Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మోడీజీ... మీరు అసమర్థులు. లక్షల మరణాలకు కారకులు. దయచేసి తక్షణమే రాజీనామా చేయండి'' అంటున్నారు అరుంధతీరారు. మోడీ గారి ''భక్తబృందాల''కూ ''భజనబృందాల''కూ ఇది కాస్త కటువుగా అనిపించవచ్చు,.. షరా మామూలుగా అసహనానికీ గురి చేయవచ్చు.. కానీ ఇందులో కాదనడానికి ఏముంది? నేడు అంతర్జాతీయ మీడియా కూడా ఇదే చెపుతున్నది కదా?! ''కరోనా రెండవ అల నియంత్రణలో భారత ప్రభుత్వ వైఫల్యమే ఈ మహావిషాదానికి కారణం'' అంటూ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ ''ది లాన్సెట్'' చేసిన విశ్లేషణ దేనికి సూచిక ''దేశం జాతీయవిపత్తును ఎదుర్కొంటున్న వేళ మౌనంగా ఉండలేం'' అంటూ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు తానే సుమోటోగా విచారణ చేపట్టడం ఎవరి వైఫల్యాలకు సంకేతం? తాజాగా ఈ విచారణకు సంబంధించి కేంద్రం న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వపనిలో కోర్టు జోక్యం తగదు అని పేర్కొంది. అంటే ఇక్కడ కూడా విమర్శను సహించలేని తనమే తప్ప, స్వీకరించి సరిదిద్దుకునే తత్వమే ఈ సర్కారుకు లేదని స్పష్టమవుతున్నది.
నిజానికి ప్రభుత్వాల పనిలో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాకున్నా ఆ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ, ప్రజల ప్రాథమిక హక్కుల్నీ ఉల్లంఘిస్తున్నప్పుడు కచ్చితంగా జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకుంది. దానిని కాదనే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. భారత రాజ్యాంగం ప్రజల ధన మాన ప్రాణాలకు హామీనిస్తోంది. ఇప్పుడు ఘనతవహించిన సర్కారువారి నిర్వాకం ఆ మూడింటికీ ముప్పు తెస్తున్నది. కనుకనే న్యాయస్థానాలు స్పందించాల్సి వస్తున్నది. వాటిని గౌరవించి, తనను తాను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం వ్యవస్థల పట్ల దాని గౌరవం ఏపాటితో ఎత్తిచూపుతున్నది. ఆక్సిజన్ సరఫరా మొదలు వ్యాక్సినేషన్ వరకూ కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి ఓ ప్రణాళిక, ఓ విధానమంటూ ఉన్నాయా? అంటూ కోర్టు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ.. చివరికి కోర్టుల జోక్యమే తగదని చెప్పడం ఏలినవారి స్వభావాన్ని తేటతెల్లం చేస్తోంది. అంటే ఆసుపత్రిలో పడక కాదుకదా ప్రవేశమే లభించక రోగులు రోడ్లమీద మూలుగుతున్నా కోర్టులు మౌనంగా ఉండాలా? ఆక్సిజన్ అందక అర్ధాంతరంగా పౌరుల ఊపిరాగిపోతున్నా కోర్టులు మౌనంగా ఉండాలా? జనం టీకాల కొరతతో అల్లాడుతుంటే కోర్టులు మౌనంగా ఉండాలా? రెమ్‌డెసివర్ వంటి మందులనేకం యధేచ్ఛగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంటే కోర్టులు మౌనంగా ఉండాలా? ప్రజల నిస్సహాయ స్థితిని కూడా ఆదాయవనరుగా మార్చుకుంటున్న కార్పొరేట్ దోపిడీని చూస్తూకూడా కోర్టులు మౌనంగా ఉండాలా? జనం ప్రాణాలకు ఎటూ విలువలేదు, కనీసం మరణాలకైనా గౌరవం దక్కని అమానవీయ స్థితి కొనసాగుతుంటే కోర్టులు మౌనంగా ఉండాలా? రాజ్యాంగ పూచీనిచ్చిన ప్రజల జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుంటే న్యాయస్థానాలు ఎందుకు మౌనంగా ఉంటాయి? ప్రజల ప్రాథమిక హక్కులు దిక్కులేనివవుతుంటే కోర్టులు స్పందించడం ఎలా అభ్యంతరకరమవుతుందో ఏలినవారికే తెలియాలి! అటు ప్రతిపక్షాల్నీ లెక్కచేయక, ఇటు పౌరసమాజాన్నీ లక్ష్యపెట్టక, చివరికి న్యాయస్థానాల జోక్యాన్ని కూడా సహించని తీరును ఏమనాలి?
