Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అంటుకోను ఆముదం లేదుగానీ మీసాలకు సంపెంగ నూనె'' అన్నట్టుంది మన ప్రధాని తీరు. వ్యాక్సిన్ కొరతతో జనం అల్లాడుతుంటే దేశమంతటా ''టీకా ఉత్సవాల''కు పిలుపునిచ్చారాయన. కరోనా సెకెండ్ వేవ్ ఊహించని వేగంతో వణుకుపుట్టిస్తున్న వేళ ప్రధాని ఉద్దేశ్యాన్ని తప్పు పట్టలేం గానీ, అందులో ప్రచారార్భాటమే తప్ప ఆచరణకు తగ్గ ప్రణాళికలు లేకపోవడమే ఆక్షేపణీయం. ప్రతి సందర్భంలోను నాలుగు ఉచిత సలహాలు విధిలించి, విపత్తును ఎదుర్కొనే బాధ్యతను ప్రజలకు వదిలేయడమేగాక, వాటిని కూడా ప్రచారానికీ తన పాపులారిటీకీ ఉపయోగించుకోజూడటం ప్రధానికి ఓ ఆనవాయితీగా మారింది. ప్రణాళికా రహితమైన లాక్డౌన్ ప్రకటన మొదలు దీపాలు వెలిగింపజేయడం, చప్పట్లు కొట్టించడం, గో! కరోనా గో!! అంటూ భజనలు చేయించడం వంటి ఆయన అశాస్త్రీయ విన్యాసాలెన్నో మొదటి వేవ్‌లో చూశాం. ఇప్పుడు కరోనా రెండవ ఉధృతిలో ఈ 'టీకా ఉత్సవ్' మరో విన్యాసం..!
ఇన్నాళ్లుగా వేస్తున్న టీకాల కంటే విస్తృతంగా, భారీస్థాయిలో టీకాలు వేయడం ఈ టీకా ఉత్సవ్ ఉద్దేశ్యం. ఉద్దేశ్యం మంచిదే కానీ అసలు టీకాలే లేకుండా ఈ టీకా ఉత్సవాలేలా? అనేది 'నూటా ముప్పయికోట్ల' ప్రశ్న. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశీయ అవసరాల కోసం ఉత్పత్తి అయిన మొత్తం డోసులు పదమూడున్నర కోట్లు. ఇందులో పదికోట్ల డోసులు ఇప్పటికే రాష్ట్రాలకు అందించారు. మిగిలిన మూడున్నర కోట్ల డోసులు నిల్వల్లోనో, పంపణీలోనో ఉన్నాయి. రాష్ట్రాలకు అందించిన డోసుల్లో దాదాపు తొంబైశాతానికి పైగా ఖర్చయిపోయాయి. మిగిలిన డోసులు ఇప్పుడు రోజువారీగా ఇస్తున్న సంఖ్యలో ఇచ్చినా మరో మూడు రోజులకు మించి సరిపోవు. మన దేశ జనాభా ఏమో నూటా ముప్పయి కోట్లకు పై మాటే. మరి ఈ అరకొర డోసులతో టీకా ఉత్సవ్ ఎలా నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఘోష.
ఉదాహరణకు మన తెలంగాణనే తీసుకుంటే గత శుక్రవారం లక్షా ఎనిమిది వేలు, శనివారం లక్షా యాభైమూడువేల టీకాలు వేయగా... టీకా ఉత్సవాల ప్రారంభదినమైన ఆదివారం నాడు వేసింది కేవలం 85,329 మాత్రమే. ఈ లెక్కన వేసినా రాష్ట్రంలో ఉన్న నిల్వలు మరో మూడురోజులకు మాత్రమే సరిపోతాయి. ఈలోగా కొత్తవి రాకపోతే టీకా కేంద్రాలను మూసివేసుకోవాల్సిందే..! పోనీ దేశవ్యాపిత గణాంకాలు చూద్దామన్నా ఇందుకు భిన్నంగా ఏమీలేవు.. శుక్రవారం 34,15,055, శనివారం 35,19,987 టీకాలు వేయగా ఉత్సవం రోజున వేసింది 27,69,888 మాత్రమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ 'టీకాలే లేకుండా ఉత్సవాలెలా?' అని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి.
