Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లమల అటవీప్రాంతంతో పాటు నల్లగొండ జిల్లా పెద్దగుట్ట పరిధిలో యురేనియం తవ్వకాల నుంచి కేంద్రం వెనక్కి తగ్గింది. సర్వే నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రోజుల కింద ప్రకటించింది. నిక్షేపాల అన్వేషణకు చేపట్టిన బోర్‌వెల్స్, డ్రిల్లింగ్ ప్రణాళికల అమలును నిలిపేసినట్టు అటామిక్ మినరల్ డిపార్ట్మెంట్(ఏఎండీ) తెలియజేసింది. ఇది నూటికి నూరుపాళ్లూ ప్రజావిజయమే. దీంతో పర్యావరణ ప్రేమికులు, అడవిబిడ్డల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అణువిద్యుత్, అణ్వాయుధాల తయారీలో యురేనియం కీలకం కాబట్టి 'తవ్వకం' అనే ఉపద్రవం ఎప్పుడైనా వచ్చిపడొచ్చు. రాష్ట్రంలోని నల్లమలలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్), నల్లగొండ పెద్దగుట్టలో దేశంలోనే అత్యంత నాణ్యతతో కూడిన యురేనియం నిక్షేపాలున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(డీఏఈ) 1995లోనే గుర్తించింది. అప్పటి నుంచే దీని అన్వేషణ, వెలికితీతకు శ్రీకారం చుట్టింది. ఈ యురేనియం రేడియో ధార్మికత అత్యంత ప్రమాదకరం. పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని తవ్వడం, నిల్వచేయడం కూడా పెద్దసవాలే. వాస్తవానికి నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యమయం. పెద్ద పులులకు నిలయం. చెంచులకు ఆలవాలం. పక్షుల కిలకిలారావాలు, సహజ సుందరమైన జలపాతాలు నిత్యం అలరిస్తుంటాయి. జంతువులు, జీవనదులు, పచ్చనిచెట్లు నల్లమల సొంతం. ప్రకృతి సోయగాలకు నెలవు. అలాంటి చల్లని అడవిపై పంజా విసిరేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. అందుకు ప్రజా ఉద్యమాల సత్తువే కారణం.
ఉమ్మడి రాష్ట్రంలోనే నల్లమలలో ఓ ప్రయివేటు కంపెనీ గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలను చేపడితే, ప్రజలంతా తిరగబడ్డారు.. వామపక్షాలు, ఇతరపార్టీల ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు ముందుకు రావడంతో అప్పుడు సద్దుమణిగింది. మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యురేనియం ఖనిజాన్వేషణను తెరపైకి తెచ్చింది. అసలు ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఎంత పరిధిలో విస్తరించి ఉన్నాయి? ఎంత లోతులో ఉన్నాయి? అనే సంగతిని గుర్తించేందుకు డ్రిల్లింగ్ చేపట్టాలని 2015-16లో డీఏఈ నిర్ణయంచింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు, నల్లగొండ జిల్లా పెద్దగుట్టతో కలిపి మొత్తం 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.45 కోట్లతో నాలుగు వేల బోర్లు వేయాలని అటామిక్ మినరల్స్ డెవలప్మెంట్(ఏఎండీ) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతులను అడిగింది. నల్లమల జీవవైవిధ్యం, పులుల సంరక్షణ, చెంచుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అటవీశాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ అభిప్రాయాన్ని తుంగలో తొక్కిన బీజేపీ, యథేచ్ఛగా 2019లో రహస్యంగా సర్వేకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. తద్వారా 'సేవ్ నల్లమల' ఉద్యమానికి కారణ మైంది. తవ్వకాల ప్రతిపాదిత గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు, వాహనాల రాకపోకలను చెంచులు, యువత అడ్డుకున్నారు. ఒకానొక దశలో మున్ననూరు చెక్‌పోస్టు దాటి నల్లమలలోకి ఒక్క వాహనాన్నీ లోపలికి అనుమతించలేదు. వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని గ్రహించిన రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయకతప్పలేదు. ''కృష్ణానదిని కలుషితం చేస్తుంది. దీని నుంచి తాగునీరు సరఫరా అయ్యే హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సగం తెలంగాణకే ప్రమాదం పొంచి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం'' అని 2019లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. వైల్డ్‌లైఫ్ సర్వే కోసమే అనుమతులిచ్చాంగానీ, తవ్వకాలకు ఇవ్వలేదంటూ బీజేపీ సర్కారు లోక్‌సభలో బుకాయించింది. కానీ ప్రజా ఉద్యమాల ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు. 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పించింది. జీవోనోపాధికి హామీనిచ్చింది. కనుక యురేనియం పేరుతో అసలు నల్లమలలోనే అడుగు పెట్టొద్దు' అంటూ స్థానిక ప్రజలంతా తమ వైఖరిని కుండ బద్దలు కొట్టారు. బోపాల్ గ్యాస్ బాధితుల విషాదానికి నేటికీ పరిష్కారం దొరకలేదనే విషయాన్ని ఎత్తిచూపారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ యురేనియం తవ్వకాలతో స్థానిక ప్రజల కన్నీటి ఘోస... మా దాకా రాకూడదనే పట్టుదలతోనే ఉద్యమించారు. సీపీఐ(ఎం), ఆదివాసీ, గిరిజన సంఘాలతో పాటు ఇతర పార్టీల ఆధ్వర్యంలో నడిచిన ఉద్యమాలు ఓవైపు..మరో వైపు అసెంబ్లీ తీర్మానంతో కేంద్ర ప్రభుత్వం చచ్చినట్టు దిగొచ్చింది. సర్వే పనుల పేర చేపట్టిన బోర్ల తవ్వకాలను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే ప్రస్తుతం రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం, కార్మిక కోడ్లను తాత్కాలికంగా ఆపేయడమూ ప్రజాపోరాటాల ఫలితమే. కాగా ఇప్పటికిప్పుడే ముప్పు తొలగిపోలేదు. ప్రపంచ దేశాలను శాసిస్తున్న అణుసంపత్తిలో యురేనియందే కీలక పాత్ర. దీంతో పాలకుల కన్ను ఎప్పటికీ నల్లమలపై ఉంటుంది. తాత్కాలిక విజయాలకు పొంగిపోకుండా నిరంతర అప్రమత్తతే అందరికీ శ్రేయస్కరం.