Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా ''కరాళ నృత్యం'' చేస్తోంటే ''కుంభమేళా''కు ప్రభుత్వాలు అనుమతించడాన్ని ఏమనాలి? మునుపెన్నడూ ఎరుగని రీతిలో రోజుకు రెండులక్షల కేసులు నమోదవుతున్న వేళ ఇది ఎంత ప్రమాదమో తెలిసి కూడా అనుమతించడమేగాక, కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రకటనలిచ్చి భక్తులను ఆహ్వానించడం ఎంతటి బాధ్యతా రాహిత్యం? ఇలా ఒకవైపు భారీ ఉత్సవాలకూ, బహిరంగసభలకూ, ర్యాలీలకు అనుమతిస్తూ మరోవైపు కరోనా నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని చెపితే, ప్రజల్లో వాటికి విశ్వసనీయత ఉంటుందా?! మహమ్మారిపై ముందుండి పోరాడమని ఆరోగ్యరంగ కార్యకర్తలను ఆదేశించే నైతికత ఈ ప్రభుత్వాలకుంటుందా? కుంభమేళాలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం నామమాత్రం. భౌతికదూరం పాటించడం అసాధ్యం. అయినా, ప్రభుత్వ పెద్దలు ఈ ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. పైగా 'కుంభమేళా పవిత్ర గంగానదీ తీరాలలో జరుగుతోంది గనక ఇక్కడ కరోనా రాదు' అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్సింగ్ వ్యాఖ్యానించడం దేనిక సూచిక లక్షల సంఖ్యలో హాజరయ్యే యాత్రికులు కరోనా బారినపడి దేశం నలుమూలలకు వైరస్ను వ్యాపింపచేస్తే అందుకు బాధ్యత ఎవరిది? కోవిడ్ ఇంతలా విజృంభిస్తున్నా కుంభమేళా యథావిథిగా ఈ నెల 30వరకు కొనసాగుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం అమానుషం.
ఇప్పటికే పెరుగుతున్న కరోనా ఉధృతిలో ప్రజలు బంబేలెత్తుతుండగా... తగిన సంఖ్యలో వ్యాక్సిన్ కేటాయించలేదంటూ మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా ఏమాత్రం చలించని కేంద్రం కుంభమేళాకు సన్నాహాలు చేస్తోంది. పైగా దేశంలో టీకా కొరత వెంటాడుతుంటే 80దేశాలకు వ్యాక్సిన్ పంపామని ప్రధాని గొప్పగా చెప్పడం 'ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత' అన్న చందంగా ఉంది. వైద్య సేవలు అందించడంతోబాటు ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు మెండుగా ఉన్న స్థితిలో కేంద్రం వాటికి తగిన నిధులను కేటాయించకపోవడం భావ్యం కాదు. సీబీఎస్ఈతో సహా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పది పరీక్షలను రద్దు చేసి ప్లస్ టు వాయిదా వేస్తున్నాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు రీ షెడ్యూల్ చేయగా ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి పరీక్షలు యథాతథం అంటున్నారు. ఆయా రాష్ట్రాల విద్యార్థుల సన్నద్ధత, కోవిడ్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాల నిబద్ధతనుబట్టి పరీక్షలు నిర్వహించడం లేదా వాయిదా వేయడం, లేదంటే రద్దు చేయాలి. అన్ని స్థాయిల పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు సమగ్ర దృక్పథంతో వ్యవహరించడం అవసరం.
కొత్త కేసుల సంఖ్య దేశంలో రెండు లక్షలు దాటగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకరం. పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రయివేటు ఆస్పత్రులు రోగులనుంచి లక్షల రూపాయలు గుంజుతుండగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేవన్న ప్రకటనలు రావడం బాధాకరం. ప్రభుత్వాల ఆదేశాలే తప్ప అందుకుతగ్గ మౌలిక వసతులు, వైద్య, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా అన్నది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే! వైరస్ వ్యాప్తి తీవ్రతకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికపై వైద్య సౌకర్యాల కల్పన జరగాలి. కానీ ఇందుకు విరుద్ధంగా వైరస్ విజృంభిస్తుంటే రోజురోజుకూ వేస్తున్న టీకాల సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరం. వ్యాక్సిన్ ఇవ్వకపోడం ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పి ఊరుకోరాదు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబానికి రూ.7,500 నగదు, ఆహార ధాన్యాల పంపిణీతోపాటు ఉపాధి హామీ పనులు విస్తారంగా చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలి. గతంలో త్రిపుర వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధంగా ఇప్పుడు దేశమంతటా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం అవసరం. వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బందిని సమకూర్చడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. 'టీకా ఉత్సవం' అని ఉత్తుత్తి మాటలు కాకుండా పెద్ద సంఖ్యలో వేసేందుకు వీలుగా టీకాల ఉత్పత్తులు, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అనుమతులు మంజూరు చేయడం, తగినంత ఉత్పత్తి, పంపిణీ దేశమంతటా జరిగేలా చూడటం కేంద్ర ప్రభుత్వ గురుతర బాధ్యత. క్షేత్ర స్థాయి కార్యాచరణ చేపట్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధులు కేటాయించాలి. 'పీఎం కేర్స్' డబ్బును రాష్ట్రాలకు బదలాయించడం కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలు చేసి ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం క్షంతవ్యం కాదు.