Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అస్థిమూల పంజరాలు, ఆర్తరావమందిరాలు, ఏలోకం తల్లీ ఇట, ఏవో భాష్పజలాలు, మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం, పిలిచికొన్న ఒక సైన్యం, తిరిగిరాని ఒక ధైన్యం, ఇది యుద్ధం అబ్బీ, ఇపుడింట ఇంట ఆక్రోశం, వీరికి మిగిలేదొక భాష్పం'' అంటూ మృత్యుమైదానాన్ని గురించి గుండెలోతు ద్ణుఖంతో గానం చేస్తాడు కవి తిలక్.
అవును కదా! యుద్ధంలో నేలకొరుగుతున్న సైనికుల శవాల దృశ్యంలా ఆక్సిజన్ అందక చివరి శ్వాస విడుస్తున్న కరోనా బాధితులు కనపడుతున్నారు. వెల్లువెత్తుతున్న స్మశానవాటికల్లోని శవ జన సమ్మర్థం మునుపెన్నడూ చూడని విషాద చిత్రం. ఇది మానవ హృదయాలను కలచివేస్తోంది, కన్నీళ్ళలో ముంచివేస్తోంది. దు:ఖాలు ఉప్పొంగుతున్నాయి. హాహాకారాలు మిన్నుముడుతున్నాయి. ఒక భయానక భీభత్సకాండ మన కండ్లముందర విలయతాండవం చేస్తున్నది.
ఎక్కడి మనిషైతేయేమి, ఏమతం, ఏ కులం, ఏ ప్రాంతం అయితే నేమి! దు:ఖపు రుచంతా ఒక్కటే కదా! ఊపిరికి రంగేముంటుంది! ఆపదలకు తల్లడిల్లే ఆత్మలగీతాలాపన అందరికీ ఒకటేకదా. అమ్మ ఆస్పత్రి అరుగుముందర ఆక్సిజన్ కోసం వేచీ వేచీ చివరగా కొడుకును చూస్తూనే ఆఖరి ఊపిరి విడుస్తున్న కండ్లలోని దీనవేదన కంటున్న కొడుకు గుండెపగుళ్ళను, ఎక్కిళ్ళదు:ఖాన్ని ఏమని వర్ణిస్తాం. అమ్మానన్ను బతికించమన్నట్టు ఊపిరి నింపే సిలెండరు కోసం ఎదురుచూసే బిడ్డ కాళ్ళదగ్గరే కండ్లుమూసుకుపోతుంటే ఏ గుండెయినా నీరైపోకుండా ఉంటుందా! ఏ ఇంటికి ఎప్పుడు కాలుడు నడుచుకుంటూ వస్తాడో, ఎవరి కోసం తలుపు కొడతాడో అంతా అయోమయం. ఒక నిస్సహాయ యుద్ధ సన్నివేశం. చుట్టుముడుతున్న మృత్యుశోకం. నీడలా వెన్నాడుతున్న భయాలు.
వాస్తవిక దృశ్యాలు మరింత దారుణంగా ఉన్నాయి. ఆక్సిజను కోసం బారులు తీరిన బంధుజనుల ఆత్రుత, తమవారిని బతికించుకోవాలనే ఎదురుచూపులు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. ఓ ఆర్మీ ఆస్పత్రిలో కూడా మాజీ ఆర్మీ అధికారికి పడక దొరకక మృత్యువొడిలోకి చేరటం, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పిట్లల్లా రాలిపోతున్నా, రోదనలు వెల్లువెత్తుతున్నా, ''దేశభక్తు''లనుకుని జబ్బలు చరచుకునేవారెవ్వరూ ఆదుకునే ప్రయత్నమేదీ చేయకపోగా ఆక్సిజన్ మీద, కరోనా మందులపైనా, వ్యాక్సినుపైనా జీఎస్టీ వేసి ముక్కుపిండి వసూళ్ళు చేపట్టటం ఏరకమైన మానవీయత అనిపించుకుంటుంది! శవాలపై పేలాలు ఏరుకోవడమంటే ఇదే మరి!
