Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్వైరస్ విధ్వంసం సృష్టిస్తున్నది. సామాన్యుడిపై పంజా విసిరింది. దురదృష్టవశాత్తూ ప్రజల కష్టాల్ని పాలకులు వినోదంలా చూస్తుంటే, పెట్టుబడిదారులు లాభాలను మూట కట్టుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇవే పరిస్థితులు సాక్షాత్కరిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు మాకు బాధ్యత లేదంటూ నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫస్ట్‌వేవ్ అనుభవాలు ఉన్నా, సెకండ్‌వేవ్ పరిణామాలను పట్టించుకోకుండా ఎవరి చావు వారు చావండి అన్నట్టుగా ఉంది ఈ రెండు సర్కార్ల వైఖరి. ఆస్పత్రుల దగ్గర నుంచి మొదలెడితే బెడ్లు, ఆక్సిజన్ వరకు, మందులు, ఇంజక్షన్లు మొదలెడితే టీకాల వరకూ అన్నింటికీ కొరతే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలే కీలకమవడం క్షమించరానిది.
రాజకీయ ప్రయోజనాల కోసం నేడు ప్రజల ప్రాణాలను గాల్లో దీపం చేశాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిపోయి చేష్టలుడిగి చూస్తున్నాయి. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫీడేల్ వాయించినట్టుగా ఉంది ప్రధాని మోడీ పరిస్థితి. సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో శాస్త్రీయమైన విధానాలు అనుసరించకపోవడంతో సమస్య తీవ్రమైంది. వామపక్ష కేరళ ప్రభుత్వం అమలుచేసిన కమ్యూనిటీ ఐసోలేషన్ విధానాన్ని దేశమంతా విస్తరిస్తే కరోనా నివారణ సులభమయ్యేది. కేరళలో కోవిడ్ కేసులను మూడు రకాలుగా విభజించి స్థానిక పంచాయతీరాజ్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. భోజనం, వైద్యాన్ని ఉచితంగా కల్పించారు. ప్రతి పౌరున్నీ కుటుంబ సభ్యుడిలా భావించి ప్రంట్‌లైన్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో పెట్టి వైద్యమందించారు. టీకాలకూ ప్రజల నుంచి పైసా వసూలు చేయలేదు. ఆ మేరకు కేసులను అరికట్టడమేగాక నివారణకూ మార్గాన్ని చూపింది ఆరోగ్యకేరళ.
నేడు మనరాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చావుల వరద పారుతున్నది. రోగుల అవస్థలు వర్ణణాతీతం. 'అంతా బాగుంది...' అని సర్కారు జబ్బలు చరుచుకుంటుంటే, అసలు రంగును పత్రికల్లో వార్తలు, టీవీల్లో దృశ్యాలు కండ్లకు కడుతూనే ఉన్నాయి. వైరస్కులోనైన సామాన్యుల గుండెలు పగులుతున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వెళితే ఇక యమలోకానికి వెళ్లినట్టేననే భావన. ప్రయివేటులో మహాదోపిడి. ముందస్తుగా మేల్కోని సామూహిక జన హననానికి పాల్పడుతున్న కోవిడ్‌కు అడ్డుకట్ట వేసుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కమ్యూనిటి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యసదుపాయాలు కల్పిస్తే పరిస్థితులు అదుపులోనే ఉండేవి. స్థానిక సంస్థలకు నిధులిచ్చి సేవా దృక్పథంతో పనిచేసేలా సమన్వయం చేస్తే వైరస్‌ను వేరులోనే రూపుమాపే వీలుండేది. అన్నింటికి మించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పిదం. భయాన్ని దూరం చేసి 'ధైర్యం'' అనే మందును నూరిపోస్తే వైరస్ పటాపంచలయ్యేది. రాష్ట్రంలో కూడా ఆక్సిజన్, బెడ్ల కోసం పేషెంట్లు 'క్యూ' లు కడుతున్నారన్న కఠోర వాస్తవాన్ని గులాబీ సర్కారు గుర్తించాలి. అన్ని బెడ్లు, ఇన్నీ వెంటిలేటర్లు , ఇంకా ఇంజక్షన్లు అంటూ లంబాచోడా హెల్త్‌బులిటెన్‌ను ఒకరోజు ఆలస్యంగా ఇస్తున్న సర్కారు, ఇంకా ఎప్పుడు మేల్కోంటుంది? హైస్కూళ్లు, కాలేజీలను కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలుగా మారిస్తే కోవిడ్‌ను అంతమొందించే అవకాశమెక్కువ. టీకాల విషయంలో కేంద్రానిది మోసపూరిత వైఖరైతే, తొలుత రెండు శాతం మందికే టీకాలేసిన కేంద్రం, మిగతా వారిని మీ తిప్పలు మీరు పడాలంటూ గాలికొదిలేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే టీకాకు రెండు ధరలు ఎందుకంటూ నిలదీసింది. బీజేపీ టీకా విధానం రాష్ట్రాలపై భారం మోపడం, పరోక్షంగా ప్రజల మీద పడుతుందనీ, అంతిమంగా నిరుపేదలు టీకాకు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రజల జీవించే హక్కును పరిరక్షించాల్సిన, గ్యారంటీ ఇచ్చేలా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సుప్రీం హెచ్చరించింది. రాష్ట్రానికి కూడా ఒక విధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఏప్రిల్ 25 నుంచి కరోనా టెస్ట్‌లు తగ్గాయి. దీంతో పాజిటివ్ రేటు అమాంతం అధికమైంది. తొలుత రెండు, మూడు శాతముంటే, ఇప్పుడది 13 శాతానికి పెరిగింది. ఈ తరుణంలో యూనివర్సల్ ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. కేంద్రమే ఉచిత టీకాలు సరఫరా చేయాలనే రాజకీయపార్టీల డిమాండ్ ఇప్పటికే ఉంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో గత ఏడాది లాక్డౌన్లో మాదిరిగానే పేదలకు బియ్యం, డబ్బులు సమకూర్చాలి.
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కదలాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనే అత్యధికంగా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా పేదలను ఆదుకోవాలి. వారిని నిలబెట్టాలి. ఆ కృషికి ఇప్పటికే సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ శ్రీకారం చుట్టింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒకడుగు ముందుంది. ఈ తరహా కార్యకలాపాలను జిల్లా, మండల స్థాయికి కూడా తీసుకెళ్లే ప్రణాళికతో సాగుతున్నది.