Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ ఆరున పోలింగ్ జరుగనుండగా బెంగాల్లో మే 29న జరిగే ఎనిమిదవ విడత పోలింగ్‌తో ఈ ఎన్నికలు ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్న ఈ ఎన్నికలు అనేక కారణాల చేత అత్యంత కీలకమైనవి. ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల ప్రత్యేకతల రిత్యా చూసినా, జాతీయ ప్రాధాన్యాల రిత్యా చూసినా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోమ్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదిచ్చేరిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు 19కోట్ల మంది ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి మెజారిటీతో రెండవసారి అధికారంలోకొచ్చిన తరువాత మోడీ ప్రభుత్వం అమితవేగంతో ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడం, దేశంలో ఏకచ్ఛత్రాధిపత్యానికి బీజేపీ ఉవ్వీళ్లూరుతున్న ఎన్నికలు కావడం, రాబోయే 2023 ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటం ఈ ఎన్నికల ప్రత్యేకత.
ఇప్పటికే పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను చేజిక్కించుకున్న బీజేపీ, ఇప్పుడు వామపక్షాలు, ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో పాగా వేయగలిగితే దేశంలో తమకు తిరుగే ఉండదని భావిస్తోంది. అందుకనుగుణంగానే సకలశక్తులనూ ఒడ్డుతోంది. వ్యూహాలకు పదునుపెడుతోంది. అయితే ఇవేవీ ప్రజాస్వామ్యయుతమైనవీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించేవీ కావని ఈ ప్రచార పర్వం తేటతెల్లం చేసింది. ప్రజాబలంతో కాకుండా ఇతర పార్టీల నుంచి అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా, కేంద్ర దార్యాప్తు సంస్థలను ప్రయోగించి ఎదుటి పక్షంలోని బలమైన నేతలను లొంగదీసుకోవడం ద్వారా, మతాల మధ్య, కులాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి మెజారీటీ ఓట్లను కొల్లగొట్టడం ద్వారా మాత్రమే ఎన్నికలను గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని తేలిపోయింది. ఎప్పుడూ ఎత్తులూ జిత్తులూ కుట్రలూ కుతంత్రాలూ తప్ప ఎక్కడా విధానాల ప్రాతిపదికన ప్రజల నిజమైన తీర్పుకు అవకావమిచ్చే ఉద్దేశ్యమే బీజేపీకి లేదని ఈ సందర్భమూ తేల్చి చెబుతోంది.
అధికారాన్ని ఉపయోగపెట్టుకుని నయానో భాయానో ప్రత్యర్థిపార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం, ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొనుక్కుని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం, కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఏ భాష వాడాలో, ఏ భావోద్వేగాలను రెచ్చగొట్టాలో నిర్ణయించడం, విద్వేషాల్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు పెట్టి ఎలా లబ్ది పొందాలో వ్యూహాలు రచించడం, వాటిని పకడ్బందీగా అమలుపరుచటంలో తప్ప నిజాయితీగా ప్రజల హృదయాలను గెలిచే సామర్థ్యాలు కమలనాథులకు లేవని ఈ ప్రచార తీరు మరోసారి నిరూపిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రయోజన అంశాలు అసలు చర్చకే రాకుండా చేయడం వారి ప్రత్యేకతగా నిలుస్తోంది. అందుకే బీజేపీలో ఈ పరిణామాల్ని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన ఆత్మకథలో ఏవగించుకున్నారు. అధికారం కోసం ప్రజాప్రతినిధుల్ని సంతలో పశువుల్లా కొనుగోలు చేయడం, గోరక్షణ, లవ్‌జిహాద్ పేరుతో అల్లర్లు, అకృత్యాలను అవలంబించడం చూసి సిగ్గుపడుతున్నాని చెప్పారు. ఇంకా బీజేపీనుద్దేశించి ''నీతి నిజాయితీలేని మోసపూరిత రాజకీయాలతో ప్రభుత్వాలను మార్చవచ్చునేమోగానీ సమాజాన్ని మార్చలేం. స్వామి వివేకానందను పూజిస్తున్నామంటే చాలదు, ఆయన మార్గాన్ని అనుసరించాలి'' అంటూ కుండబద్దలు కొట్టారాయన. అవి ఎంతటి అక్షర సత్యాలో కండ్లముందరి బీజేపీ ఎన్నికల వ్యూహాలు రుజువుచేస్తున్నాయి.
ఎంతసేపటికీ సంచలనాత్మక ప్రకటనలు, సవాళ్లూ ప్రతిసవాళ్లు, వ్యక్తిగత విమర్శలూ ప్రతి విమర్శలూ తప్ప విధానాలు అప్రస్తుతమైపోయాయి. పెరుగుతున్న అసమానతలూ, నిరుద్యోగం, చుక్కలనంటుతున్న నిత్వావసరాలూ అసలు ప్రజాసమస్యలన్నవి చర్చకే రాకుండాపోవడం కాకతాళీయం కాదు. ఓ వ్యూహంలో భాగం. నిజానికి గడిచిన ఏడేండ్లుగా బీజేపీ ప్రజలకు హానిచేసే విధానాలను రూపొందించి అమలు చేస్తోంది. అయినా ఎన్నికలను గెలుస్తోందంటే ఇలాంటి వ్యూహాలతో ప్రజలను ఏమార్చడం ద్వారానే. నేడు కరోనా గడ్డుకాలంలోనూ కార్మిక, రైతు వ్యతిరేకమైన ప్రమాదకర చట్టాలను చేసింది. స్వావలంబనకు ప్రతిబింబంగా గత ఏడు దశాబ్దాలుగా నిర్మించుకున్న సమస్త ప్రభుత్వరంగాన్నీ తన కార్పొరేటు మిత్రులకు కారుచౌకగా కట్టాబెట్టాలని చూస్తోంది. ప్రజాస్వామ్య లౌకిక విలువలను సమాధి చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధమైన పాలన సాగిస్తోంది. ఈ సామ్రాజ్యవాద ఆర్ధిక విధానాల పట్ల వామపక్షాలకు మినహా మరే పార్టీకి విధానపరమైన ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. కానీ ప్రజాజీవితం అత్యంత సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీ పప్పులేవీ ఉడికేటట్టు లేవు. పలు విశ్లేషణలూ, సర్వేలు కూడా అదే చెపుతున్నాయి. కేరళ, తమిళనాడుల్లో ఆ పార్టీకి అవకాశాలే లేవు. అసోంలో తన సంకీర్ణాన్ని తిరిగి నిలబెట్టుకోవటం, బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం మీదే బీజేపీ కేంద్రీకరణ ఉన్నా, అందుకూ అవకాశాలు పరిమితమే. రేపు ఈ ఎన్నికల ఫలితాలు ఎలావున్నా, నేటి బీజేపీ విధానాలు ప్రజలను పీడించడమే కాదు, దేశ ఫెడరల్ స్ఫూర్తినే తివ్రమైన వత్తిడికి గురిచేస్తున్న వేళ ఈ అయిదు రాష్ట్రాల తీర్పు అత్యంత కీలకం అనడంలో మాత్రం సందేహం లేదు.