Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవయిత్రి శీర్షికలో చెప్పిన 'ఆమె' తరతరాలుగా, రకరకాలుగా తప్పిపోతూనే ఉన్నది.'ఆమె' నటించని పాత్ర లేదు. అన్ని పాత్రలన్ని ఆమె పాత్రతోనే మిళితమై సాగుతాయి. ఇక్కడ ఇంకా మనం ఇంకాస్త ముందుకెళ్ళి మాట్లాడుకుంటే 'ఆమె తప్పిపోవటం' ఇంకెన్ని సార్లో.
కవయిత్రి ఒక స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు, వద్ధాప్యానికి చేరువయ్యాక ఉన్న పరిస్థితులను ఈ 'ఆమె తప్పిపోయింది' కవితలోకి తీసుకొచ్చింది. తప్పిపోవటం అంటే ఇక్కడ కనుమరుగై పోవటం, దూరంగా వెళ్ళిపోవటం కాదు. ప్రత్యేకించి జీవితాల్లోంచి తప్పించటం.
కవయిత్రి స్త్రీ వాదినా అనే సందేహం ఈ కవితా సంపుటిని చదువుతున్నంత సేపు కలగటంలో వాస్తవం లేకపోలేదు. ప్రత్యేకించి ఎక్కువ శాతం కవితలు స్త్రీకి బాసటగా నిలిచినవే. ఈ కవితా సంపుటిలో స్త్రీ సంబంధిత కవితలను మినహాయించి మాట్లాడినప్పుడు 'ఆమె' వివిధ రకాలైన అంశాలను కవిత్వం చేయగల దన్న నమ్మ కాన్ని కలిగిస్తుంది. ''కవిత్వం'' అనే కవితతో ఈ సంపుటి ప్రారంభమవుతుంది. ఇందులోని వాక్యాలను మనం పరిశీలిస్తే నేటి సమాజంలోని దుశ్చర్యలపై కవయిత్రి స్వరమేమిటో, మార్గమేమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ కవయిత్రి తొలి కవితా సంపుటి.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ఎంతెత్తు
సెట్టునైనా బుదుగరిచ్చి
శిటికెలో సంకనెక్కటోడు
నాయినంటే ఇట్టమేమో
పేమనంత ధారలోలె ఒలకబోత్తు
లొట్లను నింపేవి
(మానాయిన; పేజీ 35)
నాన్నను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ కవితలో 'భాష' ప్రత్యేకమైనది. కవయిత్రి నాన్న పేరుతో రాసినా కూడా ఇందులో ప్రతి గౌడ్ జీవితం కళ్ళ ముందు మెదులుతుంది. చెట్టు పైకెక్కి కల్లును ఒంపుకొచ్చే తీరును కవయిత్రి ఈ వాక్యాల్లోకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంటుంది.
2. ఇక్కడ
మతాల తొడుగులుండవు
అభిమతాల గొడుగులుండవు
కులాల కంపలుండవు
కుళ్ళు కంపులుండవు
ఆచారాల అపసోపాలుండవు
(గర్భాలయం; పేజీ 66)
ఇవి గర్భంలో ఉన్న శిశువు గురించి తెలియజేస్తున్న వాక్యాలు. కులం, మతం, కుళ్ళు, ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు ఇష్టం లేకున్న ఆమోదించటం వంటివి ఈ భూమి మీదకోచ్చాకేనని గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి కల్మషం ఉండదని కవయిత్రి చెబుతుంది. ఈ అడ్డుగోడలన్నీ మనుషులేర్పర్చుకున్నవేనని వాటిని నిలువరించాల్సి ఉందన్న విషయాన్ని ఇందులో బలంగా వ్యక్తీకరిస్తుంది.
3. ఆమె నుదుట మొలిచిన
ఎర్రని సూర్యుడు
మబ్బుల్లో మాయమై
ఆమె కళ్ళల్లో చీకట్లను కురిపించాడు
(విధిరాత; పేజీ 90)
కవయిత్రి భర్తను కోల్పోయిన స్త్రీ భాధనంతా ఈ కవితలో పట్టుకొచ్చింది. ఈ వాక్యాల్లో ఆ విషయాన్ని మార్మికంగా చెప్పటంలోని అభివ్యక్తిని సాధించింది. ఎర్రని సూర్యడుని నుదుటిన పెట్టుకునే కుంకుమకు ప్రతీకగా, కళ్ళల్లో చీకట్లను కురిపించటాన్ని బాధకు ప్రతీకగా తీసుకొని ఓ మంచి దశ్య చిత్రాన్ని మన కళ్ళ ముందుంచింది.
4. ఏ మతం చెప్పింది...?
ఈ వి'తంతు' మతలబును
ఏ శాస్త్రం పలికింది...??
ఈ వింత వి'తంతు' విడ్డూరాన్ని
(వి'తంతు'; పేజీ 97)
వితంతువు పట్ల సమాజ దష్టి కోణాన్ని ప్రశ్నించే విధంగా ఈ కవిత సాగుతుంది. వితంతుల విషయంలో జరుగుతున్న అన్యాయాలను మనం కుప్పలు తెప్పలుగా చదువుకున్నాం.
సతీసహగమనమనే ఒక హేయమైన చర్యను కూడా ఖండించాము. ఇప్పుటికిప్పుడు పరిస్థితులు కొంత మారినా ఇంకా వారి పట్ల ఉండే భావనలను తొలగించుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నది. మారుతున్న పరిస్థితులతో పాటే వారు ఎదుర్కుంటున్న సమస్యలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఆ కోణంలో కవయిత్రి రాసిన ఈ వాక్యాలు బలమైనవి. ఈ వాక్యాల్లో శబ్దాన్ని ప్రయోగించిన తీరు ఆకట్టుకుంటుంది.
మొత్తంగా చూస్తే ఈ కవయిత్రికి సామాజిక దష్టికోణం ఉన్నదని, స్త్రీ జీవితం పట్ల, సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నదని ఈ కవితలను చదివితే అర్థమవుతుంది. రాబోయే సంపుటిలో ఇంకా బలంగా రాయగలదన్న భరోసాని ఈ కవితా సంపుటి మనకిస్తుంది. అందుకే అనుంటారు ప్రముఖ కవి అఫ్సర్ ''వొక బాధ్యత కల్గిన దేశీయ స్త్రీ చైతన్యం'' ఆమె కవిత్వమని.
- తండ హరీష్ గౌడ్
సెల్: 8978439551