Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగయ్య లక్ష్మమ్మలది పేద కుటుంబం. వీరికి పిల్లలు లేరు. కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను, చాలా ప్రేమగా చూసుకునే వారు. తమకు పిల్లలు లేరనే లోటు తీర్చుకునే వారు. అందుకే పిల్లలు అందరూ రంగయ్య లక్ష్మమ్మలను ఇష్టపడేవాళ్ళు.
రంగయ్య రోజు కూలీ పనులకు వెళ్లేవాడు. లక్ష్మమ్మ కూడా తోపుడు బండిపై రోజు ప్లాస్టిక్ సామాన్లు ఊరూరు తిరిగే అమ్మేది. ఇలా వారి జీవనం ఆనందంగా గడుస్తున్నది. కానీ తమకు పిల్లలు లేరనే బాధ వారి అంతరంగం లోనే ఉండేది.
ఒకరోజు లక్ష్మమ్మ తోపుడు బండిపై సామాన్లు అమ్ముకొని సాయంకాలం ఇంటికి తిరిగి వస్తుండగా ఎక్కడో చెట్ల పొదల్లో ఏడుస్తున్నట్లు, అరుపులు వినిపించాయి. వెంటనే పరిగెతు ్తకుంటూ వెళ్లి చూసింది. ఎవరో పసిగుడ్డును, ఆడపిల్ల అని వదిలి వెళ్లారు. వెంటనే లక్ష్మమ్మ ఆ పసిగుడ్డును, దేవుడిచ్చిన వరంగా భావించి అక్కున చేర్చుకుని తన ఇంటికి తీసుకెళ్లింది .తన భర్తతో జరిగిన విషయం అంతా చెప్పింది .భార్యా భర్తలిద్దరూ, తమకు పిల్లలు లేరనే లోటు తీరిందని సంబర పడ్డారు. సిరి అని పేరుపెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
సిరి పెరిగి పెద్దయ్యాక, ఆ ఊర్లో ఉన్న పాఠశాలకు వెళ్లి, చదువుకోవడం ప్రారంభించింది. చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. ఉపాధ్యాయుల పట్ల ,పెద్దల పట్ల, వినయ విధేయతలు చూపిస్తూ, ఆ గ్రామంలో అందరి మన్ననలు పొందింది. అందరూ సిరి భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం సాధిస్తుందని చెప్పారు. ఇది రంగయ్య లక్ష్మమ్మలకు వాళ్లకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
సిరి పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం మార్కులు పొంది, జిల్లాలోనే ప్రథమ స్థానం పొందింది. సిరి తెలివితేటలకు అబ్బురపడిన ఆ ప్రాంత ఎమ్మెల్యే, సిరి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు ఎంత అయినా ఇస్తానని ప్రకటించాడు. సిరి బాసరలో ఉన్న త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. రేయింబవళ్లు కష్టపడి చదువు పూర్తి చేసింది.
తన తల్లిదండ్రుల పేదరికం పోగొట్టాలంటే పెద్ద ఉద్యోగం సాధించాలని, ఇంజనీర్ కావాలని కలలుగన్నది సిరి. అందుకు అనుగుణంగానే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. ఇది ఎనలేని సంతోషాన్ని కలగ జేసింది సిరికి.
అంతేకాకుండా తన లాంటి నిరుపేద విద్యార్థులందరిని చేరదీసి, వారికి ఉచితంగా విద్యను అందించింది. తన బిడ్డ గురించి అందరూ గొప్పలు చెబుతూ ఉంటే రంగయ్య లక్ష్మమ్మ లు సంతోషించారు. తన తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలనే సిరి కలలు నెరవేరాయి.
నీతి : చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదు; లక్ష్య సాధనే ముఖ్యం
- యాడవరం చంద్రకాంత్ గౌడ్