Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాటల వంతెన కూలిపోగానే, ఎవరికి వారు ఆరాటంగా, 'పక్కపక్కనే నడుస్తున్నా, అందరూ అగంతకులే'. లోపలి మనిషి రోదించే క్షణాన, ఎవరికి వారే వోదార్చుకోవడం తప్ప! మనం రెండో ముఖాన్ని కనిపెట్తలేం. కానీ కాలం ముసుగు తీయగానే దాగిన నైజాన్ని చూసి నిలదీసి, నటించే నైజాన్ని చూపుతుంది. నిజాయితీ వల్లె వేసేవాడు చేతల్లో దొరికి పోతాడు, - (నిఖిలేశ్వర్). అవును ఎప్పటికయినా దొరికిపోతాడు. మాటలు కోటలు దాటినా, చేతలు గడపలుదాటని వాడి ముఖౌటాలు తొలగిపోతాయి. ఎప్పుడో ఒకప్పటికి వొట్టిమాటల బండారం బయటపడక మానదు.
ఇప్పుడు మాటల గురించి, మాటిచ్చినవారి చేతల అసలు రూపాల గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది మాట్లాడటం, మాటలకూ చేతలకూ పొంతనలేకుండా నడవటం ఒక రివాజుగా మారిపోయింది. నిజంగా మాటకు చాలా విలువుంటుంది. మాటపై నిలబడిన వాళ్ళకూ విలువుంటుంది. మాటల్ని నీటి మూటలు చేసేవాళ్ళు నిత్యం మనకు ఎదురౌతూనే ఉంటారు. వారికే విలువ ఉండదు. ఎవరి మాట చివరికంటా చేతల వరకు వెళుతుందో, ఎవరి మాట చేతగా రూపొందుతుందో కాలం పసికడుతుంది. మాటలు తప్పినవాళ్ళను పసిగట్టటం, పనిపట్టటం ఒక కాలానికే చేతనవును. సాధారణ, సామాన్య మనుషుల సంగతి అటుంచితే, ఎవరైనా పెద్దవాళ్ళు, నాయకులుగా ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారంటే పదిమందీ ఎంతో విలువనిచ్చి వింటారు. నిజమని నమ్ముతారు. అలాంటి పెద్దల మాటలే డొల్లగా మారి, నిజం కాకపోవడం చూస్తుంటే మాటలపైనే నమ్మకాలు పోతున్నాయనిపిస్తోంది.
మన పురాణాలలో, కావ్యాలలో కూడా కథానాయకులు గొప్పవారుగా పేరొందటానికి కారణం వాళ్ళ మాటలకూ చేతలకూ భేదం లేకపోవడమే. రామాయణంలో శ్రీరాముడు ఒకే మాట ఒకే బాణమని పేరు తెచ్చుకున్నాడు. మాటతప్పనివాడు కనుకనే అతని మాటకు విలువనిచ్చారు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని, అధికారాన్ని, సర్వాన్ని కోల్పోయినా జంకలేదు. సత్యం మాట్లాడటం కోసం శంభూకుడు తన తలనే ఫణంగా పెట్టాడు. ఇలా ఎన్నయినా చెప్పుకుంటూపోవచ్చు. కానీ ఇప్పుడు మాటకూ చేతకూ పొంతన తెగింది. దూరం పెరిగింది. చేతలలోంచి పుట్టిన మాట, మాటలలోంచి విస్తరించిన చేత నిట్టనిలువునా చీలిపోయింది.
