Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్రం జాషువా చెప్పిన ''పిశాచీ బాంధవశ్రేణే'' ఈ'పైసా'చికులు. వీరి గురించే మార్క్స్ ''లాభం పది శాతం ఉంటుందనుకుంటే పెట్టుబడి ఎక్కడికైనా దూకుతుంది. ఇరవైశాతం ఉంటుందంటే (దానికి) ఉత్కంఠరేగుతుంది. యాభైశాతం లాభం వస్తే అన్ని మానవ విలువలను తొక్కి పడేస్తుంది. లాభం 300శాతం ఉంటుందంటే తన యజమానిని ఉరితీయడానికి కూడ పెట్టుబడి వెనుకాడదు'' అంటాడు కార్ల్‌మార్క్స్.
భారతదేశంలో నేడు అన్ని మానవ విలవల్ని కరోనా ఛిద్రం చేస్తోంది. ఆక్సిజన్ కోసం పరితపించి ఊపిరందక తల్లి ఒళ్లో చనిపోయే కొడుకు, నడవలేని ముసలివాణ్ణి వీల్‌చెయిర్ లేకుండా దేకిస్తూ సిలెండర్‌తో సహా లాక్కుపోయే వార్డ్బోరు ఇవన్నీ మోడీ మార్క్ మోడల్ స్టేట్ గుజరాత్ రాజధానిలోనే సుమా! ప్రాణవాయువును నల్లబజార్లకు తరలించే వ్యాపారులు, ఆస్పత్రిలో బెడ్ బుకింగ్పేరిట దానికి ముందు అంబులెన్స్ బుకింగ్పేరిట వేలు గుంజే ఆన్లైన్ ''సేవ''కులు, రోజుకి లక్షల్లో ఫీజులు వసూళ్ళు చేసే కార్పొ'రేట్లు' వీరంతా 3వ నంబర్ 'పైసా'చికుల క్యాటగిరీ. నిన్నటిదాకా ప్రపంచానికే టీకాలు ఎగుమతి చేస్తున్నామని ఢిల్లీలోని మోడీ నుంచి గల్లీలోని భక్త బత్తాయిల వరకు బీరాలు పోయారు. బింకాలు పలికారు. ఎందుకంటే మన రాష్ట్రంలోని భారత్ బయోటెక్, పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐఐ)లో టీకాలు తయారవుతున్నాయి. ఇందులో మొదటిదే (అంటే కోవాగ్జిన్) దేశవాళీది. రెండవది ఆక్స్ఫర్డ్ వారు సృష్టించి అమెరికన్ బహుళజాతి సంస్థ ఆస్ట్రాజెనికా తయారుచేసే కోవిషీల్డ్. దానికి సబ్లైసెన్సీగా పూణేలోని ఎస్ఐఐలో ఉత్పత్తి చేశారు. ఏ దేశం నుంచి ఆర్డర్స్ వస్తే వారికి సప్లయి చేసింది ఈ ఎస్ఐఐ. ఇప్పుడు రెండవ అల, మహౌగ్రమై సునామీలా విరుచుకు పడుతూంటే ఈ'పైసా'చికుల కారణంతో 'ఊపిరందని జనం పిట్టల్లా రాలిపోతున్నారు. టీకా దొరికితే మహత్ భాగ్యమనే స్థితి దాపురించింది. దీంతో రాష్ట్రాలకు ఒకధర, కేంద్రానికో ధర, ప్రయివేటు ఆస్పత్రులకో ధర ప్రకటించారు పైన పేర్కొన్న 'పైసా' చికులు. ఇది స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ అన్నట్లు ''మానవత్వ సంక్షోభా''నికి దారితీసింది. మార్క్స్ చెప్పిన యాభై, వంద, మూడువందల శాతం లాభాలు దండుకునే ఈ శ్రేణే రెండవ తరహా ''పైసా''చికులు. ఈ రెండు క్యాటగిరీలే అసలైన 'పైసా'చికులని మార్క్స్ చెప్పింది.