ఇవేవీ పట్టని ప్రధాని ''ఈ టీకా ఉత్సవ్ మరో యుద్ధానికి నాంది'' అంటూ గంభీరంగా సెలవిస్తున్నారు గానీ, ఆయన మాటలకూ వాస్తవ ఆచరణకూ ఎక్కడా పొంతన కుదరటం లేదు. అటువంటప్పుడు ఈ టీకా ఉత్సవాలతో ఒనగూరే ప్రత్యేక ప్రయోజనమేమిటో వారికే తెలియాలి..! పైగా టీకాల పంపిణీలోనూ వివక్ష చూపుతూ తన రాజకీయ కారణాలకోసం ప్రజలను బలిపెడుతున్నారు. తాము అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు 40 లక్షల డోసుల చొప్పున ఇచ్చి, ఏ రాష్ట్రంలో లేనంతగా విలవిల లాడుతున్న మహారాష్ట్రకు కేవలం ఏడు లక్షల డోసులివ్వడాన్ని ఏమనాలి? ప్రజల భాగస్వా మ్యంతో, అవగాహనతో, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలని సలహాలివ్వ డానికే పరిమితమవుతున్న ప్రధాని, ఓ ప్రభుత్వా ధినేతగా తన బాధ్యతలను మాత్రం విస్మరిస్తు న్నారన్న సంగతి గుర్తించవలసిన సత్యం.
భారత్‌ను వ్యాక్సిన్ అడ్డాగా ప్రచారం చేసుకుంటూ ప్రపంచవ్యాపిత ప్రాచుర్యం కోసం తహతహలాడుతున్న మోడీ, ఆ వ్యాక్సిన్ అడ్డాలోనే కొరతను నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపివేయాలనే డిమాండ్స్ కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికి 6కోట్ల 45లక్షల డోసుల వ్యాక్సిన్‌ను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందుకు భిన్నంగా అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్లు తమ దేశంలో ఒక్క చుక్క వ్యాక్సిన్ ఉత్పత్తి చేయకపొయినా, పరిశోధనా స్థాయిలోనే వివిధ కంపెనీలకు నిధులు సమకూర్చి తమ అవసరాలకు రెట్టింపు వ్యాక్సిన్‌ను ఆర్డర్ చేసుకున్నాయి. ఇందులో ముందుచూపుకన్నా, ప్రపంచం ఏమైపొయినా ఫరవాలేదు తమ ప్రయోజనాలే ముఖ్యమనే స్వార్థమే ఎక్కువ. ఇది మరీ దుర్మార్గం. ఎందుకంటే, ప్రపంచమంతా ఓ కుగ్రామమైపోయిన ఈ ప్రపంచీకరణ యుగంలో.. కరోనా నివారణ అనేది ఏ దేశానికి ఆ దేశం మాత్రమే చేసేది కాదు. ప్రపంచంలో అది ఏ మూలన ఉన్నా అన్ని దేశాలకూ ప్రమాదమే. వ్యాక్సిన్ ఉత్పత్తి కాదుకదా, కనీసం కొనుగోలు కూడా చేయలేని పేద దేశాలనేకం ఉన్నాయి. విశ్వమానవ దృష్టితో వారందరికీ వ్యాక్సిన్ అందించాల్సిందే. కాబట్టి భారత ఎగుమతులను తప్పుపట్టలేం. కాకపోతే దేశీయ అవసరాలను, ఎగుమతులను అంచనా వేయలేకపోవడం, వ్యాక్సిన్ ఉత్పత్తి పట్ల, పంపిణీ పట్ల సమగ్ర దృష్టి కొరవడటం, కనీస ప్రణాళికలు లేకపోవడం బాధ్యతారాహిత్యం. ప్రధాని మిత్రదేశమని చెప్పుకునే అమెరికాయేమో వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును మన దేశంలోకి రాకుండా అడ్డుపడుతోంది. చైనా ఇస్తానన్నా తన రాజకీయ కారణాల కోసం మోడీ నిరాకరిస్తున్నారు. తగిన సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోవడానికీ, వ్యాక్సిన్ కొరతకూ ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఇవన్నీ గాలికొదిలి, 'కాదేదీ కవితకనర్హం' అని మహాకవి చెపితే 'కాదేదీ ప్రచారానికనర్హం' అన్నట్టుగా ప్రధాని వ్యవహరిస్తున్నారు. ఎంతసేపటికీ ప్రచారయావే తప్ప ప్రజారక్షణ పట్ల చిత్తశుద్ధిలేని నేతల నుంచి ఇలాంటి ఉత్తుత్తి ఉత్సవాలను తప్ప ఉపయోగపడే ఉత్సవాలను ఎలా ఆశించగలం..?!