Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్రమోడీ ఇంద్రజాల ప్రదర్శనకు భంగపాటే ఎదురయింది. అర్థబలం, అంగబలం, అధికారబలంతో సర్వశక్తులొడ్డినా సాధించలేకపోయారు. కేంద్రపాలకులంతా కాలుకు బలపం కట్టుకుని తిరిగినా విజయతీరాలను చేరలేకపోయారు. చివరికి ఎన్నికల కమిషన్ ప్రతిష్టను, కేంద్ర బలగాల స్వతంత్రతను ఫణంగా పెట్టినా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలను గెలవడానికి విభజన రాజకీయాలు మొదలు అధికార దుర్వినియోగం వరకు, ఫిరాయింపులు మొదలు బెదిరింపులవరకు, కమలదళం ఉపయోగించని సాధనమంటూ లేదు. అయినా బెంగాల్‌ను గెలవలేకపోయారు. తమిళనాడులో పుంజుకోలేకపోయారు. కేరళలో ఉన్న ఒక్క సీటునూ కోల్పొయారు. చావుతప్పి కన్నులొట్టబోయిన తీరున అస్సోంను నిలుపుకోగలిగారు. పుదుచ్చేరిలో పాగా వేయగలిగారు. బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా కేరళలో లెఫ్ట్, తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో టీఎంసీలు విజయకేతనం ఎగురవేసాయి.
ఈ ఫలితాలకు కారణాలేమైనప్పటికీ ఇవి బీజేపీ ఏకపక్ష రాజకీయాలకు పెద్ద ఎదురుదెబ్బ. మేం అఖండులం, అజేయులమని విర్రవీగేవారికి చెంపపెట్టు. అదే సందర్భంలో కేరళలో మినహా ఈ ఫలితాలు విజేతల సుపరిపాలనకు బహుమానాలు కూడా కావు. అదే నిజమైతే అసోంలో బీజేపీ, బెంగాల్లో టీఎంసీలు గెలవకూడదు. తమిళనాడులో కూడా అన్నాడీఎంకేకు అన్ని సీట్లు రాకూడదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలేవీ సమర్థపాలనకు, ప్రజల సంక్షేమానికీ ప్రతీకలు కావు. అవినీతికీ అవకాశవాద రాజకీయాలకూ ఆనవాళ్లే. అయినా వారిని ప్రజలు తిరిగి గెలిపించారంటే కారణం, వారు బీజేపీని ఓడించదలచుకున్నారు. ప్రజల నిజమైన అవసరాలను, ఆకాంక్షలను విస్మరించి, వారిని భావోద్వేగాలలో ముంచెత్తి పీఠాలనధిరోహించా లనుకుంటే అది ఎల్లకాలమూ చెల్లదని చెప్పదలిచారు.
గడిచిన ఏడేండ్లలో దేశంలో మోడీషాల విజయగర్వానికి తూట్లుపొడిచే తీర్పులనేకం వచ్చినప్పటికీ, ప్రజాతీర్పును మంటగలిపి, ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, దొడ్డిదారిలో తమ ప్రభుత్వాలను కొలువుదీర్చడం కమలదళానికి ఓ ఆనవాయితీగా మారింది. కానీ ఈసారి అందుకు ఏమాత్రం అవకాశంలేని తీర్పు ఇది. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కారం. ఈ తీర్పు చారిత్రాత్మక రైంతాంగ నిరసనలకు సంఘీభావం. ఈ తీర్పు ప్రజాస్వామిక, లౌకిక భావాలకు ఊపిరి. కరోనా మహమ్మారి నియంత్రణలో కేంద్రం వైఫల్యాలకూ బాధ్యతారాహిత్యానికీ నిరసన. మోడీ పట్ల తొలగుతున్న భ్రమలకు ప్రతీక. అన్నిటికీ మించి ప్రత్యామ్నాయ రాజకీయాలకూ ప్రతిపక్షాల బలోపేతానికీ గొప్ప అవకాశం. ఫలితాల తీరు చూస్తే కమలనాథులు ఎన్ని పన్నాగాలు వేసినా వారు ఆశించినట్టు హిందూ ఓటర్లు సంఘటితం కాలేదనీ, ప్రజలు భావోద్వేగాలకన్నా వాస్తవ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారనీ స్పష్టమవుతున్నది. బీజేపీ నేతల అహంకార పూరిత నిరంకుశ చర్యలు ప్రజలకు రుచించడం లేదని అర్థమవుతున్నది.
