Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇండియాల పాలకులను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలి.'' -నామ్‌చోమ్‌స్కీ
కరోనా మహమ్మారి రెండవ ఉప్పెన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సార్వత్రిక ఉచిత టీకాలు ఇవ్వడం, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు, వెంటనే పరీక్షలు నిర్వహించి, సోకిన వారిని వారు కలిసిన వారిని గుర్తించి వేరు చేయడం అత్యంత కీలకం. ఈ విషయంలో నయా ఉదారవాద విధానాల పాటించే ప్రభుత్వాలు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, భారతదేశం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి. చొమస్కీ దీన్ని నయా ఉదారవాద ప్రభుత్వాలు తమ ప్రజలపై చేస్తున్న నేరంగా పరిగణించి వాటి నాయకులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
బ్రెజిల్‌లోని మనావుస్ నగరంలో ఒకవారం ముందు ఆక్సిజన్ కొరత రానున్నదని హెచ్చరికలు స్థానిక, కేంద్ర ప్రభుత్వానికి అందినా ప్రభుత్వం కదలకపోవడంతో కరోనా రోగులు ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు. ఆధునిక యుగంలో ప్రభుత్వం కదలకపోవడం, ప్రజలను తమ చావుకు వదిలివేయడం నేరం కాక ఇంకేమవుతుంది.
బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించమని ఆదేశించినా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంపై ఆ జడ్జి ఇచ్చిన నివేదికలో వివరించారు. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ముందస్తు చెప్పినా చీమకుట్టినట్టు లేని బ్రెజిల్ అధినేత బోల్సనారో ఈ హెచ్చరికలను తోసిపుచ్చుతూ కరోనాకు తొలిదశలో చికిత్స పనిచేయదని ఒక సిద్ధాంతాన్ని చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయాధికారి ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో వెనెజులా ప్రభుత్వం మనావుస్ పట్టణానికి ఒక ఓడనిండా ఆక్సిజన్‌ను పంపింది.
బ్రెజిల్లో వైద్యరంగం ప్రయివేటురంగంలో ఉన్నది. ప్రభుత్వ వ్యవస్థ కుళ్ళిపోయి కుప్పకూలిపోయింది. ఇదే పరిస్థితి నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తున్న మితవాద ప్రభుత్వాలున్న అన్ని దేశాలలో కనిపిస్తున్నది. ఆ ప్రభుత్వాలు మందుల కంపెనీలకు లాభాలు విపరీతంగా ఎలా పెంచి వారిని సంతోషపరచాలని ఆలోచిస్తున్నాయి తప్ప పేద ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆలోచించడం లేదు. దీనికి బీజం ఆ ప్రభుత్వ విధానంలోనే ఉన్నది. కాబట్టి అది మారకుండ పేదప్రజల ప్రాణాలు కాపాడటం కష్టం.
మందులపై పేటెంట్స్ ఇచ్చి మందుల కంపెనీలకు లాభాలు కట్టబెట్టాలని తహతహలాడుతున్న ప్రభుత్వాలు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్స్, బెడ్ల కొరత, అందరి ఉచిత వ్యాక్సిన్‌పై పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నాయి. ఇది పెట్టుబడిదారీ నైజం. దానికి భిన్నంగా సోషలిస్టు దేశాలైన చైనా, క్యూబా, వెనెజులా తమ ప్రజలను రక్షించుకుంటూనే ఇతర దేశాలకు తమశక్తికొద్ది డాక్టర్లను, వైద్య సిబ్బందిని, మందులు, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కోవిడ్‌ను కట్టడిచేసే ప్రజా ఆరోగ్య రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, నయా ఉదారవాదాన్ని నరనరాన నింపుకున్న కొన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణ పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ పరిస్థితులలో ఔషధ పరిశ్రమల ఆధిపత్యానికి ముకుతాడు వేసిన దక్షిణాఫ్రికా అనుభవాలు గుర్తుతెచ్చుకోవాలి. ఎయిడ్స్ మహమ్మారి ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలు కాపాడటానికి చౌకగా ఎయిడ్స్ నియంత్రణకు మందులు సరఫరా చేయాలని ఆఫ్రికా దేశాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లను ఫార్మా కంపెనీలు పెడచెవిన పెట్టాయి. దీనితో ఆఫ్రికా దేశాలన్ని కూడబలుక్కుని డబ్ల్యూటీఓ చర్చలలో ఏకంగా పేటెంట్ హక్కులనే సవాలు చేశాయి. ఆరు సంవత్సరాలు ఘర్షణతరువాత గ్లాక్సో, ఫైజర్ లాంటి కంపెనీలు ఎయిడ్స్ మందుల సరఫరా విషయంలో ఆఫ్రికా ప్రభుత్వాల డిమాండ్స్‌కు తలొగ్గాయి.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఉచిత టీకా విధానం తొలిఅడుగు అవుతుంది. ఈ ఆలోచన విధాన రూపం తీసుకోకుండా అడ్డుపడటానికి కార్పొరేట్ సైందవులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వీరు మాస్క్‌లు ధరించకుండా ప్రజలలో తిరగడం, భౌతికదూరం పాటించకపోవడం, ఎన్నికల కోసం పెద్ద పెద్ద కూటములు నిర్వహించడం ఒకే నమూనాగా ఉన్నది. ఈ విషయంలో ట్రంప్, బొల్సనారోలకు మోడీ రూపంలో జతగాడు దొరికాడు. ఈ మూడు దేశాలలోనూ కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యం తీరు ఎండగడుతున్న న్యాయస్థానాలు ఒకే రకంగా స్పందించడం కాకతాళీయం కాదు. నోమ్ చోమ్స్కీ లాంటి అంతర్జాతీయ మేథావులు ఇలాంటి పాలకులను ప్రపంచ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ప్రజలప్రాణాలతో చెలగాటం ఆడిన ట్రంపును ఆదేశ ప్రజలు సాగనంపారు. మిగిలిన దేశాలలో కూడా ప్రజలు ఆ దారిలో నడవాలి. ఈ లోగా సత్వర ఉపశమనం కోసం ప్రజా అనుకూల వ్యాక్సిన్ తయారీ విధానాలకై ఉద్యమించనిదే ఈ పెనుముప్పునుంచి బయటపడటం అసాధ్యం. ప్రజా ఆరోగ్య రక్షణ విధానం, ఔషధాలపై ఫార్మా కంపెనీల గుత్తాధిపత్యంపై జరిగే పోరాటాలు అంతర్జాతీయ సంఘీభావంతో సాగాలి.