Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలు, పురుషులను కలిపే మానవజాతి అంటుందీ ప్రపంచం. కానీ ఈ మానవజాతిలో ''స్త్రీలు'' అనబడే వారికి ఎప్పుడూ పురుషులతో సమానమైన హక్కులు లేకపోవడం ఓ కాదనలేని కఠోర సత్యం. పరిణామ క్రమంలో మనం వ్యవసాయ నాగరికత నుంచి పారిశ్రామిక వ్యవస్థలోకి వచ్చాం. అక్కడి నుంచి నేటి శాస్ల్ర సాంకేతిక యుగంలోకి ప్రవేశించాం. అయినప్పటికీ ఈ పరిణామ అభ్యుదయ సూచికలేవీ స్త్రీ పురుష అసమానతలను తొలగించకపోవడం విషాదం. ప్రపంచం సంగతెలా ఉన్నా ఈ దేశం మాత్రం నేటికీ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం పొందలేక అసమానతల్లో కునారిల్లుతుండగా 'అత్యంత ఆధునికంగా' తిరోగమనం వైపుకే 'పురోగమిస్తోంది'. మానవ హక్కులూ, ఆర్థిక, సామాజిక అసమానతలూ, ఆకలి సూచీల్లోనే కాదు... స్త్రీ, పురుష సమానత్వంలో అంతకు మించిన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. దీనిని ''వరల్డ్ ఎకానిమిక్ ఫోరం (ప్రపంచ ఆర్థి వేదిక)'' 2020 నివేదిక మరోసారి నిరూపిస్తోంది. ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్య ప్రమాణాలూ, రాజకీయ ప్రాధాన్యాలూ ప్రధాన ప్రాతిపదికగా 156 దేశాల గతిరీతులను పరిశీలించి, విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో భారతదేశానిది 140వ స్థానం. నిరుటితో పోలిస్తే 28స్థానాలు దిగజారింది.
దక్షిణాసియాలో కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మాత్రమే మనకంటే వెనుకబడి ఉన్నాయి. పొరుగు దేశాలయిన బంగ్లాదేశ్(65), నేపాల్(106), శ్రీలంక(116), భూటాన్(130)లు కూడా మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో ఈ అంతరం దేశంలో మరీ దారుణంగా ఉంది. దేశంలోని స్త్రీలందరి ఆదాయం కేవలం 20శాతం మంది పురుషుల ఆదాయంతో సమానం కావడం విచారకరం. అంటే పురుషుల ఆదాయంలో కేవలం అయిదోవంతు ఆదాయం మాత్రమే మహిళలు పొందగలుగుతున్నారు. దీనినిబట్టి మహిళలపై దోపిడీ, వివక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో అట్టడుగున ఉన్న మొదటి పది దేశాల్లో భారత్ ఒకటని నివేదిక గుర్తు చేస్తోంది. కార్మిక భాగస్వామ్య రేటు 24.8శాతం నుంచి 22.3శాతానికి క్షీణించింది. సాంకేతికరంగంలో స్త్రీల పాత్ర 29.2శాతానికి పడిపోయింది. విద్యా ప్రమాణాల్లోనూ ఈ అంతరాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. పురుషుల్లో నిరక్షరాస్యత 17.6శాతం ఉండగా మహిళల్లో ఇది 34.2శాతానికి మించి ఉంది. వైద్య, ఆరోగ్య రంగాలలోనైతే మనది చిట్టచివరి నుంచి అయిదో స్థానం. ఉన్నంతలో కాస్త ఊరట కలిగించేది బాలికా విద్యలో పురోగతి మాత్రమే. ఇక రాజకీయ ప్రాతినిద్యానికి సంబంధించి చెప్పనక్కర్లేదు. 2019లో 23.1శాతంగా ఉన్న మహిళా మంత్రుల శాతం 2020కి 9.1శాతానికి పడిపోయింది.
భారత్లో లింగభేదం 62.5శాతం నమోదైంది. దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు కుటుంబ వేధింపులకు గురవుతున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కడుపులోనే చంపుతున్న అమానుషత్వం భారతోలోనే తీవ్రంగా ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. ఆడ, మగ పుట్టుకలు పకృతి సహజాలనీ, ఆ రెండూ సహజంగా జరిగితేనే తప్ప ఈ సృష్టి క్రమం సజావుగా సాగదనీ తెలిసి కూడా ఈ అమానుషం కొనసాగడం నాగరికతకే సిగ్గుచేటు. నూటికి 93.7శాతం మహిళలు రకరకాల వేదింపులకు గురవుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారన్నది ఎంత నిజమో, అన్నింటా అంతకు మించిన అసమానతలకు గురవుతున్నారన్నది అంతకంటే నిజమంటోంది ఈ నివేదిక.
స్త్రీ పురుషుల మధ్య ఇంత అంతరముంటే ఏ దేశమైనా ఎలా పురోగమిస్తుంది? స్నేహితుల్లా మెలగాల్సిన భార్యాభర్తలు బానిస, యజమానుల్లా గడపడం ఎలా సహేతుకమవుతుంది? అత్యంత ఆధునిక సమాజమని గొప్పలుపోతున్న కాలంలో కూడా వరకట్న చావులూ, లైంగిక దాడులూ కొనసాగడం దేనికి నిదర్శనం? ప్రేమను తిరస్కరించిందనో, పెళ్లికి నిరాకరించిందనో ఓ ఆడపిల్ల జీవించే హక్కును కాలరాయడం ఎంత అమానుషం..! కుటుంబాల్లో ప్రజాస్వామిక విలువలు లోపించినా, స్త్రీలు సామాజిక అణచివేతకు గురవుతున్నా, రాజకీయంగా స్త్రీలకు సరైన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కరువవుతున్నా, స్త్రీలకు ఆర్థిక స్వావలంబన లేకపోయినా ఆ సమాజం అభివృద్ధి చెందిన, చెందుతున్న సమాజం ఎంత మాత్రమూ కాదు. ఏ దేశ అభ్యున్నతికైనా స్త్రీల జీవనప్రమాణాలే కొలమానాలు. కానీ దేశంలో మహిళల జీవన ప్రమాణాలకు, ప్రభుత్వ పెద్దల ప్రచార్భాటాలకు మధ్యనున్న ఆగాథాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసింది. అయినా స్త్రీలను సైద్ధాంతికంగానే రెండవ శ్రేణికి చెందిన పౌరులుగా భావించే మనువాదుల పాలనలో ఈ అసమానతల తొలగింపు సాధ్యమా? వీరి కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, ఈ అసమానతలపై పోరాడటమొక్కటే సమాజాన్ని ముందుకు తీసుకుపోగలదు.
ఇది స్త్రీ పురుషుల సమిష్టి బాధ్యత. స్త్రీల అభ్యున్నతి అంటే అది వారికొక్కరికే చెందింది కాదు. పురుషుల అభ్యున్నతి కూడా స్త్రీల అభ్యున్నతితో పెనవేసుకొని ఉన్నదన్న సత్యాన్ని గుర్తించాలి. స్త్రీ విమోచన అంటే పురుషద్వేషమనీ, పురుషులు లేని సమాజమనీ కాదు కదా అర్థం. ముందే చెప్పుకున్నట్టు మానవజాతి అంటేనే స్త్రీలూ పురుషులూ. అటువంటప్పుడు అందులో సగంమంది అభివృద్ధి చెందకుండా ఆ దేశం ఎలా అభివృద్ధి చెందిన దేశమవుతుంది?