కాలేజీలో నా లెక్చర్స్ ఐపోయాయి. ఇక ఏ కాస్త టైమ్ దొరికినా పైన లైబ్రరీకి వెళ్లి ఏదో రాసుకోవడమో, చదువుకోవడమో అలవాటైపోయింది. అలా ఎప్పటిలాగే ఈరోజు కూడా ఫ్రీ టైమ్ కదా అని లైబ్రరీకి వెళ్లి కూర్చున్నాన, ఎప్పటిలాగే తన జ్ఞాపకాలు వేధించడం మొదలెట్టాయి. తన గురించే ఏదైనా రాద్దామనుకొని బుక్ పెన్ను తీసి ఆలోచిస్తున్నాను ఎలా మొదలెట్టాలా అని, ఏమి తోచట్లేదు. నా పేరుతో పాటు తన పేరుని కలిపి తెల్లని ఆ కాగితం మీద ఒంపేసాను. అచ్చంగా వెన్నెల రాత్రి మెరుస్తున్న నక్షత్రంలా నా కంటిని మాయ చేసి తన వశం చేసుకున్నాయి ఆ అక్షరాలు. వాటి నుంచి నా చూపులు అసలు పక్కకి కూడా కదలట్లేదేంటో? వాటినే చూస్తూ పరధ్యానంలోకి వెళ్లిపోయా, కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ లాగా. లైబ్రరీ లోకి ఎవరొస్తున్నారు, ఎవరెళ్తున్నారు ఏది తెలీదు నాకు. అసలీ ప్రపంచంతో బొత్తిగా నాకే సంబంధంలేని దాన్నయిపోయాను. తన పేరుని చూస్తూ తన ఆలోచనలలోనే మునిగిపోయాను. నడి సముద్రంలో చిక్కుకున్న నావలా, నన్నీ లోకంలోకి తేవడం అనేది ఎవ్వరికి సాధ్యం కానీ పని అపుడు.
అంతలోనే నా మనసుకి తెలుస్తుంది కాలేజీ బైట లైబ్రరీకి కింద తను నా కోసం నిలబడి చూస్తున్నాడని. టక్కున లేచి కిటికీ దెగ్గరికి వెళ్లి చూసాన, నిజంగానే నాకోసం నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడో పాపం, ఎదురు చూసి చూసి ఇంకా ఎప్పుడొ స్తుందా అనే అలసట తన మొహం చూడ గానే తెలిసి పోయింది నాకు. నన్ను చూడగానే కొన్ని యుగాలుగా పెదవి చాటున దాచిపెట్టి ఉంచిన నవ్వు నంతా ఒక్కసారిగా బైయటికి తీసినట్టు, ఆపబట్ట లేని సంతోషంతో నవ్వాడు. ఎంత ముద్దుగా నవ్వాడో పసి పిల్లోడికి అమ్మ ఒడి దొరికినట్టుగా.
క్షణం ఆగుతానా ఇక నేనక్కడ. నిమిషంలోపే పైనుంచి కిందకి పట్టరాని సంతోషంతో హడావిడిగా పరిగెత్తు కుంటూ వెళ్ళి తన ముందు వాలిపోను. గట్టిగా హత్తుకున్నాను. ఎంత బిగ్గరగా అంటే ఎదుటివాళ్ళు చుస్తే అక్కడున్నది ఇద్దరు కాదు ఒక్కరే అనిపించేంత బిగ్గరగా పట్టుకున్నాము ఒకరిని ఒకరం. చుట్టూ పక్కల ఎవరున్నారు, ఎవరు లేరనే దానితో అసలు మాకు సంబంధం ఉంటేనా? అసలా ధ్యాసే లేదు మా ఇద్దరికీ.