ఇకపోతే మనిషి చలనం ముగిసిపోయాక, తమవారిని చివరి సారిగా కండ్లార చూసుకుని ఆఖరి సంస్కారాలు నిర్వహించడం, మానవ సంబంధాలలోని ఔన్నిత్యాన్ని తెలుపుతుంది. కానీ స్మశానంలోనూ చోటు దొరకని దౌర్భాగ్య సన్నివేశాలను మొదటిసారి చూస్తున్నాం. ముగింపుయాత్రలో నలుగురు కావాలనేది పాతమాటగా మారి, పరిచయమేలేని ఎవరో ఇద్దరు పట్టి నిప్పుపెట్టటం, అయినవాళ్ళకు తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నది. 'ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదారెటు పోతుందో ఎవరినీ అడగకా' అని పాడుకోవడం మినా ఏమీ చేయలేని దీనత్వంలోకి ఎందుకు నెట్టివేయబడ్డాము!
స్మశానవాటికలకు, అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోలేని దారిద్య్రముందామనకు? చితిమంటల్లాంటి గుండెమంటలను రాజేసిన వాళ్ళెవరు? అధికారం కోసం కుయుక్తులు, ఆధిపత్యం తప్ప ఆదుకోవడం విస్మరించిన పాలకుల నైజాన్ని చూస్తే అసహ్యమేస్తున్నది. సుప్రీంకోర్టు చివాట్లుపెట్టి, ఊరికే ప్రవచనాలు, సందేశాలకు పరిమితమవకుండా ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించేదాకా చలించని చర్మాలను ఏమనుకోవాలి! విపత్తును ఎదుర్కొనే శక్తియుక్తులున్నప్పటికీ నిర్లక్ష్యాలూ, ప్రజలపట్ల బాధ్యత లేకపోవటమూ, నిబ్ధతలేని నాయకత్వమూ ఈ శ్మశాన దు:ఖాలకు ముఖ్య కారణమని చెప్పవచ్చు. రోగులను వైద్యశాలలకు చేర్చే అంబులెన్సులు లేవు, పడకలు లేవు, ఆక్సిజన్లేదు, ఆఖరుకు స్మశానంలో స్థలమూలేదు. ఏమీలేని తనానికి నాయకులు మాత్రం ఎందుకు? ప్రభుత్వాలెందుకు?
'ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జై గదిలించి యాడు రంగస్థలంబు
యిది మరణదూత తీక్షణ దృష్టలోలయ
నవని బాలించు భస్మసింహాసనంబు' అని పాడుకోవడమేనా!
'అంతేలే, పేదలగుండెలు! అశ్రువులే నిండిన కుండలు! శ్మశానమున శశికాంతులలో చలివారిన వెలిరాబండలు!' అనుకుంటూ నిరాశలో మునిగిపోవలసిందేనా! లేదు, లేదు దు:ఖాన్ని ధిక్కారమై పలికించాలి. అశ్రువులను ఉప్పెనలుగా మలచాలి. ఒట్టిమాటలకు ప్రబోధాలకు పరిమితమయి, దేశ ప్రజలను వాళ్ళ బాధలకు వాళ్ళనొలేసి చేతులు దులుపుకునే బాధ్యతా రహితులకు సరైన గుణపాఠాలను నేర్పాలి. జనులు శ్మశానానికి క్యూగడుతుంటే, మందుల మార్కెట్కు తెరలేపటంలోని దేశభక్తిని నిలదీయాలి. మన ఊపిర్లదగ్గరి ప్రాణవాయువును, వ్యాక్సిన్లనూ ప్రపంచమార్కెట్లో, పరాయిదేశాలకు తరలించడంలోని స్వదేశీ మంత్రగాళ్ళ బండారాన్ని విప్పేయాలి. 'ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన కరగిపోయే' అని పాడుకుని రోధించిన నేలలోనే భూమినేలు రాజన్యుని యధికార ముద్రికలు అంతరించునను సత్యాన్ని నిరూపించాలి.