Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని సార్లు, ఎన్నో సార్లు రుజువైన సామెతలు కూడ తప్పని రుజువు చేయగల పాలకులు చెలామణిలో ఉంటారు. మన ప్రారబ్దమేమంటే ఈ కరోనా వేళ అటువంటి పాలకులు మనకే దాపురించడం! ''అనుభవంలోకొస్తేనే తత్వం బోధపడుతుంద''న్న గిరీశం పలుకులు అందరూ ఒప్పుకునేవే. కాని మన ఢిల్లీ పాదుషాలు మాత్రం ససేమిరా అంటున్నారు. ''మీ పెళ్ళికి నేను పెట్టిన ముహూర్తం బానే ఉంది. కాని తమరి జాతకమే అలా అఘోరించింది!'' అని ఒక పాత తెలుగు సినిమాలో పురోహితుడి పాత్ర అంటుంది. ఘనత వహించిన ప్రధాన మంత్రివర్యులు తమ పాలన మహాద్భుతంగానే ఉంది గాని ప్రజలు, కుప్పలు పోసినట్లు ఆయుషు తీరిపోయి పుట్టుక్కున చస్తుంటే దానికి తామెలా బాధ్యులమని అడుగుతున్నారు. పైగా ఇంకా మూడు సంవత్సరాల ఆయుర్దాయమున్న తమ గవర్నమెంటుపై అర్ధాంతరంగా యమపాశం విసరగలిగిన సత్తా ఎవరికుందని ఏలినవారి ప్రశ్న. మోడీజీని దిగిపొమ్మని అడగడానికి అరుంధతీరారుకి, సీతారాం యేచూరికి ఏమి హక్కుందని భక్తులంతా ఆవేశంతో ఊగిపోతున్నారు.
2020లో కరోనా ప్రపంచానికీ కొత్తే. మనకీ కొత్తే! ట్రంప్ భల్లూకపు పరిష్వంగం కోసం మోడీ పడ్డ తపన, ఆయన, ఆయన పార్టీ రాజకీయ కండూతి దేశాన్నీ దశకి తెచ్చాయి. మార్చి 23న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, దేశానికి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లను సప్లయి చేసినాయన్ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించడం వంటి రాచకార్యాలు పూర్తిచేసి మార్చి 24న లాక్డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా 'స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని పూర్తిచేసుకున్న ఘనుడు మన ప్రధాని. దేశాన్ని మోడీ ఎక్కడికో తీసుకెల్తున్నాడని పంచరంగుల చిత్రం చూపించారు భక్తులు. రెండంకెల వృద్ధి రేటన్నారు. అందరికీ కొలువులన్నారు. చివరికి మన జీడీపీ మైనస్ 24కి పడిపోయింది. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత పెరిగింది. అనాలోచిత లాక్డౌన్ వల్ల కోట్ల మందికి ఉపాధి పోయింది. 11కోట్ల మంది వలస కూలీలు చివరికి కాలిబాటన వందల కి.మీ. నడిచి స్వస్థలాలు చేరారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
పాత క్యాసెట్‌ను 'రీప్లే' చేయడానికి కారణం మోడీ సర్కార్ చేతగాని తనం + రాజకీయ కండూతి కలసి మొదటి దశలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాయి. ఇంత అనుభవంలో కొచ్చినా మోడీ బృందానికి తత్వం బోధపడలేదని నేడు స్పష్టం. 2020 మార్చి 24 తర్వాతి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రైళ్లు, బస్సుల నిండా వలస కార్మికులు పిల్లా జెల్లాతో సొంతూళ్లకి పయనమవడం నేటి రీతి. స్థానిక లాక్డౌన్స్ దెబ్బకి పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. 2021 జనవరి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కేసినట్టు ప్రగల్భాలాడిన సర్కార్ వారిని తాజాగా నిన్నటి ఏప్రిల్‌లో 75లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయనే వార్త తెల్లమొహం వేసేలా చేసింది. మరీ ఆశ్చర్యమేమంటే 2020 మార్చి కంటే ఏప్రిల్‌లో 18శాతం మందికి కొలువులూడితే, 2021 మార్చి కంటే ఏప్రిల్‌కి 31శాతం మందికి ఉద్యోగాలు పోయాయి. సరుకు రవాణా పడిపోయినట్టు ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టు రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ పేర్కొంది. ట్రక్లు, లారీల ద్వారా జరిగే సరుకు రవాణాకు కిరాయి తీసుకోవడం 30శాతం తగ్గిందని పైసంస్థ పేర్కొంది. స్థానిక లాక్డౌన్ వ్యవస్థలో డిమాండు కొడిగట్టిపోవడంతో మీడియా, హెవీ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు తగ్గిపోయాయని కూడా పేర్కొంది. రైల్వే సరుకు రవాణా కూడా తగ్గింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. వాణిజ్యలోటు భారీగా పెరగడం కూడా ఆందోళణ కలిగించే అంశమే. వాస్తవానికి మన దిగుమతుల్లో దాదాపు 60శాతం పెట్రోలియం ఉత్పత్తులే. బ్యారల్ ముడిచమురు ధర భారీగా తగ్గినందువల్ల దిగుమతుల బిల్లు తగ్గాలి. పైగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మాసంలో ఎగుమతులు బాగా పెరిగాయి. అయినా వాణిజ్యలోటు పెరగడం అందోళనకరం. ధనికులు వినియోగించే అనేక రకాల సరుకుల దిగుమతి పెరగడమే దీనికి కారణం.
వెరసి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ సంక్షోభంలో కూరుకుంటోంది. మోడీ సర్కార్ చేష్టలే దేశంలో కరోనా విజృంభణకు మూలకారణం. తిరిగి అది ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నది. వ్యాక్సిన్లులేవు. వెంటిలేటర్లు లేవు. అన్నింటికంటే మించి ఆక్సిజన్ లేదు. దీనికి ముందస్తు ప్లాన్ లేకుండా రాష్ట్రాల ఎన్నికలపైనే మోడీ అండ్ కంపెనీ దృష్టంతా. దీనికితోడు కుంభమేళ. మొదటి దశ బీజేపీ నాయకుల ఆలోచనలెలా ఉన్నాయో రెండవ దశలోనూ వరస మారలేదు. అసలిలాంటి పార్టీ పాలనకు పనికొస్తుందా అనేది మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న.
బీజేపీ పాలకులంటున్నట్టు ఇది దేశంలోని సామాన్యజనం ''ఖర్మ''కాదు. సుమారు 2 కోట్ల మంది ఆస్పత్రి పాలు కావడానికి, వేలల్లో మరణాలకు పూర్తిగా మోడీ సర్కార్‌దే బాధ్యత. 2020 అక్టోబర్‌లో 162 ఆక్సిజన్ ప్లాంట్లకు డబ్బు మంజూరు చేసి నేటికి 14మాత్రమే నిర్మించిన ఈ పాలననేమనాలి? కేరళలో వారికవసరమైన దానికంటే మూడింతలు ఎక్కువ సేకరించుకోవడమే కాదు, పొరుగునున్న నాలుగు రాష్ట్రాలకు సప్లయి చేయడం దేనికి నిదర్శనం? ఒకటి బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, రెండవది వామపక్ష ప్రభుత్వ ప్రజానుకూలతకు నిదర్శనం కాదా!