Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం... తీరమెక్కడో, గమ్యమేమిటో తెలియదు పాపం!' అనే యేసుదాసు పాట మనల్ని విషాద సన్నివేశంలోకి తీసుకువెళుతుంది. అలాంటి ఒక భయంకర, విషాద దు:ఖ సందర్భంలోనే మనమంతా ఇప్పుడున్నాం. గత సంవత్సర కాలంగా భయంకర వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి మనకు తెలుసు. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి తిరగబెట్టింది. రెండోఅల ఉధృతి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నది. ఇందులోనూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహించిన దేశాలలోనే కరోనా వ్యాప్తి తీవ్రవేగంతో మనుషుల్ని కబలిస్తున్నది. విలయం సృష్టిస్తున్నది.
ఈ విపత్తుల గురించి మనం సంవత్సరకాలంగా చర్చిస్తూనే ఉన్నాం. దీని కారణాలను విశ్లేషిస్తున్నాం. మనిషి మనుగడకు సవాలుగా మారిన ఈ ఉపద్రవాన్ని ఎలా అధిగమించాలో, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు ఏమేమిచేసుకోవాలో, ఎలా వ్యవహరించాలో మొదలైన విషయాలు ప్రపంచం మనకందించింది. విపత్తును అరికట్టే విధానాలేమిటో కూడా తేటతెల్లంగా చూపెట్టింది కూడా. కానీ కొన్ని వ్యవస్థలు నిర్లక్ష్యంగానే, నిర్లిప్తంగానే ఉంటాయి. మొదటిసారి కరోనా మనల్ని వెంటాడినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తున్నదని, ఇది ప్రాకృతిక జీవ అసమతుల్య పర్యవసానమని, మానవజాతినంతటినీ నిలదీసి, దోషులుగా నిలబెట్టాము. కానీ నేడు తలెత్తుతున్న ఈ ఘోర పరిస్థితికి, దీన్ని ఎదుర్కొవడంలో పాలకులు చూపుతున్న ఉదాసీన, అమానవీయవైఖరే కారణమనేది స్పష్టంగా కనపడుతున్నది. ప్రభుత్వాలు, నాయకులు, ప్రజలను కాపాడటంలో ముందున్నచోట విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొవడం చూస్తున్నాం. కానీ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి, ఏదో చేసామంటే చేశాం. చూశామంటే చూశాం, అనే ధోరణితో మన ప్రభుత్వాలు, వ్యవస్థలు ఉండటం నిజమైన విషాదం.
వాస్తవంగా ప్రాణం కంటే విలువైనది ఏమున్నది! కండ్లముందరే పిట్టల్లా రాలిపోవటాన్ని చూస్తూ కూడా తమపనేదో తాము చేసుకుంటూ పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. మనకేం కావాలో మనకు తెలియాలి. ముఖ్యంగా ప్రజలకూ ఈ విషయం అర్థంకావాలి. ఆహారం, ఆరోగ్యం, విద్య ఇవి ప్రాథమిక అవసరాలు. డెబ్బయి ఐదేండ్ల స్వాతంత్య్ర అమృత దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో ఈ దేశ ప్రజలకు సంపూర్ణంగా ఆహారాన్ని అందించగలుగుతున్నామా? ఆరోగ్యాన్ని ఇవ్వగలిగామా! అందరికీ నీడ ఉందా? ఇవో సమాధానం లేని ప్రశ్నలు. మనకు కావలసినవి ఏమిటి? మనం చేస్తున్నదేమిటి! నూటముప్పయి ఐదుకోట్ల జనాభాకు అందుబాటులో ఉన్న వైద్యశాలలు కేవలం ముప్పయి ఎనిమిదివేలు. పదివేల నాలుగువందల మందికి ఒక డాక్టరు చొప్పున మాత్రమే ఉన్నారు. ఆస్పత్రుల్లో ఏడులక్షల పడకలు మాత్రమే ఉన్నాయి. ఇన్నికొట్ల మంది ప్రజలకు ఇవ్వెలా సరిపోతాయి. సంవత్సర కాలంగా వైద్యావసరాలను ఏమైనా పెంచారా? ఒక్క ఆస్పత్రయినా నిర్మించారా? ఎత్తయిన విగ్రహాలు, పెద్ద పెద్ద స్టేడియాలు, ఘనమైన మందిరాలు, పార్లమెంటు, అసెంబ్లీల భవనాలకు ప్రయత్నాలు తప్ప. 'మా నాన్నను ఆస్పత్రిలో చేర్చుకోండి, లేదంటే మందిచ్చి చంపేయండని' కొడుకు వైద్యాధికారులతో మొరపెట్టుకున్నాడంటే ఎంత దయానీయంగా మారింది పరిస్థితి! వ్యాధి గ్రస్తులకు ఇంత చోటు కల్పించలేని ప్రభుత్వాలు ఆదర్శ ప్రభుత్వాలుగా ఊదరగొట్టుకోవడం ఎంత నిర్లజ్జంగా జరిగిపోతోంది!
