Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదైనా ఒక కార్యక్రమాన్ని వాయిదా లేదా రద్దు చేస్తే 'అనివార్య కారణాలవల్ల' అని నిర్వాహకులు ప్రకటించడం పరిపాటి. కాని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్-14 మాత్రం నూటికి నూరు పాళ్లూ 'అనివార్యమై' వాయిదా వేశారు. కరోనా విపత్తు మూలంగా దేశం అతలాకుతలం అవుతుంటే అదేమీ పట్టని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి 'ఐపీఎల్ యథాతథం' అంటూ మొండికేశాయి. పైపెచ్చు తాము కట్టుదిట్టంగా అమలు చేస్తున్న 'బయో బబుల్' క్రీడాకారులను కరోనా బారిన పడనివ్వబోదని ఐపీఎల్ పాలకమండలి గొప్పలు చెప్పింది. ఈ మ్యాచ్‌లు ఎన్నికల సభల మాదిరి సూపర్ స్ప్రెడర్స్ కావనీ ప్రేక్షకులనేగాక మీడియాను సైతం క్రీడాస్థలికి రానివ్వనందున కరోనా సోకే ప్రమాదమే ఉండదని బీసీసీిఐ కూడా వంత పాడింది. కాని, వాస్తవం మరోలా జరిగింది. బయో బబుల్ సంగతి ఏమోకాని ఐపీఎల్ పాలకవర్గం మాట మాత్రం నిజంగానే బుడగలా పేలిపోయింది. మంగళవారం సన్‌రైజర్స్ వికెట్ కీపర్ వద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కరోనా బారిన పడడం, అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్ళు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లతో పాటు మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులకు కరోనా సోకడంతో అసలు ఆడేవాళ్లే లేక 'అనివార్యంగా' వాయిదా వేయాల్సివచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు ప్రజలు అల్లాడుతుంటే ఐపీఎల్ పాలకమండలి గాని, ఘనత వహించిన బీసీసీఐ కానీ అదేమీ పట్టకుండా వుండడం అమానుషత్వం. 'క్రీడాస్థలి బయట ఆక్సిజన్‌లేక తుది ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులను తీసుకెళ్లే ఆంబులెన్స్‌ల సైరన్లు మోగుతుంటే క్రీడాకారులు ఎలా ఆడుతారు?' అన్న జనఘోష వారి చెవులకెక్కకపోవడం దారుణం. 'ప్రజల ప్రాణాలకన్నా మాకు ధన సంపాదనే ముఖ్యం' అన్నదే ముమ్మాటికీ వారి భావన! శవ దహనానికి శ్మశానాల్లో కూడా చోటు దొరకని దుస్థితిలో ఐపీఎల్ నిర్వహణకు పూనుకోవడం అనుచితం, అవాంఛనీయం. కానీ, 'శవ పేటికలవల్ల లాభం ఎక్కువ వస్తే పెట్టుబడిదారుడు వాటినే తయారుచేస్తాడు' అన్న మాట అక్షర సత్యమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, ఐపీఎల్ పాలక మండలిల తీరు మరోసారి రుజువు చేసింది. వాటికి క్రీడా స్ఫూర్తి కాకుండా డబ్బు యావే అధికమని స్పష్టమవుతోంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలులో వినిమయతత్వం ఒక ముఖ్యమైన అంశం. పాలకవర్గాలు దాన్ని విపరీతంగా పెంచి పోషించడంతో క్రీడలు సైతం సరుకులుగా మారిపోయాయి. ప్రఖ్యాత క్రీడాకారులు సైతం సంతలో పశువుల్లా 'వేలం' వేయబడుతున్నారంటే ఇందులో ఏ స్ఫూర్తి ఎక్కువగా ఉందో తేటతెల్లమవుతోంది. క్రీడలు దేహ దారుఢ్యాన్ని పెంచడానికి, మానసికోల్లాసాన్ని, ఐక్యతా భావాన్ని సమిష్టితత్వాన్ని కలిగించడానికి దోహదపడాలి. అందుకే మనిషి జీవితంలో క్రీడలకు వ్యాయామానికీ ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అంతేతప్ప డబ్బు కోసం ఆటలు అన్న పరిస్థితి రాకూడదు. అంతకంటె మించి ప్రజల ప్రాణాలు ఏమైపోయినా మాకు మా ఆట, అందువల్ల వచ్చే డబ్బే ముఖ్యం అన్న ఐపిఎల్ పాలకవర్గం, బిసిసిఐల అమానుష వైఖరి క్షంతవ్యం కాదు.
ఐపీఎల్ వాయిదాతో విదేశీ ఆటగాళ్ళను వారి వారి దేశాలకు చేరవేసేందుకు బీసీసీఐ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కష్టమైపోతోంది. ఆటగాళ్లతో కూడిన ఛార్టర్డ్ విమానాన్నయినా తమ దేశంలో దిగనివ్వబోమని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారంటే ఇప్పుడు కరోనా పీడిత భారత్ పరిస్థితి ఎలావుందో విదితమవుతోంది. తమ దేశ ఆటగాళ్లను సైతం రానివ్వబోమని ఒక ప్రభుత్వం ప్రకటించిన ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ సీజన్-14ను గత ఏడాది మాదిరిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుపుతారన్న ఊహాగానాలు కూడా కష్ట సాధ్యమే కావచ్చు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఇప్పటికే నిర్ణయమై వుంది కనుక ఐపీఎల్ సీజన్-14 కొరవ మ్యాచ్‌లకు చోటు, తేదీలు దొరకడం అంత తేలిక కాదు. ఐపీఎల్ సీజన్-14 కొరవ కానీ మరో క్రీడ కానీ జరిపే తేదీలు, ప్రదేశాలు నిర్ణయించేటపుడు నిర్వాహకులు అక్కడి ప్రజల మంచి చెడ్డల గురించి తప్పక ఆలోచించాలి. ప్రజలు ప్రజా ప్రయోజనమే ఎవరికైనా దేనికైనా పరమావధిగా ఉండాలి.