అయితే కేరళ ఫలితాలు ఇందుకు భిన్నం. గత నలభయేండ్ల చరిత్రను తిరగరాస్తూ కేరళ ప్రజలు తిరిగి లెఫ్ట్‌ఫ్రంట్‌కు అధికారం అప్పగించారు. దానికి కారణం కమ్యూనిస్టుల సమర్థపాలన. గడిచిన అయిదేండ్లలో దేశంలో ఏ రాష్ట్రమూ ఎదుర్కోనన్ని విపత్తులను కేరళ ఎదుర్కొంది. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018-19లో భయంకరమైన వరదలు, 2020లో కరోనా మహమ్మారి. ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిపడుతున్న ఈ ఉపద్రవాలకు ఎదురొడ్డి నిలవడంలో, వాటిని చాకచక్యంగా అధిగమించడంలో విజయన్ ప్రభుత్వ పనితీరు కండ్లారా చూసింది కేరళ ప్రజ. మరోవైపు ఈ విపత్తులన్నిటా కేంద్ర సర్కారు సహాయ నిరాకరణకుతోడు, అది సృష్టించిన అడ్డంకులనూ వారు అర్థం చేసుకున్నారు. తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి అక్రమ కేసులు, అనైతిక ఆరోపణలకూ దిగజారిన కేంద్రం నీచ రాజకీయాలనూ వారు గ్రహించారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం రూపొందిన సంక్షేమ పథకాలనూ, వాటి అమలునూ, అందులో నిజాయితీనీ వారు చూసారు. కాంగ్రెస్ అవకాశవాద, బీజేపీ విభజన రాజకీయాలనూ గమనిస్తూనే ఉన్నారు. అందుకే కీలెరిగి వాత పెట్టారు. కష్టనష్టాల్లో తమ వెన్నంటి నిలిచిన కమ్యూనిస్టులకు జేజేలు పలికారు. సుపరి పాలనకు పట్టంకడుతూ కేరళ ప్రజలిచ్చిన ఈ తీర్పు ఎంతో విశిష్టమైనది.
ఇక ఈ ఎన్నికల్లో అన్ని పక్షాలూ బీజేపీతో పాటు ఎన్నికల కమిషన్‌తోనూ కేంద్ర దర్యాప్తుసంస్థలతోనూ పోరాడాల్సిరావడం వైచిత్రి! ప్రత్యేకించి బెంగాల్లో ఎనిమిదంచెల ఎన్నికల షెడ్యూలు మొదలు పోలింగ్ ఏజెంట్ల నియామాకాల నిబంధనల్లో మార్పుల వరకూ, రాష్ట్రంలో అధికారుల తొలగింపుల నుంచి కేంద్ర బలగాల మోహరింపుల దాకా అడుగడుగునా బీజేపీ అలవిగాని అధికారదుర్వినియోగాన్ని ప్రదర్శించినా.. వారి మతతత్వ రాజకీయాలకు చెల్లుచీటీపాడుతూ ఆ ప్రజలిచ్చిన తీర్పు లౌకికశక్తులకు ఎనలేని బలం. నిజానికి బెంగాల్ ప్రజలు మొదటి నుంచీ ఈ విభజన రాజకీయాలకు వ్యతిరేకమే. 1905లో నాటి బెంగాల్ విభజనపై హిందువులు ముస్లింలు ఐక్యంగా పోరాడి, బ్రిటిష్ ప్రభుత్వం మెడలువంచి, 1911లో తిరిగి ఐక్య బెంగాల్‌ను సాధించారు. ఆ చారిత్రక వారసత్వం తోనే నేడు బీజేపీ విభజనరాజకీయాలకు చరమగీతం పాడారు. కేరళ, తమిళ ప్రజలు బీజేపీకీ తావేలేదని తేల్చిచెప్పారు. భవిష్యత్తుకు కొత్తదారులు పరిచారు.