Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసుపత్రులు హౌజ్‌ఫుల్... స్మశానాలూ హౌజ్‌ఫుల్.. ఊపిరాడటం లేదు, కాడు ఆరటం లేదు. నేడు కరోనా గాఢ పరిష్వంగంలో ఎప్పుడు ఎవరు వాలిపోతారో, ఎక్కడ ఎవరు రాలిపోతారో తెలియని హృదయవిదారకమైన పరిస్థితి ఈ దేశానిది. భారతదేశం మొన్నెన్నడూ ఎరుగని భయానకమైన విపత్తును చూస్తున్నది. ఆరని చితిమంటల సాక్షిగా తీరని వేదన అనుభవిస్తున్నది. గంగ మొదలు నాగావళి వరకూ నదీ తీరాలన్నీ సామూహిక శవదహనాలతో విషాదాగ్నులై ప్రవహిస్తున్నాయి. మహమ్మారి రెండవ అల వలయంలో దేశం విలవిలాడుతున్న తీరుకు నేడు ప్రపంచమే కన్నీరు పెడుతున్నది. ''భారత్‌లో పరిస్థితులు హృదయాలను కలచివేస్తున్నాయ''ంటూ సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థే విచారాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో మనమున్నాం. ఇంతటి అనర్థానికి కారణాలేమిటి? ఈ మహావిషాదానికి కారకులెవరు? ఈప్రశ్నలకు సమాధానంగా అంతర్జాతీయ మీడియా మోడీ వైపే వేలెత్తి చూపుతున్నది. ఆయనది ఒక బాధ్యతారహిత నేతృత్వంగా దుమ్మెత్తిపోస్తున్నది.
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగాని తనం వల్లే దేశం కరోనా కూపంగా మారిందని ప్రపంచ ప్రసార మాధ్యమాలు హౌరెత్తుతున్నాయి. భారత ప్రభుత్వ నిర్వాకానికి ఆ దేశమే కాక ప్రపంచమంతా మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించనున్నదని హెచ్చరిస్తున్నాయి. ఊహించని వేరియంట్లు భారత్‌లో పురుడుపోసుకుని ప్రపంచానికే ప్రమాదంగా పరిణమించే స్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ నుంచి గార్డియన్ వరకు.. ప్రఖ్యాత మాధ్యమాలన్నీ మోడీ సర్కార్ తీరును తూర్పారబట్టాయి. కరోనా ప్రమాదమేంటో ఏడాది కిందటే తెలిసినా, రెండో దశకు ఏడాది సమయమున్నా ప్రభుత్వం ఎందుకు సన్నద్ధం కాలేకపోయిందని నిలదీసాయి. దేశమంతటా చావుగంట మోగుతుంటే ఎన్నికల ర్యాలీల్లో ఊరేగడం సమంజసమేనా? కుంభమేళాలకు పిలుపునివ్వడం విజ్ఞతేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
నిజమే కదా! ప్రపంచమంతా కరనా రెండవ తరంగాన్ని ఎదుర్కోవడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకుంటుంటే, మోడీ మాత్రం ఆ సమయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల రాజకీయాలకు వాడుకున్నారు. అంతకు ముందు ప్రభుత్వాల్ని పడదోయడానికీ, ప్రత్యర్థులపై దాడిచేయడానికీ వాడుకున్నారు. విపత్తుసమయంలో కూడా తమ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల అవసరాల గురించి ఆయన పట్టించుకున్నదెక్కడీ పైగా వ్యాక్సిన్స్లూ, అత్యవసర ఔషధాలూ ప్రజల ప్రాణావసరాలుగా కాక, కంపెనీల వ్యాపారసాధనాలుగా మారిపోతుంటే చోద్యం చూశారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన నేతగా కీర్తిగడించాలన్న వ్యామోహమే తప్ప తగిన ప్రణాళికలను, ప్రజల నిజమైన అవసరాలను గుర్తించలేకపోయారు. ఫలితంగా ప్రపంచానికి వ్యాక్సిన్ కాదు కదా, దేశానికి ఆక్సిజన్ కూడా అందించలేని నేతగా మిగిలిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలో దేశాన్ని కరోనా విపత్తుకు గురుత్వ కేంద్రంగా మార్చేసారు. అందుకే అంతర్జాతీయ మీడియా ఇంతగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే దేశంలో రైతుల ఆందోళన పట్ల మోడీ నిర్లక్ష్యాన్నీ ప్రజా వ్యతిరేక స్వభావాన్నీ ఎండగట్టిన అంతర్జాతీయ మీడియా, ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో మండిపడింది. దేశంలో మీడియాను మ్యానేజ్ చేయడం ద్వారా విమర్శను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని కూడా పేర్కొనడం వాస్తవాలకు అద్దం పడుతోంది. స్వదేశీ మీడియాను నయానో భయానో తన నియంత్రణలో ఉంచుకున్న ప్రభుత్వం, సోషల్ మీడియాలో సైతం తమను విమర్శించే ట్వీట్లనూ పోస్టులనూ తొలగిస్తున్న వైనాన్ని కండ్లార చూస్తూనే ఉన్నాం.
మరి విమర్శనే ఎదుర్కొలేని సర్కారు విపత్తునెలా ఎదుర్కోగలదు? ప్రశ్నను సహించలేని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలదు? అసలు విమర్శన్నా, ప్రశ్నన్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత అభద్రతకు గురవుతోంది? నిజానికి విమర్శ లోపాలను సరిచేసుకునే అవకాశాలను అందిస్తుంది. ప్రశ్న జవాబుదారీతనాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ రెంటికీ భయపడే ప్రభుత్వం ప్రజలకేం చేయగలుగుతుంది? కాబట్టే మొదట్లో వారానికోసారి టీవీల్లో ప్రత్యక్షమయ్యే నేతలు ఇప్పుడు మీడియా సమావేశాలకే మొహం చాటేశారు. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమివ్వలేక తమ అభిప్రాయాలను ప్రకటనల ద్వారా వెల్లడించడానికే పరిమితమవుతున్నారు. మూలవిరాట్ అయితే గత ఏడేండ్లలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టని దేశాధినేతగా రికార్డులకెక్కాడు. ప్రపంచ మీడియా చెబుతున్నట్టు ఈ ప్రభుత్వ చేతకానితనానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇది తలలూపాల్సిన సందర్భం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించాల్సిన సందర్భం. ప్రభుత్వాలపై ప్రజలు నమ్మకముంచడం కాదు, ప్రభుత్వాలే ప్రశ్నలూ విమర్శలపై విశ్వాసముంచాల్సిన సమయం. అంతర్జాతీయ మీడియా అందిస్తున్న సందేశమిదే.