Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ జనతా పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం 'ఆడలేక మద్దెల..ఓడు' అన్నట్టు ఉంది. ఏడు సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తరువాత ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి రోజున చెప్పుకోవడానికి ఎన్ని విషయాలు ఉంటాయి? సాధించిన విజయాలు, పొందిన కితాబులు, వర్తమానపు నడత, భవిష్యత్తు లక్ష్యాలు .. ఇలా ఎన్నో! కానీ, మోడీ ప్రసంగంలో ఇవేమి లేవు ఎందుకు? 'పండగ రోజున కూడా...' అన్నట్టు ప్రతిపక్షాలపై అవాకులు చవాకులకే పరిమితం కావడం... పరనిందతోనే సరిపుచ్చడం, అట్టహాసంగా జరుపుకోవాల్సిన వ్యవస్థాపక దినోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్‌తో సరిపుచ్చడం దేనికి సంకేతం? ఇలా నిరాడంబరంగా జరుపుకోవడం బీజేపీ సాంప్రదాయమేమి కాదు. పోనీ కరోనా వ్యాప్తితో జాగ్త్రతలు పాటించారను కుందామంటే, వేలాదిమందితో నిర్వహిస్తున్న ఎన్నికల సభలు షరా మామూలుగానే జరుగుతున్నాయి. మరి, ఇన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తరువాత ఇంత సాదాసీదాగా వ్యవస్థాపక దినోత్సవం ఎందుకు గడిచిపోయింది?
నిజానికి ఏడేండ్ల పాలనలో మోడీ సర్కారు సాధించింది పెద్ద గుండుసున్నా! చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విజయమూ లేదు. వేళ్ల మీద లెక్కించగలిగిన కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజానీకానికి మోడీ పాలన ఒరగబెట్టిందేమీ లేదు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్.. ఇలా పేరేదైనా పేదలను కొట్టి పెద్దలకు పంచడమే ఈ కాలమంతా సాగింది! బ్లాక్‌మనీని దేశానికి తీసుకురావడం, అవినీతిని రూపుమాపడం, పేదల బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేయడం, ఉద్యోగ కల్పన ఇలా అమలుకాని వాగ్దానాల జాబితా బారెడు! నిరుద్యోగం, ఆకలి, అభద్రత వంటి అంశాల్లో ర్యాంకు పెరిగినప్పటికీ అవి మైనస్ మార్కులే! ఇక నోట్లరద్దు, ఎన్ఆర్సీ వంటి మోడీ మార్కు చర్యలు దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ కారణంగా పడ్డ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వలస కార్మికుల వేదనాభరిత పాదయాత్రలు, అవి చెప్పిన కన్నీటి కథలను జనం ఎలా మరచిపోగలరు? చెప్పుకోవడానికి ఇవేమి ఘనతలు కావుకదా! ఇక మిగిలిందేమిటి? దేశవ్యాప్తంగా మేధావులు, రచయితలు, కళాకారులు వంటి ప్రజాతంత్ర శక్తులపె జరిగిన దాడుల నిరంకుశ పోకడలు. గో గూండాలు సృష్టించిన బీభత్సం. విశ్వవిద్యాలయాలను మతోన్మాదానికి వేదికలుగా మార్చడం. విజ్ఞాన శాస్త్రంపై దాడి చేసి అభూతకల్పనలు, కట్టుకథలతో పాఠ్యాంశాలను నింపడం! మహిళలు, మైనార్టీలు, అణగారిన వర్గాల గొంతును అమానుషంగా నులిమివేయడం..! వీటి గురించి ఏమని చెప్పుకోగలదీ ప్రభుత్వం? అందుకే..మోడీ వ్యవస్థాపక దినోత్సవం రోజునా ప్రతిపక్షలపై విషం గక్కారు. దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రను ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో చెప్పకుండా నూతన వ్యవసాయ చట్టాలను, సీఏఏను, కార్మిక చట్టాలను ఆయన ప్రస్తావించారు. వాటి వలన రైతులకు, కార్మికులకు, సామాన్య పౌరులకు కలిగిన ప్రయోజనం ఏమిటో చెప్పగలిగారా? లేదు. నిజానికి ఒకపక్క మోడీ తన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం కొనసాగిస్తున్నప్పుడే మరోపక్క యూపీ, రాజస్థాన్, హర్యానాల్లో ఆ పార్టీ ఎంపీలను రైతులు ఛీత్కరించి మళ్లీ తమ ఊళ్ల వైపు రావొద్దని చెప్పారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? కార్మికుల మధ్యకు వెళ్లినా అదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. విశాఖ ఉక్కు ఉద్యమకారుల దగ్గరకు వెళ్లి కార్మికులకు సమాధానం చెప్పుకోలేక అప్పటి నుంచీ మొహం చాటేసిన బీజేపీ నేతల ప్రహసనం మనందరికీ ఎరుకే! దానికి బదులుగా అవాస్తవాలను ప్రచారం చేయడానికి మోడీ పూనుకుంటున్నారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవంటారు కదా..! కమలనాథులను దేశ రాజకీయ చిత్ర పటం నుంచి పూర్తిగా తుడిచిపెడితేగానీ తిమ్మిని బమ్మి చేసే టక్కుటమార గారడీల నుండి ప్రజలకు విముక్తి లభించదు.