Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటకం (రంగస్థలం) సజీవ మాధ్యమం. ఈ డిజిటల్ యుగంలో ఎన్ని మార్పులు సంభవించినా నాటకం ఉనికి, ప్రాశస్త్యం ఏనాటికీ చెక్కుచెదరదు. ఏ కారు మబ్బులు సూర్య ప్రతాపాన్ని దాయలేవు. నాటకం మానవ జీవితంలో సమాంతరంగా నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే మానవ జీవితంలో నాటకం అంతర్భాగమే. ప్రపంచ నాటక కర్త షేక్స్ఫియర్ ఏనాడో చెప్పాడు కదా.. ''ప్రపంచమంతా ఓ రంగస్థలవేదిక, ఎవరి పాత్ర వారు ధరిస్తారు. సమయం వచ్చినప్పుడు వారు ప్రవేశిస్తారు, సమయం అయిపోగానే అంతే సహజంగా నిష్క్రమిస్తారు. తరాలు మారుతాయి అంతే. మనిషి ఉన్నంత కాలమూ నాటకమూ వుంటుంది.''
ప్రస్తుత డిజిటల్ యుగంలో కదిలే బొమ్మల పట్ల ఆబాలగోపాలానికి ఆకర్షణ పెరిగింది. సెల్‌ఫోన్ దగ్గర నుండి ఐమాక్స్ థియేటర్ వరకు ఆ చలన చిత్రాలను చూస్తూనే వున్నారు. పిల్లలు సెల్ఫోన్లకు, మహిళలు టీవీ సీరియళ్ళకు, యువత సినిమాలకు ఆటలకు అతుక్కుపోతున్నారు. కరోనా అనంతరం ఆన్లైన్ విద్యావిధానం కూడా తామరతంపరగా పెరుగుతున్నది.
సెల్ఫోన్లు, టీవీలు మనిషిని చాలా చిన్నవిగా చూపిస్తాయి. సినిమాలు, ఐమాక్స్‌లు చాలా పెద్దవిగా చూపిస్తాయి. మనిషిని మనిషిగా కేవలం నాటకం మాత్రమే దగ్గరగా చూపగలదు సాంకేతికపరమైన ఏ కృత్రిమతా వుండదు. అంతా సహజంగానే వుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మరల రంగస్థల ప్రక్రియకు ఆదరణ నెమ్మదిగా పెరుగుతున్నదని చెప్పడం సత్యదూరం కాదు. యువజన, బాలల రంగస్థలాలు విస్తరిస్తున్నాయి. ఇదో శుభసూచకం. ఎందుకంటే సజీవ మాధ్యమం ప్రాధాన్యం కొట్టివేయలేనిది. ఏకకాలంలో అటు ప్రదర్శకులను, ఇటు ప్రేక్షకులను రంజింప చేస్తుంది. ఆ రసానుభూతితో పరస్పరం పునరుత్తేజితులవుతారు. రసరమ్యమైన ఆ భావోద్వేగం, మగ్గంలో నాడి పోగులా హృదయాలను అల్లుకుంటూ పోతుంది.
1962లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రారంభమైంది. ఆ ఏడు పారిస్‌లో జాతుల రంగస్థలం సీజన్ ప్రారంభమైన రోజు మార్చి 27ను ఇందుకు సంకేతంగా భావించారు.
విశ్వవ్యాప్తంగా విభిన్న భాషల, రూపాలలోని రంగస్థలాన్ని ప్రేమించడం, గౌరవించడం, ప్రోత్సహించడం, రంగస్థల ప్రాముఖ్యతను తెలియపరచడం, ముఖ్యంగా ప్రభుత్వాలు, రాజకీయ నేతలు గుర్తెరిగేలా చేయడం, రంగస్థలం ద్వారా పొందే అనుపమాన చైతన్యాన్ని, మానసికోల్లాసాన్ని పంచుకోవడం, ప్రపంచ రంగస్థల దినోత్సవ లక్ష్యంగా, ఆనవాయితీగా వస్తున్నది.
