Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామెతలు ఊరికే పుట్టవు. ఒకేసారి కుందేళ్లతో పరిగెడుతూ రేచుకుక్కలతో కలసి ఆ కుందేళ్లనే వేటాడటం సాధ్యం కాదని ఒక ఆంగ్ల సామెత! (వన్ కెనాట్ రన్ విత్ హేర్సే అండ్ ఛేజ్ విత్హౌండ్స్) అంటే నువ్వు కుందేలై మిగతా కుందేళ్లతో పాటు పరుగెట్టనన్నా పరిగెట్టు లేదా రేచుకుక్కవై ఆ కుందేళ్లను వేటాడనన్నా వేటాడు. అంతేగాని ఒకేసారి రెండు పనులు చేయలేవనేది ఆ సామెత అంతరార్థం. బీజేపీకి సంబంధించినంత వరకు రెండూ చేయగలుగుతున్నానని విర్రవీగుతూ భారత ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది.
ఈ భూమండలంలో మతం కార్డ్‌ను అతిశక్తివంతంగా వాడుకోగలుగుతున్న శక్తుల్లో బీజేపీ కూడా ఒకటి. బొంబాయి హౌటల్‌పై పాకిస్థాన్ ఉగ్రమూకల దాడులనైనా, 2020 ఏప్రిల్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం సందర్భంగా ఆనాడు ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులపైన అయినా ఒక మతాన్ని ఏవిధంగా లక్ష్యంగా చేసుకున్నారో యావత్ భారతదేశం చూసింది. మర్కజ్లో హాజరైంది 3500 మంది. దీనికి వెయ్యిరెట్లు ఎక్కువగా నేడు కుంభమేళాకి హాజరయ్యారు. పైగా గంగామాతలో పుణ్యస్నానం చేస్తే కరోనా పారిపోతుందని ఇప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ చెప్పడం చూస్తోంటే మనం పాతరాతి యుగంలో ఉన్నామా అనిపిస్తోంది. నాడు తబ్లిగీలను ''కరోనా జిహాదీ''లని హేళన చేసిన వారిని, బద్నామ్ చేసిన వారిని ఇప్పుడు ఏమనాలి?
ఎట్టకేలకు ప్రధాని కుంభమేళాని ఇక్కడికి ముగిద్దామని మొన్న ఓ ట్వీట్ పడేశారు. ''ఏప్రిల్ 12, 14న పవిత్ర స్నానాలు చేశారు. కాబట్టి 17వ తారీఖు చేయకపోయినా ఫర్వాలేద''న్నారు. కుంభమేళాని రద్దుచేయడం మంచిదని ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఒక కీలక అధికారి చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. హిందూ ఓటు బ్యాంకును హౌల్సేల్గా కొల్లగొట్టడానికి బీజేపీకున్న రాజకీయ కండూతి దానికి మసిపూసేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు ముప్పిరి గొనడానికి ప్రధానకారణం ఇదే! చివరికి వారణాసిలో సైతం ప్రభుత్వం చెప్పే లెక్కలకు మించి మరణాలున్నాయని 'వైర్' వంటి వెబ్ పత్రికలు పేర్కొన్నాయి.
గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో అధికారిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుభాష్ సాలుంకే ప్రస్తుత కరోనా విజృంభణకు రాజకీయ నాయకులే ప్రధాన బాధ్యులన్నారు. ఎన్నికలు, సభలు యధావిధిగా సాగిపోవడాన్ని తప్పుపడుతున్నారు. కానీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమే కోవిడ్ విజృంభణకు కారణమని పాపాన్ని ప్రజల నెత్తికి పులిమేశాడు. ప్రజలకీ బాధ్యత ఉంటుందనడంలో సందేహం లేదు. అందులో కరోనా వంటి మహమ్మారితో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాల్సిందే. కాని మనదేశంలో ఉన్న అవిద్య, పేదరికం వంటివి ప్రభుత్వాల బాధ్యత కాదా!? తాగడానికి నీళ్లకోసమే మైళ్లు మైళ్లు నడిచేవారు రోజుకి పదిసార్లు చేతులు కడుక్కోగలరా? శానిటైజర్లు వాడగలిగే శక్తి ఎంతమందికుంది? ఎన్నికలు, ర్యాలీలు, సభలు కోట్లు కుమ్మరించి నడిపేస్తూనే ఉన్నారు. మతపరమైన సమ్మేళణాల నిర్వహణ ఆగట్లేదు. హౌటళ్ళు, సినిమా హాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. ఈ దశలో ఏప్రిల్ 18కి రోజుకి కేసుల సంఖ్య దేశంలో 2.75లక్షలు దాటుతోంది.
దాహమేసినప్పుడు బావితవ్వుకున్నట్టు మరో 162 ఆక్సిజన్ ప్లాంట్లకు నేడు అనుమతించారట! ప్రపంచంలో ఏదేశంలో విధించనంత కఠినతరమైన లాక్డౌన్ గత మార్చి 24న ప్రకటించింది మోడీ సర్కార్. వందల మైళ్ళు నడిచి స్వంత ఊళ్లు చేరిన కోట్లాది వలస కార్మికులు ఆ అనుభవంతో గత నెలరోజులుగా స్వంత ఊళ్లకి పయనమవుతూనే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా ధ్వంసమవుతూనే ఉంది. అనేక గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు 'నోమురా', జె.పి.మోర్గాన్, యూ.బి.ఎస్. వంటివి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ 13శాతం పైగా క్షీణిస్తుందని అంచనా వేశాయి. నిటి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని చెపుతూ మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం ఉంటుందన్నారు. ప్రధాన పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటివి మహమ్మారితో తల్లడిల్లిపోతున్నాయి. మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో నిర్మాణ రంగం వలస కార్మికుల దెబ్బకి ఇంకా పట్టాలెక్కలేదు. గత పదిరోజులకు పైగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు స్వస్థలాలకు గుంపులు గుంపులుగా తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి హరిద్వార్‌కి వేసిన రైళ్లలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రైళ్లలో ఎక్కిన వలస కూలీలు కరోనాకు బలవుతున్నారు. స్వస్థలాలకు చేరే వీరందరికీ గ్రామీణ ఉపాధి చట్టం ద్వారానైనా ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికుందా?
2019-20కి 2020-21కి మధ్య ఉపాధి హామీ కూలీల సంఖ్య 41.75శాతం పెరిగి 11.17 కోట్లయింది. వీళ్లంతా పట్టణాల నుంచి సొంతూర్లకు చేరిన వలస కార్మికులేనన్న విషయం ఇంగితజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమయ్యే విషయం. కాని ఇప్పటికీ ప్రభుత్వ కిరాయి రాతగాళ్లు అంతా పచ్చగానే ఉన్నట్టు భ్రమింపచేస్తున్నారు. 50వేలు దాటిన సెన్సెక్స్ అంగలు, జీడీపీల పరుగే ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి నిదర్శనమనే వాగ్ధాటి ఆగట్లేదు. వేల సంఖ్యలో మూతపడే పరిశ్రమలు, రికార్డుస్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న పేదరికం పంద్రాగస్టు ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాల ముంగిట మనల్ని వెక్కిరిస్తున్నాయి. 2017 డిసెంబర్ నాటికే కునారిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై 2020లో కరోనా తాటికాయ పడింది. లేచేలోపు 2021 మార్చి నుంచి రెండవ అల విరుచుకుపడుతోంది. పాలకులు నీరో అవతారమెత్తిన స్థితిలో పాలితులు పీడితులు ఒక్కటై పోరుబాట పట్టక తప్పుతుందా!?