కాసేపటికి తను తన భుజం మీద వాలిన నా మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీస్కొని, నా మొహం మీద పడుతున్న వెంట్రుకల్ని ప్రేమగా వెనక్కి నెట్టుతూ చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు. ఎప్పటి లాగే కోపంతో ఒక్క చూపు చూసాను. (నీకు తెలీదా అన్నట్టు) (స్పెషల్ ప్లేస్ అంటూ ఏది లేదు బండి మీద అలా రోడ్ల మీద పడి తిరగడం నాకు చాలా ఇష్టం అదే లాంగ్ డ్రైవ్. మధ్యలో ఎక్కడైనా ఏదైనా మంచి ప్లేస్ కనిపించి ఆగాలనిపిస్తే ఆగడం లేదా ఏదైనా మంచి హోటల్‌కో లేదా ఏదైనా చిన్న బండి లాంటిది కనిపిస్తే వాటి దగ్గర ఆగి తింటూ ముచ్చట్లు పెట్టుకోవడం ఇదే ప్రతిసారి జరిగేది అండ్ నాకు నచ్చేది). ఒకే ఒకే అర్థం అయింది. సరే వెళ్దాం పద అన్నాడు (తనకి అదంత గుర్తొచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ).
అలా నడుస్తున్నానా, వెంటనే తన చేయి పట్టుకున్నాను. ఆమ్మో నిన్ను అసలు నమ్మొద్దు కాస్త వదిలేస్తే చాలు నన్నొదిలేసి వెళ్ళిపోతావు నువ్వు అన్నాను చిన్న పిల్లలా ఏడ్పు మొహం పెట్టి. అదేం లేదు నానా ఈసారి వెళ్ళనుగా అన్నాడు బుజ్జగిస్తూ. నువు ప్రతిసారి ఇలాగే అంటావు, ఐనా వదిలి వెళ్ళిపోతావు అన్నాను మళ్ళీ ఏడ్పు మొహంతోనే అడుగులో అడుగులు వేస్తూ నడుస్తూ, తన చేయిని ఇంకా బిగ్గరగా పట్టుకుంటూ. సరే బండైన స్టార్ట్ చేయని చేయి వొదులు అన్నాడు. పట్టుకున్నది ఒక చెయ్యే కదా ఇంకో చేయి ఖాళీగానే ఉంది కీస్ ఐతే పెట్టు అన్నాను బుంగ మూతి పెట్టి. పాపం ఎలాగో అల కుస్తీ పడ్తూ ఒక్క చేత్తోనే కీ బండికి పెట్టేసి, సరే ఇపుడు బండి నడపాలంటే నువు చెరు వొదలాలి కదా అన్నాడు. ఏం వొద్దు నువ్విలాగే బండి ఎక్కు చెప్తా అన్నాను అలాగే తను బండి మీద కూర్చున్నాడు. క్షణం చేయిని విడిచి భుజం మీద చేయి వేసానో కూడా గమనించలేనంత రెప్ప పాటు క్షణంలో బండి ఎక్కి మళ్ళీ తనని బిగ్గరగా పట్టుకుంటూ, మోసగాడివి నువ్వు ఏ కాస్త నేనూ వదులుగా ఉన్నా, క్షణంలో జారిపోతావు నువ్వు అన్నాను. నిన్నసలు వొదిలే ప్రసక్తే లేదు ఈరోజు అన్నాను. దానికి తన దగ్గర సమాధానం లేదన్నట్టుగా మౌనంగా ఊర్కున్నాడు.