అదేరోజు మార్చి 27న ప్రపంచంలో ఓ రంగస్థల ప్రముఖుని సందేశం కూడా వస్తుంది. ఈ ఏడు ఈజిప్షియన్ రంగస్థల టి.వి. నటీమణి సమీహ అయూబ్ సందేశం ఇచ్చారు.
సమకాలీన ప్రపంచంలో ఓ రంగస్థల కార్యకర్త/ కళాకారుడు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని తమ అనుభవ ప్రాతిపదికగా ఎరుక పరిచే రీతిలో ఆ సందేశం వుంటుంది.
'సత్యం - సౌందర్యం - రసవత్ సమ్మేళనమే కళ' అని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపాడు. 'ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనంద విషాదాలు మరొకరిలో కలిగించే ప్రయత్నమే కళ' అని టాల్‌స్టారు అంటాడు. సుఖదు:ఖాలు కేవలం వ్యక్తిగతం కావని, వ్యక్తి నుండి సమాజానికి, సమాజం నుండి వ్యక్తికి ప్రసారమయ్యే విద్యుత్ ప్రవాహంగా మనం భావించవచ్చు.
అందుకే కళ ప్రజలది. ప్రజల నుండి ప్రజలకు అన్నాడు లెనిన్ మహాశయుడు. రంగస్థల ప్రక్రియల్లో శిఖరాయమానమైన నాటక కళ మానవ జీవితంలా నవరస భరితమే కాదు. సర్వకళల సమాహారం కూడా.
సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలతో పాటు భూత, భవిష్యత్ విషయాలను సైతం నాటకం స్వేచ్ఛగా చర్చించగలదు. మనిషికి కనిపించని విషయాలను చూపించగలదు. వినిపించని విషయాలను వినిపించగలదు. నాటకం శ్రవ్య - దృశ్య కళారూపం. పండిత పామరులకు, ఆబాల గోపాలానికి ఏకకాలంలో, ఏక పత్ర సమారాధన చేయగలదు. అందుకే 'కావ్యేషు నాటకం రమ్యం' అన్నాడు కళాదాసు మహాకవి
అంతకుముందే భరతముని నాట్యశాస్త్రంలో ఈ విధంగా ఉల్లేఖించాడు.... ''నానా భావోప సంపన్నం/ నానావస్థాంత రాత్మకం/ లో కానువృత్తాను కరణం నాటకం/'' అన్నాడు. నాటకంలో కనిపించని జ్ఞానం గాని, శిల్పం కాని, విద్యగాని, కళగాని, యోగం గాని, కర్మగాని ఉండనే వుండవని తేటపరిచాడు.
మానవ జీవనంలోని మాలిన్యాన్ని ప్రక్షాళన గావించేందుకే (కెథోరిసెస్) గ్రీకు నాటకం ఉద్భవించినట్టు చరిత్ర చెబుతున్నది. వేల సంవత్సరాలుగా నాటకం అలా మానవ వికాసంలో అంతర్భాగం అవుతూనే వున్నది.
నాటక సంస్కృతి నదీ ప్రవాహం వంటిది. ప్రాంతం ప్రాంతానికి, కాలం కాలానికి మారుతూనే వుంటుంది. ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నెన్నో జాతుల సమూహాల్లో, ఎన్నెన్నో ప్రయోగరీతులతో రంగస్థలం విలసిల్లుతూనే వుంటుంది. తెలుగువారికి పద్యనాటకం, బెంగాలి వారికి జాతర, మహారాష్ట్ర వారికి తమాషా, కర్ణాటక వారికి యక్షగానం, కేరళ వారికి కథాకళి వంటి జానపద నాటక ప్రక్రియలు నేటికీ రంజింపచేస్తూనే వున్నాయి.