అందుకే నేడు ''జాతి విలయానికి లోనవుతున్నప్పుడు నాయకుడు ఎలా ఉండకూడదో మోడీ ఒక ఉదాహరణ'' అంటూ అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. దేశ నిర్మాణానికి తమ జీవితాలు ధారపోసిన ఒక తరం మొత్తాన్నీ కరోనా సునామీలో ముంచిన అసమర్థపాలనకు నమూనాగా మోడీని వేలెత్తి చూపుతోంది. కోవిడ్ మొదటి దశ మన ప్రజారోగ్య వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేసినా, రెండవ అల ప్రమాదం పొంచివుందని నిపుణులు ముందే హెచ్చరించినా, తగు చర్యలు కాదు కదా, కనీస చర్యలు కూడా చేపట్టకుండా.. అధికార విస్తరణకు అర్రులు చాచారు. ఎన్నికలసభలూ ర్యాలీలు కుంభమేళాలతో వ్యాధి నియంత్రణ సంగతి దేవుడెరుగు మరింత వ్యాప్తికి కారకులయ్యారు. కొన్ని లక్షల ప్రాణాలను బలిగావించారు. పోనీ అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాతనైనా ఏలికలు సోయిలోకి వస్తారనుకుంటే... ఇప్పుడు ''సెంట్రల్ విస్టా'' నిర్మాణానికి తహతహలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు కొడిగట్టిన దీపాలవుతుంటే వీరికి మాత్రం విలాసవంతమైన పార్లమెంటు భవన సముదాయాలు, ప్రధాని నివాస మందిరాలు కావలసి వచ్చాయి. ఇప్పటి వరకూ మహమ్మారి నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చేపట్టవలసిన ఏ చర్యనూ చేపట్టని కేంద్రం ''సెంట్రల్ విస్టా'' పనులకు మాత్రం ''అత్యవసర సేవల'' కింద అనుమతులు జారీ చేయడం విడ్డూరం. ఇరవయివేల కోట్ల ఖరీదైన ఈ భారీ నిర్మాణం కోసం అంతే భారీ సంఖ్యలో కూలీలను తరలిస్తున్నారు. దీనివల్ల వారంతా కరోనా బారిన పడటమే కాదు, అది సూపర్ స్ప్రెడర్గా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఎంతసేపటికీ తమ రాజకీయ ప్రయోజనాలే తప్ప.. ప్రజలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేని వారికి హితవచనాలు ఎలా తలకెక్కుతాయి?
''రక్షించండి మహాప్రభో'' అంటూ ప్రజలు మొరపెట్టుకుంటుంటే రాజసౌధ నిర్మాణానికి వేగిరపడుతున్న నాయకుడు ఎంత బలవంతుడైతే మాత్రం ఏం ఉపయోగం? నమ్మి ఓటేసిన జనాలు నరకయాతన పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండే నాయకుడి ఛాతి ఎన్ని అంగుళాలుంటే మాత్రం ఏం ప్రయోజనం? అందుకే నేడు పవిత్ర గంగానదిలో జలాలకు బదులు శవాలు ప్రవహిస్తున్నాయి. ఆరని చితి మంటల్లో దేశం తీరని దుఖాన్ని మూటగట్టుకుంటోంది. ఇంతటి మహావిషాదానికి కారకుడైన నాయకుడు.. పాలించే అర్హత కోల్పోయాడని ఎవరు చెప్పినా అందులో సందేహమేముంటుంది..?