Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షణాలు కేవలం కాలాన్ని అనుసరించే పరివారం కాదు. కొన్ని క్షణాలుంటాయి... యావత్ మానవ చరిత్రనూ మార్చగల మహత్తు ఉన్నవి'' ఒక కవి అన్న ఈ మాటలు మేడేకి సరిగ్గా సరిపోతాయి. శ్రమశక్తిని తట్టిలేపి కర్తవ్యబోధ చేస్తుంది మేడే. 135 యేండ్లయినా నాటి కిరాయి పోలీసులు బలిగొన్న మెక్కార్మిక్ ఫ్యాక్టరీ కార్మికుల రక్తం మన గుండెలకు వెచ్చగా తగుల్తూనే ఉంది. ఉరితీయబడ్డ కార్మిక నాయకుల శిరస్సులు మనతో ముచ్చటిస్తూనే ఉన్నాయి. వేతన దోపిడీపై తిరగబడమన్న వారి మాటలు ప్రపంచ కార్మికుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మేడేకున్న శక్తి అది! యంత్రంలో యంత్రమై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ చాకిరీ చేసే కార్మికులకు వ్యవస్థపై విరుచుకుపడటం నేర్పింది మేడే. కార్మికుల స్వేదాన్ని, రక్తాన్ని పీల్చిపిప్పి చేయటం 'పెట్టుబడి' ఎంచుకున్న ప్రాథమిక దోపిడీ పద్ధతి. అయితే ''ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తిగత పెట్టుబడిదారునికి వ్యతిరేకంగా పోరాడి పనిగంటలు తగ్గించుకుంటే అది ఆర్థిక పోరాటమవుతుంది. ఇందుకు భిన్నంగా పోరాటమొకటి ప్రజ్వరిల్లి 8 గంటల పనిదినం సాధిస్తే అది రాజకీయ ఉద్యమమవుతుంది'' అన్నాడు కారల్ మార్క్స్. ఆ మాట ఆ తర్వాత ఈ నేలపై నిజమై నిలువలేదా?
1886 నాటి పనిగంటల తగ్గింపు ఉద్యమం ప్యారిస్ కమ్యూన్ నాటి తప్పటడుగులు సరిచేసుకుంటూ.. రైతాంగాన్ని తన సందిట నిలుపుకుంటూ శ్రీశ్రీ అన్నట్టు ''లెనిన్ తపస్సు, స్టాలిన్ సేద్యం జ్వలించిన, ఫలించిన సముజ్వల తేజ''మై తొలి కార్మికవర్గ రాజ్యమై నిలువలేదా? ఇది 1919లో ఐఎల్ఓ ఏర్పాటుకు దారితీసి, దాని సభ్యదేశాలన్నీ చట్టప్రకారం 8 గంటల పని విధానాన్ని ఆమోదించలేదా? మార్క్స్ ఆశించిన ''రాజకీయ ఉద్యమం'' ఇదే కదా! ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో రక్త పిపాసి హిట్లర్ కుక్కచావుకు కారణమై, సోషలిస్టు శిబిర ఏర్పాటు రాజకీయ పెను మార్పు కాదా? అది కారకమై, ఉత్ప్రేరకమై, భాస్వరమై మండి వలస వ్యవస్థను విధ్వంసం చేయడం కనీవినీ యెరుగని రాజకీయ మార్పే! చికాగో కార్మికుల రుధిరధారలు వృథా కాలేదనడానికి ఇంతకంటే మించిన రుజువులు ఏం కావాలి? సమసమాజాన్ని అవి ఆవిష్కరించాయి. మానవజాతి చరిత్రలో మున్నెన్నడూ చూడని మార్పులివి. మనిషిని మనిషి దోచుకోని సమసమాజాన్ని ఆవిష్కరించాయి.
శాస్త్రాన్ని అనువర్తింపచేయడంలో జరిగిన లోపాలు సోషలిస్టు శిబిరాన్ని దెబ్బతీశాయి. కృశ్చేవ్లు, టిటోలు, సిసెక్యూలవంటి కుక్కమూతి పిందెలు కాసి ఆ మహావృక్షాన్ని దెబ్బతీశారు. ఆ సరికి ద్రవ్య పెట్టుబడి విశ్వవ్యాప్తినొందింది. దాంతో పెట్టుబడిది పైచేయి అయ్యింది.
ఆ వరుసలో మన దేశంలో మోడీ సర్కార్ ప్రతిష్టాపితమయ్యింది. ప్రస్తుతం మన దేశంలో ఈ 'కారణజన్ముడి' ఆధ్వర్యంలో పెట్టుబడికి చేసే ఊడిగం పరాకాష్టకు చేరింది. శతాబ్దకాలంగా అనుభవిస్తున్న హక్కులు, పోరాడి సాధించుకున్న చట్టాలు మూటగట్టి తన కార్పొరేట్ మిత్రులకు ముడుపుగా చెల్లిస్తున్నదీ ప్రభుత్వం. ఈ కార్పొరేట్లే మన పంటల్ని మేసెయ్యడానికి సిద్ధమయ్యారు. కార్మికోద్యమ ఉరికి నాలుగు కార్మికకోడ్లు, వ్యవసాయ రంగ విధ్వంసానికి, దేశంలో ఆహార భద్రతను దెబ్బతీసేందుకు మూడు వ్యవసాయ చట్టాలు తమ మందబలంతో పార్లమెంటును బుల్డోజ్ చేసి ఆమోదించుకుంది బీజేపీ.
దేశ విదేశీ కార్పొరేట్లు ఆంబోతుల్లా స్వైర విహారం చేయడానికీ, స్వేచ్ఛా వ్యాపారానికీ మన దేశ ఆర్థిక వ్యవస్థను చదునుచేసి సన్నద్ధం చేస్తోంది మోడీ సర్కార్. మతాల మధ్య నిలువుగోడలు నిర్మిస్తూ, కార్మికులనూ చీలుస్తున్నది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను శాస్వతం చేయడానికి వెంపర్లాడుతున్నది. ఈ రెంటిపై ద్విముఖ పోరుకు నడుంబిగించాల్సిన దశలో వచ్చిన ''మేడే'' అన్ని మేడేల్లాంటిది కాదు. పాలకులతో అమీతుమీ తేల్చుకోవాల్సిన దశలో ''నువ్వెటు?'' అని ప్రశ్నిస్తోంది మేడే 2021.
''ప్రతి యుగమూ ఒక మూర్ఖ సిద్ధాంతపు పరిపాలనని ఆహ్వానిస్తుంది. దాని సార్వభౌమత్వానికి హృదయపూర్వకంగా లొంగుతుంది. బౌద్ధికశక్తి మాత్రం అనుమానంతో చూస్తూ ఉంటుంది.. మరో యుగపు గుడ్లు పొదుగుతూ..'' అన్న గుంటూరు శేషేంద్ర శర్మ మాటలు మోడీ పాలనను గుర్తుచేస్తున్నాయి.
''ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఎదురైనా ముందుదారి'' మనది.. ముందుకే సాగుదాం..