Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలేదీ చింతేనా' అంటూ తన మనసులో అడుగంటిన ఆశను గూర్చి గానం చేస్తుంది సినిమాలో ఓ పాత్ర. సినిమాలో పాత్రవరకే పరిమితమయితే ఫర్వాలేదు. నిజజీవితంలో నిరాశ ఆవహిస్తే కలిగే అనర్థాలు అనేకం. మొత్తం సమాజంలోని యువతరంగాన్ని ఈ నిరాశ చుట్టుముడితే సామాజిక జీవనం నిస్సారభూతమై చీకట్లు కమ్ముకుంటాయి. ఎన్ని కష్టాలున్నా, బాధలు, సవాళ్ళు ఉన్నా మనిషిలో ఆశ చావకూడదు. చిగురంతయినా ఆశ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది.
నిరాశ నిండితే భవిష్యత్తంతా ఎడారితనమైపోతుంది. అందుకనే సినీకవి 'నిజమైనా, కలయైనా, నిరాశలో ఒకటేలే, పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే' అని నిర్వచించాడు. అవును కదా! మన మనసులోకి నిరాశ చేరితే భవిష్యత్తు శూన్యంగా కనపడుతుంది. చైతన్య రహితులుగా, నిరాసక్తంగా మారిపోతాము. అంతేకాదు మనం చేసే పనిలో, ఆలోచనలో సృజనాత్మకత అంతరించిపోతుంది. సమూహాలతో ఉన్న సంబంధాలు సజీవతను కోల్పోతాయి. మనం పక్కవాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వకపోగా మనకు మనమే నిరుత్సాహంలో మునిగిపోతాము. మనకు మనమే భారంగా మారిపోతాము. భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిపోతే అది ప్రతి అంశంపైనా తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఇప్పుడు నిరాశా, అవిశ్వాసం గురించి చర్చకు కారణమేమంటే ఇటీవల ఆర్బీఐ వాళ్ళు ఐదువేలకు పైగా కుటుంబాలను సర్వే చేయగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు భవిష్యత్తుపట్ల విశ్వాసం పడిపోయిందని, చాలా మంది నిరాశలో ఉన్నారని తేలింది. దీనికి కారణాలను కూడా ఈ సర్వే ప్రకటించింది. స్థూలంగా వారివారి ఆర్థిక పరిస్థితులపట్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వివరించింది. నిత్య జీవిత అత్యవసరాల కోసం బెంగ వెన్నాడుతోందని, యేడాదికేడాది వాటి కోసం చేసే ఖర్చు అధికమవుతున్నదని, కానీ ఆదాయాలు సమకూరడంలేదన్న మనాది పెరిగిపోయిందని తెలిపింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని తీవ్ర సంక్షోభ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వివరించింది. ఉపాధి దొరకుతుందన్న భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వ చర్యలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే ఉంటున్నాయని, సామాన్య ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసారని ప్రజలు కూడా భావిస్తున్నారని తెలియవచ్చింది.
ఒక అనిశ్చితి, భరోసాలేనితనం, ఆశాలేమి, విశ్వాసం అడుగంటిపోవడం అనేవి సమాజాన్నంతా ఆవరించినట్టయితే సామాజిక సంక్షోభం ఏర్పడుతుంది. అరాచకమూ ప్రబలుతుంది. ఆధిపత్య వర్గాలకు కావలసింది కూడా ఇదే. ఎందుకంటే నిస్సహాయస్థితిలోకి ప్రజలు పోయినప్పుడు వారిని తమకనుకూలంగా, లేదా తమ భ్రమాత్మక ఆలోచనలకు అనుకూలంగా మలచుకోవచ్చు. విశ్వాసాలపై, మూఢత్వంపై ఆధారపడి జీవించే వాళ్ళుగా జనులను చేయగలిగితే వారి పప్పులన్నీ ఉడుకుతాయి. ఆధిపత్యమూ భద్రంగా కొనసాగుతుంది. ఒక నిస్సత్తువతో ఉన్న సమాహాంపై బలాన్ని ప్రయోగించడం తేలిక. నిరాశ నిండిన ప్రజలు ప్రశ్నను సంధించలేరు. ప్రశ్నలు తలెత్తనీయకపోవటమే నేటి పాలకులు కోరుకునేది.
ఇప్పటికే అవిద్య, అజ్ఞానం, మూఢత్వం నిండిన ప్రజలున్న మన సమాజంలో ఈ రకమైన నిరాశలు, భవిష్యత్తు పట్ల విశ్వాసలేమితనం పెరగడమనేది మరింత మౌఢ్యంలోకి లాక్కెలుతుందేమో అనే ఆందోళన కలుగకమానదు. ఆ రకమైన అస్థిరతను కోరుకోవడంలోని ఆంతర్యమే అది. మనం నేడు సమాజంలో తలెత్తుతున్న హింసాప్రవృత్తి, లైంగిక దౌర్జన్యాలు, ఉన్మాద భీభత్స కృత్యాలు, నిస్సహాయతతో చేసుకునే ఆత్మహత్యలు పెరగటానికి సమాజంలోని ఈ మానసిక బలహీనతలే కారణం. ఈ రకమైన బలహీనతలు పెరగటానికి పాలకులు, వారు వంతపాడుతూ దోచుకోవటానికి ఆటంకాలేవీ లేకుండా చూసుకుంటున్న వర్గాల నిర్హేతుక దోపిడీయే మూలకారణాలు.
అసలైన కారణాలను తెలుసుకోకపోతే ప్రజలు మోసపోతూనే ఉంటారు. అందుకనే పెద్దలు మనకు ఏడుచేపల కథను ఉదాహరణగా చిన్నప్పటినుంచే నేర్పుతారు. చేపలు ఎండకపోవటానికి పుట్టలో చీమ కుట్టటానికి ఉన్న సంబంధాన్ని కథాగానంగా చేశారు. నిజమే కదా! మనిషి నమ్మకాలకు, మౌఢ్యానికి, ఉన్మాదాలకు, నిస్పృహలకు, భావోద్వేగాలకు, ద్వేషాలకు ఆర్థిక జీవనం, వొత్తిడి, దోపిడీ కారణమనే విషయాలను తెలుసుకుని చైతన్యపడాల్సిన సమయమిది. అలా చైతన్య పడిన సమూహాంగా తమ బతుకు భవితను తామే తీర్చుకుంటామని రైతులు ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారు. మన మీద మనం విశ్వాసాన్ని కలిగివుండాలి. ఆశను పట్టుకొనే ముందడుగేయాలి. అందుకనే మహాకవి సి.నా.రే 'నిప్పులు వీచే యెడారి యెదపై నీటి చుక్క ఆశ / మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ / వెలుతురు చచ్చిన గగనం కంటికి వెలుగుచుక్క ఆశ / పక్కలు విరిగి ఉసూరను ఒంటికి పక్షిరెక్క ఆశ'' అని అంటాడు. నిరాశనెదిరించే ధైర్యమూ మనలోనే ఉంది. సవాళ్ళపై సమరమే పరిష్కారాన్ని చూపుతుంది.