Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పౌరహక్కులనగానే ఏ కొద్దిమందికో పరిమితమైన వ్యవహారంగా చూడటం పరిపాటైంది. పాలకవర్గాలు సైతం దీనిని అవకాశంగా తీసుకుని హక్కుల ఉద్యమకారులపై తప్పుడు ప్రచారానికి, అణచివేత చర్యలకు దిగుతూ ఉంటాయి నిజానికీ, పౌరహక్కులనేవి దేశంలోని ప్రజలందరికీ సంబంధించినవి! రాజ్యాంగం ధృవీకరించినవి! ఒక్క మాటలో చెప్పాలంటే గాలి పీల్చడం, ఆకలేస్తే కడుపుకింత తినడం ఎంత సహజమో మనిషి, మనిషిగా బతకడానికి హక్కులు కూడా అంతే! అందుకే, ప్రతి ఆధునిక రాజ్యమూ పరిమితులతోనైనా సరే పౌరహక్కులను గుర్తిస్తుంది. చట్టాలను చేస్తుంది. అరకొరగానైనా అమలు చేస్తుంది. అదే సమయంలో అవి తమ ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తే వాటిని తుంగలోకి తొక్కేస్తుంది.
తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలో కస్టడీలో ఉన్న యువకుడి మరణానికి సంబంధించిన కేసులో ఒక ఎస్.ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు పది సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ అక్కడి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. ఈ తీర్పు కూడా అంత సులభంగా ఏం రాలేదు. స్థానిక డిఎంకె నాయకుడికి, యవకుడికి మధ్య నెలకొన్న భూవివాదాన్ని పోలీసులు మసిపూసి మారేడు కాయ చేసిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. దేవుని ఉత్సవంలో భక్తులను కత్తితో బెదిరిస్తున్నాడని, దొంగతనం చేస్తానంటున్నాడని ఆయనపై నేరారోపణ చేసి పోలీస్ స్టేషన్లో ప్రాణాలు పోయేంతవరకు చితక్కొట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినందువల్లే ఈ కేసులో విచారణ ముందుకు సాగి నేరస్తులకు శిక్షలు పడినాయి. ఈ తరహా సంఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారిని తప్పుడు కేసులతో వేధిస్తున్న సంఘటనలు కోకొల్లలు. వీటిని ప్రశ్నించడం, నిలదీయడం ప్రజాస్వామిక హక్కే!
కరోనా విలయ తాండవానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్ఎ) దాఖలు చేసిన పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు, ఇచ్చిన ఆదేశాలు ఆహ్వానించదగినవి. కరోనా విజృంభణతో సామాన్యుడి బతుకులు చితికి పోవడం ఒక ఎత్తు కాగా, వ్యాధి బారిన పడిన అభాగ్యుల కష్టాలు మరో ఎత్తు! వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి, ఆస్పత్రులలో బెడ్లు, మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇలా ప్రతిదీ సమస్యగా మారింది. సన్నిహితులు ఆస్పత్రి పాలవుతుంటే మళ్లీ ప్రాణాలతో తిరిగి చూస్తామా అన్న ప్రశ్నతో నిలువెల్లా వణికిపోతున్న దుస్థితి సామాన్యులది! వైద్యం పొందడం, ప్రాణాలు కాపాడుకోవడం వీరందరి హక్కు! ఇదే విషయాన్ని ఎపిసిఎల్ఏ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. చికిత్స, ఫీజులు, ఆక్సిజన్ సరఫరాతో పాటు వివిధ అంశాలపై ధర్మాసనం ఇచ్చిన తీర్పుతోనైనా కరోనా చికిత్సలో పారదర్శకత పెరుగుతుందని, సామాన్యుడికి భరోసా దక్కుతుందని ఆశిద్దాం. ఆస్పత్రికి వచ్చిన రోగికి వైద్యం చేయకుండా తిప్పి పంపకూడదంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ప్రజల హక్కులకు పట్టం కట్టేదే!
వివిధ సంఘాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామికమైనది. ఈ మేరకు మార్చి 30న జారీ చేసిన జీవో నెంబర్ 73 ఏప్రిల్ 23 దాకా వెలుగులోకి రాకపోవడం ఎన్నో సందేహాలను రేకెత్తిస్తోంది. సీఏఏ, ఎన్ఆర్సీ రద్దుకు ఉద్యమించడాన్ని కూడా నిషేధించడానికి కారణంగా చూపడం హాస్యాస్పదం. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావే వీటిని వ్యతిరేకించడం దేశమంతా చూసింది. అదే కారణమైతే ఆయన్ను, ఆయన పార్టీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏం చేయాలి? దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది వీటిని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకు వచ్చారు. వారందరినీ నిషేధిస్తారా? భీమా కోరెగావ్ కేసులో అరెస్టయిన వారి విడుదల కోసం ఆందోళనలు చేశారన్న కారణం కూడా ఇటువంటిదే. అసలా కేసే పెద్ద కుట్ర అనే ఆధారాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం విస్మరిస్తే ఎలా? అందుకే, హక్కులనేవి సమాజానికి సంబంధించినవి. వాటి పరిరక్షణే ప్రజాస్వామ్య మనుగడకు కీలకం. ఈ దిశలో ప్రజలను చైతన్యవంతం చేయడమే ప్రజాతంత్ర శక్తుల కర్తవ్యం.