అలా వెళ్తున్నామా ఒక చిన్న పల్లెటూరు తగిలింది (ఎపుడు వెళ్లే దారే, ఎపుడు మాకు మధ్యలో తగిలే ఉరే) చుట్టూ పచ్చని చెట్లు, ఒకవైపుగా చిన్న నది, నది ముందు ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఎవరో ముందుగానే మా కోసం కూర్చోడానికి ఏర్పాటు చేసినట్టు కట్టలతో చేసిన ఒక చిన్న బల్ల (కూర్చోడానికి వీలుగా ఉండే). అక్కడదాకా వెళ్ళామా, ఎంత కాలానికి మళ్ళీ మిమల్ని చూసాను, ఇప్పుడిక మిమల్ని ఇక్కడి నుంచి అసలు వెళ్లనివ్వను అన్నట్లు ఒకేసారి మోదయ్యింది బోరుమని వర్షం. తడిసి పోతున్నాం ఇద్దరం. హడావిడిగా చెట్టు పక్కకి బండి ఆపాడు నా చేయి పట్టుకొని చెట్టు కిందకి లాగుతూ, అయ్యో తడిసి పోతున్నావు అన్నాడు బాధతో, తను కూడా తడుస్తున్నడనే విషయమే మర్చిపోయి. చెట్టు కింద కాస్త వర్షపు చినుకులకి దూరంగా ఉన్న తనకేదో తెలియని గుబులు తన ప్యాంటు పాకెట్ లో ఉన్న రుమాలు తీసి హడావిడిగా నా తలకి కడ్తూ నెత్తి బాగా తడిస్తే మళ్ళీ జలుబు చేస్తుంది అంటున్నాడు. నన్ను దగ్గర తీస్కొని తన రెండు చేతులతో కప్పేస్తున్నాడు వర్షం నుంచి తప్పించాలని ఎంత ఆరాటమో తనకి.
ఎప్పటిలాగే నా అల్లరి మొదలయింది ఎందుకు కడ్తున్నావు ఈ రుమాలు నాకేమి వొద్దు అని అలకగా అంటూ నెత్తికి కట్టిన రుమాలుని గుంజేస్తు పద తడుద్దాం వర్షంలో అన్నాను. అరె చెప్తే అసలు వినవు జలుబు చేస్తుంది మళ్ళీ జ్వరం వొస్తే ఎలా అంటున్నాడు కాస్త కోపంలో బోలెడు ప్రేమని కలిపి. మరి అలా జలుబు చేసి జ్వరాలొచ్చినా రోజులు ఎన్ని ఉన్నాయో తెల్సా, ఒంటరిగా ఒక్కదాని ఎంత బాధ పడేదాన్నో తెల్సా ఎందుకురా నన్ను వొదిలి ఊర్కే వెళ్ళిపోతావు, జాలి కలగదా నీకు నా మీద. నువ్వు లేకపోతే నాకు ఏమైనా ఎవరు పట్టించుకోరు తెల్సా.వొళ్ళు పొక్కులు పడేంత వేడిగా కాలుతున్న హాస్పటల్‌కి తీసుకెళ్లేంత టైం నా కోసం ఎవరి దగ్గర ఉండదు, అపుడు నువు గుర్తొచ్చి దుప్పటి నిండా కప్పుకొని పిల్లోలో మొహం పెట్టి రాత్రంతా ఎంత ఏడ్చేదాన్నో తెల్సా అన్నాను. అంత బోరు వర్షంలో కూడ నా చెంపల మీది నుంచి జారి పడ్తున్న కన్నీళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి తనకి. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. వెంటనే నన్ను గట్టిగ హత్తుకొని చిన్నపిల్లోడిలా తను ఏడ్చేస్తున్నాడు ''I am sorry beta, I am soo sorry ప్లీజ్, నువు నా బంగారం కదు. ఇంకెప్పుడు ఏడవద్దు. ప్లీజ్ నానా. నువు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది నాకు అసలు నచ్చదు'' అంటున్నాడు. మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకురా ఊర్కే నన్ను వదిలేసి వెళ్తావు అని అడిగాను మళ్ళీ. ఈ ప్రశ్న అడిగిన ప్రతి సారిలాగే, ఇపుడు తన దగ్గర సమాధానం లేదు. ఒక రెండు నిముషాలు మా మధ్య మౌనం, నిశ్శబ్దం తప్ప ఏమి లేదు.
