Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్వేటినగరం అడవుల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, అడవి పిల్లులు, ఎలుకలు మొదలైన జంతువులన్నీ స్నేహంగా, సంతోషంగా జీవించేవి. ఒకరోజు శేషాచలం అడవుల నుండి ఒక పులి కార్వేటినగరం అడవిలోకి ప్రవేశించింది. తనకు తానుగా అడవికి రాజునంటూ ప్రకటించుకుంది.
ఆకలి ఉన్నా లేకున్నా తక్కిన జంతువులను వేటాడేది. ప్రతిరోజు పదుల సంఖ్యలో జంతువులను చంపేసేది. జంతువులన్నీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన వచ్చింది. ఒక రోజు ఏనుగు పులి దగ్గరకు వెళ్లి
''పులి రాజా! ఆకలి వేసినప్పుడు మీరు జంతువులను వేటాడి తినవచ్చు. అది ప్రకతి ధర్మం. కానీ మీరు అవసరానికి మించి జంతువులను వేటాడుతున్నారు. ఇది మీకు న్యాయం కాదు.'' అంటూ హితబోధ చేసింది.
''నేను ఈ అడవికి రాజును. నాకు నీతులు చెప్పే సాహసం చేయడం నీకు మంచిది కాదు.'' అంటూ ఏనుగు పట్ల అహంకారాన్ని ప్రదర్శించింది పులి. ఏనుగు మౌనంగా తిరిగి వచ్చేసింది.
చెరువు గట్టుపై జంతువులన్నీ సమావేశమయ్యాయి. పులి నుండి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించి సాగాయి.
''నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పనా?'' అడిగింది కుందేలు. జంతువులన్నీ కుందేలు వైపు చూసాయి.
''పులి మెడలో గంట కడదాం! పులి కదలికలను పసిగట్టి జాగ్రత్త పడుదాం'' చెప్పింది కుందేలు.
కుందేలు మాటలు విని ఫక్కున నవ్వాయి ఎలుకల గుంపు.
''ఎందుకు నవ్వుతున్నారు?'' అమాయకంగా అడిగింది కుందేలు.
''గతంలో మేము ఇలాగే పిల్లి మెడలో గంట కట్టాలని ఉపాయం వేశాము. గంట సిద్ధం చేశాక దాన్ని పిల్లి మెడలో కట్టే ధైర్యశాలి దొరకలేదు. దాంతో ఆ గంట మా బొరియలో వధాగా పడి ఉంది.'' చెప్పింది ఎలుక.
''నాకు తెలియకుండా ఇంత ఉపాయం వేశారా?''అంటూ ఎలుకల వైపు కొరకొరా చూసింది పిల్లి.
ఎలుకలన్నీ భయంతో తమ బొరియల్లో దాక్కోబోయాయి.
''మిమ్మల్ని ఇంకెప్పుడూ వేటాడునులే! ప్రత్యామ్నాయ ఆహారం సంపాదించుకుంటాను'' అభయమిచ్చింది పిల్లి. ఎలుకలన్నీ సంతోషించాయి.
''ఎలుకలు చెప్పింది నిజమే. అవి పిల్లి మెడలో గంట కట్టలేక పోయినట్టే, మనం పులి మెడలో గంట కట్టే సాహసం చేయలేము'' నిరుత్సాహంగా చెప్పింది జింక.
''పులి మెడలో గంట కట్టే ఉపాయం నా దగ్గర ఉంది.'' అంటూ ముందుకు వచ్చింది కోతి.
''పులిని మనం రాజుగా అంగీకరించినట్టు కబురు పంపండి. సన్మానం చేయదలిచామని చెప్పి పులిని ఆహ్వానించండి. సన్మాన కార్యక్రమంలో నేను పులి మెడలో గంట కడతాను.'' చెప్పింది కోతి.
సన్మానానికి కావలసిన పూలను సిద్ధం చేశాయి పిల్లులు. పండ్లను, కాయలను కోసుకొచ్చాయి పిల్లులు. ఎలుకలు గంటను శుభ్రం చేసి తీసుకొచ్చాయి. గుర్రాలు తోలు శాలువాను ఏర్పాటు చేశాయి. కోతి పూలహారం మధ్యలో గంట కట్టి మాలలు చుట్టింది. ఏనుగు జంతువులన్నిటినీ వెంటబెట్టుకుని గుహ దగ్గరకు వెళ్లి పులిని తన వీపుపై ఎక్కించుకుని ఊరేగింపుగా చెరువుగట్టు దగ్గరకు తీసుకు వచ్చింది. జంతువులన్నీ నాట్యంచేస్తూ స్వాగతం పలుకగా పులి సింహాసనం పై కూర్చుంది. పులి శౌర్య పరాక్రమాల గురించి గొప్పగా పొగిడాయి. జంతువులన్నీ చప్పట్లు కొడుతుండగా పులికి శాలువా కప్పింది ఏనుగు. గంట కట్టిన పూల హారాన్ని పులి మెడకు గట్టిగా కట్టింది కోతి. తనకు దక్కిన గౌరవానికి పులి మురిసిపోయింది.
రెండు రోజులు గడిచాయి. పులి మెడకు కట్టిన మాలలోని పూలన్నీ వాడిపోయి రాలిపోయాయి. పులి మెడకు గంట మాత్రమే మిగిలింది. గుహ నుండి కాలు బయట పెట్టిన ప్రతిసారి గంట గణగణమని మ్రోగేది. జంతువులన్నీ పులి కంట పడకుండా దాక్కోవడం మొదలుపెట్టాయి. పులికి ఒక్క జంతువూ చిక్కేది కాదు. దాంతో పులి ఆహారం కోసం మరో అడవికి వలసపోయింది. కోతి తెలివితేటలను మెచ్చుకుంటూ జంతువులన్నీ ఆనందంతో చిందులు వేశాయి.
- పేట యుగంధర్, 9492571731