Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బాధాకరం. ఎన్నికల ఘర్షణలుగా పైకిచెబుతున్నప్పటికీ వీటి వెనుక మత విద్వేష రాజకీయం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితి కోసం సంఘ పరివార్, బీజేపీ శక్తులు ఒక పథకం ప్రకారం కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను గట్టిగా అడ్డుకుని, తిప్పికొట్టాల్సిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం దానికి భిన్నంగా మెతక వైఖరి అవలంభించడం మతోన్మాదశక్తులకు కలిసివచ్చింది. ప్రజల మధ్య విద్వేషాగ్నులు రెచ్చగొట్టి, ఆ మంటల్లో ఎన్నికల లబ్ధి పొందడానికి చూస్తోంది.
నిజానికి బెంగాల్ ప్రజలను మత ప్రాతిపదికన చీల్చాలన్న కుట్ర ఈ నాటిది కాదు. మన స్వాతంత్య్రాన్ని కబళించి, దేశాన్ని బానిసత్వంలో ముంచిన తెల్లదొరలు అనుసరించిన దుష్ట విధానమది! విభజించి పాలించే విద్వేష వ్యూహంలో భాగంగా బ్రిటిష్ పాలకులు మొట్టమొదట ఆ దమననీతిని అనుసరించారు. 1905లో మత ప్రాతిపదికన తూర్పు, పశ్చిమ బెంగాల్‌గా విభజిస్తున్నట్టు చేసిన ప్రకటనను బెంగాల్ ప్రజలు ఐక్యంగా వ్యతిరేకించారు. ఆరేండ్ల పాటు విరామమెరుగక పోరాటం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా కాంగ్రెస్ ఈ చర్యను వ్యతిరేకించింది. వామపక్ష శక్తులూ ప్రజలకు అండగా నిలిచాయి. ఈ పోరాటంలో భాగంగానే రవీంధ్రనాథ్ టాగూర్ రాసిన 'అమర్ సోనార్ బంగ్లా..' గీతం బెంగాలీయుల హృదయాన్ని ఆవిష్కరించింది (బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత దీనినే ఆ దేశ జాతీయగీతంగా ప్రకటించారు). ప్రజాందోళనకు తలొగ్గక తప్పని పరిస్థితి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏర్పడింది. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బెంగాల్ ప్రజల ఐక్యతను మత ప్రాతిపదికన చీల్చడానికి జరిగిన మొట్టమొదటి ప్రయత్నమది!
స్వరాజ్య సాధనలో ఇసుమంత పాత్రకూడాలేని సంఫ్‌ుపరివార్ తెల్లదొరల నుంచి ఆ విద్వేష వ్యూహాన్ని మాత్రం వారసత్వంగా పొందింది. 1947లో దేశ విభజన వేళ విషం చిమ్మడానికి ప్రయత్నించింది. ఈ యత్నాన్ని బెంగాల్ ప్రజానీకం మరోసారి అడ్డుకుంది. గాంధీజీ స్ఫూర్తితో గ్రామగ్రామాన శాంతియాత్రలు సాగాయి. కమ్యూనిస్టులు ప్రజల ఐక్యత కోసం గట్టిగా నిలబడ్డారు. ఆ తరువాత రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం పెరగడం, సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏర్పడటంతో మతోన్మాదుల ఆగడాలు సాగలేదు. ప్రజల ఐక్యతను, చైతన్యాన్ని పెంచడానికి వామపక్ష ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో దశాబ్దాల తరబడి విద్వేష వ్యూహాలు బెంగాల్‌కు సోకలేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ వ్యాప్తంగా సిక్కులపై జరిగిన దాడులు బెంగాల్లో జరగకపోవడానికి, బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం చెలరేగిన మత ఘర్షణల ప్రభావం ఇసుమంత కూడా పడకపోవడానికి వామపక్ష ప్రభుత్వం అనుసరించిన చైతన్య పూరిత లౌకిక విధానాలే కారణం.
వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ ప్రభుత్వానికి ఎటువంటి సైద్ధాంతిక నిబద్దత లేదు. ఇది బీజేపీకి అవకాశంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నిరుద్యోగం వంటి ప్రజల సమస్యలు ఏమాత్రం చర్చకు రాకుండా చూడటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై మాట్లాడటానికి బదులుగా ప్రజలను చీల్చడానికి, వారిలో ఒకరిని మరొకరికి శత్రువుగా చూపడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది. బెంగాల్‌కు కీలకమైన జూట్ తదితర పరిశ్రమల పరిరక్షణతో పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి అంశాలపై కూడా ప్రజలను విభజించడమే బీజేపీ వైఖరి. ప్రజలలో మత ప్రాతిపదికన చీలికలు తెచ్చే సీఏఏ చట్టాన్ని తాను అధికారంలోకివస్తే వెంటనే అమలు చేస్తానని పదేపదే ప్రకటించడం, ప్రధాని, హౌంమంత్రి స్వయంగా మత ప్రాతిపదికన ఓటర్లకు చేస్తున్న విజ్ఞప్తులు ఈ వైఖరినే తేటతెల్లం చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్న పేరుతో ఒక్క బెంగాల్లోనే ఎనిమిది విడతల పోలింగ్ నిర్వహించడం వెనుక బీజేపీ కుట్ర ఉందనే అందరూ భావిస్తున్నారు. బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ విద్వేష ఎజెండానే కారణం. దీనిని తిప్పికొట్టడానికి, రవీంద్రుడు విరచించిన 'బెంగాల్ ఆత్మ'ను పునర్జీవింపచేయడానికి విరామమెరుగక కృషి చేయడమే అభ్యుదయ శక్తుల కర్తవ్యం!