అయితే ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్లో అసలు, సిసలైన పైశాచికానందం పొందుతున్న రాజకీయ ''అథమ పురుష''శ్రేణే మొదటితరహా పైశాచికులు. కరోనా వైరస్‌ను శాస్త్రీయంగా అంచనా వేయలేదు మోడీ అండ్ కంపెనీ. నేడు మనదేశంలోనే రూపాంతరం చెందిన వైరస్ బి.1.167. నేటి దేశ దుర్దశకి కారణం ఇదే. 2020 అక్టోబర్‌లో దీన్ని గుర్తించినా మోడీసర్కార్ చేష్టలుడిగి కూచుంది. జనవరిలో కోటి 16 లక్షల డోసులకు ఆర్డరిచ్చారు. గుళ్లో ఏదో చేయకపోతే గుగ్గిలమేసినంత బరాబరి! అని తెల్సినా ఎన్నికల ర్యాలీలు, కుంభమేళాలు కొనసాగాయి. కుంభమేళాకి రండని ప్రధాని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిపేరున బ్యానర్లు కట్టారు. హాజరైన 35లక్షల మందికి ''గంగమ్మతల్లి'' మీ కరోనాను కడిగి పారేస్తుందని పై బ్యానర్లలో రాశారు. ఆతర్వాత వచ్చే ఎన్నికల్లో హిందూ ఓట్లు రాల్చుకోవడానికి వీలుగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా జనాన్ని కరోనాకు ఆహారంగా వదిలారు. ఇదే నేడు సూపర్ స్ప్రెడర్గా ఆ రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్నది. పైసా వసూల్ రాజాలను జనం మీదికి విసిరిన వీరిది పైశాచికానందం కాక మరేంటి?!
కోవిడ్ ప్రోటోకాల్‌ను గాలికొదిలేసిన పదవీ వ్యామోహ పిశాచాలు వీళ్ళు. బెంగాల్లో 30 మీటింగులు మోడీ, 50కి పైగా రోడ్‌షోల్లో అమిత్‌షాలు తిరిగారు. జనానికి మాస్క్‌ల్లేవు, భౌతికదూరం పాటించేవారు లేరు. కరోనా విస్ఫోటనానికి ఇవి చాలవా?!
దేశంలోని ఏ మెట్రోనగరంలోనూ అవసరమైనన్ని ఐసీయూ బెడ్స్ లేవు. వెంటిలేటర్లు లేవు. ఆక్సిజెన్ సిలెండర్లు లేవు. ఇప్పటికి కేవలం పదిశాతం కంటే తక్కువ జనాభాకు టీకాలు వేశారు. అమెరికాలో 57శాతం, బ్రిటన్‌లో 60శాతం తమ జనాభాకు టీకాలేసేశారు. ఎలాగంటే గత అక్టోబర్‌లోనే అమెరికా 40కోట్ల డోసులు, ఇ.యు. 80కోట్ల డోసులు బుక్‌చేసుకున్నారు. తన జనాభా ఆరోగ్య రికార్డులన్నింటినీ ఆస్ట్రాజెనికాకు అందుబాటులో ఉంచడం ద్వారా ఇజ్రాయిల్ పుక్కట్లో టీకాలు సంపాదించింది. భారతదేశంలో వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వస్తుందని ఔట్లుక్ పత్రిక రాసింది. క్రయోజెనిక్ ట్యాంక్‌లను ఇతర దేశాల నుంచి విమానాల్లో తెప్పించుకోడం ఎన్నడైనా చూశామా? ఒక రాష్ట్రం నుంచి మరోరాష్ట్రానికి ఆక్సిజన్‌ను నింపుకున్న విమానాలు గాల్లోకి లేవడం ఎన్నడైనా చూశామా? గుళ్ళలోకి భక్తులు రావద్దు మొర్రో! పూజార్లకి కరోనా వస్తోందనే బోర్డులు తగిలించడం ఏన్నాడైనా చూశామా?
కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. గురుబలం గంపెడున్నా, శుక్రుడు శుభదృష్టితోనే చూసినా, తారాబలం కుదిరినా, వధూవరుల చూపులు కలిసినా, పెద్దల మాటా ముచ్చటా పూర్తయినా రేపు మే, జూన్ మాసాల్లో పెండ్లిండ్లు వాయిదా వేస్తున్నారు. కుదుర్చుకున్న ముర్తాలకి కరోనా అడ్డుపడుతోంది. కరోనాను కట్టడి చేయలేని పాలకుల 'చలవే' ఇదంతా! కొందరు శాస్త్రవేత్తలు చెపుతున్నట్టు నవంబర్‌లో 3వ అల రాకుండా ఇక్కడితో సమసిపోతుందని ఆశిద్దాం. పైశాచికుల ప్రోత్బలంతో రెచ్చిపోతున్న 'పైసా'చికులకు కళ్లెం పడుతుందనే ఆశిద్దాం.