ఇక కరోనా రాకుండా తీసుకునే వాక్సిన్లు మన దేశీయ కంపెనీలే తయారు చేస్తున్నా, టీకా కొరతతో వాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఎనభైదేశాలకు దాదాపు అరవై మిలియన్ల వాక్సిన్లు ఎగుమతి చేశానని గొప్పలు చెప్పుకునే నాయకులు, దేశ ప్రజలకు మొండిచేయి చూపటం వారి నిర్లక్ష్య విధానానికి నిలువెత్తు నిదర్శనం. తీరా అవసరాలు, ముప్పు చుట్టుముట్టగానే విదేశీ వాక్సిను కోసం ఎదురుచూడటం వెనకాల వ్యాపార, లాభాల లాబీలు విస్తృతంగానే ఉంటాయనటంలో సందేహంచేదేమీ లేదు. దేశ భక్తిని గూర్చి నిత్యం విన్న సామాన్య ప్రజలు మాత్రం 'ఇది ఆశ నిరాశల పోరాటం, ఇది చీకటి వెలుగుల ఆరాటం' అని కష్టాల చరణాల్ని పాడుకుంటున్నారు. ఆఖరికి స్మశాన వాటికలో చివరి వీడ్కోలు చెప్పేందుకు అయిన వారి పార్థివదేహాలతో గంటలతరబడి వేచి చూడాల్సి రావడం కలిచివేస్తున్న సంఘటన.
ఈ ఇక్కట్లపై దృష్టిని కేంద్రీకరించి, ఆరోగ్య ప్రణాళికను తయారుచేయాల్సిన ప్రభుత్వాలు, పెద్ద యెత్తున వైద్యసేవలను పెంచాల్సిందిపోయి, వేలాది మందితో ప్రచారాలు నిర్వహించే ఎన్నికలను మాత్రం అత్యంత శ్రద్ధతో అధికారాన్నంతా ఉపయోగించి కొనసాగిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలను ఓట్ల కొనుగోళ్ళకు వినియోగిస్తున్నారు. అంతే కాదు కుంభమేళా పేరుతో లక్షలాది ప్రజలు నదీస్నానాలు చేయటానికి అనుమతినిచ్చి వేలాదిమందికి కరోనా రావటానికి, విస్తరించటానికి పూనుకోవడం ఏరకమైన బాధ్యత అనిపించుకుంటుంది! ఆరంభంలో ఒక మతవాదులు ఈ దుశ్చర్యకు ఒడిగడుతున్నారని విపరీతంగా ప్రచారం చేసిన వాళ్ళే ఇప్పుడు కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రయితే కుంభమేళా భక్తులకు కరోనా రాదని దబాయిస్తున్నాడు.
ఇప్పటికయినా ప్రభుత్వాలు, నాయకులు, మహాభాగ్యమయిన ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకాలు వేసే ఏర్పాట్లు చేసి, సామాన్యుల ప్రాణాలకు సైతం రక్షణ కల్పించాలి. ప్రజావసరాలను గుర్తించాలి.