Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణాచలం పక్కన ఉండే అడవిలో జంతువులెన్నో ఉండేవి. అక్కడి జంతువులలో ఒక గుడ్డి గుర్రం ఉండేది. అది పుట్టుకతోనే కంటి చూపు లేకుండా పుట్టింది.
'కంటి చూపున్న జంతువులనే క్రూరమగాలు వదలవు. వెంటాడి చంపుతాయి. చూపు లేని నీలాంటి దాన్ని వేటాడడం వాటికి మరింత సులువు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి' అనేది తల్లిగుర్రం.
'ఏవైనా జంతువులు తరుముతున్నప్పుడు తప్పించు కోవడానికి వేగంగా పరుగెత్తినా సరే చూపు లేక పోవడం వలన చెట్లకు గుద్దుకుని పడిపోవచ్చని, గోతుల్లో, గుంటల్లో పడిపోయే ప్రమాదం కూడా ఉందని, అలా కూడా దొరికిపోవచ్చని' ఎన్నో సార్లు హెచ్చరించింది తల్లి. తల్లి బతికి ఉన్నంతకాలం కంటి చూపులేని పిల్లను జాగ్రత్తగా కాపాడుకుంది. తల్లి చనిపోవడంతో పిల్ల గుర్రానికి కష్టాలు మొదలయ్యాయి.
ఒకసారి పిల్ల గుర్రం మేతకు వెళుతుంటే ఒక చిలుక ''అన్నా! అటు వెళ్ళవద్దు. అక్కడొక గొయ్యి వుంది'' అని కేక పెట్టింది. వెంటనే గుర్రం తన దారిని మార్చుకుని సరైన దారి అడిగింది. ఆపద నుండి తప్పించిన చిలుకకు ధన్యవాదాలు చెప్పింది.
మరొకరోజు మైనా ఎదురై 'ఆ దారిలో సింహం కూర్చుంది. వేటకోసం వెతుకుతోంది. అటు వెళితే ప్రమాదం తప్పదు. దారి మార్చు' అని హెచ్చరించింది గుర్రాన్ని. గుర్రం జాగ్రత్త పడింది. అలా ఏదో ఒక జంతువు పిల్ల గుర్రానికి సాయపడేది.
ఆ విషయం తెలుసుకున్న దుష్ట నక్క ఒకటి ఆ గుర్రాన్ని చంపాలని ఆలోచన చేసింది.
ఒకరోజు ఉదయాన్నే పిల్ల గుర్రం దగ్గరకు వెళ్ళింది నక్క. ''నీ కష్టం చూస్తే జాలేస్తుంది. రోజూ ఎవరో ఒకరు నీకు సాయపడుతున్నారు. ఇంతవరకు నేను సాయం చెయ్యలేదు. అందుకే నీకు దారి చూపించాలని వచ్చాను'' అని ప్రేమగా మాట్లాడింది. నక్క మాటలను నమ్మింది పిల్ల గుర్రం. దానితో కలసి నడక మొదలుపెట్టింది.
కొంత దూరం వెళ్లిన నక్కకు దారిలో ఒక గొయ్యి కనబడింది. దానిని వేటగాళ్లు తవ్వారు. గుర్రాన్ని ఆ గోతిలో పడేలా చేసి అది బయటకు రాలేని పరిస్థితిలో చంపాలని అనుకుంది నక్క. గుర్రాన్ని గొయ్యి ఉన్న వైపు నడిపించింది నక్క.
ఇంకొద్ది సేపట్లో గుర్రం గోతిలో పడుతుందనగా ''ఆగు అల్లుడూ!'' అని వినిపించింది. గుర్రం నిలబడి 'ఎవరూ? ఎందుకు ఆగాలి?' అని తిరిగి అడిగింది.
'అక్కడ గొయ్యి ఉంది. ముందుకి వెళితే గోతిలో పడతావు. నేను మీ అమ్మకు నేస్తాన్ని. కోతిని' అని చెప్పింది.