జానపద, పౌరాణిక నాటకాల పరిథి దాటి 20వ శతాబ్దంలో నాటకం ఎల్లెడలా సాంఘిక నాటకంగా పురివిప్పింది. ప్రగతిశీల సంస్కరణోద్యమాలతో జతకట్టింది. వలసపాలనా విముక్తి స్వాతంత్య్ర పోరాటాల్లో కదం తొక్కింది. 'అలజడి మా ఊపిరి - ఆందోళన మా సిద్ధాంతం - తిరుగుబాటు మా వేదాంతం' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చివరకు నాటకం తనకు తానుగానే ఓ ధిక్కార స్వరమైంది.
ఆధిపత్యమూ, అణచివేత, దోపిడీ ఏ రూపంలో వున్నా మానవ సమాజం ప్రతిఘటిస్తూనే వుంటుంది. వర్గ సంఘర్షణ అనివార్యం. ఆ ఘర్షణలో నాటకం భాగస్వామ్యం కాక తప్పదు. ఫ్రెంచి విప్లవం ద్వారా మానవ జాతికి లభించిన స్వేచ్ఛా, సమానత్వ, సౌభ్రాతృత్వాలను విడనాడుకోవడానికి నేడు ఎవరూ సిద్ధంగా లేరు. ఆధునిక ప్రజాస్వామ్య విధానమే ఓ జీవన శైలిగా మారిన సందర్భంలో మనం వున్నాం. ఈ యధార్థాన్ని గ్రహించిన నాటక కర్తల దృక్కోణం వేరుగా వుంటుంది.
సమాజం ఎట్లున్నది? అని విశ్లేషించడానికో, గత వైభవాలను నెమరు వేసుకోవడానికో వారు పరిమితం గారు. సమాజం ఎలా వుంటే బావుంటుందో స్వప్నించి, ఆ మార్పు వైపు శాస్త్రీయంగా, గతి తర్కంగా నాటకాన్ని నడిపిస్తారు. ఆ లక్ష్యంతో ప్రపంచం వెంట నాటక స్రష్టలు పరుగెడుతారు. ఆ తదుపరి నాటకం వెనుక ప్రపంచం ప్రయాణిస్తుంది. దీన్నే నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తే జీవితం నాటకాన్ని ప్రతిస్పందిస్తుంది అని చెప్పుకుంటాం.
కొంతమంది నాటక కళాకారులు రాజకీయాలను అస్పృశ్యంగా భావిస్తారు. రాజకీయ పరిణామాలు, విధానాల ఫలితంగానే మానవ జీవితం ప్రభావితం అవుతుందన్న సత్యాన్ని తెలుసుకోరు. కరుడుగట్టిన స్వార్థం, పెత్తందారీ స్వభావంతో కొందరు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తారు. మరికొందరు నిష్కళంక దేశభక్తితో, ప్రాణత్యాగాలతో, నిస్వార్థ ప్రజాసేవతో రాజకీయాలను పునీతం చేస్తారు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అన్న నినాదం ఇచ్చిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ ఎప్పటికీ ఆదర్శప్రాయుడే, అజరామరుడే. రాజకీయ కార్యాచరణతోనే భగత్‌కు ఇది సాధ్యమైంది.
జీవితం అంటే నేడు సమానత్వం, ఆత్మ గౌరవం, హక్కుల సాధన. ఈ మానవీయ కోణంతోనే కళాసాహిత్యాలు విశ్వమంతా పరిఢవిల్లుతున్నాయి. విశ్వజనీన సత్యాలను చాటుతున్నాయి.
