Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరణించిన వారినెవరూ 'క్రాస్ ఎగ్జామినేషన్' చేయలేరన్నాడు ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు ఇ.హెచ్.కార్. అది మనందరికీ తెల్సిన సత్యమే అయినా ఒకవేళ చెయ్య గలిగితే? అదీ 2020 మార్చి లాక్డౌన్ తర్వాత కోవిడ్ వల్ల చనిపోయిన వారందర్నీ ఎవరైనా 'క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే? వారు గుజరాత్ పౌరులైనా, వారణాసి వాసులైనా 'అగ్రద్వయా'న్ని ఉతికి ఆరేయకుండా ఉంటారా? మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులంతా కట్టకట్టుకుని మోడీకి, యోగీకి డస్ట్‌బిన్ దారి చూపిన వైనం సువిదితమే కదా! ''సుపరిపాలన''కు తామే సిసలైన పట్టాదారులమని విర్రవీగే బీజేపీ నాయకులను చూసి ప్రపంచ దేశాలు 'ఛీ' కొడుతున్నాయి.
తమ రాజకీయ అవసరాల కోసం భారతదేశ పౌరులను, మరీ ముఖ్యంగా ఏ ''హిందువు''ల ఉద్ధరణకైతే తాము కంకణధారులై ఉన్నామని చెప్పుకుంటున్నారో వారితో సహా ఈ దేశ పౌరుల సామూహిక హననానికి పాల్పడే పాలకులనేమని పిలవాలి? నిఘంటువులకు, వాంగ్మయానికి చిక్కని మాట ఏదైనా ఉందేమో! ఈ వైరస్ ప్రస్తుత స్వభావమేమిటి? మనదేశంలో దాని మ్యుటేషన్ ఏమిటి? డాక్టర్ కూడా అయిన ఒక కలెక్టర్ మహారాష్ట్రలో తన జిల్లా కవసరమైనంత ఆక్సిజన్ నిల్వలు ప్లాన్ చేసుకోగలిగినప్పుడు ఒక ప్రధాని, ఒక ప్రభుత్వం ఎందుకు చేసుకోలేకపోయింది? ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నామన్న ప్రచారార్భాటం సద్దుమణగకముందే బేల మొహమేసుకుని వ్యాక్సిన్ కోసం జోలెపట్టిన దైన్యాన్ని ఏమనాలి? ప్రపంచ దేశాలు మన సర్కార్ నోట్లో ఉమ్మేయడానికి కారణం - ఇప్పటికీ గోమూత్రం తాగితే కరోనా పోతుందని నమ్మే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు బీజేపీ నిండా సమృద్ధిగా ఉండటం, గంగలో మునిగితే కరోనా పారిపోతుందని చెప్పే ప్రధాన మంత్రి ఈ దేశానికుండటం! ఇంత మౌఢ్యం ఆఖరికి తాలిబాన్ల నిలయమైన ఆఫ్ఘనిస్థాన్‌లో సైతం లేదు కదా అని ప్రపంచం ఆశ్చర్యపోతోంది.
అమెరికా ఇరాక్ మీదో, ఆఫ్ఘనిస్థాన్ మీదో దాడిచేసి సామాన్య పౌరులను చంపేస్తే దాన్ని 'నరమేధం' అంటాం. కాని ఒక ప్రభుత్వమూ, దాని పాలకులు తమ స్వంత ప్రజలపై సాగించే మారణకాండను ఏమని పిలుస్తాం 'నరబలి' అని తప్ప?! బీజేపీ పాలకులకు కేవలం ఇతర మతాలంటేనే వ్యతిరేకత ఉందనుకుంటే పొరబాటే. ''అలగా జనం'' అని 'వారు' పిలిచే సామాన్యులంటే కూడ పడదు. అందుకే గత సంవత్సరం మార్చి 24 నుంచి దాదాపు ఏప్రిల్, మే నెలలంతా వేల మైళ్ళు నడిచి సొంతూర్లకి చేరిన వలసకార్మికుల గురించి ప్రపంచమేడ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏడ్చింది. కాని బీజేపీ నేతల పాషాణ హృదయాలు కనీసం చెమర్చలేదు. మేము రైళ్ళువేసేదాక ఆగలేకపోయారన్నారు. కాబట్టి అది వారి స్వయంకృతమన్నారు. మరి మీ'యెడ్డీ' మహాశయుడు బెంగుళూరు నుంచి రైళ్లెందుకు రద్దుచేశాడంటే రియలెస్టేట్ కార్పొరేట్ల కోసం ఆ మాత్రం చేయకుంటే జీడీపీ పెరిగేదెట్లా? అని చొప్పదంటు ప్రశ్న వేస్తున్నారు.
