Sun 14 May 05:56:36.403644 2023
Authorization
రాత్రి, ఆకాశం, చుక్కలు, చంద్రుడు, గాలి, నీరు వీటితో బాల్యం నిండిపోయేది. వీటితో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, తాత, అత్త.. వీళ్ళు లేని బాల్యం వుండేది కాదు. రాత్రి ఆరుబయట వెల్లకిలా తాత పక్కన పడుకుని, ఆకాశంలో చుక్కల్ని కలిపి చిత్రాలు గీసుకుంటూ ఎప్పుడు నిద్రాదేవి ఒడిలోకి జారిపోయేవాళ్ళమో... అర్థరాత్రి గుడ్లగూబ చెట్టుమీద బుగులు పెడుతుంటే గుండె వేగంగా కొట్టుకునేది. కట్ట పక్కన పెద్ద పిల్లులు చిన్న చిన్న పిల్లల్లా అరుస్తుంటే తాతని వాటేసుకున్నప్పుడు వచ్చే ధైర్యం దేనితో పోల్చగలం? అమ్మమ్మ చెప్పే కథలు ఒక కొత్త లోకంలోకి తీసుకుపోతుంటే, నిద్ర కూడా ఒక స్వప్నంలా వుండేది. ఇప్పటి మార్వెల్ హీరోస్ ఎందుకు పనికొస్తారు?
ప్రతి ఇంట్లో నాయనమ్మో, అమ్మమ్మో మనల్ని క్రమశిక్షణకు అలవాటు చేసే అలారంగా వుండేది. ఇంటికి లేటుగా పోయినా, తినకపోయినా అమ్మలా ఆదరించే అమ్మమ్మ. అమ్మకు అమ్మే మరి. అప్పుడప్పుడు అమ్మమ్మ డాక్టర్ అవతారం ఎత్తేది. కంటికి పాపలా కాపాడుకుంటూ, అన్నీ తానై అక్కున చేర్చుకునే అమ్మమ్మ చేయిని ఎవరైనా మరిచి పోగలరా?
కాలం మారింది. కాలంతో పాటు మనుషులు మారరా? ప్రేమలు కూడా మారాయా?
సాంకేతిక విప్లవంతో మనిషి, మనిషితో పాటు పరిస్థితులు, జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. కానీ ఈ మార్పు కన్న తల్లినీ, తండ్రినీ కూడా దూరం వుంచేంతగా ఎందుకు మార్పు వచ్చింది? కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు, తాత, నాయనమ్మ లాంటి ప్రేమ పూరితమైన మనసులో నువ్వు, నేను, మన పిల్లల వరకూ ఎలా కుదించబడింది?
'ఫ్యామిలీ' రోమన్లో ఫేములస్ అనే పదం నుండి వచ్చింది. ఫేములస్ అంటే అర్ధం సేవకుడు అని.
కుటుంబం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తమైనది. మనిషి మనుగడకు ప్రాణం, మనసు ఎంత ముఖ్యమో సమాజంలో కుటుంబం అనేది అంతే ముఖ్యం.
ఒకప్పుడు భారతదేశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో విరాజిల్లింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తులకు పూర్తిస్థాయి రక్షణ వుండేది. ఏ సమస్యకైనా కుటుంబం సామూహికంగా చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తయ్యేది. అంతే కాకుండా కుటుంబం వల్ల ఇతరులు హాని తలపెట్టే అవకాశాలు తక్కువ. అందరూ కలిసి వుండడం వల్ల తాము బలంగా వున్నామనే ధీమా, ధైర్యం కుటుంబ సభ్యులకు ఉండేది. కుటుంబానికంతా పెద్దగా తండ్రి వుండేవాడు. తరువాతి స్థానం ఆ ఇంటి పెద్ద కొడుకు కు వుండేది. నిర్ణయాలన్నీ ఆ ఇంటి పెద్ద ద్వారానే జరిగేవి. ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులు అమలు చేసే వారు. కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేసేవారు. వారి శ్రమ ఫలితమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా వుండేది. భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల ఎక్కువగా వ్యవసాయిక కుటుంబాలే ఉండేవి. ఆ కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరూ కష్టపడి పని చేసి కుటుంబానికి కావలసిన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడంలోనూ, కుటుంబానికి కావలసిన ఆర్థిక అవసరాలను తీర్చడంలోనూ సహాయపడేవారు. కుటుంబ సభ్యుల్లోని అందరు సభ్యులకు కుటుంబం రక్షణగా, అండగా వుండేది. రాను రాను కుటుంబాలు విచ్చిన్నమయి చిన్న కుటుంబాలుగా రూపాంతరం చెందాయి. అలా మారడానికి సమాజంలో వచ్చిన మార్పులతో పాటుగా కుటుంబ సభ్యుల్లో పెరిగిపోయిన స్వేచ్ఛా పిపాస, ఆస్తుల గొడవలు మొదలైన కారణాలతో పాటుగా చదువుల సంస్కృతి పెరిగి దాని ద్వారా ఉద్యోగాలు పొంది కుటుంబ సభ్యుల్లోని కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండాల్సిరావడం కారణం. రాను రాను స్త్రీలు కూడా చదువుకుని కుటుంబానికి దూరంగా వుండవలసి రావడం మొదలైన కారణాలతో చిన్న కుటుంబాల ఏర్పాటు తప్పనిసరి అయింది. దీనితో చిన్న కుటుంబాల్లోని స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందాలను కుటుంబ సభ్యులు పొందగలిగారు. ఉమ్మడి కుటుంబాల్లో వుండే ఏకవ్యక్తి నిర్ణయాలకు కట్టుబడి వుండడం, వారి ఆజ్ఞలను పాటించే పద్ధతిలేకపోవడం, ఆర్థిక స్వేచ్ఛలతో పాటుగా కుటుంబాల్లో సాధారణంగా వుండే కట్టుబాట్లు లేని స్వేచ్ఛ వల్ల కుటుంబ సభ్యులు పూర్తి స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత ఆనందాలకు అడ్డంకి లేకుండా జీవించడమనే జీవన విధానాలకు అలవాటు పడి కుటుంబాల కంటే వ్యక్తిగత కుటుంబాలే మేలుగా సమాజం భావిస్తుంది.
