిలుక అడవి పందిని మెచ్చుకొని ''ఆ... ఆ.... ఇది సాయం అంటే! చూశావా! నీ సాయం వల్ల ఆ రైతుల పంటలు ఇతర జంతువులు తినకుండా కాపాడబడుతున్నాయి. ఇటువంటి మంచి పనులు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది'' అని అంది.
''ఇకముందు నీవు చెప్పినట్లే చేస్తాను'' అంది అడవిపంది ఆనందంగా.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535