వర్షం ఆగిపోయింది. ఇంకా ఇద్దరం వెచ్చని అ కౌగిలిలో ఎన్నో ఏండ్ల ఎడబాటుని విసిరి కొట్టెందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. వర్షం పడింది కదా మట్టి వాసన అక్కడున్న ఆ ప్రకృతి అందాన్ని ఇంకా పెంచింది. కిచ్‌కిచ్ మంటున్న పక్షుల శబ్దాలు చెవుల్లో ఏదో సంగీతాన్ని వినిపిస్తున్నంత హాయిగా ఉంది. చల్లగా వీస్తున్న గాలి, ఆ గాలికి కదులుతున్న చెట్లు, ఆ చెట్ల నుంచి మా మీద రాలిపడుతున్న పూలు. నెమ్మదిగా, ప్రశాంతంగా కనిపిస్తున్న ఆ నది అంతే ఇదే మా ప్రపంచం కదా. ఇంకేమి వొద్దు మాకు అనిపిస్తుంది. మనసు కుదుట పడినట్లు కాస్త తేలికగా ఉంది.
పక్కన ఉన్న ఆ బల్ల మీద కూర్చుందాం అన్నాను. రెప్పార్పకుండా నన్నే చూస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతే ఎన్నాళ్ళకి చూస్తానో అన్నటుగా. నీకు అసలు నేనంటే నిజంగా ఇష్టమేనా అన్నాను అమాయకంగా. పిచ్చి ప్రేమరా అన్నాడు. ఔను, ఎంత పిచ్చి ప్రేమ అన్నాను. నీకోసం మళ్ళీ మళ్ళీ నీదాకా వొచ్చేంత అన్నాడు. ఎప్పటిలాగే మళ్ళీ నాది అదే పిచ్చి ప్రశ్న. మరెందుకు వెళ్ళావ్ అంటూ తన మోచేతిని పట్టుకుంటూ తన భుజం మీద నా తల వాల్చేసరికి రెడీగా ఉన్న నా కనీళ్ళు పరుగు పరుగున వొచ్చేస్తూనే వున్నాయి. తన మోచేతిని ఇంకా బిగ్గరగా పట్టుకొని ఏడుస్తూనే నువు నన్ను వొదిలి వెళ్లొద్దు నానా నువ్వులేకపోతే నాకస్సలు బాలేదు తెలుసా. ఉండలేక పోతున్న నువు లేకుండ. ఇలా ఐతే ఏడ్చి ఏడ్చి నేనూ పిచ్చిదాన్నయిపోతానేమో రా ప్లీజ్ కన్నా నువు నన్ను వొదిలి వెళ్లొద్దురా అంటూ ఎంత బతిమాలుకుంటున్నానో దీనంగా.
బల్ల మీది నుంచి లేచి కింద మోకాలు మీద కూర్చొని నా రెండు చేతులు పట్టుకొని, వెళ్ళను రా నీతోనే ఉంటాను నువు నా బంగారం కదా అస్సలు ఎడవొద్దు నువ్వు అంటున్నాడు.
ఇలా ఎన్ని సార్లు చెప్పి ఉంటావో అయిన వెళ్ళిపోయావు కదా ఇపుడు కూడా వెళ్ళిపోతావు నువ్వు, నాకు తెల్సు అన్నాను ఏడ్పు మొహం పెట్టి. వెళ్ళను నానా నిన్న వదిలి నేనూ ఉండలేను కాబట్టే కదా మళ్ళీ మళ్ళీ వొస్తాను అన్నాడు (చాలా ప్రశాంతంగా, ప్రేమగా). అలా ఐతే ఎందుకు వెళ్ళిపోయావు, పోతే పోయావు నన్నెందుకు నీతో తీసుకెళ్లలేదు? నీకు తెలీదా నువ్వు లేకుండ, నిన్ను వదిలి నేనూ ఉండలేనని అన్నాను. తన రెండు చేతుల్తో పట్టుకున్న నా చేతుల్ని ప్రేమగా నిమురుతూ ఒక చిన్న నవ్వు నవ్వాడు ఎంత పిచ్చిదానివి రా నువ్వు అంటూ.
