Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక విద్యార్థి తన గురువును 'ఎన్నో వందల కోట్ల డబ్బు వ్యవసాయం, ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఖర్చు చేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయినా, ప్రపంచంలో ఆకలి సమస్య ఇంకా ఎందుకు పరిష్కారం కాలేదు?' అని ప్రశ్నించాడు. అందుకు గురువు స్పందిస్తూ 'ప్రపంచంలో చాలామంది ఆకలితోనో, పొషకాహారలోపంతో ఉండటానికి కారణం, తగినంత ఆహారం లేకపోవడం కాదు. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించలేని పాలకుల వైఫల్యం సమాధానం చెప్పాడు. ఆ గురువు తన విద్యార్థులకు చెప్పిన విధంగానే నేడు ప్రపంచ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు నిదర్శనమే 16 అంతర్జాతీయ సంస్థలు 55 దేశాలను అధ్యాయనం చేసి విడుదల చేసిన ఈ నివేదిక. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహామ్మారి కరోనా విషపు కోరల్లో నుంచి మరో ఏడాదికో, మరో దశాబ్దానికో బయటపడగలం. కానీ ప్రపంచాన్ని ఎప్పటి నుంచో ధృతరాష్ట్ర కౌగిలిలా పట్టుకున్న ఆకలి కౌగిలి నుంచి బయటపడటం ఎప్పటికి సాధ్యం? అనేది వేల డాలర్ల ప్రశ్న.
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా ఆకలి మాత్రం తీరని సమస్యగానే మిగిలివుంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లోని 15.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారనీ, కనీసం ఒక పూట కూడా కడుపు నింపుకోలేని దుస్థితిలో ఉన్నారని ఐరాసనే అధికారికంగా వెల్లడించింది. 2019తో పోలిస్తే ఇది రెండు కోట్లు అధికం. అఫ్ఘాన్, జింబాబ్వే వంటి దేశాల్లో ఆకలి కేకలు అధికం. అందులో ఆహారం అందించకపోతే చనిపోయే స్థితిలో లక్షా 33 వేల మంది బుర్కినా ఫాసో, దక్షిణ సుడాన్ వంటి దేశాల్లో ఉన్నారని తేలింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలు పతనం కావడం, దేశాల మధ్య ఘర్షణలు, తద్వారా ఎర్పడుతున్న ప్రతికూల వాతావరణాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ ఘర్షణలు 23 దేశాల్లోని 9.9 కోట్ల మందిపై ప్రభావం చూపాయి.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ క్షీణించి 17దేశాల్లోని 4.05 కోట్ల మంది అత్యంత తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు. 15.5 కోట్ల మందిలో 60-80శాతం మంది వ్యవసాయ ఆధారిత ఆహార అభద్రతకు గురయ్యారు. అయితే 30శాతం మంది ప్రజలకు మాత్రమే ఎఫ్ఏఓ(ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ) సాయం చేయగలిగింది. వీరందరికీ సహాయం చేయలేకపోవడానికి నిధుల లేమే ఏకైక అడ్డంకి అని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఈపీ) ముఖ్య ఆర్థికవేత్త ఆరిఫ్ హుస్సేన్ ఆవేదన వ్యకం చేశారు. 2018లో సంభవించిన అంతర్యుద్ధాలు, వాతావరణ వైపరీత్యాల వల్ల 113మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటించిపోయారని ఐరాస తెలిపింది. ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువని పేర్కొంది. ఆహార సంక్షోభానికి సంబంధించి 2019 నివేదికను ఐరాస ఈనెల 2న విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 53దేశాల్లో ఆకలి తీవ్రత ఉందని ఈ నివేదిక సారాంశం. ఆకలి తీవ్రతను ఎదుర్కొన్న వాటిలో సిరియా, అఫ్ఘాన్ వంటి ఎనిమిది దేశాలున్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 7.2 కోట్ల మంది ఉన్నారని ఐరాస పేర్కొంది.
సిరియాలో అంతర్యుద్ధం, మయన్మార్‌లో అశాంతి వల్ల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లడం వంటి పరిస్థితులు ఆకలి తీవ్రతకు అద్దం పడుతున్నాయని వెల్లడించింది. భారత్‌లో 19కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతం 'అన్నమో రామచంద్రా' అంటూ ఒక్క ముద్ద అన్నం కోసం ఎండిన డొక్కలతో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వారు, పోషకాహారలోపంతో బాధపడుతున్న వారు మన దేశంలోనే అత్యధికంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. భారత్‌లో 6-23 నెలల వయసున్న చిన్నారుల్లో కేవలం 9.6శాతం మంది చిన్నారులకు మాత్రమే కనీస పౌష్టిక ఆహారం అందుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. మిగతా పిల్లలు పౌష్టిక ఆహార లోపం వల్ల వయసుకు తగ్గ బరువు,ఎత్తు ఉండటం లేదని తెలిపింది. ఈ విషయంలో 20.8శాతంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో భారత్ ఉన్నట్టు పేర్కొంది.
2021లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆహార సంక్షోభం దీర్ఘకాల సమస్యగా మారిపో తోందని తెలిపింది. దీన్నుంచి బయటపడే అవకాశాలు సన్నగిల్లు తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 40 దేశాల సమాచారం తో ఈ ఏడాది పరిస్థితులను నివేదిక అంచనా వేసింది. ఈ దేశాల్లో 14.2కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. 2021 అర్థభాగం ముగిసేనాటికి లక్షా 55 వేల మంది విపత్తు పరిస్థితుల్లో ఉంటారని పేర్కొంది.
కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులు దాన్ని నియంత్రించ డానికి ముందస్తు ప్రణాళికలు లేని ప్రభుత్వ వైఫల్యాలు మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. జీవనోపాధి పోవడతో లక్షలాది మంది పేదరికపు గీతకు దిగువకు నెట్టబడ్డారు. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కార్పోరేట్లకే తప్ప పేదలకు పట్టెడు మెతుకులు రాల్చలేదు. మోడీ పాలన ఇలానే కొనసాగితే సమీప భవిష్యత్తులో ఆకలి తీవ్రస్థాయి నుంచి భీకర స్థాయికి నెట్టబడే ప్రమాదం ఉందని ఈ ఆకలి సంక్షోభం హెచ్చరిస్తుంది.
''అన్నపురాశులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట / సంపద అంతా ఒకచోట / గంపెడు బలగం ఒకచోట'' అన్న కాళోజీ మాటలు ఇప్పటికీ పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.