అంబులెన్స్ లేక, ఆక్సిజన్ లేక సామాన్యజనం పిట్టల్లా రాలిపోతున్నారు. అంగబలం, అర్థబలం ఉండేవారికి అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. దీన్నే ''సోషల్ డార్వినిజం'' అన్నారు. అంటే పరిణామక్రమంలో ఆనాటి పరిస్థితులకు తగ్గట్లు తమని తాము మార్చుకోగలిగిన జంతువులు బతక గలిగినాయని అంటే అవతలి వాడినోట్లోంచి లాక్కుని తినగలిగినవారని (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) అర్థం. ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోవడాన్ని అలహాబాద్ హైకోర్టు 'సామూహిక హత్యాకాండ'గా పిలిచినా అటు యోగీకి, ఇటుమోడీకి చీమకుట్టినట్లైనా లేకపోవడం దారుణాతి దారుణం! ఈ రెండవ అల విరుచుకు పడటానికి కారణం ''జనం సర్కారీ ఆజ్ఞలను ఔదల దాల్చకపోవడమే''నని చెప్పే బీజేపీ నేతలు మొన్న ఫిబ్రవరిలో ''దేశంలో కోవిడ్‌ని నియంత్రించిన మోడీ నాయకత్వ పటిమ''ను వేనోళ్ల పొగుడుతూ తీర్మానించారు! కోవిడ్ విస్తరణకు జనం కారణమైతే నియంత్రణకు కూడా వాళ్ళేకదా కారణం? అయినా భజన మాత్రమే అలవాటైన వారిముందు తర్కం పనిచేస్తుందా?
ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. చైనాయే గనుక 2019 చివరినాటికే కరోనా అనుపానులు కనుక్కుని 2020 జనవరి 7వ తేదీకల్లా దాని జీనోమ్ వివరాలు డబ్ల్యూహెచ్ఓకు వెల్లడించి ఉండకపోతే నేడు ప్రపంచం ఏస్థితిలో ఉండేదో! వాళ్ళు దీన్ని మూతా పెట్టలేదు. ముసుగేసి చూపించలేదు. 2020 జులై నాటికే టీకాలు తయారు చేసుకుని వారి జనానికి వేస్తూనే ఉన్నారు. నేడు ఇండియా ప్రపంచముందు దోసిలి జాపేసరికి ప్రపంచ దేశాలు చైనా వైపు చూస్తున్నాయనే వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం కదా?
''ఒక క్రూరుడికి మాత్రమే విజ్ఞప్తిచేసుకునే స్థితిలో ప్రజలుంటే వారి ముందు రెండే మార్గాలు మిగుల్తాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం'' అన్నాడు ఏంగెల్స్.
భారతదేశ ప్రజలు ఉసుళ్లుకాదు. దీపంకోసం వచ్చి, ఆ దీపం ఉండగానే చచ్చిపోవడానికి! మోడీగారి 'పితృస్వామ్య' రాజ్యంలో ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిన ఏపనినీ, అది నోట్ల రద్దైనా, జీఎస్టీ అయినా, తాజాగా కోవిడ్‌ని హ్యాండిల్ చేస్తున్న తీరైనా ఎవరూ ప్రశ్నించకూడదట! మనం వస్తువులం కాదు. ''విధి'' చేతిలోని ఆటబొమ్మలం అంతకన్నా కాదు. ప్రాణమున్న మనుషులం. మన కుటుంబాల్లోని ప్రియతముల ప్రాణాలు నిలబెట్టే ప్రాణవాయువు అందించాల్సిన బాధ్యత సర్కార్‌ది. మన ప్రజలందరికి టీకా వెయ్యాల్సిన బాధ్యతా ఈ సర్కార్‌దే. కానీ ఈ నరబలిని ఆపాల్సిందేనని పాలకులను నిలదీయాల్సిన బాధ్యత మనందరిదీ.-