ఒక మనిషి, ఒక సమూహం, ఒక తెగ, జాతి, ఒక దేశం అంతరంగం తెలుసుకోవడానికి రంగస్థలం అద్వితీయ మాధ్యమమైంది. మనిషి తనకు అనుకూలంగా సమాజాన్ని, వాతావరణాన్ని, ప్రపంచాన్ని మార్చుకోవడానికి రంగస్థలమే ఆయుధం. మనిషిలోని సహజ గుణాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, శాంతి, స్వాభిమానం మొదలైన వాటిని సృశించి తట్టిలేపి మేల్కొలిపేలా చేయడంలో రంగస్థలమే ముందున్నది. సానుభూతిని మించిన సహానుభూతిని కలిగించేది రంగస్థలం ఒక్కటే. ప్రేక్షకులను యంత్రాలుగానో, జంతువులుగానో దిగజార్చే కళలు దోపిడీ సమాజంలో ఎప్పుడూ వుండనే వుంటాయి. అందుకు భిన్నంగా మనిషిని మనిషిగా నిలబెట్టడంలో ప్రజాస్వామ్య కళలు నిత్యం పురుడు పోసుకుంటాయి. ఆ మార్గంలో ప్రపంచ రంగస్థలం తాను నిత్యం మారుతూ ప్రపంచాన్ని మానవీయంగా మార్చేందుకు ఘర్షణ పడుతూనే వుంటుంది.
సమీహ అయూబ్ సందేశం
మనం నిత్యం అనేక ఒత్తిళ్ళకు గురౌతున్నాం. మనం అంటే రంగస్థల కళాకారులు అనేకాదు, అందరం. సర్వమానవాళి. యుద్ధాలు, కరోనా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలతో భౌతిక ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నది. మానసిక ప్రపంచం కూడా కకావికలమవుతున్నది.
ప్రపంచం అంతా మంచు ముసుగులో కప్పబడిన చుక్కాని లేని నావల్లా గోచరిస్తున్నది. అయినా వాటి యానాన్ని అవి కొనసాగిస్తూనే వున్నాయి. ఏనాటికైనా సురక్షిత తీర ప్రాంతానికి చేరుకోగలమనే ఆశే వాటిని నడిపిస్తుంది.
ప్రపంచం గతం కంటే పరస్పర ఆధార సంబంధాలు కలిగి వున్నది. అదే సందర్భంలో ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ వైరుధ్యాన్ని గ్రహించాలి. ఈ ప్రభావం మనపై కూడా వుంటుంది. సమాచార రంగంలో వస్తున్న సాంకేతిక విప్లవం సరిహద్దులను చెరిపేస్తున్నది. అయితే వీటిలో సత్యాల కన్నా అసత్యాల వెల్లువే ఎక్కువ. తత్ఫలితంగా మానవత్వపు సారం దెబ్బతింటున్నది.
రంగస్థల మౌలిక లక్ష్యం మానవత్వపు సారాన్ని మనిషిలో పాదుకొల్పడం. నట సిద్దాంత కర్త స్టానెస్లవిస్కి మాటలు గుర్తున్నాయి కదా...
నీ బురద కాళ్ళతో రంగస్థలంపైకి ప్రవేశించకు. నీ మురికి భావాలను, నీ చిన్ని చిన్ని సమస్యలను బయటే విడిచిపెట్టిరా. లేకుంటే అది నీ రంగస్థల కర్తవ్యాన్ని, అంతిమంగా నీ జీవితాన్ని చెడగొడుతుంది.
ప్రతి మనిషికి ఒకే జీవితం వుంటుంది. కాని రంగస్థల కళాకారుని పరిస్థితి వేరు. అనేక జీవితాలను ప్రతిబింబించే సామర్థ్యం వారిది. దానిని ఎవరూ చేజేతులారా చెడగొట్టుకోకూడదు.
కవులు, రచయితలు, నటులు, దర్శకులు, సంగీత వాద్యకారులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరూ నూతన మానవ జీవితాన్ని సృష్టించి ఆవిష్కరించడంలో సిద్దహస్తులే. ఆ నూతన జీవితం హృదయాలను ఉప్పొంగేలా చేస్తుంది. ప్రేక్షకులకు గొప్ప ధైర్యాన్ని, చైతన్యాన్ని ఇస్తుంది. ఆ నూతన జీవన సృష్టే రంగస్థల మనుగడకు ప్రాణం.
ఆ నూతన జీవితమే కారుచీకట్లో కాంతి రేఖ కావాలి. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయాలి.
- కె.శాంతారావు, 9959745723