ఒక్కసారి వెనక్కి తిరిగి మాటలను గమనించండి. 'దేశం వెలిగిపోతోందని' పలికిన పలుకుల మర్మమేంటోగానీ, నేడు శ్మశానంలో శవాల మంటలు మాత్రమే చీకట్లో వెలగటాన్ని చూస్తున్నాం. ఇంకా 'అచ్చేదిన్ ఆనేవాలేహై' అన్నారు. మంచిరోజు లెక్కడొచ్చాయి. వేలాది, లక్షలాది మంది ప్రజలు, వలస కార్మికులు కనీస సౌకర్యాలు లేకుండా, కాలినడకన తమ ఊళ్ళకు నడిచిపోతున్నా మార్గంలో ప్రాణాలు కోల్పోతున్నా ఆదుకొను చేతలురాలేదు. కోట్లాది ప్రజలు ఉపాధి కోల్పోయారు. కొత్తగా వస్తాయన్న కొలువులకు గతిలేదు. కానీ ఆదానీ అంబానీలకు అచ్చేదిన్లు వచ్చాయి. వారి ఆస్తులు మూడువందల రెట్లు పెరిగాయి. 'బేటీ పడావ్-బేటీ బచావ్' ఆడపిల్లలను చదివించటం పక్కనపెట్టండి. అత్యాచారాలు పెరిగిపోయాయి. బాధితులవైపు నిలబడాల్సిన ప్రభుత్వం, నాయకులు బేటీ బచావ్ అన్నవాళ్ళు పీడకుల పక్షం వహించడం దేశమంతా చూస్తూనే ఉంది. 'మేక్ ఇన్ ఇండియా' మరో మాట. ఇక్కడ తయారవుతుంది కానీ ఉపయోగంలోకి రాదు. విదేశాలకు తరలిపోతుంది. వ్యాక్సిన్లు, మందుల కోసం దేశాలవెంట చేయిచాచటం చూస్తూనే ఉన్నాం. 'మినిమమ్ గవర్నమెంట్ - మాగ్జిమమ్ గవర్నెన్స్' ఇది మరో మాటలాంటి నినాదం. గవర్నమెంట్లేదు - పరిపాలనాలేదు. హైకోర్టుల నుంచి, సుప్రీం కోర్టు వరకు ఏం చేస్తున్నారు మీరు? ఏది ప్రణాళిక ఇప్పటివరకు ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? అని మందలించేదాకా చీమకుట్టనట్లు వ్యవహరించే వీరి మాటల వెనకాల దుర్మార్గం ఎంతదాగి ఉందో తెలుసుకోవటం అవసరం. వీళ్ళేమీ చేష్టలుడిగిలేరు. 'ప్రభుత్వమా' మేమిన్ని బాధలు పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకోండి' అని మొరపెట్టుకుంటున్న బాధితుల ప్రశ్నలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న వారి నైచ్యాన్ని అర్థంచేసుకోవాలి. 'సబ్కా సాత్ సబ్ కా వికాస్' కాస్తా అంబానీ ఆదానీకే సాత్, కార్పొరేట్‌కా వికాస్‌గా మారిపోలేదా? సామాన్య రైతుల పాలిట శాపంగా పరిణమించిన చట్టాలను కార్పొరేట్ల లాభాల కోసం తీసుకువచ్చి, రైతులను అణచివేయపూనుకోవడం వెనకాల దాగిన దుష్టత్వాలను ఇంకా తెలుసుకోవాల్సే ఉంది. 'స్వచ్ఛ భారత్' పేరుతో కల్మషాలను, విద్వేషాలను ప్రజల మధ్య నింపుతున్న వారి మాటల ఆంతర్యాలను గ్రహించాల్సే ఉంది.
మహాకవి గురజాడ 'వొట్టిమాటలు కట్టిపెట్టోరు.. గట్టిమేల్ తలపెట్టవోరు' అని ఇలాంటి మాటల రాయళ్ళనుద్దేశించే అని ఉంటాడు. అందుకనే మాటల వెనకాల ఉన్న చేతలను గమనించాలి. లేకుంటే మోసపోతూనే ఉంటాము. ముఖ్యంగా నాయకుల మాటల్ని, వారి చేతల్ని అప్రమత్తంగా కనిపెడుతూ ఉండాలి. మాటల వెనకాలి గోతుల పట్ల జాగ్రత్త పడాలి.