Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏదో పీడకలవచ్చి.. ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతున్నట్టు, కుతికమీద కాలుపెట్టినలిపినట్టు, ఎక్కిళ్ళు పట్టేదాక ఒకటే ఏడుపు, ఏదైనా రాద్దామనుకుంటే, ఏదైనా చదువుదామనుకుంటే వాక్యాలు నాగుపాములై బుసలు కొడుతున్నాయి. ఆసుపత్రి బెడ్డుమీద నోటిమాటలు బందై 'నాకు బతకాలని ఉందిరా' అని కన్నీళ్ళతో చేతుల మీద రాస్తున్నట్టు పొద్దు పొద్దున్నే కల' అంటూ తగుళ్ళ గోపాల్ 'దండ కడియం'లో పీడకలకే కలవరపడ్డాడు. ఇప్పుడు కళ్ళముందు, మనందరి కళ్ళముందు, చూస్తుండగానే ఒక్కొక్క గుండె వీడ్కోలు చెబుతుంటే, దిక్కు మొక్కులేనట్టు దీనంగా విలపిస్తుంటే ఇది కలయితే బాగుండనిపిస్తోంది. కలగా మారితే బాగుండనిపిస్తోంది.
ఏమిటి ఈ మారణకాండ! ఇది విధి ఆడుతున్న ఆటకాదు. ఏం చేస్తామనుకోవడానికిది కాల ధర్మం కాదు. ప్రకృతి కారణమని నిందించడం ఎంతకాలం చేస్తాం. ఆ ప్రకృతినీ ధ్వంసించిన దుర్మార్గం ఎవరిది? ఎనాడూ నిలదీయరేం? ఉసిళ్ళు రాలిపడుతున్నట్టు మనుషులు. ఎవరు చేస్తున్న యుద్ధమిది. ఎవరు శత్రువు? ఎవరినైనా చూసారా? కనపడ్డాడా, చూడగలిగారా? క్షతగాత్రమైన గుండె రోదనకు కారకులను కనుగొన్నారా? ఇంకెప్పుడు! ఎప్పుడొస్తుంది మనకు సోయి. వాడికెలాగూ సిగ్గూ ఎగ్గూ లేదు. మనకైనా ఉండాలి! ఇప్పుడు తలదించుకోవాల్సింది ఎవరు? ''మిత్రమా! ఆయాసంపెరుగుతోంది. ఊపిరి కష్టంగా ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లేదంటున్నారు. ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. భయం భయంగా ఉంది. నాకు బతకాలని ఉంది! నాకు బతకాలని ఉంది''అన్న మాటలు చెవిన పడగానే ఒళ్ళంతా కాలిపోతున్న నిస్సత్తువ, ఏమీ చేయలేక వేస్తున్న నిస్సహాయిపు కేక నన్ను నిందిస్తూ ఉండగానే అతని చివరి ఊపిరి వార్తతో దు:ఖం కూడా ఇంకిపోయింది.
ఒక్క వార్తకాదు. రోజూ ఇలాంటివే మృత్యుఘోష దృశ్యాలు. ఒక్కొక్క వార్త ఒక్కోదు:ఖాన్ని మోసుకొస్తున్నది. ఉద్యమకారులు, సేవకులు, వైద్యులు, అనుభవాలు నిండుకున్న పెద్ద మనుషులు, కళాకారులు, సంగీత స్వరలయలు, గాయకులు, నాయకులు, విదుషీమణులు, విద్యాఘనులు ఎందరో మరెందరో కళ్ళముందు కనుమరుగై పోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఎవరికీ ఇంకా తెలియటం లేదా! ఇంత హీనమైన, దిగజారిన సమాజాన మనముంటున్నందుకు నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళకెలాగూ లేనప్పుడు మనమైనా నిస్సిగ్గుగా ఎలా ఉండగలం!
