Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మరోసారి కోరలు చాస్తున్నది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ ఈ వైరస్ ప్రమాదఘంటికలను మోగిస్తున్నది. దేశంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంటే, రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ వణికిపోతున్నది. కోవిడ్ టెస్ట్‌ల కోసం సర్కారీ ఆస్పత్రులు, ప్రయివేటు కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. యూకే స్ట్రెయిన్ సైతం ప్రజల భయానికి ఒక కారణమే. ఈనేపథ్యంలో మెట్రోనగరాల నుంచి వలసకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతరులు లక్షలాదిగా తిరిగి సొంత ఊళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. మంబయి నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు అప్పుడే మూటాముల్లే సర్దుకుని వచ్చేస్తున్నారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లో విస్తరణ రేటు ఒక శాతమైతే, ప్రస్తుతమది ఆరు నుంచి పది రెట్లు. తొలిదశలో తీవ్రస్థాయికి వెళ్లడానికి నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడితే, ఇప్పుడది కేవలం మూడువారాలే కావడం ప్రస్తుత తీవ్రతకు సాక్ష్యం. కాగా ఈ మహమ్మారికి బలవుతున్నది ఎక్కువగా యువతే కావడం ఆందోళనకరం. వైరస్ రూపాంతరం చెందటమే ఇందుకు కారణమని వైద్యనిపుణుల అంచనా. ఎప్పటిలాగే బీజేపీ ప్రభుత్వం కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలంటూ రాష్ట్రాలకు ఉచిత సలహా పడేసి చేతులు దులుపేసుకుంది. మళ్లీ పంజా విసురుతున్న విపత్తును ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక వనరుల సంగతి మాత్రం మాట్లాడటం లేదు.
కార్యాలయాలు, ఫంక్షన్లు, వారాంతపు పార్టీలు వైరస్ వ్యాప్తికి కారణమని వైద్యఆరోగ్యశాఖ భావిస్తున్నది. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వస్తుందో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. కాగా విద్యార్థులను మార్కులేసి ప్రమోట్ చేశారు. కానీ, ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఒకటే నెల. కొన్ని మాసాలు ఆన్లైన్ చదువు సాగింది. త్వరలోనే పది, ఇంటర్, వృత్తివిద్యకు సంబంధించిన సాధారణ పరీక్షలు, ఎంట్రెన్స్ టెస్ట్‌లు జరగనున్నాయి. పరీక్షలు జరుగుతాయా? లేదా? ప్రత్యామ్నాయమేంటి? అనే సందిగ్దతలో సర్కారుంది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు. మానవ విలువల పరీక్షను అసైన్మెంట్గా మార్చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందనే ఆవేదన వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నది. ఇంకోవైపు ఉపాధి సమస్య. గత కరోనా లాక్డౌన్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకమైంది. ఈ సంగతిని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థే(ఐఎంఎఫ్) తేల్చింది. కేంద్ర సర్వీసుల్లోని మాజీ ఐఏఎస్‌లు సైతం 'మన లాక్డౌన్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైంది. కరోనాకు సంబంధించి అన్ని బాధ్యతలను రాష్ట్రాలపైనే బీజేపీ ప్రభుత్వం నేట్టేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సరైన సాయమందలేదు' అని ది ఇండియా పోరం-ఓరియంట్ బ్లాక్ స్వాన్ అనే సంస్థ ప్రచురించిన ఒక సంకలనంలో పేర్కొన్నారు. ప్రజారోగాన్ని దీర్ఘకాలికంగా నిర్లక్ష్యం చేశారన్నారు. 'కేరళ ప్రభుత్వం మాత్రమే ప్రజారోగ్యం, సంక్షేమ రంగాలపై పెట్టిన శ్రద్దతో కోవిడ్ నష్టాన్ని బాగా తగ్గించగలిగింది' అని అభిప్రాయపడ్డారు.
సెకండ్ వేవ్‌తో ఇంకోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం ప్రజలను మానసికంగా వేధిస్తున్నది. 'లాక్డౌన్ ఉండదని స్వయానా సీఎం కేసీఆర్' చెప్పినా కేసులు పెరుగుతున్నాకొద్దీ ఆ పనిచేయక తప్పకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. గత ఆదివారం 1321, సోమవారం1498 కేసులు రాగా, 12 మంది చనిపోయారు. సర్కారీ చికిత్సా విధానం, పరీక్షల పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పదిశాతం కూడా మించడం లేదంది. రాపిడ్ టెస్ట్‌లే ఎక్కువగా చేస్తున్నారంటూ మొట్టికాయలేసింది. పాఠశాలలు, కాలేజీలను మూసేసిన సర్కారు, బార్లు, క్లబ్బులు, పబ్బులపై ఆంక్షలు పెట్టకపోవడం ఏంటనీ ప్రశ్నించింది. నిబంధనలు పాటించని వారిపై పెట్టిన కేసులు, జరిమానాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
పొరుగున మహారాష్ట్ర విలవిల్లాడుతున్నది. 55శాతం కేసులతోపాటు 50శాతం మరణాలూ అక్కడివే. ఢిల్లీ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీగా పాజిటివ్‌లు వస్తున్నాయి. రాష్ట్రంలోనూ రోజువారి హెల్త్‌బులెటిన్ వివరాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉందనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ సేవలందించే గాంధీ ఆస్పత్రిలో ఈనెల ఒకటో తేదీన 17మంది చనిపోతే, కేవలం నలుగురే మృతిచెందినట్టు నివేదికలో పేర్కొనడం అనుమానాలకు తావిస్తున్నది. లాక్డౌన్లో బీజేపీ తెచ్చిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ బడా కార్పొరేట్లకే ఉపయోగపడింది. కాగా గత లాక్డౌన్ నుంచి గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నాలేవీ ఈ రెండు ప్రభుత్వాల్లో లేవు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజారోగ్యానికి ప్రతియేటా నిధులు పెంచడం, జాతీయ ఉపాధి హామీ చట్టం పనులను పట్టణాలకూ విస్తరించడం చేస్తేనే ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారనే సంగతిని ఈ ప్రభుత్వాలు గుర్తెరగాలి.