''అలాగా. మరి నక్క మామ ఆ గొయ్యి సంగతి చెప్పలేదెందుకు?'' అని నక్క వైపు తల తిప్పి అడిగింది గుర్రం. 'చూసుకోలేదు అల్లుడూ. నేనేదో ఆలోచనలో ఉన్నానులే' అంది నక్క తన ప్రయత్నం బయటపడకుండా కప్పిపుచ్చుకుంటూ.
'నీతో నడుస్తూ దారి చూపిస్తాను అల్లుడూ' అంది ఆ కోతి మాటలు పొడిగిస్తూ.
'నక్క మామ ఉన్నాడు కదా. ఇంకా నువ్వెందుకు' అని గుర్రం అంటుంటే ఎలాగూ తన పథకం కోతి అడ్డంకి రావడం వలన నెరవేరదని తెలుసుకున్న నక్క 'మీరిద్దరూ కలసి వెళ్ళండి. నాకు వేరే పని ఉంది' అంటూ చల్లగా జారుకుంది.
నక్క వెళ్ళిపోయిన తరువాత కోతి 'ఆ నక్క మోసకారిది. దాన్నెలా నమ్మావు. నేను రావడం ఆలస్యం అయితే గోతిలో పడి దానికి ఆహారమయ్యేదానివి. నక్కతో నువ్వు రావడం చూసి నిన్ను రక్షించాలని మీ వెనుకే వచ్చాను. నిజానికి నా కాలుకి దెబ్బ తగిలి బాధలో ఉన్నాను. మీ అమ్మ మీదున్న గౌరవంతో ఓర్చుకుని ఇలా వచ్చాను'' అంది కోతి.
''అలాగా. ధన్యవాదాలు మామ. నాకు సాయం చేసావు కదా. నేనూ నీకొక సాయం చేస్తాను. సరేనా?' అని అడిగింది గుర్రం.
'ఏమిటో చెప్పు అల్లుడూ' అని కోతి అనగానే ''నీకు కాలు నెప్పి అన్నావు కాబట్టి నా మీద కూర్చో. నువ్వు దారి చూపిస్తుంటే నేను మోసుకుపోతాను. ఈ రోజు నుండి ఒకరికొకరం సాయం చేసుకుందాం'' అని చెప్పింది గుర్రం.
'సరేనని' చెప్పింది కోతి. వెంటనే గుర్రం మీద కూర్చుని వారు వెళ్లాల్సిన దారి చూపింది కోతి. కోతికి ఆకలైతే పండ్ల చెట్ల దగ్గర, గుర్రానికి ఆకలైతే పచ్చిక మైదానం దగ్గర ఆగేవారు. చెరువులో నీళ్లు తాగి మళ్ళీ బయల్దేరేవారు. అలా కలసి జీవించడం వాటికి అలవాటై పోయింది.
కొన్నాళ్ల తరువాత ''కాలి గాయం నయమైంది. ఇప్పుడు చెట్లెక్కగలను. నడవగలను'' అంది కోతి.
'అమ్మ పోయిన తరువాత బతుకు మీద భయం కలిగింది. నువ్వు నాతో ఉన్న తరువాత నాలోని భయం పోయింది. సంతోషంగా బతుకుతున్నాను. నువ్వు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళవద్దు. నా మీద కూర్చుని దారి చూపిస్తుంటే ఎంత దూరమైనా మోసుకువెళ్తాను. నా కాళ్లకు నీ కంటి చూపుని అందించు మామ'' అంది గుర్రం .
తన అవసరం గుర్రానికి ఉందని గుర్తించిన కోతి దాన్ని విడిచి వెళ్ళలేదు. అడవిలోని జంతువులు ఈర్ష్య పడేలా గుర్రం అవసరాలను తెలుసుకుని సాయపడింది కోతి. అవి జీవించి ఉన్నంతకాలం ఒకరికొకరు సాయం చేసుకుని ఆదర్శ జంతువులుగా పేరు పొందాయి.
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు,
9490799203