మనుషులమై బతుకుతున్నందుకు, కొన్ని కన్నీళ్ళు దాచుకుని ఉంటాము కదా! కొంత దయనూ, కొంత కరుణనూ, ఇంకొంత వివేచననూ కలిగిఉండాలికదా! శాస్త్రవేత్తలు, వైద్యులు, సామాజిక వేత్తలు ముందుగానే హెచ్చరించినా నిర్లక్ష్యపు చాతీ పెరుగుతూనే ఉంది. ఉదాసీనపు గడ్డానికి అడ్డెక్కడుంది! మనుషుల ప్రాణాలకు విలువలేమీ వీరిదరి చేరవు! ఇలాంటి 'నీరో'లను ఏమనాలి? ఏ రకమైన మానసికతకు నిదర్శకులు వీళ్ళు! సిగ్గుండాలి మనకైనా! శ్మశానాల్లో శవాలు కాలుతున్న మంటల సెగలు ప్రతి మనిషి గుండెనూ తాకుతూంటే! సొంత సౌధాన్ని కలగంటూ విస్టా ప్రణాళికలో వేల కోట్లను వెచ్చించడానికి పూనుకుని, నిర్మాణ గడువునూ నిర్లజ్జగా ఆలోచించే ఆజాను భాహువులుమన నేతలు. సిగ్గుండాలి కదా! మనకు! మనుషులమైనందుకు నాగరీకులమైనందుకు, ఏ స్పందనా లేక కాగితపు బొమ్మలా కళ్ళప్పగించి చూస్తుండిపోవడానికి!
కలాలు ఎత్తగానే అక్షరాలు కూడా కన్నీళ్ళతో తలదించుకుంటున్నాయి. జరుగుతున్న ఘోరాలకు తను సాక్షిగా నిలబడాల్సి వస్తున్నందుకు. ఇదెక్కడి నాగరికత! అదిగో చూడు ఒక మనుషుల కన్నా గోవులు ముఖ్యమంటాడు. ఇంకొకడు చావడాన్ని ఎవరాపగలరంటాడు! ముక్కూ నోరూ మూసుకుని దేవున్ని ప్రార్థించమంటాడు. అసలు గుడ్డలేవీ కట్టకుండానే స్వేచ్ఛగా తిరగండని సిగ్గులేని తనాన్ని చిమ్ముతుంటాడొకడు. శ్మశాన సమీపాన శవాల వరుసల నిరీక్షణా కాలంలో ఎన్నికల ఓట్ల పండుగలు జరిపి 'చచ్చేంత' జనాలు వచ్చారని తెగ సంబరపడిపోతాడు. కాటికాపరులుగా కూడా యోగ్యతలేని కాపలాదారుల కార్యక్షేత్రాన గుజరాత్లో చేసినట్టుగానే బెంగాల్లోనూ ఖనన దహనాలకు పిలుపునిస్తుందొక రంగుల మానసికరోగి. ఏమిరా ఇదని ఎవరైన ప్రశ్నిస్తే నోరుమూసి దేశభక్తి హద్దు దాటొద్దని హూంకరిస్తారు. సాక్షాత్తూ న్యాయస్థానమే చెంపలు వాయించినా చీమకుట్టినట్టు కూడా చలించని నిండుబండలు. అందుకే మనకైనా ఒకింత సిగ్గుండాలి! ప్రాణాలు కాపాడేమందులను బ్లాక్ చేసి వ్యాపారపు లాభాల కోసం వెంపర్లాడే నాయకులున్న రాజ్యాన సిగ్గుపడాల్సింది మనమే. వాళ్ళకెలాగూ సిగ్గులేదు. ఓ2కు బదులు ఓటు కోసమే పరితపించే రాజకీయులున్నందుకు నిజంగా సిగ్గుపడాలి.
అమ్ముకోవడానికి ఆత్రుత పడ్డవాడు, ఆఖరి ఊపిరికి ఆయువును ఏమి అందించగలడు. రాజ్యాధికారం కోసం ప్రణాళికలు వేసేవాడు వేశాలు మార్చేవాడు, మనుషుల ప్రాణాలను కాపాడే ప్రణాళికేమిటో ఎందుకు ఆలోచిస్తాడు! ఈ నేలపైనే విజయన్ ప్రజా ప్రణాళికను చూసైనా ఒకింత బుద్ధికి పనిచెబుతారనుకుంటే అదీలేదు. శ్మశానంలోనూ కుర్చీవేసుకుని కూర్చునేవాడు ఏం సిగ్గుపడతాడు! ఇక మనమైనా సిగ్గుపడదామా? నిగ్గదీసి తరిమిగొడదామా! అగ్గిలా అంటుకుందామా!