బాగా చదువుతున్నావా? నీకు రాయడం ఇష్టం కదా రాస్తున్నావా ఆపేసావా? ఏదో చేయాలి, సమాజానికి మనం ఉపయోగపడాలి, సమా జాన్ని మార్చాలి అంటుంటావు కదా ఎపుడు, ఏదైనా చేస్తున్నావా అన్నాడు. కోపం వొచ్చింది ఏంట్రా నువ్వు ఎపుడో చెప్ప కుండా వొస్తావు మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోతావు ఉన్న ఆ కాస్త సమయం ఐనా నాతో ప్రేమగా ఉంటావు, మాట్లాడు తావు అంటే ఇవన్ని అడుగు తున్నావు అంటూ కసిరాను. ''పిచ్చిదాన నువ్వే కదా నన్ను నీతో తీసుకెళ్లకుండా ఎందుకురా ఒంటరిగా వెళ్ళావు అని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం నీ మనసునే అడుగు దానికి తెలుసు సమాధానం ఏంటో. నువ్వు చాలా మొండిదానివి, ధైర్యవంతు రాలివి. నీ తెలివిని చూసే కదా ఇష్ట పడ్డాను నేనిన్ను. దాన్ని వృధా కానివ్వకు. చాలా చెయ్యాలి నువ్వు అండ్ నువ్వు చేయగలవు అంటూ ప్రేమగా నా నుదిటిన ముద్దు పెట్టి తన రెండు చేతుల్లోకి నన్ను తీస్కున్నాడు. తన యెదపై మొహం వాల్చిన నాకు, దబ దబా ఫాస్ట్‌గా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు నా చెవుల్లో నిశబ్దంగా మొగుతుంది. ప్రేమగా తను నా కురుల్ని నిమురుతూ వుంటే నెమ్మదిగా నా కళ్ళు మూత పడుతు న్నాయి. నా చెంపల మీద జారిపడ్డ కన్నీటి బొట్టుని, కళ్ళు మూసుకునే తుడుచు కుంటూ ఎందుకీ కన్నీళ్ళు అని అడి గాను. ఇంకో చేతిలో ఈ చెయ్యి కలిసి అది విడదీయలేనంత బిగ్గరగా ముడి పడున్నంత కాలం నా బెంగ తీరదులే అన్నాడు.
టక్కున నా కళ్ళు తెరుచుకోవడం అంతలోనే ఆయమ్మ వొచ్చి మేడం, మేడం అంటూ పరధ్యానంలో ఉన్న నన్ను గట్టిగ ఒక కేక వేసి పిలవడం రెండు ఒకేసారి జరిగిపోయాయి.
కాలేజీ టైం ఐపోయింది అందరు వెళ్లిపోయారు కూడా, మీరింకా లైబ్రరీలోనే ఉన్నారా? లైబ్రరీ కూడా క్లోజ్ చేసే టైం అయింది మేడం అంది. ఒక్కసారిగా చుట్టు పక్కల చూసాను ఏముంది ఎప్పటిలాగే ఇప్పుడు నన్ను బుజ్జగించి, లాలించి, ప్రేమించి మళ్ళీ వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పటి లాగే తనది పాత మోసం.
కానీ నీకు తెలుసా, ఎప్పుడూ అనుకోలేదు నీ ప్లేస్ రీప్లేస్ అవ్వగలదు అని, అమ్మ సంబంధాలు తెస్తుంటే చాలా చిరాకేసేది, మా ఇద్దరి మధ్య పెండ్లి కోసం గొడవ కాదు, యుద్ధమే జరిగేది ఎప్పుడూ. అయినా ఎవడైనా నచ్చితేనా నాకు? అయిన నీ అంత గొప్పగా నన్ను ఎవరు మాత్రం ప్రేమించగలరు అసలు అనుకునేదాన్ని కానీ మిరాకిల్ ఏదో జరిగింది నానా. ఈసారి నువ్వొచ్చినపుడు కాస్త ఎక్కువ టైం తీస్కొని రా 'నాని' గురించి చెప్పాలి నీకు.
- దియా-విఘ్నేష్
Sun 19 Feb 00:12:16.984568 2023