అయితే పెద్ద కుటుంబాల్లో కొన్ని లాభాలు చిన్న కుటుంబాల్లో వుండవు. అలాగే వ్యక్తిగత కుటుంబాల్లో వుండే స్వేచ్ఛ ఉమ్మడి కుటుంబాల్లో వుండదు. పెద్ద కుటుంబాల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడో, ఇబ్బంది ఏర్పడినప్పుడో కుటుంబం అండగా వుంటుంది. దానితో మొత్తం కుటుంబం తన వెనక వున్నదనే ధీమా వుంటుంది. అయితే అదే సమయంలో కొన్ని వ్యక్తిగతమైన స్వేచ్ఛలు, ఆర్థిక అవసరాలు తీరడంలో ఇబ్బందులను కుటుంబ సభ్యులు ఎదుర్కొనవలసి వుంటుంది.
చిన్న కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, కావలసిన అవసరాలు తీర్చుకునే స్వేచ్ఛ వుంటుంది. కానీ అవసరమైనప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో వుండే రక్షణ ఇక్కడ వుండదు. కష్టం వచ్చినప్పుడు ఎవరికి వారే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవలసి వస్తుంది.
అయితే చిన్న కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రులకు ఆదరణ కరువవుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో వృద్ధాప్యం పైనబడ్డ తరువాత మనవలు, మనవరాళ్ళతో మిగతా కుటుంబ సభ్యులతో వారి చివరి ఘడియల వరకూ ఆనందంగా గడిపేవారు. కానీ కుటుంబాలు ఛిన్నాభిన్నమై వేరువేరుగా, వేర్వేరు ప్రాంతాల్లో వుంటున్న కొడుకుల దగ్గరకి వృద్ధ తల్లిదండ్రులు మారుతూ మనవలతో దగ్గరితనం లేక కుటుంబంలో కలిసి వుండే ఆనందాన్ని కోల్పోతున్నారు.
భారత్లోనే కాకుండా తూర్పు ఆసియా కుటుంబాల్లో కూడా బలమైన కుటుంబ సంబంధాలు కలిగి ఉంటారు. అయితే 20వ శతాబ్దం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు చిన్న కుటుంబాల ఏర్పాటుకు దారి తీసింది. గత శతాబ్దంగా వస్తున్న మార్పులు ఇటు జపాన్, చైనా, కొరియా మొదలైన దేశాలు కూడా చిన్న కుటుంబాలుగా ఏర్పడుతున్నాయి. భారతదేశం కంటే చాలా ముందుగానే పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయింది. కుటుంబం ఒక సమిష్టి వ్యవస్థ కుటుంబం కేవలం సమకాలీన కాలానికి అందులో వున్న సభ్యులకు మాత్రమే అవసరమై న ఒక వ్యవస్థగా కాకుండా తన తర్వాత తరాలకు విలువలను, సాంప్రదాయాలను ఒక తరం నుండి మరో తరానికి బదిలీ చేసి కుటుంబ విలువల పునాదులను బలీయంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది.
కుటుంబం అనేది మనుషులకే కాకుండా జంతువుల్లోనూ వుండే ఒక లక్షణం. సృష్టిలోని అనేక జీవ జాతులు కుటుంబ వ్యవస్థను కలిగి వున్నాయి. జంతు జాతుల కంటే ఎక్కువగా మానవ సమాజంలోని మనం కుటుంబ వ్యవస్థ వచ్చిన్నం అవడం చూస్తున్నాం. ఈ పరిస్థితుల నుండి మానవ సమాజాన్ని తిరిగి కుటుంబ వ్యవస్థపైపు ఆలోచించే విధంగా చేయడానికి కొంతమంది నిపుణులు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కుటుంబాల మధ్య సఖ్యత పెంచాలనే ఒక ఆలోచనతో ఐక్యరాజ్య సమితి 'అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం' పేరుతో ఒక రోజును జరుపుకోవడానికి 1992లో మే 15న తన జనరత్ అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసింది.
ఎన్ని తీర్మానాలు వచ్చినా, తెచ్చినా, మనిషిలో పెరిగిన తీవ్ర మానసిక వ్యత్యాసాల (ఇంబ్యాలెన్స్)తో చోటు చేసుకున్న సంఘటనలు మనలను కవవర పెడుతూనే వున్నాయి.
''ఆస్థి కోసం అన్నదమ్ముల పరస్పర దాడిలో ఒకరు మృతి''
''మాకు వచ్చే వాటా ఎంతో తెలిస్తేనే అమ్మ శవాన్ని తీసుకెళ్తాం'' అనే కూతుళ్ళు
''పిల్లల ఆదరణ లేక వృద్ధ జంట ఆత్మహత్య''
అమ్మ చనిపోయిన ఆరు నెలలకు ఇంటికి వచ్చిన కొడుకు. అమ్మ అస్థిపంజాన్ని చూసి ఆశ్చర్యపోయిన తనయుడు''... ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనిషి ప్రయాణం ఎటు అనేది ప్రశ్నార్ధకమే.
- సి.హెచ్.ఉషారాణి, 9441228142