Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆరేండ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా... ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను'' - ఇది కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి సునీల్ నాయక్ మరణసందేశం. ఇది కేవలం సునీల్‌నాయక్ వేదన మాత్రమే కాదు, కోట్లాది యువకుల గుండె ఘోష. మూడు రోజులు మృత్యువుతో పోరాడి అశువులు బాసిన సునీల్ ఘటన మరువకముందే నాగార్జునసాగర్‌లో మూడు రోజుల క్రితం రవికుమార్ ఆత్మహత్య... అంతలోనే ఓ వాగులో శవమైతేలిన రవికుమార్ భార్య అక్కమ్మ... ఇవి మచ్చుకు కొన్నే, దేశంలో ఇటువంటి హృదయవిదారక ఘటనలు నిత్యం ఎన్నో.. చదువుకు తగిన కొలువులు లేక కొందరు, సంసార సాగరాన్ని ఈదలేక మరికొందరు తనువులు చాలిస్తున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న కమలనాథులమాట కేవలం ఓట్లకోసం యువతకు వేసి ఎర అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలేం కావాలి? నీళ్లూ, నిధులు, నియామకాలన్న ఉద్యమనేతల మాటలు నీటి మూటలేననడానికి ఈ బలిదానాలకు మించిన రుజువులేం కావాలి?
''ఆకాశం అంటుకునే ధర లొకవైపు - అంతులేని నిరుద్యోగమింకొకవైపు'' అంటూ ఏనాడో శ్రీశ్రీ రాసిన గీతం ఈనాటికీ తన ప్రాసంగికతను కోల్పోకపోవడం పట్ల ఆనందించాలో దు:ఖించాలో అర్థం కాని పరిస్థితి. దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు మారినా నిరుద్యోగం మాత్రం తీరని సమస్యగా అంతకంతకూ తీవ్రమవుతుండటానికి కారణమేమిటి? దేశంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న నిరుద్యోగుల బలిదానాలకు బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రమే. ఇప్పుడీ సమస్యకు పరిష్కారం చూపగలదు. ఈ వాగ్దానభంగాలూ బలిదానాలూ ఈ దేశానికి కొత్తవేం కాకపోగా, ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా నిరుద్యోగం ఓ పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోవడం కాకతాళీయమేం కాదు. అది దేశంలో దశబ్దాలుగా అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానంలో భాగం. నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషించడం దాని లక్షణం. నేటి ఈ నిరుద్యోగ రక్కసి విలయానికి అదే కారణం.
ఈ విధానాలకనుగుణంగానే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించాలనే బాధ్యతను మరిచిన ప్రభుత్వాలు, ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కూడా మానేశాయి. పైగా ఖాళీ అవుతున్న పోస్టులను రద్దు చేస్తూ ఖాళీల సంఖ్యను తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో ఇంకా సుమారు 60లక్షలకు పైగా ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వాలకున్న అభ్యంతరాలేమిటి? కండ్లముందు ఇన్ని ప్రాణాలు నేల రాలుతున్నా అందుకు పూనుకోకపోవడంలోని ఔచిత్యమేమిటి?
దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి సాధిస్తామంటూ, యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు నిత్యం పెట్టుబడిదారులకు సాగిలబడుతున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసమంటూ రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారు. నదులూ, సముద్రాలూ, గనులూ, అడవులూ సమస్త వనరులనూ వారికి ధారాదత్తం చేస్తున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులనూ చట్టాలనూ నీరుగారుస్తున్నారు. ఇంత చేసినా ఈ అభివృద్ధికీ ఉద్యోగాలకు సంబంధమే ఉండటం లేదు. స్వాతంత్య్రనంతరం 80వ దశాబ్దం వరకూ జీడీపీ పెరుగుదల 4శాతం మించలేదు. ఆ కాలంలో ఉద్యోగకల్పన 2శాతంగాఉంది. 90వ దశకంలో సరళీకరణ విధానాల అమలు ప్రారంభమైనాక అభివృద్ధి 7శాతానికి పెరుగగా ఉద్యోగ కల్పన 1శాతానికి తగ్గిందని ప్రభుత్వగణాంకాలే సెలవిస్తున్నాయి. మరి ఈ అభివృద్ధి ఫలాలు ఎటుపోతున్నట్టు? ఎవరికి అందుతున్నట్టు?
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను వాగ్దానం చేసి పీఠమెక్కిన మోడీ ఎలుబడిలో నిరుద్యోగిత రేటు గత నలభై అయిదేండ్ల గరిష్టానికి చేరింది. సీఎంఐఈ అధ్యయనం ప్రకారం 2017లో 40.78 కోట్లమంది ఉద్యోగాలు చేస్తుండగా, 2018లో ఆ సంఖ్య 39.69 కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒకే ఒక సంవత్సర కాలంలో కొత్త ఉద్యోగాలేమీ లేకపోగా కోటీ తొమ్మిది లక్షల వున్న ఉద్యోగాలు ఊడిపోయాయి. కొత్తగా చదువులు పూర్తి చేసుకుని కొలువుల కోసం వచ్చేవారికి అవకాశాలు లేకపోగా, ఉన్న ఉద్యోగాలే మాయమవుతుండటం మన నిరుద్యోగాన్ని పరాకాష్టకు చేరుస్తోంది. అయినప్పటికీ పారిశ్రామికీకరణ, నూతన పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలంటూ ప్రభుత్వాలు ఊదరగొడుతుండగా, వాస్తవాలు వాటిని వెక్కిరిస్తున్నాయి.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాల పుణ్యమా అని ప్రభుత్వరంగం రోజురోజుకూ కుంచించుకుపోతుండగా ప్రయివేటు రంగంలోనూ అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. బడా కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ విధానాలు చిన్న, మధ్య తరహ పరిశ్రమలను కూడా దెబ్బతీస్తున్నాయి. దేశంలో అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం దివాళా తీయడంతో ఈ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది నిరాశ్రయులు కాగా దాదాపు అంతే సంఖ్యలో కొత్తగా ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు.
అందువలన ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుండా అవి ఎన్ని ఉద్యోగాలను వాగ్దానం చేసినా అవి గాలిమూటలే అవుతాయి. దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజల ఆదాయాలు పెరిగినప్పుడే పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులు, నూతన పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగావకాశాలూ పెరుగుతాయి. అందుకు భిన్నంగా దేశ సంపదలో 73 శాతం జనాభాలో ఒక్కశాతం ఉన్న అత్యంత సంపన్నుల చెంతకు చేరుతున్నంతకాలం నిరుద్యోగం పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపో తుంది. ఇది గుర్తించనంత కాలం సునీల్, రవికుమార్, అక్కమ్మ లాంటి బలిదానాలు కొనసాగుతూనే ఉంటాయి.